కలిదోషము నివారించే వైశాఖ వ్రత విధానము

కలిదోషము నివారించే వైశాఖ వ్రత విధానము .
- లక్ష్మి రమణ
నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మహిమను ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. “ శృతి దేవుని మాటలు విన్నటువంటి శృతి కీర్తి మహాముని ఈ వైశాఖ మాసములో ఉత్తమమైనటువంటి తిధులేవి ? దానాలలో ఉత్తమమైన దానములేవి? వీటిని లోకములో ఎవరు వ్యాపింప చేశారు? దయచేసి వీటిని గురించి నాకు వివరంగా తెలియజేయండి” అని అడిగాడు. అప్పుడు శృతదేవుడు ఓ శ్రతకీర్తి మహారాజా సూర్యుడు మేషరాశిలో ఉండగా, వైశాఖ మాసము వస్తుంది.” అంటూ వైశాఖ మాసములో వచ్చే తిధుల ప్రాధాన్యతని వైశాఖ పురాణంలోని 27వ అధ్యాయంలో ఈ విధంగా వివరించసాగారు.
“ఓ రాజా! మాసములో వచ్చే తిధులన్నీ కూడా ఉత్తమమైనవే. అందులోనూ ఏకాదశి నాడు చేసినటువంటి పుణ్య కార్యాలు కోట్ల కొలది రెట్టింపుల పుణ్యాన్ని ఇస్తాయి. అన్ని దానములలోనూ పుణ్యప్రదమైన దానాన్ని చేయటం వలన వచ్చే ఫలితము, అన్ని తీర్థములలోను స్నానం చేయడం వలన వచ్చేటటువంటి పుణ్యము, వీటన్నిటిని వైశాక ఏకాదశి నాడు స్నానం చేయటం వలన జీవులు పొందుతూ ఉన్నారు. ఆనాడు చేసినటువంటి స్నానము, దానము, తపము,హోమము, దేవతార్చన, సత్క్రియలు, హరికథా శ్రవణము ఇవన్నీ కూడా సద్యోముక్తిదాయకాలని తెలుసుకో! రోగము, దరిద్రము, వీటికి లోబడి స్నానాధికములను చేయలేనివాడు కనీసం శ్రీహరి కథలను విన్నప్పటికీ కూడా సర్వ పుణ్యకార్యాలు చేసినటువంటి ఫలితాన్ని పొందగలడు.
పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో జలాశయములకి దగ్గరగా ఉండి శరీరము బాగా ఉన్నప్పటికీ కూడా స్నానాదికాలు చేయకుండా గడిపినటువంటి వారు, గోహత్య పాతకాన్ని చేసినవారితో సమానము. కృతఘ్నుడై తల్లిదండ్రులకు ద్రోహం చేయడము, తనకు తానే అపకారం చేసుకోవడం మొదలైన వాటిని చేసినంత పాపాన్ని పొందుతారు. శరీర ఆరోగ్యము సరిగ్గా లేనట్లయితే, శ్రీహరిని మనసులో తలుచుకోవాలి. వైశాఖమాస కాలము సద్గుణాకరమైనటువంటిది, సర్వ పుణ్యఫలప్రదమైనటువంటిది. సర్వజనులు, సజ్జనులు, దయావంతులు అయినటువంటి వారు ఇటువంటి పవిత్ర కాలంలో సదా శ్రీహరిని సేవిస్తూ ఉంటారు. దరిద్రులు, ధనవంతులు, కుంటివారు, గుడ్డివారు, నపుంసకులు, విధవలు, భార్య లేని వారు, స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వృద్ధులు, రోగిష్టి వాళ్లు వీరందరూ కూడా యధాశక్తిగా ఆచరించి, తరించదగినటువంటి పుణ్యకాలము వైశాఘమాస కాలము.
సర్వ ధర్మ కార్య ఫల ప్రాప్తికి మూలమైనటువంటి వైశాఖమాసంలో ధర్మ కార్యాలను, స్నానాధికాలను చేయగోరేవారు చేసేవారు సర్వోత్తములు. ఈ విధంగా అత్యంత సులభమైన వైశాఖమాస ధర్మాన్ని ఆచరించని వారు సులభముగా నరక లోకాలను పొందుతారు. ఇందులో సందేహమే లేదు . పాలను చిలికి సారభూతముగా వెన్నను తీసినట్టుగా, సర్వపాపాలను హరించి, సర్వ పుణ్యాలను ఇచ్చేటటువంటి తిధిని గురించి చెబుతాను, విను.
మేషరాశిలో సూర్యుడు ఉండగా, పాపాలను నివారించి పితృదేవతలకు అత్యంత ప్రీతిని కలిగించే తిధి గురించి నీకు వివరిస్తాను. ఈ తిధి రోజు పితృదేవతలకు శ్రాద్ధములు చేసినట్లయితే గయలో కోటిమార్లు పిండ ప్రధానము చేసినటువంటి పుణ్యము కలుగుతుంది. సారస్వత మనువు భూమిని పరిపాలిస్తుండగా జరిగిన నరక లోకంలోని పితృదేవతలకు చెందిన కథ ఒకటి పెద్దలు చెప్పి ఉన్నారు. ఆ కథను నీకు ఇప్పుడు వినిపిస్తాను.
30 కలియుగములు గడిచిన తర్వాత, సర్వ ధర్మ విహీనమైనటువంటి ఆ నర్తదేశంలో, ధర్మవర్ణుడు అనే బ్రాహ్మణుడు జన్మించాడు. 31వ కలియుగంలో ప్రథమ పాదములో ప్రజలందరూ కూడా వర్ణ ధర్మాలను విడిచిపెట్టి, పాప కార్యాల పట్ల ఆసక్తులై ఉన్నారు. ఇటువంటి పాప పంకిల మైనటువంటి దేశాన్ని విడిచిపెట్టి, ధర్మవర్ణుడు పుణ్యక్షేత్రంలో మౌనవ్రతముతో మునులు సత్రయాగాన్ని చేస్తూ ఉండగా చూడడానికి వెళ్ళాడు. అక్కడ కొందరు మునులు కూర్చుని, పుణ్యకథా ప్రాసంగములు చేస్తూ ఉండగా, ధర్మవర్ణుడు అక్కడికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న మునులందరూ కూడా కర్మలయందు ఆసక్తి కలవారై, కలియుగాన్ని మెచ్చుకుంటూ ఈ విధంగా అన్నారు.
కృతయుగములో సంవత్సర కాలము నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజలు, యాగాలు, వ్రతాలు చేస్తే వచ్చేటటువంటి పుణ్యం త్రేతాయుగములో ఒక మాసము చేసినట్లయితే సంప్రాప్తిస్తుంది. ద్వాపర యుగములో అటువంటికార్యాలని ఒక పక్షము పాటు చేసినట్లయితే లభిస్తుంది. కానీ, దానికి పది రెట్ల పుణ్యము కలియుగములో శ్రీమహావిష్ణువుని స్మరించినంత మాత్రాన చేత వస్తుంది. కాబట్టి కలియుగంలో చేసినటువంటి పుణ్యము కోటి గుణితము. దయా, పుణ్యములు, దానధర్మములు లేని ఈ కలియుగములో శ్రీహరిని ఒక్కసారి స్మరించి దానము చేసినట్లయితే, కరువు కాలంలో అన్నదానము చేసిన వానిలాగా పుణ్యలోకాలకు పోతారు” అని అనుకుంటున్నారు.
ఆ సమయంలో నారదుడు అక్కడికి వెళ్లారు. ఆయన ఆ మునుల మాటలు విని, ఒక చేతిలో శిస్నమును, మరొక చేతితో నాలుకను పట్టుకుని నవ్వుతూ నాట్యం చేయసాగారు. అక్కడ ఉన్న మునులు ఈ విధంగా దేవముని అయినటువంటి నారదుడు ఎందుకు చేస్తున్నాడో అర్థంకాక ఆయన్ని ప్రశ్నించారు. అప్పుడు నారదడి విధంగా సమాధానం చెప్పారు . మీరు ఇప్పుడు చెప్పిన మాటలను బట్టి , కలియుగం వచ్చిందని తెలిసి ఆనందము పట్టలేక నాట్యం చేస్తు నవ్వుతున్నాను. మనము అదృష్టవంతులము. స్వల్ప ప్రయాసతో, అధిక పుణ్యాన్ని ఇచ్చే గొప్ప యుగము కలియుగము. ఈ కలియుగంలో కేవలం స్మరణ మాత్రం చేత సంతోషించి కేశవుడు క్లేశములను నశింప చేస్తాడు, అంటే సంతోషాన్ని ఆపుకోలేకపోతున్నాను. మీకు ఒక విషయాన్ని చెబుతున్నాను వినండి. శిస్నమునునిగ్రహించుకోవడం కష్టం. అంటే, సంభోగాభిలాషని నిగ్రహించుకోవడం కష్టము నాలుకను రుచిచూచుట నుంచి నిగ్రహించుకోవడం, తిండి పై ధ్యాసను తగ్గించుకోవడం కష్టము . కలియుగములో భోగాభిలాష తిండి ధ్యాస వీటిని నిగ్రహించుకోవడం ఎంతో కష్టం. కాబట్టి నేను నా శిస్నమును, నాలుకను పట్టుకున్నానని” వివరించాడు .
ఇంకా ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. “ శిస్నమును, జిహ్వను నిగ్రహించుకోగలిగినట్లయితే, పరమాత్మ అయినటువంటి శ్రీహరి దయ ఈ యుగములో సులభంగా సాధ్యమవుతుంది. కలియుగములో భారతదేశము వేద ధర్మాలను విడిచి ఆచార వ్యవహార శూన్యమైనటువంటిది. కాబట్టి మీరు ఈ దేశంని విడిచి ఎక్కడికైనా వెళ్లిపోండి” అని నారదుడి పలికాడు. నారదుని మాటలను విని, యజ్ఞం చేస్తున్న వారందరూ కూడా తమకి ఇష్టమైన ప్రదేశాలకు తరలి వెళ్లారు.
ధర్మవర్ణుడు కూడా భూమిని విడిచి మరొకచోట ఉన్నాడు. కొంత కాలమైన తర్వాత, వానికి భూలోకము ఏ విధంగా ఉందో చూడాలని కోరిక కలిగింది. తోజోపరిపూర్ణుడైన అతడు దండ కమండలాలను, జటావల్కములను ధరించి, కలియుగ విచిత్రములను చూడదలిచి భూలోకానికి వచ్చాడు. భూలోకములో జనులు వేద బాహ్యమైనటువంటి ప్రవర్తనను కలిగి, పాపములను ఆచరిస్తూ, దుష్టులై ప్రవర్తిస్తూ ఉన్నారు. బ్రాహ్మణులు వేద ధర్మాలను విడిచిపెట్టారు. శూద్రులు సన్యాసులయ్యారు. భార్య - భర్తను, శిష్యుడు - గురువును, సేవకుడు- యజమానిని, పుత్రుడు- తండ్రిని ద్వేషిస్తూ ఉన్నారు. బ్రాహ్మణులందరూ కూడా శూద్రుల వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. ధేనువులు మేకలయ్యాయి. వేదములు కథాప్రాయములయ్యాయి. శుభక్రియలు సామాన్య క్రియలు అయ్యాయి. భూతప్రేత పిశాచాదులనే ప్రజలందరూ పూజిస్తూ ఉన్నారు. అందరూ సంభోగాలాలసని కలిగి అందుకు జీవితాలను కూడా పణంగా పెడుతున్నారు. తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు,మోసగించే స్వభావము గలవారుగా ఉన్నారు . మనసులో ఒకటి , మాటలో మరొకటి, చేసేది వేరొకటి అనే రీతిలో ప్రవర్తిస్తున్నారు. విద్యాభ్యాసము పరమార్థకము కాక, హేతు ప్రధానముగా కొనసాగుతూ ఉంది. అటువంటి విద్య రాజ పూజితమై ఉంది. సంగీతము మొదలైన వాటిని రాజులు ప్రజలు ఆదరిస్తున్నారు. అధములు, గుణహీనులు పూజ్యులుగా మారారు. ఉత్తములైన వారిని ఎవ్వరూ కూడా గౌరవించడం లేదు. ఆచారవంతులైనటువంటి బ్రాహ్మణులు దరిద్రులు అయ్యారు. విష్ణుభక్తి జనంలో కనిపించడం లేదు. పుణ్యక్షేత్రాలు వేద ధర్మ విహీనములైపోయాయి. శూద్రులు ధర్మ ప్రవక్తలు జటాధారులై సన్యాసులయ్యారు. మానవులు అల్పాయుష్కులై ఉన్నారు. ఇంకా జనులు దుష్టులు దయాహీనులుగా ఉన్నారు. పైగా అందరూ కూడా ధర్మాన్ని చెప్పేవారే, అందరూ దానాన్ని స్వీకరించే వారే! సూర్య గ్రహణాధి సమయములను ఉత్సవముగా తలిచేవారే. ఇతరులను నిందిస్తూ, అసహ్యపడుతూ, తాము మాత్రమే గొప్పవారమనే భావనలో జీవించేవారుగా ఉన్నారు !
అభివృద్ధిలో ఉన్న వారిని చూసి అసూయ పడుతున్నారు. సోదరుడు- సోదరిని, తండ్రి -కుమార్తెను, తక్కువ జాతి వారిని కోరుతూ ఉన్నారు. పొందుతూ ఉన్నారు. అందరూ వేశ్యసక్తులై ప్రవర్తిస్తున్నారు. సజ్జనులను అవమానిస్తున్నారు. పాపాత్ములను గౌరవిస్తూ ఉన్నారు. మంచి వారిలో ఉన్న కొద్దిపాటి దోషమును పెద్దదిగా ప్రచారం చేస్తున్నారు. పాపాత్ముల దోషాలను, గుణములను చెప్పుకుంటూ శ్లాఖిస్తూ ఉన్నారు. దోషమునే గుణముగా జనులు స్వీకరిస్తున్నారు. జలగ స్తనముపై పట్టి పాలను తాగదు, రక్తమునే తాగుతుంది. ఆ విధంగా దుష్టులు కూడా గుణములను కాక, దోషములనే స్వీకరిస్తారు. ఔషధులు సారహీనములయ్యాయి. ఋతువులు వరుసలు తప్పాయి. అంటే ధర్మములను విడిచి ప్రవర్తిస్తున్నాయి. అంతటా కరువు నిండి ఉంది. కన్యలు గర్భవతులు అవుతున్నారు. స్త్రీలు తగిన వయస్సులో ప్రసవించడం లేదు. నటులు, నర్తకులు వీరి పట్ల ప్రజలు ప్రేమను పొంది ఉన్నారు. వేద వేదాంత శాస్త్రాదులని చదివిన పండితులను సేవకులుగా ధనవంతులు భావిస్తూ ఉన్నారు. విద్యావంతులైనటువంటి బ్రాహ్మణులు ధర్మహీనులను సేవించి ఆశీర్వదిస్తూ ఉన్నారు. అవమానించిన ధన మధాందులను , నీచులను ఆశీర్వదించినట్లయితే దానికి ఫలం ఉండదు కదా!
వేదములలో చెప్పినటువంటి క్రియలను, శ్రీహరి నామాలను అందరూ విడిచిపెట్టారు. శృంగారము పట్ల ఆసక్తి కలవారై అటువంటి శృంగార కథలనే చదువుతూ ఉన్నారు. విష్ణు సేవను, శాస్త్ర చర్చను, యాగ దీక్షను, కొద్దిపాటి వివేకము, తీర్థయాత్ర, దానధర్మాలు కలియుగమున ఎక్కడా కూడా కానరాలేదు. ఇది ఎంతో విచిత్రముగా ఉంది. ధర్మవర్ణుడు భూలోకములో ఉన్న కలియుగ విధానాన్ని చూసి ఎంతో భయపడ్డాడు. పాపం చేయటం వలన వంశ నాశనమును గమనించి, మరొక ద్వీపానికి తరలి వెళ్లాడు. ఇలా అన్ని ద్వీపములను చూసి, పితృలోకమును చూడడానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నవారు కష్టతరమైనటువంటి పనులను చేస్తూ, ఎంతో శ్రమ పడుతూ కనిపించారు. కిందపడి ఏడుస్తున్నారు. చీకటి గల నూతిలో పడి గడ్డిపరకను ఆలంబనగా పట్టుకుని, నూతిలో కి జారిపోకుండా వేలాడుతున్నారు. వారికి కింద భయంకరమైనటువంటి చీకటి మాత్రమే కనిపిస్తూ ఉంది.
ఇంతకన్నా భయంకరమైనటువంటి విషయాలను కూడా ధర్మవర్ణుడు చూసాడు. ఒక ఎలుక ఆ పితృదేవతలు పట్టుకొని వేలాడుతున్న గడ్డి పరికను మూడువంతులు కొరికి వేసింది. గడ్డి పరికను పట్టుకొని వేలాడుతున్న పితృదేవతలు కింద ఉన్న భయంకరమైన ఆగాధాన్ని చూసి, పైన ఎలుక గడ్డిని కొరికి వేయడాన్ని చూసి దీనులై దుఃఖిస్తూ ఉన్నారు. ధర్మవర్ణుడు కూడా ధీనుడై ఉన్న వారిని చూసి జాలిపడి “మీరు ఇలా నూతిలో ఎందుకు పడ్డారు? ఎటువంటి కర్మలు చేయడం చేత మీకు ఇటువంటి పరిస్థితి కలిగింది? మీరు ఏ వంశము వారు? మీకు విముక్తి కలుగు మార్గమేదైనా ఉన్నదా? నాకు చెప్పండి. చేతనైనటువంటి సాయం చేస్తాను” అని అడిగాడు.
అప్పుడు వారు “ఓయీ! మేము శ్రీవత్సస గోత్రీకులము. భూలోకములో మా వంశములో సంతానము లేదు. అందువలన పిండములు, శ్రార్ధములు లేక దీనులమై బాధపడుతున్నాము. మేము చేసినటువంటి పాపముల చేత, మా వంశము సంతానము లేక క్షీణిస్తూ ఉంది. మాకు పిండమునిచ్చే వారే లేరు. వంశము క్షీణించింది. ఇటువంటి దురదృష్టవంతులమైన మాకు, ఈ చీకటి కూపములో పడక తప్పదు. మా వంశంలో ధర్మవర్ణుడనే కీర్తిశాలుడు ఒక్కడే ఉన్నాడు. అతడు విరక్తి చేత వివాహాన్ని చేసుకోక, ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడు.
నాయనా! ఈ మిగిలిన గడ్డిపరకను చూసావా! మా వంశమున అతడొక్కడే మిగలడం వలన ఇక్కడ ఇది ఒక్కటే మిగిలింది. మేము దీనిని పట్టుకుని వేలాడుతూ ఉన్నాము. మా వంశము వాడైనటువంటి ధర్మవర్ణుడు ఒక్కడే మిగిలి ఉన్నాడు. దానికి సంకేతముగానే పిత్రులోకంలో ఉన్న మాకు కూడా ఈ గడ్డి పరిక ఒక్కటే మిగిలింది. అతడు వివాహము చేసుకోకపోవడం చేత, అతనికి సంతానము లేకపోవడం వలన ఈ గడ్డికి అంకురములు లేవు. ఈ ఎలుక ఈ గడ్డిని ప్రతిరోజూ తింటుంది. ఆ ధర్మవర్ణుడు కూడా మరణించినట్లయితే ఆ తర్వాత ఈ ఎలుక మిగిలిన ఈ గడ్డి మొక్కను కూడా తినేస్తుంది. అప్పుడు మేము అగాధములోనికి భయంకరమైనటువంటి కూపములోకి పడిపోతాము. ఆ కూపము దాటలేనిది. చీకటితో నిండి ఉన్నది.
కాబట్టి, నాయనా మాపైన దయవుంచి, భూలోకానికి వెళ్లి, మా ధర్మవర్ణుడికి మా దైన్యాన్ని వివరించు. మేము అతని దయకు ఎదురు చూస్తున్నామని చెప్పి, వివాహం చేసుకోవడానికి అంగీకరింపజేయి. నీ పితృదేవతలు నరకమున చీకటి కూపములో పడి ఉన్నారు. బలవమైన కాలమనే ఎలుక వారికీ ఆధారమై మిగిలిన ఆ ఒక్క గడ్డి పరికను కూడా కొరికేస్తోంది. ఈ గడ్డిలో మూడు వంతులు పోయాయి. కేవలం ఒక్క వంతు మాత్రమే మిగిలి ఉంది. ఆ మిగిలింది నీ ఒక్కడివే నీ ఆయువు కూడా గతిస్తూ ఉంది. నీవు ఉపేక్షించినట్లయితే మావలనే నీవు కూడా మరణించిన తర్వాత ఈ విధంగా మాతోపాటు ఇందులోనే పడిపోతావు. కాబట్టి గృహస్థ జీవితాన్ని అవలంబించి, సంతానాన్ని పొంది, వంశవృద్దిని చేసి మేము నూతిలో పడకుండా రక్షించమని మా మాటగా చెప్పు. పుత్రులు ఎక్కువ మందిని పొందాలి. అందులో ఒక్కడైనా గయకు పోయి, పిండ ప్రధానము చేయాలి. అశ్వమేధ యాగము చేయవచ్చు. ఆయా మాస వ్రత విధానము అవలంబించి మాకు దానము, శ్రార్ధము మొదలైనవి చేయవచ్చును. ఇందువల్ల మాకు నరక విముక్తి విముక్తి కలుగుతుంది. పుణ్యప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. మా వంశంలో ఎవరైనా పాప నాశనం అయినటువంటి విష్ణు కథను విన్నపటికి చెప్పినప్పటికీ కూడా మాకు ఉత్తమ గతులు కలగవచ్చు. తండ్రి పాపాత్ముడైనప్పటికీ, పుత్రుడు ఉత్తముడు, భక్తుడు అయినట్లయితే అతని తండ్రి తరిస్తాడు. దయ ధర్మ విహీనమైనటువంటి పుత్రులు ఎక్కువమంది ఉన్నప్పటికీ ప్రయోజనం ఏమిటి? శ్రీహరిని అర్చించని, స్మరించని పుత్రులు ఎంతమంది ఉన్నప్పటికీ ఉపయోగమేమున్నది? పుత్ర హీనుడైనటువంటి వానికి ఉత్తమ గత్తులు కలగవు కదా ! కాబట్టి సద్గుణ శాలి అయినటువంటి పుత్రుణ్ని పొందాలి. మా ఈ బాధను మా ఈ మాటలను అతనికి వివరముగా చెప్పు. గృహస్థ జీవితాన్ని స్వీకరించమని నచ్చచెప్పు. మంచి సంతానాన్ని పొందమని తెలియజేయని” వారు అభ్యర్ధించారు.
ధర్మవర్ణుడు పితృదేవతల మాటలు విని ఆశ్చర్యపోయాడు. దుఃఖమును పొందినవాడై ఈ విధంగా పలికాడు. “మీ వంశమునకు చెందినటువంటి ధర్మ వర్ణుడని నేనే. వివాహము చేసుకోకూడదనే పనికిమాలిన పట్టుదల కలిగి మిమ్మల్ని ఈ విధంగా బాధపడే విధంగా చేసిన వాడిని నేనే . పూర్వము సత్రయాగము జరిగినప్పుడు, నారద మహర్షి మానవులకు కలియుగములో గుహ్యావయవము, నాలుక అదుపులో ఉండవు. విష్ణుభక్తి ఉండదని చెప్పినటువంటి మాటలను బట్టి, నేను గుహ్యావయవాన్ని అదుపులో ఉంచుకోవడానికి వివాహాన్ని మానేశాను. కలియుగములో పాప భూయిష్టమైనటువంటి జనుల సాంగత్యం ఇష్టము లేక, ద్వీపాంతరములో నివసిస్తూ ఉన్నాను. ఇప్పటికే కలియుగం మూడు పాదాలు గడిచిపోయాయి. 4వ పాదము కూడా చాలా వరకు గడిచింది. నేను మీ బాధను అర్థం చేసుకోగలను. మిమ్మల్ని ఈ విధంగా బాధలకు గురిచేసినటువంటి నా జన్మ వ్యర్థమైనటువంటిది. మీ కులములో పుట్టి మీకు తీర్చవలసినటువంటి రుణాన్ని తీర్చలేకపోయాను. విష్ణువును, పితృదేవతలను, ఋషులను పూజించని వాని జన్మ వ్యర్థము. అతని ఉనికి భూమికే భారము. నేను మీ ఆజ్ఞను పాటించి వివాహం చేసుకుంటాను. కలి బాధలు కలగకుండా, సంసార బాధలు లేకుండా మీ పుత్రుడనై నేను మీకు చేయవలసిన కార్యాలను ఆజ్ఞాపించమని ప్రార్థించాడు.
ధర్మవర్ణుని పితృదేవతలు ఆశీర్వదించి, కొంత ఊరటను పొంది, “నాయనా మీ పితృదేవతల పరిస్థితిని చూసావు కదా! సంతానం లేకపోవడం చేత, గడ్డిపరకని ఆలంబనగా చేసుకొని ఏ విధంగా వేలాడుతున్నామో చూసావు కదా! విష్ణు కథల యందు అనురక్తి కలిగి వాటిని స్మరిస్తూ సదాచార సంపన్నత కలవారిని కలి పీడించ లేదు. శ్రీహరి స్మరణము చేస్తూ, ఆయన స్వరూపము అయినటువంటి సాలగ్రామ శిలని గాని, భారతమును గాని ఇంట్లో ఉంచుకున్నట్లయితే కలి వారిని బాధించడు. వైశాఖ వ్రతము, మాఘ స్నాన వ్రతము, కార్తీక దీప దానము పాటించేటటువంటి వారిని కలి విడిచిపెడతాడు. ప్రతి రోజు కూడా పాప హరము, ముక్తి ప్రదము అయినటువంటి శ్రీహరి కథలను విన్నట్లయితే, కలి వారిని పీడించడు. వైశ్య దేవము, తులసి, గోవు ఉన్న ఇంటిని కలి బాధించడు. కాబట్టి ఇటువంటివి లేని చోట ఉండకు
నాయనా! త్వరగా భూలోకానికి వెళ్ళు. ప్రస్తుతం వైశాఖమాసము గడుస్తూ ఉన్నది. సూర్యుడు అందరికీ ఉపకారము చేయాలని మేషరాశిలో ప్రవేశించి ఉన్నాడు. ఈ నెలలోని 30 తిధులు కూడా పుణ్యప్రదాలే. ప్రతి తిధిలోను చేసినటువంటి పుణ్యము, అత్యధికమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది చైత్ర బహుళ అమావాస్య మానవులకు ముక్తిని ప్రసాదించేటటువంటిది. పితృదేవతలకు ప్రియమైనది. ముక్తిని ఇచ్చేటటువంటిది. కనుక ఆరోజు పితృదేవతలకు శ్రద్ధాన్ని చేయండి. జల పూర్ణమైనటువంటి కలశాన్ని ఇచ్చి, పిండ ప్రధానము చేసినట్లయితే గయాక్షేత్రములో చేసిన దానికి కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. చైత్ర అమావాస్య నాడు శక్తి లేనట్లయితే, కూరతో నైనా శ్రార్ధాన్ని చేయవచ్చు. ఆరోజు సుగంధ పానకం గల కలశాన్ని దానం ఇయ్యవచ్చు. పితృహత్య చేసినవాడు, ఆరోజు చల్లని పానీయాన్ని ఇచ్చి శ్రార్ధము నిర్వహించినట్లయితే, పితృదేవతలపై అమృత వర్షము కురుస్తుంది.
ఆరోజు కలిశ దానము, అన్నాదులతో శ్రార్ధము ప్రశస్తమైనది. కాబట్టి నువ్వు త్వరగా వెళ్లి, ఉదక కుంభదానాన్ని, శ్రాద్ధాన్ని, పిండ ప్రదానాన్ని చెయ్యి. వివాహమాడి, ఉత్తమ సంతానాన్ని పొంది, పురుషోర్ధములను పొంది అందరినీ సంతోష పెట్టి, మునివై నువ్వు కోరినట్లు ద్వీప సంచారము చెయ్యి” అని వాళ్ళు చెప్పారు.
అప్పుడు ధర్మవర్ణుడు త్వరగా భూలోకాన్ని చేరుకున్నాడు. చైత్ర బహుళ అమావాస్యనాడు ప్రాతః కాలమున స్నానము చేసి, పితృదేవతలు చెప్పినట్లు జల కలశమును దానం చేసి, శ్రార్ధము మొదలైన వాటిని చేశాడు. వివాహము చేసుకొని, ఉత్తమ సంతానాన్ని పొందాడు. చైత్ర బహుళ అమావాస్య ప్రసస్తిని వ్యాపింప చేశాడు. చివరకు తపస్సు చేసుకోవడానికి గంధమాధన పర్వతానికి వెళ్ళాడు.” అని శ్రుతి దేవుడు శ్రుతకీర్తి మహారాజుకు వివరించాడనే విషయాన్ని నారదుడు అంబరీష మహారాజుకి వివరంగా చెప్పారు.
వైశాఖ పురాణం 27వ అధ్యాయం సంపూర్ణం.
సర్వం శ్రీ హరి పాదారవిందార్పణమస్తు!!
vaisakha Puranam
#vaisakhapuranam