Online Puja Services

వైశాఖ కథా శ్రవణ మహిమ !

18.117.158.124

జన్మజన్మల పాప విముక్తిని కలిగించే వైశాఖ కథా శ్రవణ మహిమ !
- లక్ష్మి రమణ 

నారద (Narada) మహర్షి అంబరీష (Ambarisha) మహారాజుకు వైశాఖమాస మహిమను ఇంకా ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. “శృతదేవుని మాటలు విని శృతకీర్తి (sruthakeerthi) మహారాజు ఈ విధంగా అడిగారు.  ఓ మహాముని ఇహపర సౌఖ్యాలను ప్రసాదించేటటువంటి వైశాఖమాస మహిమని ఎంత విన్నా కూడా నాకు తృప్తి కలగడం లేదు. నెపము లేని ధర్మము, శుభకరము అయినటువంటి  విష్ణు కథలు, చెవులకు ఇంపైన శాస్త్ర శ్రవణము ఎంత విన్న తృప్తి కలగదు. ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది.  నేను పూర్వజన్మలో చేసిన పుణ్యం ఫలించడం చేత మహాత్ముడవైనటువంటి మీరు అతిధిగా నా ఇంటికి వచ్చారు.  మీరు చెప్పిన ఈ అమృతోపదేశాన్ని విని బ్రహ్మ పదవిని, ముక్తిని కూడా నా మనస్సు కోరడం లేదు. కోరికలకు అతీతమై విష్ణు కథలనే ప్రీతిని పొంది ఉంది.  కాబట్టి నా మీద దయ కలిగి ఇంకా కూడా శ్రీహరికి ప్రియమైనటువంటి దివ్యమైన ధర్మాలని వివరించవలసిందిగా కోరుతున్నాను అని ప్రార్థించాడు.  శృతకీర్తి మాటలు విన్నటువంటి శృతదేవ మహాముని ఎంతో సంతోషించి, వైశాఖపురాణంలోని  22వ అధ్యాయంను ఈ విధంగా చెప్పసాగారు.

 ఓ రాజా ! ఈ విధంగా విష్ణు (Vishnu )కథల (stories) పట్ల మనసు తిరగడం కూడా పూర్వజనం సుకృతం ఉంటె తప్ప సాధ్యం కాదు. కాబట్టి, వైశాక ధర్మాల మహిమను వివరించే మరొక కథని నీకు వినిపిస్తాను విను. పంపా నదీ  తీరంలో శంకుడు అనే పేరుగల బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకప్పుడు అతడు బృహస్పతి సింహరాశిలో ఉండగా, గోదావరి ప్రాంతానికి వచ్చాడు.  అతడు భీమారధి నదిని దాటి ముళ్ళు రాళ్లు ఉన్నటువంటి అడవిలో ప్రయాణం చేస్తూ, వైశాఖ మాసపు ఎండకు బాధపడుతూ మధ్యాహ్న సమయంలో అలసిపోయి ఒక వృక్షము నీడలో కూర్చున్నాడు. అప్పుడు ఒక బోయవాడు వెంటిని పట్టుకుని అక్కడికి వచ్చాడు.  అతడు దయ లేనివాడు.  సర్వప్రాణులను హింసించేవాడు.  సూర్యుని లాగా ప్రకాశిస్తూ రత్నకుండలాలను ధరించినటువంటి శంఖుని పీడించి, అతని దగ్గర ఉన్న కుండలాలని, గొడుగును, పాదుకులని, కమండలాన్ని లాక్కున్నాడు.  ఆ తర్వాత సదాచార సంపన్నుడైన  ఆ బ్రాహ్మణుణ్ణి  వెళ్ళిపోమని ప్రాణాలతో విడిచిపెట్టాడు. 

 శంకుడు అక్కడి నుంచి కదిలాడు.  కానీ, ఎండకు కాళ్లు కాలిపోతున్నాయి. నడవలేక, తొందర తొందరగా పరిగెడుతూ గడ్డి ఎక్కడైతే మొలిచి ఉంటుందో ఆ ప్రదేశంలో కాసేపు నిలబడుతూ, చెట్ల నీడలని  వెతుకుతూ , అక్కడ కాసేపు నిలుస్తూ, చాలా బాధపడుతూ ప్రయాణాన్ని కొనసాగించాడు. 

ఆ విధంగా బాధపడుతూ వెళుతుండగా, బోయవాడికి అతనిని చూసి దయ కలిగింది. అతని పాదుకులను తిరిగి అతనికి ఇవ్వాలి అనే ఆలోచన కలిగింది. దొంగతనం చేసి తీసుకున్నప్పటికీ, తానూ వాటిని సొంతం చేసుకున్నాడు కనుక, శంకుని ఆ పాదుకలు తనవే అని అతడి అభిప్రాయం.  ఆ కిరాతుడు దయావంతుడై శంకుడి దగ్గర నుంచి తాను దొంగలించిన పాదుకలని తిరిగి అతనికి ఇచ్చేశాడు. ఈ విధంగా ఇవ్వడం వలన కొంతైనా పుణ్యం కలుగుతుందని కూడా భావించాడు. శంకుడు కూడా కిరాతుడిచ్చిన పాదుకలని తిరిగి ధరించి ఎంతో సంతృప్తిని పొందాడు. సుఖీభవ అని అతన్ని ఆశీర్వదించాడు. దీంతో ఆ కిరాతుడి పుణ్యము పరిపక్వమైంది. 

 వైశాక మాసంలో అతడు దుర్బుద్ధితో కిరాతుడైనప్పటికీ, పాదుకులని తిరిగి ఇచ్చేయడం చేత అతనికి శ్రీహరి ప్రసన్నుడై వైశాఖ మాసంలో ఇటువంటి సద్భుద్ధిని ఆ కిరాతునికి కలిగించాడని శంకుడు భావించాడు. “ఓ కిరాతా ! నీ విచ్చిన ఈ  పాదుకులని ధరించి ఎంతో సుఖపడ్డాను.  నాకు ఇటువంటి సంతృప్తిని కలిగించిన నువ్వు కూడా సుఖంగా ఉండుమని” అతన్ని ఆశీర్వదించాడు.  కిరాతుడు కూడా శంకుడి మాటలు విని ఆశ్చర్యపడ్డాడు.  “ఓ సామీ ! నీ నుంచి దోచుకున్నదే కదా నేను నీకు తిరిగి ఇచ్చాను.  ఇందువల్ల నాకు ఏ విధంగా పుణ్యం వస్తుంది ? వైశాఖమాసము, శ్రీహరి సంతోషిస్తాడు అని అంటున్నావు.  ఈ విషయాన్ని వివరించమని శంకున్ని ప్రార్థించాడు. 

 శంకుడు కూడా కిరాతుని పలుకులకి ఆశ్చర్యపడ్డాడు.  లోభముతో ప్రవర్తించే  ఈ కిరాతుడు ఈ విధంగా నా నుండి దొంగలించిన పాదుకలని తిరిగి తెచ్చి ఇచ్చి, ఈ విధంగా వైశాఖమాసం మహిమ ని తెలుసుకోవాలి అనుకోవడం కూడా శ్రీహరి మహిమ కాబోలని తలపోశాడు .  “దుర్బుద్ధి కలవాడివైనా, నా వస్తువులు లాక్కున్నప్పటికీ, ఎండలో బాధపడుతున్న నన్ను చూసి జాలిపడ్డావు. నా పాదుకులని తిరిగి తెచ్చి ఇచ్చావు.  ఇది ఎంతో విచిత్రమైన విషయం. ఎన్ని దానాలు ధర్మాలు ఆచరించినప్పటికీ, వాటి ఫలము జన్మాంతరంలో కలుగుతుంది.  కానీ ఓ కిరాతా ! వైశాఖ  మాసంలో చేసిన దానము, ధర్మముల ఫలితాలు వెంటనే అందుతాయి.  పాపాత్ముడవైనా,  కిరాతుడవైనా దైవవశాన నీకు ఇటువంటి సద్బుద్ధి కలిగింది. నీకింత మంచి బుద్ధి కలగడానికి వైశాఖమాసము, శ్రీహరి దయ మాత్రమే  కారణాలు అని నాకు తోస్తున్నాయి.  శ్రీహరికి ఇష్టమైనవి, నిర్మలము, సంతృష్టి కరము అయినవి చేయడమే ధర్మమని మనవు మొదలైన వారు చెప్పారు. కాబట్టి  వైశాఖమాసానికి చెందిన ధర్మాలు శ్రీహరికి ప్రీతి దాయకాలు.  ఆయనకి ఎంతో ఇష్టమైనవి కూడా! వైశాక మాస ధర్మాలకు సంతోషించినట్లు, శ్రీహరి మరే ధర్మ కార్యాలకు కూడా సంతృష్టిని పొందడు.  తపస్సులు యజ్ఞాలు కూడా ఆయనకు వైశాఖ ధర్మముల అంత ఇష్టం కాదు. ఏ ధర్మమూ వైశాఖ ధర్మానికి సాటిరాదు. 

వైశాఖ ధర్మాలను ఆచరించినట్లయితే గయకు, గంగానదికి, ప్రయాగకు పుష్కరానికి, కేదారానికి, కురుక్షేత్రానికి, ప్రభాసానికి, సమంతమునకు, గోదావరికి, కృష్ణానదికి, సేతువుకు ఇలా ఎక్కడికి ఏ పుణ్యక్షేత్రానికి ఏ పవిత్ర నదికి పోవలసిన అవసరమే లేదు. వైశాఖ వ్రత వివరణా  ప్రాసంగము గంగానది కంటే పవిత్రమైంది.  ఈ నదిలో స్నానం చేసిన వారికి ఈ ప్రాసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమవుతారు. ఎంత ధనం ఖర్చుపెట్టినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని యాగాలు చేసిన స్వర్ణము భక్తి పూర్ణము అయినటువంటి వైశాఖ ధర్మము వలన వచ్చే పుణ్యానికి సాటి కావు.  అంతటి విశేషమైన ఈ మాసములో విష్ణు కృపా పాత్రుడవై కావడం చేతనే నీకు నా పాదుకలు తిరిగి ఇవ్వాలి అని అనిపించింది.  ఓ కిరాతా ! ఈ మాసము అంతటి గొప్పది కాబట్టే, దీనికి మాధవ మాసమని పేరు వచ్చింది. జీవిగా భావించిన నా ఈ పాదుకలని తిరిగి జాలితో అయినా సరే తిరిగి నాకు ఇవ్వడం చేత నీకు పుణ్యం కలుగుతుంది.  ఇది నిశ్చయము.”  అని శంఖుడు వ్యాధునికి వివరించాడు.  

ఇంతలో ఒక సింహం పులిని చంపడానికి వేగంగా వెళుతూ, మార్గమధ్యంలో కనిపించిన మహా గజము పై పడింది. సింహానికి, గజానికి భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ రెండు కూడా యుద్ధం చేసి చేసి, అలసిపోయి నిలబడి, శంకుడు కిరాతకునికి చెప్పిన మాటలను వినడం జరిగింది. వారు వెంటనే వైశాఖమాస మహిమను వినడం చేత గజము, సింహముల రూపాలను విడిచి దివ్య రూపాలను పొందారు. వాళ్ళని తీసుకొని పోవడానికి దివ్యములైన విమానాలు వచ్చాయి. దివ్య రూపాన్ని ధరించిన వాళ్ళిద్దరూ కూడా కిరాతకునికి వైశాఖ వ్రత మహిమను చెబుతున్న శంకునికి నమస్కరించారు.  కిరాతుడు, శంఖుడు కూడా అందుకు ఆశ్చర్యపడి “మీరు ఎవరు? మాకెందుకు నమస్కరిస్తున్నారని,  గజము సింహములుగా ఉన్న మీకు ఈ దివ్య రూపాలు కలగడానికి కారణమేంటని” ప్రశ్నించారు. 

 అప్పుడు వాళ్ళిద్దరూ మేము మాతంగ మహర్షి పుత్రులము.  దంతిలుడు, కోహలుడు అని మా పేర్లు.  అన్ని విద్యలను నేర్చుకుని, యవ్వనములో ఉన్న మా ఇద్దరినీ చూసి మా తండ్రిగారైన మాతంగ మహర్షి “నాయనలారా విష్ణు ప్రియమైనటువంటి వైశాఖ మాసంలో చలివేంద్రాలని ఏర్పరచండి.  జనులకు విసినకర్రలతో అలసట పోయేటట్లుగా విసరండి. మార్గములో నీడనిచ్చే మండపాలని ఏర్పాటు చేయండి. చల్లని నీటిని, అన్నాన్ని బాటసారులకి ఇచ్చి, వారి అలసటని పోగొట్టండి. ప్రాత కాలంలో స్నానం చేసి శ్రీహరిని పూజించండి.  శ్రీహరి కథలను వినండి, చెప్పండి”.  అని మాకు అనేక విధాలుగా చెప్పారు.  ఆ మాటలు విని మేము కోపగించుకున్నాము.  ఆయన చెప్పిన ధర్మాలను ఆచరించలేదు.  పైగా మా తండ్రి మాటలని తిరస్కరిస్తూ, మాకు నోటికి తోచినట్టుగా నిర్లక్ష్యముగా సమాధానాలు ఇచ్చాము.  ధర్మాలాసుడైనటువంటి మా తండ్రి మా అవినయానికి, నిర్లక్ష్యానికి కోపించారు. ధర్మ విముఖుడైన పుత్రుణ్ణి ,వ్యతిరేకముగా పలికే భార్యని, దుష్టులను శిక్షించని రాజులను వెంటనే విడిచి పెట్టాలి.  దాక్షిణ్యమువల్లో, ధన లోభము చేతనో పైన చెప్పిన అకార్యములను చేసినట్లయితే సూర్యచంద్రులు ఉన్నంతకాలము నరకములో ఉంటారు.  కాబట్టి నా మాటలు వినక క్రోధముతో ఆవేశంతో వ్యవహరిస్తున్న మీలో దంతిలుడు సింహముగాను, కోహలుడు గజముగాను అనేక కాలము అడవిలో ఉండమని” మమ్ము శపించారు.  పశ్చాతాపం పొందినటువంటి మేము ప్రార్థించగా జాలిపడినటువంటి మా తండ్రిగారు “కొంత కాలానికి మీరిద్దరూ కూడా ఒకరినొకరు చంపుకోబోతారు. అప్పుడే మీరిద్దరూ కలుసుకుంటారు.  ఆ సమయంలో ఒక కిరాతుడు శంకుడనే బ్రాహ్మణునితో వైశాఖ ధర్మాలను కూడి చర్చించడాన్ని వింటారు. దైవికముగా మీరు కూడా వారి మాటలు వింటారు.  అప్పుడే మీకు శాప విముక్తి ముక్తి కలుగుతుందని అనుగ్రహించారు. శాప విముక్తిని పొంది నా దగ్గరకు వచ్చి వెళతారని మా తండ్రిగారు చెప్పారు.  ఆయన చెప్పినట్టుగానే జరిగింది. అందుకు  కృతజ్ఞులమై మీకు నమస్కరిస్తున్నామని” దంతిలుడు కోహిలుడు చెప్పి తమ తండ్రి వద్దకు విమానాలను ఎక్కి వెళ్ళిపోయారు. 

 వాళ్ళ మాటలను విని కిరాతుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. శంకుడు కూడా కిరాతునితో “వైశాఖ మహిమను ప్రత్యక్షంగా చూసావు కదా! వైశాఖ మహిమలను వినడం వలన దంతిలుడు కోహిలులకి శాప విముక్తి కలిగింది” అని చెప్పాడు.  కిరాతునిలో ఉన్న హింసా బుద్ధి ఈ మాటలతో, ఈ దృష్టాంతరంతో నశించిపోయింది.  అతని మనసు పరిశుద్ధమైంది.  అతడు పశ్చాతాపంతో శంకునికి నమస్కరించి, ఇలా అన్నాడు”.  అని శ్రుతదేవుడు శృతి కీర్తి మహారాజుకు చెప్పాడని ఈ వైశాక మాస మహిమను వివరించే కథను అంబరీషునికి నారద మహర్షి వివరించారు. 

వైశాఖపురాణం 22వ అధ్యాయం సంపూర్ణం. 

సర్వం శ్రీహరి పాదారవిందార్పణమస్తు !!

Vaisakha Puranam

#vaisakhapuranam #vaisakha #puranam

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi