Online Puja Services

విష్ణు పదాన్ని అనుగ్రహించే దివ్యమైన కథ

3.17.146.235

సర్వసంపదలనీ, రాజ్య వైభోగాలనూ, అంత్యాన విష్ణు పదాన్ని  అనుగ్రహించే దివ్యమైన కథ ఇది !
- లక్ష్మి రమణ 

నారద మహర్షి (Narada) అంబరీష (Ambarisha)మహారాజుకి  వైశాఖ మహత్యాన్ని (vaisakha mahatyam) ఈ విధంగా వివరిస్తున్నారు.  శృతదేవుడు (srutha deva)“శృతి కీర్తి మహారాజా విను! శ్రీహరికి(Srihari) ఎంతో ఇష్టమైనటువంటి వైశాఖమాస వ్రత మహిమను వెల్లడి చేసే మరో కథను వివరిస్తాను. సర్వసంపదలనీ, రాజ్య వైభోగాలనూ, అంత్యాన విష్ణు పదాన్ని  అనుగ్రహించే దివ్యమైన కథ ఇది అంటూ వైశాఖ పురాణంలోని 20వ అధ్యాయాన్ని ఇలా వివరించసాగారు.   

పూర్వము పాంచాల దేశాన్ని పురుయశుడు  అనేటటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు.  అతడు పుణ్యశీలుడు అనే మహారాజు పుత్రుడు.  తన తండ్రి మరణించిన తరువాత ఆ రాజ్యానికి రాజు అయ్యాడు.  పురుయశుడు ధార్మికుడు, మహావీరుడు.  తన శక్తి యుక్తుల చేత విశాలమైనటువంటి భూమిని పరిపాలిస్తూ ఉండేవాడు. కానీ, పూర్వజన్మ దోషము చేత కొంతకాలానికి తన సంపదనంతా కోల్పోయాడు.  ఆయన అశ్వములు, గజములు మొదలైన బలాలన్నీ నశించాయి.  ఆయన రాజ్యంలో కరువు ఏర్పడింది.  ఈ విధంగా అతని రాజ్యము కోశము బలహీనమై గజము మింగినటువంటి వెలగపండు లాగా సారవిహీనములయ్యాయి. 

అతని బలహీనతలను ఎరిగినటువంటి శత్రువులందరూ కలిసి మూకుముడిగా దండెత్తి వచ్చారు.  అలా యుద్ధంలో ఓడినటువంటి రాజు భార్య అయినటువంటి శిఖినితో కలిసి పర్వత గుహలలో దాక్కుని 503 సంవత్సరాల కాలము గడిపాడు.  ఆ రాజు తనలో తాను ఈ విధంగా విచారించాడు.  నేను ఉత్తమమైన వంశంలో జన్మించాను.  మంచి పనులను చేశాను.  పెద్దలను గౌరవించాను.  జ్ఞానాన్నిసంపాదించాను.  దైవభక్తి, ఇంద్రియ జయము కలిగినటువంటి వాడిని.  నా వారు కూడా నాలాగే సద్గుణవంతులు.  కానీ, నేనే పాపం చేశానని నాకు ఈ విధమైన కష్టాలు కలిగాయి? ఈ విధంగా అడవిలో ఎంతకాలము గడపాలో కదా! అని విచారించి తన గురువులైనటువంటి యాజుడు, ఉపయాజకుడు అనే గురువులను తలుచుకున్నారు. సర్వజ్ఞులైన వాళ్ళిద్దరూ కూడా రాజు స్మరించుకోగానే అతని దగ్గరకు వచ్చారు.  రాజు వాళ్ళిద్దరికీ నమస్కరించి, యధాశక్తిగా ఉపచారాలు చేశారు.  వారిని సుఖాశ్శీనులను చేసి, దీనుడై పాదములను బట్టి ‘ఓ గురువులారా! నాకు ఈ విధమైన స్థితి ఏ విధంగా సంప్రాప్తించింది? నాకు దీని నుంచి బయటపడే తరుణ ఉపాయాన్ని తెలియజేయండి’ అని ప్రార్థించాడు.  వారు రాజును లేవదీసి కూర్చోబెట్టి, రాజు చెప్పిన మాటలు విన్నారు.  ఆయన మనోవిచారాన్ని గ్రహించారు.  ఒక్క క్షణకాలం ధ్యానమగ్నులై ఈ విధంగా చెప్పారు. 

 ‘ఓ రాజా నీ దుఃఖానికి కారణాన్ని వివరిస్తామో విను. నువ్వు గత పది జన్మలలో కార్యము కలిగినటువంటి కిరాతుడివి. నీ లో కొంచెం అయినా కూడా ధర్మ ప్రవృత్తి లేదు, సద్గుణములనేవి లేనే లేవు. శ్రీహరికి నమస్కరించలేదు. శ్రీహరిని కీర్తించలేదు. శ్రీహరి కథలను వినలేదు. 

గత జన్మలో నువ్వు సహ్యపర్వతమున కిరాతుడివై ఉన్నావు. అందరినీ బాధిస్తూ, బాటసారులను దోచుకుంటూ, నింద్యమైనటువంటి జీవితాన్ని గడిపావు.  నువ్వు గౌడ దేశంలో ఉన్నవారికి భయంకరుడువై ప్రవర్తించావు. ఆ  విధంగా ఐదు సంవత్సరాలు గడిచాయి.  బాలురు, మృగములు, పక్షులు,  బాటసారులు అనే వివక్ష లేకుండా అందరినీ వధించడం చేత నీకు సంతానము కలగలేదు.  ఈ జన్మలో కూడా సంతానము లేకపోవడానికి మీ పూర్వ జన్మలో చేసినటువంటి కిరాతమైనటువంటి కర్మలే కారణము.  నీ భార్య తప్ప నీకు అప్పుడు కూడా ఎవ్వరూ లేకపోయారు.  అందరినీ పీడించడం చేత, దానమన్నది చేయకపోవడం చేత, నువ్వు దరిద్రుడువిగా ఉన్నావు. అప్పుడు అందరినీ భయపెట్టడం చేత నీకిప్పుడు ఈ భయం కలిగింది.  ఇతరులను నిర్దయగా పీడించడం చేత ఇప్పుడు నీ రాజ్యము శత్రువులకు అధీనం అయిపోయింది. ఇలా ఎన్ని పాపములు చేసినప్పటికీ నువ్వు రాజకులంలో పుట్టడానికి కారణాన్ని వివరిస్తాను విను. 

నువ్వు గౌడ (Gowda) దేశంలో అడవిలో కిరాతుడివై గత జన్మలో సంచరిస్తూ ఉండగా, ధనవంతులైనటువంటి ఇద్దరు వైశ్యులు, కర్షణుడు అనే మునితో కలిసి నీవున్న అడవిలో ప్రయాణం చేస్తున్నారు.  నువ్వు వాళ్ళని అడ్డగించి బాణాన్ని ప్రయోగించి ఒక వైశ్యున్ని చంపావు.  రెండవ వైశ్యున్ని కూడా చంపబోయావు.  అతడు భయపడి ధనాన్ని పొదిరింటిలో దాచి ప్రాణ రక్షణ కోసము పారిపోయాడు. కర్షణుడనే  ముని కూడా నీకు భయపడి, ఆ అడవిలో పరిగెడుతూ ఎండకు దప్పికకు అలసిపోయి మూర్చ పోయాడు.  నువ్వు కర్ణనుడిని సమీపించి అతని ముఖము పైన నీటిని జల్లి, ఆకులతో విసిరి, వానికి సేవ చేసి, అతనిని సేద తీర్చావు.  అతడు తేరుకున్న తర్వాత, ఓయీ  నీకు నా వల్ల భయము లేదు. నువ్వు ధనము లేని వాడివి. నిన్ను చంపితే నాకేం వస్తుంది? కానీ పారిపోయిన వైశ్యుడు ధనాన్ని ఎక్కడ దాచి పెట్టాడో చెప్పు.  అప్పుడు నిన్ను విడిచిపెడతాను.  చెప్పనట్లయితే నిన్ను కూడా చంపేస్తానని అతన్ని బెదిరించావు. ఆ ముని భయపడి ప్రాణ రక్షణ కోసం వైశ్యుడు ధనాన్ని దాచినటువంటి పొదని చూపించాడు. అప్పుడు నువ్వు ఆ మునికి అడవి నుంచి బయటకు వెళ్లే మార్గాన్ని చెప్పావు.  దగ్గరలో ఉన్న తాగునీటిని గల తటాకాన్ని చూపించి నీటిని తాగి మరింత సేదతీరి వెళ్ళమని చెప్పావు . రాజుబటులు నాకై రావచ్చు కాబట్టి నేను నీ వెంట వచ్చి మార్గాన్ని చూపలేనని చెప్పావు.  ఈ ఆకులతో విసురుకొమ్మని చల్లగాలిని ఇచ్చేటటువంటి మోదుగ ఆకులను తుంపి అతనికి ఇచ్చి, నువ్వు అడవిలో దాక్కున్నావు . 

నువ్వు పాపాత్ముడైనప్పటికీ, వైశ్యుడి ధనం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఆ మునికి సేవలు చేసినప్పటికీ అతనిని అడవి నుంచి బయటకు వెళ్ళే మార్గాన్ని, జలాశయ మార్గాన్ని చెప్పటం వలన ఆ కాలము వైశాక మాసం అవడం చేత నువ్వు తెలియక చేసినప్పటికీ, స్వార్ధంతో చేసినప్పటికీ, మునికి చేసిన సేవ ఫలించింది.  ఆ పుణ్యఫలం వల్లే నువ్వు ఇప్పుడు రాజవంశం లో జన్మించావు. నువ్వు నీ రాజ్యము, పూర్వపు సంపదలు, వైభవములు కావాలని అనుకున్నట్లయితే వైశాఖ వ్రతాన్ని ఆచరించు. ఇది వైశాఖమాసము. నువ్వు వైశాఖ శుద్ధ తదియనాడు ఒకసారి ఈనినటువంటి ఆవుని దూడతో పాటు దానమిచ్చినట్లయితే, నీ కష్టాలను కూడా తీరిపోతాయి.  గొడుగును దానం చేస్తే, నీకు రాజ్యము చేకూరుతుంది. ప్రాతః కాలంలో స్నానం చేసి అన్ని ప్రాణులకు సుఖాన్ని కలిగించు. నువ్వు భక్తిశ్రద్ధలతో వైశాక వ్రతాన్ని ఆచరించి, శ్రీహరిని అర్చించి, శ్రీహరి కథలను విని, యథా శక్తిగా దానాన్ని చేయి. లోకాలన్నీ కూడా నీకు వశమవుతాయి. మీకు శ్రీహరి సాక్షాత్కారము కలుగుతుంది’ అని వాళ్ళిద్దరూ కూడా రాజుకి వైశాఖ వ్రత విధానాన్ని చెప్పి, తమ నివాసాలకు తిరిగి వెళ్లారు. 

 రాజపురోహితులు ఇద్దరు చెప్పినట్లుగా, వైశాఖ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆ రాజు ఆచరించాడు. యధా శక్తిగా దానాన్ని చేశాడు.  వైశాఖ వ్రత ప్రభావము ద్వారా అతని బంధువులందరూ తిరిగి అతని వద్దకు వచ్చారు.  వారందరితో కలిసి, ఆ రాజు తన పట్టణమైనటువంటి పాంచాల పురానికి తిరిగి వెళ్ళాడు.  శ్రీహరి దయ వల్ల అతని శత్రువులు పరాజితులై నగరాన్ని విడిచి పారిపోయారు.  రాజు అనాయాసముగా తన రాజ్యాన్ని తిరిగి పొందాడు.  పోగొట్టుకున్న సంపదలకంటే అధికముగా సర్వసంపదలను పొందాడు.  వైశాఖ వ్రత మహిమ వల్ల సర్వసంపన్నమైనటువంటి అతని రాజ్యము సుఖశాంతులతో ఆనంద పరిపూర్ణముగా ఉంది. అతనికి, దృష్టకీర్తి, దృష్టకేతువు, దృష్టజ్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అని ఐదుగురు కొడుకులు - కుమారస్వామి అంతటి సమర్ధులైనటువంటి వారు కలిగారు.  ప్రజలందరూ , రాజు కూడా వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు.  

రాజ్య వైభవము సంతానము కలిగి భక్తి శ్రద్ధలతో వైశాక వ్రతాన్ని ఆచరించి యధాశక్తి దాన ధర్మాలను చేస్తూ ఉన్నాడు. ఆ రాజుకు గల నిశ్చలమైన భక్తికి సంతోషించినటువంటి శ్రీహరి అతనికి వైశాఖ శుద్ధ తృతీయ - అక్షయ తృతీయనాడు ప్రత్యక్షమై  దర్శనాన్ని ప్రసాదించాడు. చతుర్బాహువులలో శంఖ చక్ర గదా ఖడ్గాలను ధరించి, పీతాంబరధారియై వనమాల విభూషితుడై లక్ష్మీదేవితో గరుడది పరివారములతో ప్రత్యక్షమైనటువంటి పరమాత్మ అయిన అచ్యుతుని చూసి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసుకుని భక్తితో శ్రీహరిని ఆనందపరవస్యంతో ధ్యానించాడు.  కనులు తెరిచి ఆనంద పరవశ్యుడై గగుర్పాటు ఇచ్చిన శరీరముతో, గట్టిదమైనటువంటి స్వరముతో శ్రీహరిని చూస్తూ ప్రభు భక్తితో ఆనంద పరవసుడై శ్రీహరిని స్తుతించాడు”.  అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకి తెలియజేసిన విధంగా నారద మహర్షి అంబరీషునికి దివ్యమైన ఈ గాధని తెలియపరిచారు. 

వైశాఖ పురాణం 20వ అధ్యాయం సంపూర్ణం. 

సర్వం శ్రీ హరి చరణారవిందార్పణమస్తు !!

Vaisakha Puranam

#vaisakhapuranam #vaisakha #puranam

Quote of the day

Beauty is truth's smile when she beholds her own face in a perfect mirror.…

__________Rabindranath Tagore