Online Puja Services

వైశాఖ అంత్యపుష్కరిణీ తిధుల మహిమ

3.137.180.62

పుత్రపౌత్రాది సర్వ సౌభాగ్యాలనీ ప్రసాదించే వైశాఖ అంత్యపుష్కరిణీ తిధుల మహిమ !
- లక్ష్మి రమణ 

నారద (Narada) మహర్షి రాజైనటువంటి అంబరీష (Ambarisha) మహారాజుకి వైశాఖ మహత్యాన్ని వివరిస్తూ ఈ విధంగా చెప్పసాగారు. “శృతదేవుడు శృతి కీర్తి మహారాజుకు వైశాఖ వ్రత మహిమను వివరిస్తూ ఈ విధంగా అన్నారు. “ఓ శృతదేవ మహారాజా! వైశాక శుక్లపక్షం చివర వచ్చేటటువంటి మూడు తిధులు త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ.  పుష్కరిణి అనేటటువంటి నది సర్వపార్వపాపాలను పోగొట్టి సర్వసుభాలను కలిగిస్తుంది. అదే ఫలితం పుష్కరిణి వంటి  ఈ మూడు తిథిలలోనూ స్నానాధులు చేసిన వారికీ దక్కుతుంది.  ఒకవేళ  వారు ఈ మూడింటిలో ఏదో ఒక తిధిలో అయినా కనీసం వైశాక స్నానాదులను చేసినప్పటికీ కూడా, వారికి ఈ మూడు తిథిలలో స్నానాధికములు చేసినటువంటి పుణ్యఫలం సిద్ధిస్తుంది. అంటూ వైశాఖ పురాణంలోని చివరి అధ్యాయాన్ని ఇలా వివరించసాగారు. 

త్రయోదశి (trayodasi) నాడు సర్వదేవతలూ జలములను ఆవహించి ఉంటారు. ఆ తిధి ఉన్నప్పుడు సంపూర్ణముగా జలాలలోనే ఉంటారు.  అదే విధముగా పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువు (Maha Vishnu) జలాన్ని అవహించి ఉంటారు. ఇక చతుర్దశి తిధి ఉన్నప్పుడు సర్వ యజ్ఞములు కూడా ఆ తిధిలో జలాన్ని ఆవహించి ఉంటాయి. ఈ కారణము చేత ఈ మూడు తిధులు కూడా ప్రశస్తమైనవి.  బ్రహ్మ హత్య, సురాపానము మొదలైన పాపములు చేసిన వారిని కూడా ఈ తిధులు పవిత్రులుగా చేసి పుణ్యఫలాలను అందిస్తాయి. 

దేవాసురులు క్షీరసాగరాన్ని మధిస్తూ ఉండగా, ఏకాదశి రోజు అమృతము జన్మించింది.  ద్వాదశి నాడు సర్వోత్తముడు, దయానిధి అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఆ  అమృతమును దానవుల నుంచి కాపాడారు.  త్రయోదశి నాడు దేవతలకు అమృతమును పంచారు.  దేవతలతో తగవు పెట్టుకొని వైరులైన రాక్షసులు కూడా చతుర్దశి నాడే హతమయ్యారు. పౌర్ణమి నాడు దేవతలు అందరూ కూడా తమ సామ్రాజ్యాన్ని పొందారు.  అందువల్ల దేవతలు సంతోషించి ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ ఈ నాలుగు తిధులూ మానవులు వాళ్లు చేసినటువంటి సర్వపాపాలను పోగొట్టి, పుత్రపౌత్రాది సర్వసంపదలను ఇస్తాయని ఆశీర్వదించారు.  వైశాఖమాసము 30 రోజులు కూడా వ్రతము, స్నాన, దాన, జపాదులను చేయలేని వారు కనీసం త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి  ఈ మూడు తిధులలోనైనా స్నానాధికాలను చేసినట్లయితే, వారికి సంపూర్ణ ఫలము ఇస్తాము.  అలా చేయని వారు నీచ జన్మలను పొంది రౌరవము  అనే నరకాన్ని పొందుతారు. ఈ కాలములో  వేడినీటి స్నానము చేసిన వారు 14 మన్వంతరాలపాటు  నరకాన్ని పొందుతారు. ఈ సమయములో పితృదేవతలకు దేవతలకు పెరుగన్నము ఇయ్యని వారు పిశాచాలై పంచభూతములు ఉన్నంతవరకు బాధపడతారు. 

వైశాఖ (Vaisakha) మాస వ్రతాన్ని నియమనిష్ఠలతో ఆచరించిన వారు కోరిన కోరికలను పొందటమే కాక శ్రీహరి సాహిత్యాన్ని పొందుతారు వైశాక మాసంలో నెల నాలుగు స్నానాధులు చేయలేని వారు ఈ మూడు తిధులలోనైనా స్నానాధికాలను చేసి సంపూర్ణ ఫలాన్ని పొంది శ్రీహరి సాహిత్యాన్ని పొందగలరు.  ఈ మాస వ్రతమును ఆచరించక దేవతలను, పితృదేవతలను, శ్రీహరిని, గురువును పూజించని వారికి మేము శాపాలనిస్తాము.  అటువంటివారు సంతానము, ఆయువు, శ్రేయస్సు లేని వారై బాధలు పొందుతారని దేవతలందరూ కూడా కట్టడి చేశారు.  కాబట్టి ఈ మూడు తిధుల సముదాయము అంత్యపుష్కరిణి అనే నామాన్ని పొంది సర్వపాపాలను హరించి, పుత్రపౌత్రాది  సకల సంపదలను ముక్తిని ప్రసాదిస్తుంది.

 పౌర్ణమి (Pournami) నాడు బ్రాహ్మణునికి పప్పును, పాయసాన్ని దానంగా ఇచ్చినట్లయితే సకల సంపదలు కలిగి ముక్తి పొందుతారు.  స్త్రీ కీర్తి శాలి అయినటువంటి పుత్రుని పొందుతుంది.  ఈ మూడు రోజులలోనూ గీతా పఠనము  చేసిన వారు ప్రతి రోజు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యాన్ని పొందుతారు.  ఈ రోజులలో విష్ణు సహస్రనామాలను చదివినట్లయితే అతని పుణ్యము ఇంత అని చెప్పాశక్యం  కాదు.  పౌర్ణమి నాడు సహస్రనామాలతో శ్రీహరిని కీర్తించి, క్షీరముతో అభిషేకము చేసిన వారు శ్రీహరి లోకాన్ని పొందుతారు.  సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించిన వారు, ఎన్ని కల్పములు గడిచినప్పటికీ శ్రీహరి లోకంలోనే ఉంటారు.  శక్తి ఉండి కూడా వైశాఖ వ్రతాన్ని ఆచరించని వారు, సర్వపాపాలను పొంది, నరకాన్ని చేరుకుంటారు. 

 వైశాఖమాసంలో ఈ మూడు రోజులలోనూ భాగవతమును ఏమాత్రం చదివినప్పటికీ కూడా బ్రహ్మ పదవిని పొందుతారు.  గొప్ప జ్ఞానవంతులవుతారు.  ఈ రోజులలో వ్రతాన్ని చేయడం చేత, వారి వారి శ్రద్ధాసక్తులను బట్టి కొందరు దేవతలుగాను, సిద్ధులుగాను, బ్రహ్మ పదవిని పొందారు.  బ్రహ్మజ్ఞాని, ప్రయాగలో మరణించిన వారు వైశాఖ స్నానమాచరించిన వారు, సర్వ పురుషార్థాలను పొందగలరు.  దరిద్రుడైనటువంటి బ్రాహ్మణులకు గోదానమిచ్చిన వారికి అపమృత్యువు దరిచేరదు. 

ఒకసారి “మూడు కోట్ల 58 లక్షల తీర్థములో మునిగి, ఏ పాపములను పోగొట్టుతామని మానవులు మాలో స్నానం చేస్తున్నారో, అటువంటివారు పాపములన్నీ కూడా మాలో  చేరి మేము  ఎక్కువగా కల్మషాన్ని పొందుతున్నాము.  దీన్ని పోగొట్టుకునే మార్గం చెప్పమని” శ్రీహరిని ఆ తీర్థాలన్నీ కూడా వేడుకున్నాయి. ఆయన వారి ప్రార్థనని మన్నించి ఇలా అనుగ్రహించారు.  “వైశాఖమాస శుక్లపక్షంలో అంత్యపుష్కర కాలంలో  సూర్యోదయం కంటే ముందుగా నదులు చెరువులు మొదలైన వాటిలో స్నానం చేయని వారికి  మీ కల్మషములు అంటుతాయి” అని చెప్పారు.  అంటే సూర్యోదయం కంటే ముందుగా స్నానం చేసిన వారికి కల్మషం అంటదు.  వారి పాపాలు పోతాయి అని అర్థం.  సర్వ తీర్థాలు ఆ విధంగా తమ కల్మషములను పోగొట్టుకున్నాయి. కాబట్టి వైశాఖమాసంలో శుక్లపక్షం చివర వచ్చే త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ పవిత్ర తిధులు. సర్వపాపహారాలు. 

 నాయనా శృతదేవా! నీవు అడిగిన వైశాఖ మహిమను నేను చూసినంతవరకు, విన్నంతవరకు, తెలిసినంతవరకు నీకు చెప్పాను.  దాని మహిమను పూర్తిగా చెప్పడం నాకే కాదు, పరమేశ్వరునికి కూడా సాధ్యము కాదు.  వైశాఖ మహిమను చెప్పమని కైలాసమున పార్వతీదేవి అడగగా, శివుడు నూరు దివ్య సంవత్సరాలు ఆ మహిమను వివరించి, ఆపై ఆయనకు శక్యము కాక విరమించారు. అటువంటిది సామాన్యుడైనటువంటి నావల్ల సాధ్యమవుతుందా! శ్రీహరి సంపూర్ణంగా చెప్పగలవాడేమో, తెలియదు. 

పూర్వము మనులు జనహితము కోసము తమ శక్తి కొలది వైశాఖ మహిమను చెప్పారు. కాబట్టి ఓ రాజా! నువ్వు భక్తిశ్రద్ధలతో ఈ వైశాఖ వ్రతాన్ని ఆచరించి శుభాలను పొందు.” అని శ్రుతి దేవుడు శ్రుతి కీర్తి మహారాజుకి చెప్పి తన దారిన తాను వెళ్లిపోయారు.  శ్రుతకీర్తి కూడా పరమ సంతుష్టుడై మహా వైభవంతో వైశాక వ్రతాన్ని ఆచరించి, శ్రీహరిని ఊరేగించి, తాను పాదచారిగా  అనుసరించారు.  అనేక దానములను ఆచరించి ధన్యుడయ్యారు” అని అంబరీషునికి  నారదుడు వివరించారు. 

ఇంకా ఆ దేవముని ఇలా చెబుతున్నారు.  “ ఓ అంబరీష మహరాజా ! సర్వసుభకరములైనటువంటి వైశాఖ మహిమను నీకు వివరించాను.  దీని వలన భక్తి , ముక్తి, జ్ఞానము, మోక్షము, వీటిని పొందు.  దీనిని శ్రద్ధ భక్తులతో ఆచరించి తరించు” అని ఆశేషించారు. అంబరీషుడు కూడా నారదునికి  భక్తిశ్రద్ధలతో సాష్టాంగ నమస్కారాలను అనేకమార్లు చేశాడు. నారుదుని అనేక విధాలుగా గౌరవించాడు.  నారదుడు చెప్పిన ధర్మాలను ఆచరించి శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందారు. 

 ఈ ఉత్తమ కథను విన్నా, చెప్పినా  సర్వపాపాలు పోగొట్టుకొని ముక్తిని పొందగలరు.  దీనిని పుస్తకముగా రాసి ఇంట్లో ఉంచుకున్నట్లయితే సర్వశుభములూ  కలుగుతాయి.  భక్తి, శ్రీహరి అనుగ్రహం కూడా సిద్ధిస్తాయి. 

వైశాఖ పురాణం (30 వ అధ్యాయం ) సర్వం సంపూర్ణం. 

సర్వం శ్రీ హరి చరణారవిందార్పణమస్తు !! 

శుభం

Vaisakha Puranam

#vaisakhapuranam

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi