Online Puja Services

వైశాఖ పురాణ 24వ అధ్యాయ కథనం

3.137.218.176

ప్రాణము దాని ప్రాముఖ్యతని వివరించే వైశాఖ పురాణ 24వ అధ్యాయ కథనం. 
- లక్ష్మి రమణ 

అంబరీషునికి (Ambarisha) దివ్యమైన  వైశాఖ (Vaisakha) వ్రత (vratha) మహత్యాన్నినారద మహర్షి ఇంకా ఈ విధంగా  వివరిస్తూ ఉన్నారు. “ శృత దేవుడు శ్రుతి కీర్తి మహారాజుకి శంకుడు, వేటగాడు మధ్య జరిగిన సంభాషణని ఇలా చెబుతూ ఉన్నాడు. కిరాతుడు (వేటగాడు) విష్ణు కథపట్ల, వైశాఖ మహత్యం పట్లా ఆశక్తి కలిగినవాడై శంకుని ఈ విధంగా ప్రశ్నించాడు. “ స్వామి విష్ణువుని ఉద్దేశించి చేసేటటువంటి ధర్మాలు పూజలు ప్రశస్తములైనవని, వాటిలో వైశాఖమాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తమని చెప్పారు.  ఓ మహా జ్ఞాని! ఆ విష్ణువు (Vishnu) ఎటువంటి వాడు? అతని లక్షణం ఏమిటి? దానిని తెలియజేసే ప్రమాణం ఏంటి? వాటిని తెలుసుకో కోరుతున్నాను. విష్ణువు దేనిచేత ప్రీతిని పొందుతాడు? నీ సేవకుడైనటువంటి నాకు ఈ విషయాలను దయవుంచి చెప్పవలసిందిగా కోరుతున్నానని” ప్రశ్నించాడు. 

అప్పుడు శంకుడు “కిరాతుడా జాగ్రత్తగా విను.  శ్రీమహావిష్ణువు రూపమే పాపరహితము. ఆలోచనలకి అందనటువంటిది.  బ్రహ్మ మొదలైనటువంటి దేవతలు మహాత్ములైనటువంటి మునులు కూడా తెలుసుకోలేనిది.  శ్రీమహావిష్ణువు శక్తి గుణాలు సర్వదా సంపూర్ణములు.  నిశ్చయముగా సమస్తానికి అధిపతి శ్రీమహావిష్ణువే. ఆయన  గుణ రహితుడు, నిష్కలుడు, అనంతుడు సచ్చిదానందస్వరూపుడు. చరాచర స్వరూపమంతా కూడా తానే అయినటువంటి వాడు.  ఈ సృష్టి అంతా కూడా నశించిపోయినప్పటికీ శ్రీహరి నిలిచే ఉంటాడు.  స్థిరమైనాడు.  నాశనమే లేనివాడైన శాశ్వతుడు. ఉత్పత్తి, స్థితి, సంహారము -  వీటి ఆవృతి, ప్రకాశము, బంధమోక్షాలు వీటి ప్రవృతులు నివృతులు పరమాత్మ వలన జరుగుతూ ఉంటాయి. ఇదే పరబ్రహ్మ లక్షణం. 

ఇతడే పరబ్రహ్మమని జ్ఞానుల అభిప్రాయం.  జ్ఞానులు శ్రీమన్నారాయణడే పరబ్రహ్మ అని చెబుతారు.  శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపమైనటువంటి పరబ్రహ్మ పదార్ధమని వేదాంతము కూడా నిర్ణయించింది. శాస్త్రాలు, వేదములు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, పంచ రాత్ర ఆగమములు, భారతము మొదలైనటువంటి ప్రామాణిక గ్రంథాలు , ధర్మ శాస్త్రాల ద్వారా ఈ విషయం మనకి మరింత స్పష్టంగా అర్థం అవుతూ ఉంది . 

శ్రీహరిని (Srihari) ఇంద్రియాదుల చేత అనుమానాది తర్కముల చేత తెలుసుకోవడానికి సాధ్యం కాదు.  ఈయన అవతారములను కర్మలను తమ బుద్ధి కొలది తెలుసుకొని సర్వ జీవులు ఆయన అధీన వర్తులై ముక్తిని పొందుతున్నాయి . ఈయన సర్వశక్తి సంపన్నుడు.  దేవతలు, ఋషులు, పితృదేవతలు మొదలైన వారందరూ ఒక్కొక్క విధముగా ఈయన శక్తినే కలిగి ఉన్నారు. బలము జ్ఞానము సుఖము మొదలైనవి ఉండడం చేత ప్రత్యక్ష, అనుమానాది ప్రమాణముల చేత సర్వ ప్రాణులలో మనుషుడు ఉత్తముడని తెలుసుకోవచ్చు. అటువంటి మనిషిని కంటే జ్ఞానవంతుడైన రాజు వందరెట్లు గొప్పవాడు.  అటువంటి రాజుల కంటే, మనుష్య గంధర్వులు నూరు రెట్లు గొప్పవారు.  తత్వాభిమానులైనటువంటి దేవతలను మనుష్య గంధర్వులకంటే వంద రెట్లు గొప్ప వారిని తెలుసుకోవాలి.  అటువంటి దేవతల కంటే సప్త ఋషులు గొప్పవారు.  సప్త ఋషుల కంటే అగ్ని, అగ్ని కంటే సూర్యుడు, సూర్యుని కంటే గురువు, గురువు కంటే ప్రాణము, ప్రాణము కంటే ఇంద్రుడు ఎంతో గొప్పవారు, బలవంతులు.  ఇంద్రుని కంటే గిరిజాదేవి, ఆమె కంటే జగద్గురు అయినటువంటి శివుడు, శివుని కంటే మహాదేవి అయినటువంటి బుద్ధి, బుద్ధి కంటే మహా ప్రాణము గొప్పవి.  అటువంటి మహా ప్రాణము కంటే గొప్పది లేనేలేదు.  ఆ మహా  ప్రాణము నుండే సర్వము ఉత్పన్నమవుతోంది.  ఆ మహా ప్రాణము నుండే ప్రాణాత్మకమైనటువంటి విశ్వము పుట్టింది.  సర్వము కూడా మహా ప్రాణముతోటే కూడి ఉంది. దాని  లాగానే ఈ సర్వము కదులుతూ ఉంది.  నల్లని మబ్బులాగా ప్రకాశించే ఈ మహా ప్రాణాన్ని సర్వాధారమని పెద్దలు చెబుతున్నారు.  లక్ష్మీ కటాక్షము చేత ఈ ప్రాణము నిలిచి ఉంటుంది.  ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశిస్తూ ఉంటుంది.  అటువంటి సర్వాధారుడు, సర్వోత్తముడు అయినటువంటి శ్రీ మహా విష్ణువు కంటే గొప్పది, ఆయనతో సమానమైనది మరి ఏదీ లేదు” అని శంఖుడు వివరిస్తూ ఉండగా,  కిరాతుడు “స్వామి ప్రాణము అన్నింటికంటే గొప్పదో ప్రాణము కంటే విష్ణువు గొప్పవాడో  వివరించమని”అడిగాడు . 

 అప్పుడు శంకుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు.  “ఓ కిరాతా! సమస్త జీవులనూ  పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యాన్ని చెబుతాను విను.  పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి, బ్రహ్మాదులతో ఈ విధంగా అన్నారు.  ‘దేవతలారా! నేను మీ దేవతల సామ్రాజ్యానికి బ్రహ్మను అధిపతిగా రాజుగా నియమిస్తున్నాను. మరి మీలో గొప్ప వారెవరో చెప్పిన వానిని యువరాజుగా చేస్తాను.  అతడు శీలము సౌర్యము ఔదార్యము మొదలైన  గుణాలను కలిగి ఉండాలి’ అని శ్రీహరి చెప్పారు.  అప్పుడు ఇంద్రాదులు  నేను గొప్ప, అంటే నేను గొప్పని పరస్పరము తగువలాడుకున్నారు.  కొందరు సూర్యుడు గొప్ప అన్నారు.  ఇంద్రుడు గొప్పనీ కొందరున్నారు.  కొందరు ఈ రెండు పక్షాలలోనూ చేరకుండా మౌనంగా ఉండిపోయారు.  ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయం తీసుకోలేక శ్రీమన్నారాయణుని  దగ్గరికే  పోయి ఆయన్నే నిర్ణయించాల్సిందిగా మనవి చేశారు. 

అప్పుడు శ్రీహరి నవ్వుతూ “విరాట్ పురుషుడు సృష్టించిన ఈ స్థూల దేహముకి  వైరాజమని పేరు. ఈ దేహంలో చాలామంది దేవతలు అంశరూపాలలో ఉన్నారు. ఏ దేవుని అంశ ఈ శరీరం నుండి బయటకు వస్తే ఈ దేహం పడిపోతుందో, ఎవరు ప్రవేశిస్తే నిలబడుతుందో అతడే, ఆ దేవుని అంశయే బ్రహ్మ తర్వాత యువరాజ పదవికి తగిన దైవమని చెప్పాడు.  శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరూ అంగీకరించారు.  స్థూల శరీర పాదముల నుండి ముందుగా జయంతుడు అనే దైవ శ్రేష్టుడు వెలపలికి వచ్చాడు.  అప్పుడు ఆ శరీరము నడవలేక పోయింది.  కానీ, వినడం చూడడం మొదలైన సర్వ కార్యాలను చేయగలిగింది. అప్పడా దేహిని కుండివాడు అన్నారు.  స్థూల దేహము గుహ్యావయవము నుంచి దక్షుడు అనే ప్రజాపతి ఈవతలకు వచ్చాడు.  శరీరము పడిపోలేదు.  వినగలిగింది, చూడగలిగింది, మాట్లాడగలిగింది, గాలిని కూడా పీల్చుకుంది.  ఆ తరువాత హస్తప్రదేశం నుండి ఇంద్రుడు బయటికి వచ్చాడు అప్పుడా దేహాన్ని హస్తహీనుడు అన్నారు. ఆ శరీరము ఇంద్రుడు బయటకు వచ్చినప్పటికీ, చూడడము తదితరమైన పనులన్నీ చేస్తూనే ఉండగలిగింది. ఆ తర్వాత కళ్ళనుండి సూర్యుడు బయటకు వచ్చాడు.  చూపు లేకపోయినా ఆ శరీరము తన పనులన్నీ చేయగలిగింది.  ముక్కు నుండి అశ్విని దేవతలు బయటకు వచ్చారు. వాసన చూడలేకపోయినప్పటికీ కూడా వినడము తదితర పనులన్నీ కూడా శరీరం చేయగలిగింది.  దేహము చెవుల నుండి దిక్కులు బయటకు వచ్చాయి.  అప్పుడు ఆ దేహికి వినికిడి శక్తి లేదు.  కానీ చూడటము ఇతరత్రా పనులన్నీ చేయగలిగాడు.  దేహము నాలుక నుండి వరుణుడు బయటికి వచ్చాడు.  దేహికి రుచి తెలియలేదు.  కానీ వినడము తదితర పనులన్నీ కూడా చేయగలిగింది.  శరీరం పడిపోలేదు.  ఆ తర్వాత వాక్కుకు అధిపతి అయినటువంటి అగ్ని బయటకు వచ్చాడు.  ఆ శరీరం మాట లేకపోవడం చేత మూగవాడు అన్నారు.  చూడడము తదితరమైనటువంటి చర్యలు అన్నీ చేయగలిగాడు. జ్ఞాన స్వరూపుడైన రుద్రుడు శరీరం నుంచి బయటకు వచ్చాడు.  శరీరకి జ్ఞానం లేదు కానీ వినడము తదితరాలన్నీ ఉన్నాయి. 

 ఆ తర్వాత ప్రాణము  వాయువు బయటకు వచ్చాయి.  అప్పుడు మాట మొదలైనవి పనిచేస్తున్నప్పటికీ కూడా దేహి నిశ్చేష్టమై పడిపోయాడు.  దీనిని చూసి దేవతలు అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు శ్రీహరి ఈ విధంగా అన్నారు ఈ విధంగా నిర్జీవమై పడిన శరీరాన్ని ఏ దేవత ప్రవేశించి లేవదీయగలదో అతడే యువరాజు అని పలికాడు. 

శ్రీహరి మాటలు విన్నటువంటి జయంతుడు దేహి పాదములలో ప్రవేశించాడు. కానీ, శరీరం లేవలేదు.  దక్షుడు గృహ్యమున ప్రవేశించాడు.  శరీరం లేవలేదు.  అలాగే ఇంద్రుడు హస్తాలని, సూర్యుడు కన్నులని, దిక్కులు చెవులలోనూ, అగ్ని నాలికలోనూ, రుద్రుడు మనసులోనూ ప్రవేశించారు.  అయినప్పటికీ కూడా శరీరం కదల్లేదు.  ఆ తర్వాత ప్రాణం ప్రవేశించింది.  అప్పుడు ఆ శరీరం లేచింది.  అప్పుడు బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము మొదలైన వాటిలో శక్తివంతమైనటువంటి ప్రాణాన్నే యువరాజుగా దేవతలు భావించారు.  శరీరం జీవించడానికి కారణం అవడం చేత ప్రాణమే సర్వాధికమని అన్నారు.  ఈ ప్రాణము తన అంశాల చేత పూర్ణ భాగము చేత ప్రపంచం అంతటా కూడా వ్యాపించి ఉంది. 

 ప్రాణహీనమైనటువంటి జగత్తులేనే  లేదు.  ప్రాణహీనమైనటువంటి ప్రాణి ఈ సృష్టిలో లేదు. అటువంటి ప్రాణహీనమునకు వృద్ధి లేదు.  ప్రాణము లేనిది ఉండటం లేదు కాబట్టి, ప్రాణము సర్వ జీవముల కంటే అధికము.  దానిని మించిన బలమైనది మరేది లేదు.  ప్రాణము కంటే గొప్పవారు సమానమైన వారు ఎవరు ఉన్నట్టుగా ఏ ధర్మశాస్త్రము చెప్పలేదు, చూడలేదు. ప్రాణదేవుడు ఒక్కడే అయినప్పటికీ ఆయా పనులన్నీ చేయడం చేత అనేక రూపుడవుతున్నాడు.  కాబట్టి ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసన చేస్తున్నారు. సర్వసృష్టికి, వినాశనమునకు, స్థితికి ప్రాణ దైవమే సమర్థము.  విష్ణువు తప్ప మిగిలిన దేవతలు ఎవరు కూడా ప్రాణాన్ని  తిరస్కరించలేరు.  ప్రాణదేవత సర్వదేవాత్మకము, సర్వదేవమయము.  నిత్యము శ్రీహరిని అనుసరించే ఉంటుంది.  శ్రీహరికి వశమై ఉంటుంది. అది  శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినదు చూడదు . అందువల్లనే  ప్రాణము శ్రీహరికి బలమన్నారు.  కాబట్టి శ్రీమహావిష్ణువు మహిమలను లక్షణములను తెలిసిన జీవి, పూర్వకర్మ వశమున లభించిన శరీరమును , కుబుసం విడిచినట్లు విడిచి చివరికి సర్వోత్తమము వినాశరహితము అయినటువంటి శ్రీహరి పదమును చేరుతూ ఉన్నాడు.” అని చెప్పాడు. 

 అప్పుడు ఆ మాటలు విన్నటువంటి కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయంగా మళ్ళీ శంకుని ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు.  “స్వామి బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు, సద్గురువు, సర్వేశ్వరుడు అయినటువంటి ప్రాణము యొక్క మహిమను మహిమలు లోకంలో ఎందుకు ప్రసిద్ధము కాలేదు? దేవతలు మునులు మహాత్ములు మొదలైన వారి మహిమలు లోకంలో పురాణాలలో వినబడుతూ ఉన్నాయి.  కానీ ప్రాణ మహా పురుషుని మహిమ ఎందుకు ప్రఖ్యాతము కాలేదు?” అని ప్రశ్నించాడు.  

సమాధానంగా  శంఖ మహముని ఈ విధంగా చెప్పారు. “ పూర్వము ప్రాణ మహా పురుషుడు సర్వోత్తముడైనటువంటి శ్రీహరిని అశ్వమేధ యాగములు చేసి సేవించదలచి గంగా తీరానికి వెళ్ళాడు.  నాగళ్ళతో ఆ నేలను దున్నించి శుద్ధిచేసి యాగశాలలో నిర్మించాలని అనుకున్నాడు.  నాగళ్ళ చేత దున్నిస్తూ ఉండగా, పుట్టలలో తపం చేసుకుంటున్నటువంటి కణ్వమహామునికి నాగలి తగలడం చేత తపోభంగమై కోపించాడు.  పుట్ట నుంచి వెలుపలికి వచ్చిన  ఆయన తనకు తపో విఘ్నము కలిగించినటువంటి ప్రాణపురుషుడిని చూసి, ‘ప్రధానుడనని గర్వించి నువ్వు ఈ విధంగా నా తపస్సు విఘ్నాన్ని కలిగించావు.  కాబట్టి, నీకు ముల్లోకములలోను ప్రఖ్యాతి అనేది ఉండదు.  భూలోకములో మరింతగా ప్రఖ్యాతి నశించిపోతుందని,  శ్రీహరి అవతారములు ప్రసిద్ధములుగాను, నువ్వు మాత్రము అప్రసిద్ధుడవుగానూ ఉంటారని’ శపించాడు ప్రాణ మహా పురుషుడు కూడా కోపించి, ‘దోషము లేని నన్ను తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఈ విధంగా శపించవు.  కాబట్టి ఓ కణ్వ మహాముని నువ్వు గురు ద్రోహివికమ్మని శపించాడు. నీ ప్రవృత్తిని అందరూ నిందిస్తారని’ అన్నాడు. 

 కణ్వ ముని శాపము వలన ప్రాణ మహా పురుషుడు భూలోకమున ప్రసిద్ధుడు కాలేదు. మహా ప్రాణ పురుషుడు కణ్వమునికిచ్చిన ప్రతి శాపాన్ని అనుసరించి తన గురువును భక్షించి, అయన సూర్యుడికి శిష్యుడయ్యాడు. ఓ కిరాతా ! నువ్వు అడిగిన వాటన్నింటినీ చెప్పాను.  ఇంకా నీకు తెలుసుకోవాలని ఉన్న విషయాలను అడగమని,” శంకుడు కిరాతుని అనుగ్రహించాడు  అని శృతదేవుడు శృత కీర్తి మహారాజుకు వివరించాడు” ఈ విషయాన్ని నారదుడు అంబరీషునికి తెలియజేశాడు. 

వైశాఖ పురాణం , ఇరవై నాలగవ అధ్యాయంసంపూర్ణం. 

సర్వం శ్రీ హరి పాదారవిందార్పణమస్తు !!

Vaisakha Puranam

#vaisakhapuranam #puranam

Quote of the day

The will is not free - it is a phenomenon bound by cause and effect - but there is something behind the will which is free.…

__________Swamy Vivekananda