Online Puja Services

శ్రీ మదాంధ్ర భాగవతం -- 7

18.224.73.157

శ్రీ మదాంధ్ర భాగవతం -- 7

భాగవతం అనేది సామాన్యమయిన గ్రంథము కాదు.

లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై!!

దీని స్కంధము చూస్తే లలితము. కృష్ణుడు మూలమై ఉన్నాడు. ఒక చెట్టుబాగా పెరగాలంటే చెట్టు మొదట్లో నీళ్ళు పోస్తారు. అపుడు చెట్టు బాగా పెరుగుతుంది. శుకబ్రహ్మ ఆలాపన చేసిన మహోత్కృష్టమయిన స్తోత్రము. అపారమయిన మంజులమయిన మాటలతో శోభిస్తూ ఉంటుంది. ఈ భాగవతము ఎవరు చదువుచున్నారో వారికందరికి, మంచిమనస్సుతో ఉన్న వారికి అర్థమయ్యే స్వరూపము కలిగినది. ఇది ఈ పుడమి మీదకి వచ్చి నిలబడిన కల్పతరువు. భాగవతమనేది వేరొకటి కాదు. సాక్షాత్తుగా కల్పవృక్షం ఉన్నట్లే, భాగవతంలో ఒక పది పద్యములు వచ్చినట్లయితే అటువంటి వ్యక్తి కల్పవృక్షమును జేబులో పెట్టుకొని తిరుగుతున్నట్లు లెక్క. వాని కోరిక తీరుతుంది. భాగవతంలో పోతనగారు గొప్పగొప్ప ప్రయోగములన్నిటిని, పద్యములుగా తీసుకువచ్చి పెట్టేశారు. వాని కోరిక ఎందుకు తీరదు? అందుకని భాగవతము అంత గొప్పది! అటువంటి భాగవతమును శుకబ్రహ్మ వివరణ చేశారు.

వ్యాస భగవానుడు నైరాశ్యమును పొందితే నారదుడు సాక్షాత్కరించి ఒకమాట చెప్పారు. ’వ్యాసా లోకములో బోధ చేయకపోయినా సరే ప్రజలు అందరికి కూడా తెలిసిన విషయములు రెండు ఉన్నాయి. అవి అర్థకామములు. ఈ రెండింటి గురించి మీరు ఎవరినీ తీసుకువచ్చి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనక్కరలేదు. అందరికీ డబ్బు దాచుకోవడం తెలుసు. డబ్బు సంపాదించుకోవడం తెలుసు. ఇంకా బొడ్డూడదు కానీ రూపాయి ఎలా సంపాదించాలనే తాపత్రయం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. సంస్కారబలం తక్కువగా ఉంటుంది. అందునా కలియుగంలో ఉంటే వాళ్ళది అల్పాయుర్దాయం. బుద్ధి బలం చూస్తే తక్కువ. ప్రచోదనం ఎప్పుడూ అర్థకామములయందు మాత్రమే ఉంటుంది’.

వానికి ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు వచ్చేసరికి వానికి మీరు పెళ్ళి చేయలేదనుకోండి – మీరు వానికి పెళ్ళి చేయలేదనే విషయమును వాడు మీకు తెలిసేలా చేస్తాడు. వాడు అమ్మ దగ్గరికి వచ్చి ’నా ఈడువాడు – వాడికి అప్పుడో కొడుకమ్మా అంటాడు’. ఇదివాడు ’అమ్మా మీరు నా సంగతి పట్టించుకోవడం లేదు’ అని తల్లికి పరోక్షంగా చెప్పడమే! ఇంకా అశ్రద్ధ చేశారనుకోండి – ఎప్పుడో ఒకరోజు పెళ్ళి చేసేసుకొని మీ దగ్గరకి నమస్కారం పెట్టడానికి వచ్చేస్తాడు.

అందుకని ’మానవుడు ఎప్పుడూ అర్థకామములయందు తిరుగుతూ ఉంటాడు. అర్థకామములను గురించి ఎవరికీ ఏదీ ప్రత్యేకముగా బోధ చేయనక్కరలేదు. భగవత్సంబంధమును గురించి, భక్తి గురించి మాత్రం బోధ చెయ్యాలి’ అని నారదుడు చెప్పడం కొనసాగించాడు.

’రోగం ఎక్కడ పుట్టింది?’ అని అడిగింది శాస్త్రం. అన్నంలోంచి పుట్టింది అని చెప్పారు. డాక్టరుగారు తినవద్దని చెప్పిన పదార్థములను తినడం ద్వారా మనిషి రోగమును పెంచుకుంటున్నాడు. అతను తన రసనేంద్రియములను నిగ్రహించలేకపోవడం వలన అతనికి అటువంటి స్థితి ఏర్పడుతోంది. రోగము వచ్చేస్తుంది. అని తెలిసినా సరే, శరీరమే పోతుందని తెలిసినా సరే, తినాలని కోరికను నిగ్రహించలేకపోయాడు. ఈ బలహీనత కొన్ని కోట్ల జన్మలనుండి నిన్ను తరుముతోంది. డబ్బు పిచ్చి, ఇంద్రియముల పిచ్చి అలా తరుముతూనే ఉన్నాయి. వాటికి వశుడవు అయిపోతూనే ఉన్నావు. అయినాసరే ఒక బురదలో పడిపోయిన వాడు బురదనీటిని తీసుకొని స్నానం చేసేస్తే వాడు శుద్ధి అయిపోడు. నీవు ఇంద్రియముల చేత తరమబడి తరమబడి కొన్ని కోట్ల జన్మలు ఎత్తినవాడివి, మరల ఇంద్రియములకు సంబంధించిన సుఖములనే శరీరమునకు ఇస్తుంటే నువ్వు ఇక ఎప్పుడూ ఉత్తమగతులు పొందలేవు. ఒంటికి పట్టిన బురదపోవాలంటే మంచినీటి స్నానము కావాలి. మంచినీటి స్నానము ఎవరు చేయిస్తారు? ప్రేమ ఉన్న అమ్మ చేయిస్తుంది. ఇక్కడ ప్రేమ వున్న అమ్మ స్వభావం కలవారు ఎవరు? వ్యాసుడు. ఆయన చేయించాలి. అందుకని ఆయన భాగవతం ఇచ్చారు.

నారదుడు వ్యాసునికి చెపుతున్నాడు – ’నువ్వు పాండవులు కౌరవులు ఎలా కొట్టుకున్నారో, వారికి రాజ్యములు ఎలా వచ్చాయో మున్నగు విషయములను గూర్చి వివరించి వ్రాశావు. అవి అన్నీ ఇప్పటి ప్రజలకు చాలాబాగా తెలుసు. ఇప్పటి వ్యక్తులు భారతము ఏమీ చదవకుండా దుర్యోధనుని కన్నా అహంకారముతో తిరగగలరు. ధృతరాష్ట్రునికన్నా బాగా పక్కింటివాడిది తెచ్చి దాచేసుకోగలరు. ’నీవు ప్రయత్నపూర్వకంగా భగవంతుని గూర్చి ఏమీ చెప్పలేరు. భగవంతుని గురించి చెప్పకపోతే ఈ జన్మలో వీడు చేసుకున్న ఇంద్రియలౌల్యం వీనిని వచ్చే జన్మలో హీన ఉపాధులలోకి తీసుకుపోతుంది.’ భగవంతునికి ఏమీ రాగద్వేషములు ఉండవు. ఒక వ్యక్తికి కామము బాగా ఉండిపోయిందనుకోండి. ఆ వ్యక్తికి రాకూడని మాట ఒకటి వస్తూ ఉంటుంది. మీరు వినే వుంటారు.

వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే
వ్యర్థంబైచెడు వాక్ప్రవాహములచే వాత్సల్యచిత్తంబుచే
అర్ధజ్ఞానముచే మహద్భ్రమతచే హాస్యప్రసంగాలచే
స్వార్థంబే పరమార్థమై చెడుదు రీస్వార్థప్రజల్ శంకరా!! (శ్రీశంకర శతకము – ౮౦)

వాడికి కామం ఉండిపోయింది. ఉండిపోతే వాడు పైకి చెప్పలేక డెబ్బది ఏళ్ళు వయస్సు వచ్చేసిన తరువాత మంచి పంచె కట్టుకొని వచ్చాడనుకోండి – ’తాతయ్యా పెళ్ళికొడుకులా ఉన్నావు’ అని సరదాకి ఎవరయినా అన్నారనుకోండి – అంటే ’అమ్మా అలా అనకూడదు. పెళ్ళికొడుకులా ఉన్నాననకు. మిమ్మల్ని చూడగానే త్రివేణీ సంగమంలో స్నానం చేసిన ఫలితం కనిపించే ఒక మంచి ఉపాసనాబలం పొందుతున్న వారినా ఉన్నారని అను – అది నా శరీరమునకు సరిపోతుంది. ఇంకా నేను పెళ్ళికొడుకునేమిటమ్మా’ అని అనాలి. కానీ వాడు అలా అనడు. వాడు ఏమంటాడంటే – ’ నాకు పిల్లనిచ్చేవాళ్ళు ఎవరు’ అంటాడు. అంటే వాడికి కడుపులో ఎంతబాధ ఉందో చూడండి! వానికి ఎనభై ఏళ్ళు వచ్చినా వాళ్ళు అలా అన్నందుకు బాధపడడం లేదు. ’నిజంగా నేను పెళ్ళికొడుకులా ఉంటే, సంబంధములు చూసి, తాతగారూ, మీరు చేసుకోండి అని పిల్లను తెచ్చి పెళ్ళి చేయవచ్చు కదా’ అని వీడికి కడుపులో బాధ! వృద్ధాప్యంలో ఒక విధమయిన ధూర్తతనం వచ్చేస్తుంది. వృద్ధాప్యంలో అంత్యమునందు వీడికింకా వ్యామోహం ఉండిపోతుంది అపుడు శరీరములోంచి నిరంతరము చీము స్రవించే వ్రణములు బయలుదేరతాయి. అందులోంచి క్రిములు బయటపడుతూ ఉంటాయి. అంతదూరంలో ఉంటే ఇక్కడే పుల్లటి కంపు రావడం మొదలవుతుంది. ఎవరూ వాని దగ్గరకు వెళ్ళరు. ఎంతో బాధపడతాడు. అంత బాధపడ్డ తరువాత అప్పుడు కామం పోతుంది. ’నీవు వ్యాసుడవయినందుకు అంతబాధ వారు పడకుండా నీవు చూడాలి. ఇటువంటి పాపం ఉత్తరజన్మకు వెళ్ళకుండా ఆపేశక్తి వీళ్ళకి ఇవ్వాలి. వ్యాసా, నీవు ఏమి ఇవ్వాలో తెలుసా! భగవద్భక్తికి సంబంధించిన విషయం అందించు.’ వాడు తెలిసో తెలియకో వచ్చి భాగవతమును వినడం కాని, చదవడం కాని చేస్తే అంతమాత్రం చేత వీడు భాగవతం విన్నాడు అని వాని ఖాతాలో వ్రాస్తాడు. వాడు హీనోపాధికి వెళ్ళిపోకుండా ఈ ఫలితమును అడ్డుపెట్టి వానిని మంచి జన్మవైపుకి తిప్పుతాడు. ’భాగవత శ్రవణం ఒకనాడు ఒక ఉత్తముని ఇంట్లో పుట్టి భగవద్భక్తి వైపుకి మారుస్తుంది. అందుకని ఒకమంచిమాట చెప్పు. అంతేకాని నీవు మరల అర్థకామములను గురించే మాట్లాడితే కావ్యమునకు ఏమీ ప్రయోజనం ఉండదు. హరినామస్మృతిలేని కావ్యము వృథా. దాని వలన ఏవిధమయిన ఉపయోగం ఉండదు. హరినామస్మృతి చేయు కావ్యము మానస సరోవరం లాంటిది. కానీ హరినామము చెప్పని కావ్యము, నీవు ఎంతగొప్ప అర్థములతో చెప్పినా అది తద్దినం పెట్టేచోటికి కాకులు వచ్చే రేవులాంటిది. అందుకని నీవు ఇప్పుడు భగవద్భక్తి, భగవంతునికి సంబంధించిన విశేషములు, భగవద్భక్తుల కథలతో కూడిన విషయములను చెప్పు. భాగవతంలో అటువంటివి చెప్పు’ అని చెప్పాడు నారదుడు.

పూజ్యగురువులచే చెప్పబడిన శ్రీమదాంధ్ర భాగవతం

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya