విశిష్టమైన శ్రీ హరి కథాశ్రవణ మహిమ
విశిష్టమైన శ్రీ హరి కథాశ్రవణ మహిమని వివరించే వైశాఖపురాణ 19వ అధ్యాయం .
- లక్ష్మి రమణ
నారదుడు (Narada) అంబరీషునికి (Ambarisha)వైశాఖ మహత్యాన్ని ఇంకా ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. శ్రుతకీర్తి మహారాజు శృతదేవునికి నమస్కరించి, “మరింతగా వైశాఖమాస మహత్యాన్ని (vaisakha masa mahatyam) వినాలి అనేటటువంటి కుతూహలం కలుగుతుంది ఓ మహాత్మా! దయవుంచి నాకు ఆ వివరాలను వివరించండి” అనే ప్రార్థించాడు. శృతదేవుడు (srutha deva) కూడా “రాజా జన్మజన్మల పుణ్యం ఉన్నప్పుడే, భగవంతుడు అయినటువంటి శ్రీహరి మహిమను తెలుసుకోవాలి, ఆయన వ్రతాన్ని గురించి తెలుసుకోవాలి అని బుద్ధి కలుగుతుంది. ఇటువంటి ఆసక్తి కలిగిన నువ్వు భాగ్య శాలివి. మరెన్నో శుభాలు లాభాలు నీకు మున్ముందు కాలంలో ఉండడం చేతనే నీకు ఈ విధమైనటువంటి కోరిక కలిగింది. కాబట్టి నీ ఆసక్తికి మెచ్చి, వైశాఖ మాస మహత్యాన్ని వివరిస్తాను, విను” అంటూ ఈ విధంగా చెప్పసాగారు.
వైశాఖమాసంలో సూర్యుడు (sun) మేషరాశిలో ఉండగా, ప్రాతఃకాలంలో లేచి, స్నానం ఆచరించి, శ్రీహరిని పూజించి, శ్రీహరి కథను విని యధాశక్తిగా దానాలను చేసినటువంటి వారు శ్రీహరి లోకాన్ని తప్పకుండా చేరుకుంటారు. వైశాఖ పురాణాన్ని చెబుతూ ఉండగా దానిని శ్రద్ధగా వినక మరి వేరోక దానిపై ఆసక్తి కలిగినటువంటి మూడుడు, అజ్ఞాని రౌరవము అనే నరకాన్ని పొంది, పిశాచమై ఉంటాడు. అందుకు ఉదాహరణగా నీకొక కథని చెబుతాను. ఈ కథ పాపాలను నశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాశక్తిని పుణ్యాన్ని కలిగిస్తుంది. ఇది ఎంతో ప్రశస్తమైన కథ జాగ్రత్తగా విను” అంటూ ఈ విధంగా చెప్పసాగారు.
పూర్వము గోదావరి (godavari) తీరంలో బ్రహ్మేశ్వరము (brahmeswaram) అనే పుణ్యక్షేత్రం ఉన్నది. అక్కడ దూర్వాస మహాముని శిష్యులు సత్యనిష్టుడు, తపోనిష్ఠుడు అనేటటువంటి వారు ఉండేవారు. వాళ్ళిద్దరూ కూడా మహా జ్ఞానులు, సర్వసంగ పరిత్యాగులు, ఉపనిషత్తులను బాగా చదివినటువంటి వారు. వాటిలోని భావాన్ని గ్రహించిన వారు. భిక్షని మాత్రమే స్వీకరిస్తూ ఉండేవారు. పుణ్యశీలురైనవారు అక్కడ బృగు ప్రస్రవణము అనే తీర్థము సమీపంలో నివసిస్తూ ఉండేటటువంటి వారు. వీళ్ళిద్దరిలో సత్యనిస్ఠుడు శ్రీహరి కథల పట్ల ఆసక్తి కలిగిన వారు. చెప్పేవారు ఎవరూ లేకున్నట్లయితే తానే శ్రీహరి కథలను వివరిస్తూ ఉండేవారు. శ్రీహరి కథలను ఎవరైనా చెప్పినట్లయితే శ్రద్ధగా వినేవారు. విష్ణు కథలను తలుచుకుంటూ, శ్రీహరికి ప్రీతిని కలిగించే పనులు చేస్తూ ఉండేవారు. రాత్రింబగళ్లు తన పనులన్నీ కూడా మానుకునిమరీ విష్ణు కథలను వింటూ ఉండేవారు. ఆ విధంగా వినే వారు ఉన్నట్లయితే, తాను కూడా రాత్రింబగళ్లు శ్రీ విష్ణు కథలను వివరిస్తూ ఉండేవారు. దూరంలో ఉన్న తీర్థాలలో స్నానం చేయడం కంటే, దూరముగా ఉన్న క్షేత్రాలను దర్శించడం కంటే, కర్మానుష్టానము కన్నాకూడా ఆయనకి విష్ణు కథల యందే ప్రీతి ఎక్కువ. విష్ణు కథలను చెప్పేవారు రోగాలు తోటి బాధపడుతున్నప్పటికీ, కూపస్నానము చేసి శ్రీహరి కథలను తలుచుకుంటూ ఉండేవారు. విష్ణు కథా శ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసుకుంటూ ఉండేవారు .
విష్ణు కథల పట్ల ఆసక్తి కలిగిన వారికి సంసారబంధము ఉండదు కదా! శ్రీహరి కథలను వినడం వలన చిత్తశుద్ధి కలుగుతుంది. విష్ణుభక్తి పెరుగుతుంది. విష్ణువుపై ఆసక్తి, సజ్జనుల పట్ల ఇష్టము పెరుగుతాయి. నిరంజనము నిర్గుణము అయినటువంటి పరబ్రహ్మము అతని హృదయములో స్పురిస్తుంది. జ్ఞానహీనుని కర్మలన్నీ నిష్ఫలములే కదా! దుష్టులైన వారు కర్మలు ఎన్ని చేసినప్పటికీ, అవి వ్యర్థములే! గుడ్డివానికి అద్దము చూపిస్తే, ప్రయోజనమేముంటుంది? కాబట్టి చిత్తశుద్ధిని ముందుగా సాధించాలి. చిత్తశుద్ధి వల్ల, శ్రీహరి కథల పట్ల ఆసక్తి కలుగుతుంది. అందువల్ల జ్ఞానము కూడా కలుగుతుంది. అటువంటి జ్ఞానము వల్ల ధ్యానము ఫలిస్తుంది. కాబట్టి ఎక్కువసార్లు విష్ణు కథా శ్రవణము చేయడం ధ్యానించడం మనసుకి ఆవశ్యకాలు.
శ్రీహరి కథలు, సజ్జనులు లేని ప్రదేశము అది గంగాతీరమైన విడువ తగినది. తులసి వనము, శ్రీహరి ఆలయము, విష్ణు కధ లేని చోట మరణించిన వాడు తామసము అనే నరకాన్ని పొందుతాడు. శ్రీహరి ఆలయము కానీ, కృష్ణ మృగము కానీ, విష్ణు కథ కానీ, సజ్జనులు కానీ లేని చోట మరణించిన వారు అనేక జన్మలలో కుక్కగా జన్మిస్తారు. సత్యనిష్ఠుడు ఈ విధంగా ఆలోచించి, విష్ణు కథా శ్రవణము, ప్రాసంగము, స్మరణము, శృతి మొదలైనవి ముఖ్యములని తలపోశాడు.
రెండవ వారు తపోనిష్ఠుడు. ఈయనకి పూజ, జపాది కర్మలను కర్మలంటే ఇష్టము. ఆయన ఎప్పుడూ వాటిని మానకుండా పట్టుదలతో చేస్తూ ఉండేవాడు. ఈయన శ్రీహరి కథలను వినడు, చెప్పడు. ఎవరైనా చెబుతున్నా తన కర్మానుష్ఠానం మానుకొని ఉండడు. తీర్థ స్నానానికి వెళ్లిపోయేవాడు. దీర్ఘ స్నాన సమయంలో శ్రీహరి కథా ప్రాసంగం వచ్చినట్లయితే తన పూజాది కర్మ కలపాలని ఈ కాలక్షేపం మూలంగా ఆపుకోవలసి వస్తుందేమో అని దూరముగా వెళ్లేవాడు. అతన్ని అనుసరించేవారు కూడా స్నానాధి కర్మలను ఆచరించి తమ ఇంటి పనుల్ని చేసుకోవడం పట్ల ఇష్టముగలవారై ఉండేవారు. ఇట్లా ఎంతకాలం గడిచినప్పటికీ కూడా, తపోనిష్టుడు కర్మానష్టానము తప్ప శ్రీహరి కథా శ్రవణము కానీ, చింతను కానీ, స్మృతి కానీ మొదలైన వాటిని ఎరగడు.
ఈ విధంగా అహంకారంతోనే కొంతకాలానికి మరణించాడు. శ్రీహరి కథా శ్రవణము మొదలైనవి లేకపోవడం చేత పిశాచమై చిన్న కర్ణుడు అనే పేరిట జమ్మిచెట్టు పైన నివసిస్తూ ఉండేవాడు. అతడు బలవంతుడైనప్పటికీ నిరాదారుడు నిరాశ్రయుడుగా ఉండి, ఎండిన పెదవులు, నోరు కలవాడై ఉండేవాడు. ఈ విధంగా బాధపడుతూ కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాడు. అతని సమీపానికి వచ్చే వారే లేక, ఎంతో బాధపడుతూ ఉండేవాడు. ఆకలి దాహము కలిగి, అవి తీరే ఉపాయము లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాడు. అతని శరీరానికి జలబిందువు అగ్నిగాను, జలము ప్రళయాగ్ని లాగను కనిపించేది. ఫల పుష్పాలు విషాలుగా ఉండేవి. ఈ విధంగా కర్మ పరాయణుడు అయినటువంటి తపోనిష్ఠుడు పలు విధాలుగా బాధపడుతూ ఉండేవాడు.
ఈ విధంగా నిర్జనమైన ఆ అడవిలో అతడు ఎంతో బాధపడుతూ ఉండగా, ఒకనాడు సత్యనిష్టుడు పనిపై పైఠీనస పురానికి పోతూ ఆ ప్రాంతానికి వచ్చాడు. అతడు అనేక బాధలు అనుభవిస్తున్నటువంటి చిన్న కర్ణుడిని చూశాడు. దుఃఖిస్తూ సరణాగతుడైనటువంటి ఆ పిశాచి స్వరూపంలో ఉన్న చిన్న కర్ణునికి ధైర్యం చెప్పి, ఆయన బాధకు కారణాన్ని అడిగాడు. అతడు “నేను కర్మనిష్టుడనేటటువంటి వాడిని. దుర్వాస మహాముని శిష్యుడ్ని. కర్మ పరతంత్రుడనై శ్రీహరి కథా శ్రవణాధులను చెయ్యలేదు. మూఢత్వంతో కర్మలని ఆచరించడం వలన ఇటువంటి జన్మను పొందాను. అని తన వృత్తాంతమంతా కూడా తెలియజేశాడు. నా అదృష్టవశము వల్ల మీ దర్శనమైంది. నన్నిక మీరే రక్షించాలని పలు విధాలుగా ప్రార్థించాడు. అతని పాదములపై పడి దుఃఖించాడు. సత్యనిష్ఠుడు అతనిపై జాలిపడ్డాడు. తాను రెండు గంటల కాలము వైశాఖ పురాణ శ్రవణము చేసినటువంటి ఫలాన్ని అతనికి ధారపోశాడు.
ఆ మహిమ వల్ల కర్మనిష్ఠుడి పాపాలన్నీ తొలగిపోయాయి. అతని పిశాచ రూపం పోయి, దివ్యదేహం కలిగింది. కర్మనిష్ఠుడు, సత్యనిష్ఠుడికి నమస్కరించి తన కృతజ్ఞతలు తెలియజేసి, శ్రీహరి పంపించగా వచ్చినటువంటి దివ్య విమానాన్ని అధిరోహించి, శ్రీహరి సాన్నిద్యానికి వెళ్ళాడు. సత్యనిష్ఠుడు కూడా వైశాఖ మహత్య మహిమకు విస్మయపడుతూ, తన గమ్యమైనటువంటి పఠీనసపురానికి వెళ్ళాడు.
కాబట్టి, ఓ శృతి కీర్తి మహారాజా! శ్రీహరి కథల ప్రాసంగము, శ్రవణము ప్రసస్తమైనదని తెలుసుకో! శ్రీహరి కథా ప్రాసంగము గంగా ప్రవాహము కంటే, సర్వక్షేత్రముల కంటే కూడా ప్రశస్తమని తెలుసుకో! గంగాతీర వాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగుతుందో లేదో కానీ, శ్రీహరి కథ అనేటటువంటి గంగా తీరవాసులకు ఇహము పరము నిశ్చయముగా కలుగుతాయి” అని శ్రుతి కీర్తికి శృతదేవుడు భగవత స్వరూపాన్ని ఈ విధంగా వివరించారు.
ఏ కోవశీసర్వభూతాంతరాత్మ, ఏకంరూపం బహుధాయః కరోతి |
తమాత్మస్థం యేనుపశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం ||
ఏకోదేవస్సర్వభూతేషు గూఢస్సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మా |
కర్మాధ్యక్షస్సర్వభూతాధివాసస్సక్షి చైషకేవలోనిర్గుణశ్చ ||
ఏకోనారాయణో నద్వితీయోస్తి కశ్చిత్ ఏకఏవశివో నిత్యస్తతోన్యత్ఫకలం మృషా |
బహునాత్రకిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ అనేక భేదభిన్నస్తు క్రీడ తే పరమేశ్వరః ||”
అని శృతదేవుడు శృత కీర్తి మహారాజుకు భగవంతుని తత్వమును వివరించారు అని నారదుడు అంబరీష్యునికి తెలియజేశారు.
వైశాఖ పురాణము 19వ అధ్యాయం సంపూర్ణం .
సర్వం శ్రీ హరి పాదారవిందార్పణ మస్తు !!
Vaisakha Puranam
#vaisakhapuranam #vaisakha #puranam