Online Puja Services

వంశాభివృద్ధిని అనుగ్రహించే వైశాఖ పురాణ పారాయణ.

3.149.250.65

వంశాభివృద్ధిని అనుగ్రహించే వైశాఖ పురాణ పారాయణ. 
- లక్ష్మి రమణ 

 మన్మధుడు ముక్కంటి కంటి మంటలో దగ్దమయ్యాక శివ, పార్వతుల కళ్యాణం ఏవిధంగా జరిగిందనే విషయాన్ని శృత కీర్తి మహారాజుకి  వైశాఖ పురాణంలోని పన్నెండవ అధ్యాయంలో శృతదేవ మహాముని ఈ విధంగా వివరిస్తున్నారు. ఈ అధ్యాయాన్ని ఎవరైతే చదువుతారో వారికి చక్కని వంశోద్దారకులైన ,కీర్తిమంతులైన పుత్రులు జన్మిస్తారు. సంతానవంతులైతే వారి పిల్లలు ఆయుష్షును, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని, ఐశ్వర్యాన్ని కలిగి చిరకాలం వర్ధిల్లుతారు.  అటువంటి శుభాలనిచ్చే అద్భుతమైన ఉదంతం ఇది. మహారాజా శ్రద్హగా విను అంటూ ఇలా చెప్పసాగారు .   

మన్మధున్ని దహించి శివుడు అంతర్దానమయ్యాడు.  అప్పుడు గిరిరాజ పుత్రిక అయినటువంటి పార్వతి నిరాశపడి ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయింది.  భయపడిన తన కుమార్తెను చూసినటువంటి హిమవంతుడు కూడా భయపడి, ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు.  పార్వతి పరమశివుని రూపాన్ని ఔదార్యాది గుణాలను చూసి, ఇతడే నాకు భర్త కావాలని తలచింది.  తన తలపు తీరడానికి గంగా తీరంలో తపస్సు ఆచరించడానికి నిశ్చయించింది.  తల్లి తండ్రి ఆత్మీయులు కూడా సుకుమారిమైన నీకు ఈ తపస్సు వద్దు. కఠినమైన ఈ నిర్ణయం మానుకోమని వారించారు.  అయినప్పటికీ ఆమె తన మనసుని మార్చుకోలేదు. 

 గంగా తీరాన్ని చేరి, మహా లింగ స్వరూపాన్ని ఏర్పరిచి, జటాధారిణిగా , ఆహారాన్ని విడిచి నిరాహారిగా కొన్ని వేల సంవత్సరాలు పరమశివుని కోసం తపస్సు ఆచరించింది.  శివుడు పార్వతిని పరీక్షించాలనే ఉద్దేశ్యంతో  బ్రహ్మచారి వేషం ధరించి వచ్చాడు.  కుశలప్రశ్నలు వేసి, ఆమె శివున్ని భర్తగా పొందడానికి తపస్సు చేస్తున్నట్టు తెలుసుకొని, శివుణ్ణి తీవ్రంగా పరిహసించాడు. అయినా కూడా చలించని ఆమెకు శివుడి పై గల దృఢమైనటువంటి అనురాగమును తెలుసుకొని, నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు . తపస్సుకు ప్రన్నమయ్యాను కనుక వరాన్ని కోరుకోమన్నాడు. పార్వతి, శివుని భర్తగా కోరుకుంది.  శివుడు ఆమె కోరిన వరాన్ని ఇచ్చి అంతర్దానమయ్యాడు. 

ఆ తర్వాత పరమేశ్వరుడు సప్తరషులనూ తలుచుకున్నారు. వెంటనే సప్త ఋషులు వచ్చి శివుని ఎదుట నిలబడి నమస్కరించారు.  శివుడు “ఓ సప్త ఋషులారా నాకు కన్య నిమ్మని హిమవంతుణ్ణి మీరందరూ వెళ్లి నా తరఫున అడగమని” కోరారు.  సప్త ఋషులు శివుని ఆజ్ఞను శిరసా వహించి, తమ కాంతుల చేత దిక్కులను ప్రకాశింప చేస్తూ, ఆకాశమార్గంలో హిమవంతుని దగ్గరకు వెళ్లారు. 

 హిమవంతుడు వారికి ఎదురు వెళ్లి నమస్కరించి, గృహములోకి తీసుకువెళ్లి  పూజించారు.  వారిని సుఖాసీనులను చేసి,  “ ఓ సప్తఋషులారా ! మీరు నా ఇంటికి రావడం చేత నేను ధన్యుడయ్యాను.  మీవంటి తపోదనులు  నా ఇంటికి రావడం నా తపఫలము.  మహాత్ములైన మీకు నా వలన కాదగిన కార్యము ఏదైనా ఉంటే ఆజ్ఞాపించండి.”  అని ప్రార్థించాడు.  అప్పుడు సప్త ఋషులు “ఓ రాజా! నువ్వు మాట్లాడిన మాటలు యుక్తములై ఉన్నాయి.  మా రాకకు గల కారణాన్ని వినండి.  దక్ష ప్రజాపతి కుమార్తె సతి దేవి యజ్ఞశాలలో శరీర త్యాగము చేసి, నీ కుమార్తె పార్వతిగా జన్మించింది.  ఆమెకు తగిన వరుడు శివుడే తప్ప ముల్లోకములలోను మరెవ్వరూ లేరు.  ఆమె ఆనందాన్ని కోరి నీవు ఆమెను పరమశివుడికి ఇచ్చి వివాహం చేయవలసింది.  వేల కొలది పూర్వజన్మలలో నువ్వు చేసుకున్నటువంటి తపస్సు నీకు ఈ విధంగా ఇప్పటికి ఫలించింది” అని పలికారు. 

 హిమవంతుడు సప్త ఋషుల మాటలను విని, “ఋషులారా !ప్రస్తుతం  నా కుమార్తె నార చీరలను కట్టుకొని, గంగా తీరంలో శివుణ్ణి భర్తగా కోరి తపస్సు చేస్తోంది.  పరమేశ్వరుని వివాహం చేసుకోవడం ఆమెకు మాకు కూడా ఇష్టమే.  నేను నా కుమార్తెను మహాత్ముడైనటువంటి త్రినేత్రునికి ఇచ్చి వివాహం చేస్తాను.  మీరు పరమేశ్వరుని వద్దకు వెళ్లి హిమవంతుని కుమార్తె అయినటువంటి పార్వతి నీకు ఇవ్వబడిందని చెప్పండి.  ఈ వివాహాన్ని మీరే దగ్గరుండి నిర్వహించండి.  అని సవినయముగా పరమానందంతో పలికాడు.  

సప్త ఋషులు హిమవంతుడి మాటలు విని శివుడి వద్దకు వెళ్లారు. శివునికి హిమవంతుడు చెప్పినటువంటి మాటలను యధాతధంగా తెలియజేశారు. లక్ష్మీదేవి మొదలైనటువంటి దేవకాంతలు, విష్ణువు మొదలైన దేవతలు  షణ్మాతలు అందరూ కూడా శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని చూడవచ్చారు. శివుడు సర్వదేవతా గణాలు, మునులు, షణ్మాతలు పరివేష్టించి ఉండగా వృషభ వాహనారూడుడై వేద ఘోషతో, భేరీ, మృదంగ,  ప్రకృతి వాద్య ధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణముకు చేరుకున్నాడు.  హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమైనటువంటి శుభలగ్నములో పార్వతిని శివుడికిచ్చి వివాహం చేశాడు.  వారి వివాహము ముల్లోకములకు మహోత్సవం అయింది.  

వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో కూడా కలిసి లోక ధర్మానుసారంగా సుఖిస్తూ ఉన్నారు. పగలు సర్వసంపదలతో సంపన్నమైన హిమవంతుని ఇంట, రాత్రులలో  సరస్తీరములలో, ఫలాలు , పుష్పాలతో నిండి మనోహరమై ఉన్న వనములలోను,పర్వత సీమలలోను శివపార్వతులు స్వేచ్ఛ విహారములతో సుఖంగా గడుపుతున్నారు.  ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి.  ఇంద్రుడి శాసనాన్ని అనుసరించి ఆ కాలములో సంయోగమున ఏర్పడినటువంటి గర్భము తిరిగి సంయోగము జరిపితే తొలగిపోయేది . అందువల్ల శివుని కలయిక వలన పార్వతీదేవికి  ఏర్పడిన గర్భము శివపార్వతుల పునఃసమాగము చేత పోతూ ఉండేది.  ఈ విధముగా గర్భస్రావములు జరుగుతూ ఉండేవి. పార్వతి గర్భము నిలబడడం లేదు.  

శివుడి వలన పార్వతికి కలిగిన గర్భము నిల్వక పోవడం చేత పార్వతి గర్భమున పుట్టినటువంటి రుద్ర పుత్రుని వల్ల తారకాసుర వినాశనమునకు ఎదురుచూస్తున్నటువంటి దేవతలకు ఆశాభంగము, నిరాశ కలిగి విచారము అధికమవుతుంది.  వారందరూ కూడా ఒకచోట కలుసుకొని పరమేశ్వరుడు నిత్యము రతాశక్తుడై ఉన్నాడు. అందువల్లే  గర్భములు నిలవడం లేదు.  కాబట్టి శివుడికి పార్వతితో మళ్ళీ కలయిక లేకుండా ఉండేటట్లు చేయాలి.  ఈ విధంగా చేయడానికి ఆగ్నే తగినవాడని నిశ్చయించారు. 

అనుకున్నదే తడవుగా అగ్నిహోత్రున్ని పిలిచి, “ ఓ అగ్నిదేవా! నువ్వు దేవతలకు ముఖం వంటి వాడవు.  దేవతలకు బంధువువి.  నువ్వు ఇప్పుడు శివపార్వతులు వివరించే చోటుకు వెళ్ళు. రతాంతములో  శివునిని దర్శించి శివపార్వతులకు మళ్లీ కలయిక లేకుండా ఉండేటట్లుగా వ్యవహరించు.  వారికి పునఃసమాగము  లేనట్లయితే పార్వతి గర్భము నిలుస్తుంది.  రతాంతములో నిన్ను చూసి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోతుంది.  అందువల్ల వారికి మళ్లీ పునఃసమాగము  ఉండదు.  ఆ సమయములో నీవు శివుడికి ఎదురు నిలిచి, శిష్యుడవై వేదాంత విషయాలని ప్రశ్నించు.  శివుడు నీ సందేహాన్ని తీరుస్తారు. ఈ విధముగా అయితే తప్ప, గర్భవతి అయిన పార్వతి పుత్రుడిని ప్రసవించదు.  తారకాసురుడు రుద్ర పుత్రుని చేత మాత్రమే సంహరించబడతాడు . కాబట్టి ఆ విధంగా మాత్రమే మన కష్టాలు తీరుతాయి. కార్యాసాధకునిగా  ఈ పని నువ్వు చేయక తప్పదని”  దేవతలు అగ్నిని ప్రార్థించారు.  

అగ్ని కూడా దేవతల ప్రార్థనని అంగీకరించి శివపార్వతులు ఉన్నచోటకు వెళ్లాడు.  శివపార్వతుల కలయికలో శివుని వీర్యము విముక్తుము కాకుండానే అగ్ని శివపార్వతుల వద్ద సశరీరుడై ప్రత్యక్షమయ్యాడు.  వస్త్రవిహీనై ఉన్న పార్వతీదేవి అగ్ని రాకను గమనించి సిగ్గుపడి బాధపడుతూ చాటుకు వెళ్ళింది.  శివుడు పార్వతీదేవి తన దగ్గర నుంచి దూరముగా వెళ్లడం చేత, అందుకు కారణమైనటువంటి అగ్నిపై కోపించి మా కలయికకు  ఆటంకం చేశావు.  వీర్య పతనమునకు స్థానము కాదగిన పార్వతి ఇక్కడ లేకుండా పోవడానికి నువ్వే కారణము.  నా ఈ వీర్యాన్ని నీవే భరించు.  అంటూ తన పతోన్ముఖమైనటువంటి వీర్యాన్ని అగ్ని యందు ఉంచాడు. 

అగ్ని కూడా దుర్భరమైనటువంటి శివ వీర్యాన్ని భరించలేక బాధపడుతూ ఏ విధంగానో దేవతల వద్దకు వెళ్లి, జరిగిన దానిని వారికి చెప్పారు.  దేవతలు అగ్ని మాటలు విని శివవీర్యము లభించిందని సంతోషము ,ఆ వీర్యము నుండి సంతానం ఏ విధంగా కలుగుతుందా అని  విచారాన్ని పొందారు. అగ్నిలో ఉన్న శివ వీర్యము పిండము రూపంలో పెరుగుతుంది.  పురుషుడైనటువంటి అగ్ని దానిని ఏ విధంగా ప్రసవించగలనా అని మధనపడసాగాడు. పైగా శివవీర్యము అగికి కూడా భరింపశక్యముగా లేదు.  అప్పుడు  దేవతలను చేరి అగ్ని తనను రక్షించమని కోరాడు. 

 దేవతలు విచారించి, అగ్నితో కలిసి గంగా నది దగ్గరకు వెళ్లారు. ఆమెను అనేక విధాలుగా స్తుతించారు. “ తల్లి! నీవు నీవు మా అందరికీ కూడా తల్లివి.  అన్ని జగములకు అధిపతివి.  అంటూ దేవతలు చేసినటువంటి ప్రార్థనను గంగాదేవి స్వీకరించి, వారి కోరికను అంగీకరించింది.  దేవతలు అగ్నికి గర్భమును విడిపించుకునే మంత్రాన్ని ఉపదేశించారు.  అగ్ని కూడా దేవతలు చెప్పిన మంత్ర బలమున తనలో ఉన్నటువంటి రుద్రవీర్యాన్ని గంగానదిలో ప్రవేశపెట్టాడు.  గంగానది కూడా కొన్ని మాసాల తరువాత ఆ రుద్రవీర్యాన్ని భరించలేకపోయింది.  దుర్భరమైనటువంటి ఆ శివ వీర్యాన్ని తన తీరంలో ఉన్న రెల్లిపొదలలో విడిచిపెట్టింది. 

రెల్లు దుబ్బులో పడినటువంటి శివవీర్యము ఆరు భాగాలుగా విడిపోయింది . బ్రహ్మ పంపగా వచ్చినటువంటి షట్కృతికా దేవతలు ఆరు భాగాలుగా ఉన్నటువంటి ఆ రుద్ర తేజస్సును తిరిగి ఒకటిగా చేశారు.  అప్పుడు శివ తేజస్సు ఆరు ముఖములు గల పురుషాకారమై ఉన్నది.  ఆరు ముఖములు గల ఆ రూపము ఎవరి రక్షణా లేకుండా పెరుగుతుంది. 

ఇదిలా ఉండగా, ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు వృషభాన్ని ఎక్కి శ్రీశైలానికి పోతూ, ఆ ప్రాంతాన్ని చేరుకున్నారు.  అప్పుడు పార్వతీ మాత  స్థానముల నుండి క్షీర ధారలు శ్రవించాయి.  పార్వతి తన స్థనముల నుండి నిష్కారణముగా  క్షీరస్రావము జరిగినందుకు ఆశ్చర్యపడి,  “స్వామీ ! విశ్వాత్మకా ! నా స్థనముల నుండి క్షీర ధారలు ఈ విధంగా నిష్కారణముగా శ్రవించడానికి కారణమేంటి?” అని అడిగింది.  అప్పుడు శివుడు పార్వతీ దేవికి జరిగిన విషయమంతా కూడా వివరంగా తెలియజేశారు . ఇంకా ఇలా చెబుతున్నారు . “ ఓ దేవీ !  ఆ రెల్లుపొదల్లో కృత్తికలచేత ఒక్కటి చేయబడిన  పురుష రూపమున్న చోటుకు ఇప్పుడు మనం వచ్చాము. ఇతడు నీ పుత్రుడు అవడం చేత, నీ స్థనములు క్షీరమును శ్రవిస్తున్నాయి.  ఇతడే నీ పుత్రుడు.  నా తేజస్సు వల్ల జన్మించినవాడు.  ఇతడు శ్రీ మహా విష్ణువుకి సమానమైన పరాక్రమశాలి.  వీడిని నీవు రక్షించి పాలించు.  దీనివలన నీకు గొప్ప ప్రఖ్యాతి వస్తుందని” అనుగ్రహించారు . 

 పార్వతి శివుని మాటలు విని ఆ బాలుడిని తన ఒడిలో ఉంచుకుని తన స్తన్యమును వానికి ఇచ్చింది. పుత్రవాత్సల్యముతో ఆ జగజ్జననని అయినా ఆ మాతృమూర్తి  పరవశించిపోయింది. ఆ తర్వాత  ఆ బాలుడిని తీసుకుని ఆమె కైలాసానికి వెళ్ళింది.  పుత్రుని లాలిస్తూ ఆమె గొప్ప ఆనందాన్ని పొందింది. ఓ రాజా! పరమ అద్భుతమైనటువంటి కుమార జననాన్ని నీకు వివరించాను. దీన్ని చదివిన విన్న పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది సందేహమే లేదు. 

ఇక ఈ విధంగా కుమారా సంభవానికి కారణమైన మన్మధుడు తపస్వి అయినటువంటి శివుడి పై బాణ ప్రయోగాన్ని చేసి, శివ తపోదీక్షకు భంగాన్ని కలిగించి, శివుడి కోపానికి గురై  దుఃఖాన్ని పొందినప్పటికీ కూడా తర్వాత జన్మలో వైశాఖ వ్రతాన్ని చేసి పూర్వం కంటే ఎక్కువ సౌఖ్యాన్ని పొందాడు. 

కాబట్టి  వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతడు సర్వోత్తముడు, భార్యా ద్వితీయుడు అయినప్పటికీ , ఆ వైశాఖవ్రతము ఆచరించని వారికి, వైశాఖ స్నానము చేయని వారికి, దానము చేయనివారికి వారెన్ని ధర్మముల ని ఆచరించినప్పటికీ  కష్టమూల పరంపర తప్పదు . ఏ ధర్మముల నాచరించని  వారైనా  వైశాఖ వ్రతము ఆచరించినట్లయితే , వారికి అన్ని ధర్మములనీ  ఆచరించినంత పుణ్యలాభము కలుగు తుంది” అని చెప్పారు.

వైశాఖ పురాణము పన్నెండవ అధ్యాయం సంపూర్ణం . 

Vaisakha Puranam, Kumara Sambhavam

#vaisakha #puranam #vaisakhapuranam #kumarasambhavam

Quote of the day

The will is not free - it is a phenomenon bound by cause and effect - but there is something behind the will which is free.…

__________Swamy Vivekananda