జీవులు వివిధరకాలుగా ప్రవర్తించడానికి కారణం ఏమిటి ?
జీవులు వివిధరకాలుగా ప్రవర్తించడానికి కారణం ఏమిటి ?
- లక్ష్మి రమణ
నారదుడు (Narada) అంబరీష (Ambarisha) మహారాజుతో - శృతదేవ మహాముని శృతి కీర్తి మహారాజు వివరించిన వైశాఖ పురాణాన్ని ఈ విధంగా చెబుతూ ఉన్నారు. “ విష్ణు స్వరూప స్వభావాలని వివరిస్తూ ఉండగా, ఆ వేటగాడు తిరిగి ఇలా ప్రశ్నించాడు. “ఓ స్వామి! బ్రహ్మజ్ఞానీ, ప్రభువైనటువంటి శ్రీహరి చేత సృష్టించబడిన కోట్ల కొలదిగా ఉన్న జీవులు, విభిన్న కర్మలు, బహుమార్గాలు కలవై, విభిన్న స్వభావాలను కలిగి అనేక రకాలుగా ఉన్నారు. దీనికి కారణం ఏంటి? నాకు ఈ విషయాన్ని వివరించండి అని ప్రశ్నించాడు”. అప్పుడు శంఖుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు.
“ ఓ కిరాతా! విను. సత్వము, రజస్సు, తమస్సు అనేటటువంటి గుణ త్రయాన్ని అనుసరించి జీవులు ఏర్పడ్డారు. రాజస గుణము గలవారు రాజసిక ధర్మాలనూ, తామస మనస్కులు తామస ధర్మాలనూ, సాత్వికులు సాత్విక కర్మలను చేస్తూ ఉంటారు. ఈ జీవులు తమ జీవనములో చేసిన కర్మలను బట్టి సత్వ రజస్తమో గుణాల పాళ్ళు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి. అందువల్ల వారు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలమును, తక్కువ కర్మకు తక్కువ ఫలమును - పాపము, పుణ్యముల రూపంలో సుఖదుఃఖాలను పొందుతూ ఉంటారు. ఈ జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి ఒక్కొక్కసారి దుఃఖాన్ని, మరొకసారి సుఖమును ఇంకొకప్పుడు భయము అనేటటువంటి ఫలాలను పొందుతూ ఉన్నారు.
జీవులు ఈ మూడు గుణాలకు తాము బద్దలై చేసిన గుణకర్మలకు తగిన ఫలాన్ని పొందుతూ మాయకు లోబడి మళ్లీ కర్మలను గుణాలుకూలంగా చేస్తూ , దానికి తగిన ఫలితాలను పొందుతూ ఉన్నారు. జీవులు వారి గుణకర్మల వలన కలిగే మార్పులు చేర్పులు ఆ జీవులకే గాని, మాయకు ఎటువంటి మార్పు ఉండదు. తామసులు అయిన వారు అనేక దుఃఖాలను అనుభవిస్తూ తామస ప్రవృత్తి కలవారై ఉంటారు. వీరు నిర్ధయులై, క్రూరులై, ద్వేషముతో జీవిస్తూ ఉంటారు. వారు రాక్షస జన్మ మొదలుకొని, పిశాచములుగా ఉంటూ తామస మార్గాన్నే ప్రవర్తిస్తూ ఉంటారు. రాజస బుద్ది కలిగినవారు మిశ్రమ బుద్ధితో పుణ్యము పాపము రెండిటిని చేస్తూ ఉంటారు. పుణ్యం అధికంగా చేసినట్లయితే స్వర్గాన్ని, పాపం ఎక్కువగా చేసినట్లయితే నరకాన్ని పొందుతారు. కాబట్టి, వీళ్ళు నిశ్చయముగా జ్ఞానము లేనివారై, మంద భాగ్యులై సంసార చక్రంలో భ్రమిస్తూ ఉంటారు. సాత్వికులైన వారు ధర్మశీలత్వంతో దయాగుణ విశిష్టత కలిగి, శ్రద్ధ కలిగి, ఇతరులను చూసి అసూయ పడనివారై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించి ఉంటారు. వీరు తేజోసంపన్నులుగా గుణత్రయ శక్తిని దాటి ,నిర్మలంగా ఉండి ఉత్తమ లోకాలను పొందుతారు. ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు అనేక రకాలైనటువంటి కర్మలను కలవారు అనేక భావాలు కలవారు విభిన్నమైనటువంటి విధాలుగా ఉండేవారు అవుతున్నారు.
ప్రభువైన శ్రీహరి జీవుల గుణకర్మలను అనుసరించి వారి చేత ఆయా కర్మలను చేయిస్తూ ఉన్నారు. జ్ఞానవంతుడు ఆ స్వామి స్వరూపమును చేరడానికి సమర్ధుడు అవుతున్నాడు. సంపూర్ణ పరబ్రహ్మ అయినటువంటి శ్రీహరికి భేద బుద్ధి, దయాస్వభావము లేవు. సృష్టి స్థితి లయములు సమానంగానే జీవుల గుణకర్మలను అనుసరించి చేస్తూ ఉన్నారు. కాబట్టి జీవులందరూ కూడా తాము చేసిన గుణకర్మలను అనుసరించే తగిన ఫలాలను, శుభాలను, అశుభాలను, సుఖాన్ని, దుఃఖాన్ని, మంచినీ, చెడును పొందుతూ ఉన్నారు. తోటను నాటినవాడు అన్ని మొక్కలకు సమంగానే నీరు పోసి వాటి సంరక్షణ చేసినప్పటికీ, ఆ చెట్లు వాటి స్వభావానికి తగినట్టుగా ఎత్తుగాను పొట్టిగాను లావుగాను సన్నగానూ అనేక రకాలైనటువంటి విధాలుగా పెరుగుతూ ఉంటాయి.
అక్కడ నాటబడింది ముళ్ళ విత్తు అయినట్లయితే ముళ్ళ చెట్లే వస్తాయి పండ్ల చెట్టు అయితే పండ్ల చెట్టు వస్తాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉంది జీవి చేసినటువంటి కర్మలు చెడ్డవైతే అతని కర్మ అనుభవం వల్ల ముండ్ల చెట్టు విత్తనము అవుతుంది. కర్మలు మంచివైనట్లయితే అతని కర్మఫలము పండ్ల చెట్టు విత్తనం అవుతుంది. భగవంతుని రక్షణ ఎల్లప్పుడూ మనకుంటుంది. కానీ, మనము ముళ్ళ చెట్టా, పండ్ల చెట్టా అనేది మన కర్మలు, గుణాన్ని అనుసరించి ఉంటుంది. తోట కాపరి ఒకే కాలువ ద్వారా రెండిటికి నీటిని పంపిస్తాడు. కానీ ఆ చెట్ల తీరు వేరుగా ఉండటం చేత అవి పండ్లని, ముళ్ళని ప్రభావిస్తాయి. దానికి కారణం ఆ చెట్టు స్వభావమే కానీ, తోట కాపరి గుణాలు కారణం కావు కదా !” అని శంఖుడు వివరించాడు.
అప్పుడు కిరాతుడు “స్వామి సంపూర్ణ జ్ఞాన సంపద కలవారికి సృష్టి స్థితి లయములనే స్థితులలో ఎప్పుడు ముక్తి కలుగుతుందో చెప్పండి?” అని అడిగాడు. అప్పుడు శంఖుడి ఈ విధంగా వివరించ సాగాడు. “ నాయనా ! 4000 యుగాలు కలిస్తే బ్రహ్మకు ఒక పగలు. రాత్రి కూడా 4000 యుగాల కాలమే! ఇటువంటి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక రోజు. ఇటువంటి 15 రోజులు ఒక పక్షము. ఇటువంటి రెండు పక్షములు ఒక మాసము. రెండు మాసాలు ఒక రుతువు. మూడు రుతువులు ఒక ఆయనము. రెండు ఆయనములు ఒక సంవత్సరము. ఇటువంటి దివ్యమైన సంవత్సరాలు నూరు గడిస్తే, దానిని బ్రహ్మకల్పము అంటారు. ఒక బ్రహ్మకల్పము ముగియగానే ప్రళయం ఏర్పడుతుంది అని వేద విదురులు అంటారు. మానవులందరూ కూడా నశించినప్పుడు వచ్చేది మానవ ప్రళయము. బ్రహ్మ మానసములో ఒక రోజు గడిచినప్పుడు వచ్చిన ప్రళయము దినప్రళయము. బ్రహ్మ మనసులో నూరు సంవత్సరాలు గడువుగా వచ్చింది బ్రహ్మప్రళయము. అని ఈ విధంగా ప్రళయాన్ని మూడు విధాలుగా చెప్పారు.
బ్రహ్మకు ఒక ముహూర్త కాలం గడిచినట్లయితే మనువుకు ప్రళయం అవుతుంది. ఇటువంటి ప్రళయములు 14 గడచినట్లయితే దీనిని దయనందిన ప్రళయం అని అంటారు. మన్వంతరంలో మూడు లోకాలు మాత్రమే నశిస్తాయి. అందులో చేతనములు మాత్రము నశించి, అచేతనములైనటువంటి లోకములు నశించక జల పూర్ణములై ఉంటాయి. మన్వంతరము పూర్తి కాగానే చేతనములు తిరిగి జన్మిస్తాయి. దైనందిన ప్రళయములో స్థావరం జంగములు అన్నీ లోకములతో పాటు నశిస్తాయి . బ్రహ్మ నిద్రించగా, సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నీ నశిస్తాయి. ఆ లోకముల అధి పతులు, లోకములు, చేతనములన్నీ నశించిపోతాయి. తత్వ జ్ఞానము కల దేవతలు, కొందరు మునులు సత్య లోకములో ఉన్నవారు, దిన ప్రళయములో నశించక బ్రహ్మతో పాటు నిద్రిస్తారు. దినకల్పము పూర్తయ్యే వరకు ఆ జ్ఞానుల ఆ విధంగానే నిద్రలో గడుపుతారు. రాత్రి గడవగానే మళ్లీ యధాప్రకారం గా జ్ఞానులకు మెలకువ వస్తుంది. బ్రహ్మ సృష్టి, తిరిగి మన్వంతరములు ప్రారంభమవుతాయి.
మునులు, దేవతలు, పితృదేవతలు, లోకములు ధర్మములు, వర్ణములు , దేశములు శ్రీహరి తన అవతారములను తిరిగి సృష్టిస్తారు. ఈ విధంగా ఈ దేవతలు మునులు బ్రహ్మ కల్పము మునులు బ్రహ్మకల్పము ముగిసే వరకు ఉంటారు. ఆయా రాశులలో ఉన్న దేవతలు, మునులు తమకు విహితములైనటువంటి వేద ధర్మములను అనుసరిస్తూ, ఆయా గోత్రములలో జన్మించి, తమ తమ నియమిత కర్మలను చేస్తూ ఉంటారు. యుగాంతములో రాక్షసులు, పిశాచాలు మొదలగువారు కలితో కలిసి జీవులు నరకస్థానాన్ని చేరుతారు. ఆ పిశాచ గణముల లో ఉన్నవారు తమ కర్మలను అనుసరించి, తిరిగి జన్మించి తగిన కర్మలను చేస్తూ ఉంటారు. బ్రహ్మ మొదలైన వారి సృష్టి కాలమును, ముక్తి కాలమును విను.
శ్రీమహావిష్ణువు (Mahavishnu) కన్నుమూయిట బ్రహ్మదేవుడికి ఒక కల్పమవుతుంది. మరల కనురెప్ప పైకి లేచినప్పుడు, శ్రీహరికి తనిలో ఉన్న లోకాలను సృష్టించాలానే కోరిక కలుగుతుంది. అప్పుడు తన ఉదరములో సృష్టింపదగిన వారు, లింగ శరీరులు, లింగ శరీర భంగమైన వారు ఇలా అనేక జీవులు ఉంటారు. శ్రీమహా విష్ణువు కడుపులో నిద్రించువారు, మెలకువగా ఉన్నవారు, అజ్ఞాన దశలో ఉన్నవారు, లింగ భంగ శరీరులు, పిపీలికము నుండీమానవుని వరకూ ఉండే అనేకానేక జీవులు, ముక్తిని పొందిన వారు, బ్రహ్మ మొదలు మానవుల వరకు ఉండే జీవులు వీళ్ళందరూ కూడా శ్రీహరిని ధ్యానిస్తారు. కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహంతో బ్రహ్మకు సాయుజ్యాన్ని ఇస్తారు. కొందరికి తత్వ జ్ఞానాన్ని, సారూప్య ముక్తిని, సామీప్య ముక్తిని, సాలోక్య ముక్తిని వారి వారికి తగినట్టుగా అనిరుద్ధ వ్యూహ్యమును అనుసరించి అనుగ్రహిస్తారు. ప్రద్యుమ్న వ్యూహం అనుసరించి , సృష్టిని చేస్తారు. మాయ, జయ, కృతి, శాంతి అనే నాలుగు శక్తులను వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ అనే నాలుగు వ్యూహముల నుండి ప్రవర్తింపజేస్తారు. ఈ విధంగా నాలుగు శక్తులు నాలుగు వ్యూహములు కలిగి శ్రీమహావిష్ణువు పూర్ణకాముడై, భిన్న కర్మాశ్రయముతో ప్రపంచాన్ని సృష్టిస్తారు.
యోగ మాయను (Yogamaya) ఆశ్రయించినటువంటి శ్రీహరి (Srihari)కన్ను మూయగ బ్రహ్మకు రాత్రి అవుతుంది. అప్పుడు సంకర్షణ వ్యూహంతో సర్వమును నశింపజేస్తారు. శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైనా కూడా తెలుకోజాలనివి.” అని శంకుడు వివరించాడు. అప్పుడు కిరాతుడు “స్వామి శ్రీమహావిష్ణువులకి ఇష్టమైనటువంటి భాగవత ధర్మాలను తెలియజేయండి” అని కోరాడు. అప్పుడు శంకుడు ఈ విధంగా అన్నారు. “చిత్తశుద్ధిని కలిగించి సజ్జనులకు ఉపకారము చేసేటటువంటి ధర్మము సాత్విక ధర్మం. శృతి ప్రతిపాదితము, నిష్కామము, లోకములకు విరుద్ధము కానిది అయినటువంటి ధర్మము సాత్విక ధర్మమని పెద్దలు చెప్పారు. బ్రాహ్మణాది వర్ణముల చేత బ్రహ్మ చర్యాది ఆశ్రమంల చేత విభిన్నములైనటువంటి ధర్మములు - నిత్య నైయుక్తిక కార్యములను మూడు రీతులుగా విభక్తములై ఉన్నాయి. నాలుగు వర్ణముల వారు కూడా తమ తమ ధర్మములను ఆచరించి శ్రీహరికి ఫల సమర్పణ చేసినట్లయితే అవి సాత్విక ధర్మముల అని చెబుతారు. శుభకరములైన భగవంతునికి చెందిన కర్మలను సాత్విక కర్మలు అంటారు. వీటిని పాటించేవారు శ్రీ మహావిష్ణువుని విడిచి, మరొక దైవముని ఆశ్రయించరు. ఇట్టి వీరిని భాగవతులు అనాలి. ఎవరి చిత్తము విష్ణువును మాత్రమే పొందుతుందో , ఎవరి నాలుక శ్రీహరి నామస్మరణ చేస్తూ ఉంటుందో, ఎవరి హృదయం విష్ణు పాదముల యందు ఆసక్తి కలిగి ఉంటుందో అటువంటి వారే భాగవతులు. విష్ణు ప్రీతికరమైన శుభప్రదమైన ధర్మములను నిష్కామముగా చేస్తూ ఉంటారు. విష్ణు పై భక్తి కలిగి ఉంటారు. వారు భగవద్భక్తులు. వేద శాస్త్రములలో చెప్పబడి శాశ్వతములై విష్ణు ప్రీతికరములైనటువంటి ధర్మాలను ఆచరించి, అన్ని దేశములలో తిరగడం, అన్ని కర్మలను చూడడం, అన్ని ధర్మములను వినడం, విషయం వాంచాలా పట్ల ఆసక్తి లేకుండా ఉండడం భాగవతుల లక్షణం.
నపుంసకునికి సుందరీమణులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నీ కూడా ఆజ్ఞానులకు ఉపయోగించవు. చంద్రుని చూసి చంద్రకాంత శిల ద్రవించినట్లు, సజ్జనులకు మంచివారిని చూసినంతనే మనసు ద్రవిస్తుంది. ఉత్తములకు శాస్త్ర విషయాలను వినడం వలన ,సజ్జనుల మనసు ప్రదీప్తమై సూర్య కిరణములకు సూర్యకాంత శిల మండినట్లు ప్రజ్వలిస్తుంది. ఇహపర లోకములను కలిగించు విష్ణు ప్రీతికరమైన గుణములు సర్వదుఃఖములను నశింపజేస్తాయి. పెరుగును మదించి సారభూతముగా వెన్నని స్వీకరించినట్లు, అన్ని ధర్మముల సారమునూ మధిస్తే వచ్చిన సారభూతమైన వైశాక ధర్మములనే వెన్న ఎంతో మధురమైనది.
శ్రీహరి లక్ష్మీదేవికి పాలసముద్రంలో ఉన్నపుడు చెప్పిన విధముగా బాటసారులకు మార్గాన్ని ఇచ్చేటటువంటి నీడనిచ్చేటటువంటి మండపాలను, బాటసారులకు మార్గములో నీడనిచ్చే మండపాలను చలివేంద్రాలను ఏర్పాటు చేయడం, విసిని కర్రలతో వీచడం, తగిన ఉపచారాలు చేయడం, గొడుగు చెప్పులు కర్పూరము గంధము తదితరాలను దానం ఇవ్వడం వైభవం ఉన్నట్లయితే వాపీకూప తటాకములను తవ్వించడం, సాయంకాలంలో పానకమును పుష్పాలను ఇవ్వడం, తాంబూలం దానం చేయడం, ఆవుపాలు మొదలైన వాటిని ఇవ్వడం, ఉప్పు కలిపిన మజ్జిగను బాటసారులకు ఇవ్వడం, తలంటి పోయడం, బ్రాహ్మణుల పాదాలను కడగడం, చాప కంబళి మంచం గోవు మొదలైన వాటిని దానం ఇవ్వడం, తేనె కలిపిన నువ్వుల నివ్వడం, ఇవన్నీ కూడా పాపాలని పోగొడతాయి. సాయంకాలంలో చెరుకు గడనివ్వడం, దోస పళ్ళనివ్వడం, పండ్ల రసాలను ఇవ్వడం, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం ఇవి వైశాఖ ధర్మ ములు. ఈ ధర్మములే అన్ని ధర్మములలోకి ఉత్తమమైనవి. ప్రాతః కాలంలో స్నానం చేసి, విహితమైనటువంటి సంధ్యావందనాధులను ఆచరించి, శ్రీహరిని పూజించి, శ్రీహరి కథలను విని యధాశక్తి దానములు చేయాలి.
వైశాకమున కంచు పాత్రలలో భుజించకూడదు. నిషిద్ధములైనటువంటి ఉల్లి మొదలైన వాటిని తినకూడదు. పనికిమాలిన మాటలను, పనికిమాలిన పనులను వైశాఖమాసంలో చెయ్యకూడదు. సొరకాయ, వెల్లుల్లి ,నువ్వుల పిండి, పులికడుగు, చద్దన్నము, నేతి బీరకాయ మొదలగు వాటిని వైశాకములో విడిచి పెట్టాలి. బచ్చలి కూర, మునగ కాడలు, పండని, వండని పదార్థాలు, ఉలువలు, చిరుసెనగలు, వీటిని తినకూడదు. ఒకవేళ పైన చెప్పిన వాటిలో దేనిని తిన్నప్పటికీ నూరు మార్లు నీచ జన్మను పొందవలసి ఉంటుంది. చివరకు మృగమై జన్మిస్తాడు. ఇందులో సందేహమే లేదు. ఈ విధంగా శ్రీహరి ప్రీతిని కోరి వైశాఖమాసం అంతా కూడా వ్రతాన్ని ఆచరించాలి. తాను ఆ మాసంలో ప్రతి రోజు పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను, వస్త్రములతో దక్షిణలతో యధాశక్తి వైభవముగా బ్రాహ్మణునికి దానమీయాలి. ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నాన్ని, జలకలిశమును, తాంబూల దక్షిణలను ఇచ్చినట్లయితే యమధర్మరాజు సంతోషిస్తాడు. పితృదేవతల గోత్రనామాలు చెప్పి పెరుగన్నాన్ని గురువులకు శ్రీహరికి ఇచ్చినట్లయితే పితృదేవతలు సంతోషిస్తారు. చల్లని ఉదకాన్నీ, పెరుగు కలిపిన అన్నాన్ని, కంచు పాత్రలో ఉంచి, దక్షిణ తాంబూలం, ఫలములు ఉంచి పిల్లలు కలవానికి లేదా బ్రాహ్మణునికి ఇచ్చి గోదానము చేసినట్లయితే శ్రీహరి లోకము ప్రాప్తిస్తుంది. ఆడంబరము, కపటము లేకుండా వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించినట్లయితే, అతని సర్వపాపాలు పోవడమే కాక అతని వంశములో నూరు తరాల వారు పుణ్యలోకాలను పొందుతారు.
వైశాఖ వ్రతాన్ని ఆచరించిన వారు మరణానంతరము సూర్యలోకమును, శ్రీహరి లోకమును పొందుతారని” శంఖుముని వైశాఖ మహత్యాన్ని , వైశాక ధర్మాలను కిరాతకునికి వివరిస్తూ ఉండగా, ఐదు కొమ్ములు గల మర్రిచెట్టు నేలపై పడింది. అది చూసి వారిద్దరు ఆశ్చర్యపోయారు. ఆ చెట్టు తొర్రలో నుండి పెద్ద శరీరముతో ఉన్న భయంకరమైన సర్పము బయటకు వచ్చి, సర్పరూపాన్ని విడిచి ఆ మునికి తలవంచి నమస్కరించి నిలిచింది అని శృతదేవుడు శృతకీర్తి కి చెప్పాడనే విషయాన్ని నారదుడు అంబరీష మహారాజుకి చెప్పాడు.
వైశాఖ పురాణం 25వ అధ్యాయం సంపూర్ణం.
సర్వం శ్రీ హరి పాదారవిందార్పణమస్తు !!
Vaisakha Puranam, Vishnu
#vaisakhapuranam