విష్ణు కథలు వినాలనే కుతూహలం కూడా పూర్వజన్మ సుకృతమే !

విష్ణు కథలు చెప్పేవారున్నా , వినాలనే కుతూహలం కలగడం కూడా పూర్వజన్మ సుకృతమే !
- లక్ష్మి రమణ
“అప్పటివరకు దుష్టుడై దుర్మార్గత్వంతో వ్యవహరించినటువంటి కిరాతుడు ఆ విధంగా విష్ణు కథాసక్తుడు కావడం ఆశ్చర్యంగా ఉంది ఓ నారద(narada) మహర్షి! దానికి సంబంధించిన కారణాన్ని శృతదేవ (sruthadeva) మహాముని శృత కీర్తి (sruthakeerthi) మహారాజుకు వివరించలేదా? నాకు తెలుసుకోవాలని ఉంది”అని అంబరీషుడు (ambarisha) నారద మహర్షిని ప్రశ్నించారు. అప్పుడు శృతదేవుడు వివరించినటువంటి ఆ వృత్తాంతాన్ని నారద మహర్షి అంబరీషునితో 23వ అధ్యాయంలో ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు.
“ ఆ విధంగా ఆశ్చర్యాన్ని పొందినటువంటి కిరాతుడు శంకునిని శంకుని ఈ విధంగా ప్రశ్నించాడు. “ ఓ మహాముని దుష్టుడై పాపినైన నేను నీ చేత అనుగ్రహించబడ్డాను. మహాత్ములు సజ్జనులు సహజంగానే దయాస్వభావులు కదా! నీచమైనటువంటి కిరాత కులమున పుట్టినటువంటి పాపినైన నేనెక్కడ! నాకు పుణ్యమైన ఆసక్తి గల బుద్ధి కలగడమేమిటి? ఇటువంటి ఆశ్చర్య పరిణామానికి మహాత్ములైన మీ అనుగ్రహమే కారణమని అనుకుంటూ ఉన్నాను. సజ్జనులను హింసించే పాపమును కలిగించేటటువంటి బుద్ధి నాకు మళ్ళీ కలుగకుండా చూడు. సజ్జనులతోటి సాంగత్యము దుఃఖాన్ని కలిగించదు కదా! ఓ ఉత్తముడా నేను నీకు శిష్యుడనయ్యాను. నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహించు. నా పైన దయ చూపు.
ఓ జ్ఞానీ ! పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించు. మంచి వారు చెప్పిన మాటల చేత సంసార సముద్రమును కూడా జీవులు దాటగలిగి తరిస్తారు కదా! సమచిత్తులు భూత దయ కలిగిన వారు అయిన సజ్జనులకు ఉత్తముడు, తన వాడు, పరుడు అనే భేదము ఉండదు కదా! ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందడానికి అడిగినవారు పాపాత్ములైనా, దుష్టులైనా వారిని అనుగ్రహిస్తారు కదా! గంగా నది జీవుల పాపాలను పోగొట్టే స్వభావాన్ని కలిగినది అదే విధంగా సజ్జనులు మందబుద్ధులను తరింపజేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఓ సజ్జనుడా నాకుజ్ఞానాన్ని అనుగ్రహించడానికి సందేహించకు. నీ సాంగత్యాన్ని పొంది, నీకు విధేయుడనవడం వల్ల, నీ సేవ చేసుకోవడం వలన, నాపై దయ చూపు” అని కిరాతుడు బహు విధాల శంకుని ప్రార్థించాడు.
శంకుడు కూడా కిరాతుని మాటలు విని మరింత ఆశ్చర్యపడ్డాడు. ఇదంతా కూడా వైశాఖ మహిమేనని తలపోశాడు. కిరాతని సంకల్పానికి మెచ్చుకొని ఈ విధంగా చెప్పసాగాడు. “ఓ కిరాతుడా ! నీకు శుభాలను కోరుతూ సంసార సముద్రమును దాటించగలిగిన విష్ణు ప్రీతికరమైనటువంటి వైశాఖ ధర్మాలను ఆచరించు. అవి నీకు నేను వివరిస్తాను. కానీ ముందర ఈ ఎండ నాకు ఎంతో బాధను కలిగిస్తోంది. ఇక్కడ నీరు ,నీడ లేవు. నేను ఇక్కడ ఉండలేకుండా ఉన్నాను. కాబట్టి నీడ కలిగిన ప్రదేశానికి వెళదాము. అక్కడికి పోయి, నీటిని తాగి, నీడలో కూర్చుని సర్వపాపనాశకరమైనటువంటి విష్ణు ప్రీతికరమైనటువంటి వైశాఖ మహిమను నేను చూసిన దానిని విన్న దానిని నీకు వివరిస్తాను” అని పలికాడు.
అప్పుడు కిరాతుడు శంకునకు నమస్కరించి “స్వామి ఇక్కడకు కొద్ది దూరములోనే, స్వచ్ఛమైన నీరున్న సరస్సు ఉంది. అక్కడ చక్కగా మగ్గిన వెలగపండ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నో ఉన్నాయి. అవి నీకు ఎంతో సంతృప్తిని కలిగిస్తాయి. అక్కడికి పోదాం రమ్మని” శంకుని అక్కడికి తీసుకువెళ్లాడు. శంకుడు కూడా కిరాతునితో కలిసి వెళ్లి అక్కడ మనోహరమైన సరస్సును చూశాడు. ఆ సరస్సు కొంగలు, హంసలు, మొదలైన జల పక్షుల తోటి కూడి ఉంది. వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుట చేత మనోహరమైన ధ్వనులను చేస్తూ ఉన్నాయి. పుష్పములు లతా వృక్షములు ఎక్కువగా ఉండటం చేత తుమ్మెదలు వాలి మధురమైన ధ్వనులు చేస్తున్నాయి. తాబేలు చేపలు మొదలైన జల ప్రాణులతో ఆ సరస్సు నిండి ఉంది. కలువలు తామరులు మొదలైన జల పుష్పాలతో నిండి మనోహరంగా ఉంది. వివిధ రకాలైనటువంటి పక్షులు అక్కడ వాలి మధురమైన కిలకిల రావాలు చేస్తూ ఉన్నాయి. చెరువు గట్టున పొదరిల్లు, నీడనిచ్చే చెట్లు పుష్కలంగా ఉన్నాయి. ఫలాలు పుష్పాలు నిండిన వృక్షాలు నిండుగా అద్భుతంగా అందంగా ఉన్నాయి. అడవి జంతువుల కూడా అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నాయి ఇటువంటి అద్భుతమైన సరస్సును చూసిన వెంటనే శంకుని మనసు ప్రశాంత పడింది. శరీరము సేద తీరింది. శంకుడు మనోహరంగా ఆ సరస్సులో స్నానం చేశాడు. పళ్ళు శ్రీహరికి నివేదించి తాను కొన్నింటిని తిని మరికొన్నింటిని ప్రసాదముగా కిరాతునికి ఇచ్చాడు.
ప్రశాంతమైన మనసుతో ప్రసన్నమైన చిత్తముతో వ్యాధుని దయా దృష్టిలతో చూస్తూ ఈ విధంగా పలికాడు. “ నాయనా కిరాతా! ధర్మతత్పరా ! నీకే ధర్మాన్ని చెప్పాలి? బహు విధాలైనటువంటి ధర్మాలు లోకంలో అనేకములు ఉన్నాయి. వాటిలో వైశాఖమాస ధర్మాలు సూక్ష్మములుగా అల్పక్లేశ సాధ్యములుగా ఉన్నప్పటికీ అధిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. వాటిని ఆచరించినట్లయితే సర్వ ప్రాణులకు ఐహికములు ఆయుష్మకములో అయినటువంటి శుభములు, లాభాలు కలుగుతాయి. మీకు ఏ విధములైనటువంటి ధర్మాలు కావాలో అడగమని” పలికాడు.
అప్పుడు కిరాతుడు “స్వామి అజ్ఞానాదిపూర్ణమైనటువంటి ఈ విధమైన కిరాత జన్మ నాకే విధంగా కలిగింది? ఈ విషయాన్ని నాకు చెప్పండి. మీరు తలచుకునట్లయితే దీన్ని నాకు తెలియజేయగలరు” అని ప్రార్థించాడు. అప్పుడు శంఖుడు కొంతకాలము ధ్యానమగ్నుడై ఈ విధంగా చెప్పసాగాడు “ఓ కిరాత నువ్వు పూర్వము శాఖల నగరంలో నివసించే స్తంబుడు అనే బ్రాహ్మణుడివి. శ్రీవత్సస గోత్రీకుడివి. వేద శాస్త్రాలను అభ్యసించినటువంటి పండితుడివి. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె సౌందర్యరాశి, ఉత్తమురాలు, పతివ్రత.
కానీ నువ్వు ఒక వేశ్యపైన మనసు పడి ఆచారాదులను విడిచిపెట్టి శూద్రుని వలె ఆచారహీనుడివై ఆవేశ్యతో కాలం గడుపుతూ ఉన్నావు. సుగుణవతి అయినటువంటి నీ భార్య నీకు, ఆ వేశ్యకు సేవలు చేస్తూ ఎంతో పతిభక్తితో మెలుగుతూ ఉండేది. ఆమె నీకు నీ వేశ్యకు అనేక విధాలైన సేవలను ఓర్పుగా శాంతముగా చేసేది. ఆమె మనసులో బాధపడుతున్న పతివ్రత అవ్వడం చేత భర్తకి ఇష్టమైనటువంటి వేశ్యకు అనేక రకాలుగా పరిచర్యలు చేస్తూ ఉండేది. ఈ విధంగా చాలా కాలం గడిచింది. ఓ కిరాత ఒకనాడు నువ్వు బ్రాహ్మణులు భుజించే ఆహారాన్ని విడిచి, సూత్ర సమ్మతమైన గేదె పెరుగు, ముల్లంగి దుంపలు, నువ్వులు, అనుములు కలిసినటువంటి మాంసాహారాన్ని తిన్నావు. అనుచితమైన ఆహారము వల్ల నీకు అనారోగ్యం కలిగింది. రోగివి, ధనహీనుడవు అయిన నిన్ను విడిచి ఆ వేశ్య మరొకనితో వెళ్ళిపోయింది.
కానీ నీ భార్య ఎంతో ఓర్పుతో మీకు సేవ చేస్తూ ఉండేది. నువ్వు పశ్చాత్తాప పడ్డావు. మన్నించమని నీ భార్యని వేడుకున్నావు. “నేను నీకు ఏమి చేయలేకపోయాను. అనుకూలవతివైనా నిన్ను సుఖపెట్టలేనివాడు 10 జన్మలు నపుంసకుడై పుడతాడు. అటువంటి పతివ్రతను అవమానించిన నేను అనేకమైన నీచ జన్మలను పొందుతాను”. అని అనేక విధాలుగా ఆమెతో పలికావు. ఆమె కూడా “నాథా ! నువ్వు అధైర్యాన్ని వహించకు చేసిన దానికి సిగ్గు పడొద్దు. నాకు మీపై కోపం లేదు. పూర్వజన్మలోని పాపాలు అనేక విధాలుగా బాధిస్తాయి. వాటిని సహించిన వారు ఉత్తములు. నేనేదో పాపాన్ని పూర్వ జన్మలో చేసి ఉంటాను. దాని ఫలమే ఇది” అని నీకు ధైర్యం చెప్పింది. నువ్వు ధనహీనుడవైనప్పటికీ, పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనాన్ని తెప్పించుకుని మీకు సేవ చేస్తూ ఉండేది. నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించింది. వ్యాధిగ్రస్తుడైన నీకు అనేక విధాలుగా సేవలను చేస్తూ ఏవగించుకోకుండా భక్తి శ్రద్ధలతో మెలిగింది. నిన్ను రక్షించమని దేవతలందరినీ ప్రార్థించింది. భర్తకు ఆరోగ్యము కలిగినట్లయితే చండికకు రక్తాన్నాన్ని, గేదె పెరుగుతో సమర్పిస్తానని మొక్కుకుంది. గణేశునికి కుడుములు నివేదిస్తానని, పది శనివారాలు ఉపవాసం చేస్తానని, మధురమైన ఆహారాన్ని నేతిని అలంకారాలను తైల అభ్యాంగనాదులు మానేస్తానని అనేక రకాలుగా ఎంతోమంది దేవతలకు మొక్కుకుంది.
ఇదిలా ఉండగా, ఒకరోజు దేవలుడు అనే ముని సాయంత్రం సమయంలో ఆమె ఇంటికి వచ్చాడు. అప్పుడు వైద్యం చేయడానికి వైద్యుడు వచ్చాడని చెప్పింది. సద్బ్రాహ్మణుడైన అతిధిని పూజించినట్లయితే నీకు మంచి కలుగుతుందని ఆమె తలపోసింది. నీకు ధర్మకార్యములంటే ఇష్టం లేకపోవడం చేత ఆమె అతనిని వైద్యునిగా పరిచయం చేసింది. ఆ విధంగా వచ్చిన మునికి నీ చేత ఆమె పానకాన్ని ఇప్పించింది. నీ అనుజ్ఞతో తానూ కూడా ఇచ్చింది. మరుసటి ఉదయమున దేవలముని తన దారిన తాను వెళ్ళిపోయాడు. నీకు స్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించింది. మందు నోటిలో వేస్తున్న నీ భార్య వేలిని కొరికేశావు. రోగము పెరిగి, చివరకు నువ్వు మృతి చెందావు. నువ్వు మరణిస్తున్నప్పటికీ నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకున్నావే గాని ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రం తలుచుకోలేదు. పతివ్రత అయిన నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారము చేసి తాను కూడా నీతో పాటు అగ్ని ప్రవేశం చేసి, సహగమనము చేసింది. మీతో సహగమనం చేసిన నీ భార్య పతివ్రత అవడం చేత విష్ణు లోకాన్ని పొందింది. ఆమె వైశాఖ మాసంలో దేవలునికి పానకం ఇవ్వడం వల్ల, దేవలుని పాదాలను కడగడం వలన ఆమెకు శ్రీహరి సాన్నిద్యము కలిగింది. నువ్వు మరణ సమయంలో నీచురాలైనటువంటి వేశ్యను తలపోస్తూ క్రూరమైనటువంటి కిరాత జన్మను పొందావు.
వైశాఖ మాసంలో వైద్యుడు అనుకొని పానకాన్ని ఇవ్వడం చేత ఇప్పుడు నన్ను వైశాఖ ధర్మములు అడగాలి అనేటటువంటి మంచి బుద్ధి కలిగింది. దేవలుని పాదములు కడిగిన నీటిని శిరస్సున జల్లుకోవడం చేత నీకు నాతో ఈ విధముగా సాంగత్యం చేసే అవకాశం కలిగింది. ఓ కిరాత నీ పూర్వజన్మ విషయాన్ని నేను దివ్య దృష్టితో తెలుసుకోవడం కూడా ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రతాన్ని ఆచరించడం వలన కలిగింది. నీకు ఇంకా ఏం తెలుసుకోవాలని ఉన్నదో దానిని అడుగు చెబుతాను అని శంకుడు కిరాతునితో పలికాడు. అని శ్రుతి దేవుడు శ్రుతి కీర్తి మహారాజుకు వివరించినట్లుగా నారదుడు అంబరీషునికి తెలియజేశాడు.
Vaisakha Puranam
#vaisakhapuranam #vaisakha #puranam