యముడిని ఓడించిన రాజు
యముడిని ఓడించిన రాజు !!
- లక్ష్మి రమణ
వైశాఖ పురాణంలోని 16వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ, శృతదేవమునీంద్రుడు ఇలా చెబుతున్నారు. అటువంటి సమయంలో యముని పలకరించేందుకు నారద మహర్షి యమలోకానికి వెళ్లారు. యమలోకంలోని పరిస్థితిని చూశారు. “ఓ యమధర్మ రాజా! నీ లోకములో నరక బాధలు పడే వారి రోదనలు ధ్వనులు వినిపించడం లేదేంటి? చిత్రగుప్తుడు ప్రాణుల పాపాలను లెక్క రాయడం మానేసి ముని లాగా మౌనంగా ఉన్నాడు ఎందుకు? సహజంగానే అనేకానేక పాపాలను చేసే మానవులు నీ లోకానికి రాకుండా ఉండడానికి కారణం ఏంటి? అని ప్రశ్నించాడు.
అప్పుడు యముడు ధీనుడై ఈ విధంగా సమాధానం చెప్పారు. “ఓ నారద మహర్షి! భూలోకమును ఇక్ష్వాకు వంశము వాడైన కీర్తిమంతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప విష్ణుభక్తుడు అతడు ధర్మభేరిని మ్రోగించి, తన ప్రజలందరినీ వైశాఖ వ్రతాన్ని అవలంబించేటట్లు చేస్తూ ఉన్నాడు. వ్రతాన్ని ఆచరించనివారిని గుర్తించి తీవ్రంగా శిక్షిస్తూ ఉన్నాడు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా భక్తి వలనో , దండన భయం వలనో తప్పకుండా వైశాఖమాస వ్రత ధర్మాలను ఆచరిస్తూ, చేసిన పాపాలను పోగొట్టుకుని విష్ణు లోకాన్ని చేరుతూ ఉన్నారు. ఇందువల్ల నరకలోకానికి వచ్చే వాళ్ళు ఎవరూ లేక వైశాఖ స్నానాధుల మహిమ వల్ల శ్రీహరి లోకానికే వెళుతున్నారు. అందువల్ల నేను మ్రోడైన మానులాగా ఉండిపోయాను. నాకు ఈ స్థితి పోయి పూర్వపు స్థితి రావాలి. అందుకోసం ఆ రాజు పై దండెత్తి అతనిని సంహరించాలనుకుంటున్నాను . యజమాని చెప్పిన పనిని చేయకుండా, అతడిచ్చే ద్రవ్యాన్ని తీసుకుని ఊరికే ఉండేవాడు తప్పక నరకాన్ని పొందుతాడు. నేను కూడా బ్రహ్మ చేత యమలోకానికి వచ్చే పాపులను విచారించి, శిక్షించడానికి నియమించబడి ఈ విధంగా ఊరికే ఉండటం వలన నాకు పాపము కలుగుతుంది. ఒకవేళ ఆ రాజును నేను చంపలేకపోయినట్లైతే, బ్రహ్మ వద్దకు వెళ్లి నేను చేయవలసింది ఏంటని అడుగుతాను.” అని యమధర్మరాజు నారదుడికి చెప్పాడు. నారదుడు ఇదేదో బాగుందనుకుంటూ తన దారిని తాను వెళ్లారు.
యమధర్మరాజు తన వాహనమైన మహిషాన్ని ఎక్కి భయంకరమైన ఆకారంతో యమదండాన్ని ధరించి యమభటులతో కూడా కీర్తిమంతుడి పైకి దండెత్తి వెళ్ళాడు. వచ్చినవాడు యమధర్మరాజుని తెలుసుకుని యమభటులతో యుద్ధానికి వెళ్ళాడు కీర్తిమంతుడు. యుద్ద సన్నద్ధుడై వచ్చిన యమధర్మరాజును ఎదిరించాడు. యమునికి కీర్తిమంతునికి గొప్ప భయంకరమైన యుద్ధం జరిగింది. యముని సేవకులైన మృత్యువు, రోగము, యమదూతలు కీర్తిమంతుని ఎదిరించలేక పారిపోయారు. యముడు ప్రయోగించిన ఆయుధాలు అన్నీ కూడా కీర్తిమంతుని ఆయుధాల ముందు శక్తి హీనమైపోయాయి. చివరికి యముడు బ్రహ్మాస్త్రంతో మంత్రించిన దండాన్ని కీర్తిమంతుని పైన ప్రయోగించాడు. భయంకరమైన ఆ యమ దండాన్ని చూసి అందరూ బెదిరి హాహా కారాలు చేశారు. అప్పుడు శ్రీహరి తన భక్తుడైన కీర్తిమంతుడిని రక్షించడానికి తన సుదర్శన చక్రాన్ని పంపించారు. భయంకరమైన సుదర్శన చక్రము యమదండమును, దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనము చేసి, వాటిని మరలించి యముని పైకి వదిలింది.
విష్ణుభక్తుడైన కీర్తిమంతుడు శ్రీహరికి నమస్కరించి, ఆ చక్రాన్ని ఈ విధంగా స్తుతించాడు .
సహస్రార నమస్తేస్తు విష్ణు పాణి విభూషణ
త్వం సర్వలోక రక్షాయై ద్రుతఃపురా
త్వాం యాచేద్యమంత్రాతుం విష్ణుభక్తం మహాబలం
నృణాం దేవ దృహంకాల స్త్వమేవహినచాపారః
తప్పాదేవం యమం రక్ష కృపాకురు జగత్పతే
అని కీర్తిమంతుడు ప్రార్థించగా, సుదర్శన చక్రము యముని విడిచి దేవతలందరూ చూస్తూ ఉండగా ఆ రాజు వద్దకు వచ్చి నిలిచింది. యముడు కూడా తన సర్వ ప్రయత్నాలు కూడా వ్యర్థమవటాన్ని గమనించాడు. కీర్తిమంతుడు సుదర్శనాన్ని ప్రార్థించి తనని రక్షించడాన్నీ గొప్ప అవమానంగా భావించాడు. విషాదాన్ని పొందాడు . దాంతో యముడు తలవంచుకొని, సవిచారముగా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లాడు.
ఆ సమయంలో బ్రహ్మ సభ తీర్చుకొని ఉన్నారు. రూపముతో ఉన్నవారు , రూపముతో లేనటువంటి వారితో కూడా బ్రహ్మగారు సేవితుడై ఉన్నారు. బ్రహ్మ దేవతలకు ప్రకాశమైనవాడు. జగములు అనే వృక్షానికి బీజము విత్తనము అయినటువంటి వాడు. అన్ని లోకములకు పితామహుడు. అటువంటి బ్రహ్మను, లోకపాలకులు దిక్పాలకులు, రూపము కల ఇతిహాస పురాణాదులు, వేదాలు, సముద్రములు, నదీనదములు, సరోవరాలు , అశ్వద్ధాది మహావృక్షాలు, వాపీకూప తటాకములు, పర్వతములు, అహోరాత్రాలు, పక్షములు, మాసములు, సంవత్సరాలు, కలలు, కాష్టములు, నిమిషములు, రుతువులు, ఆయనములు, యుగములు, సంకల్ప, వికల్పములు, నిమిషాములు, నక్షత్రములు, యోగములు, కరణములు, పూర్ణిమలు, అమావాస్యలు, సుఖదుఃఖాలు, భయా భయాలు, లాభాలు, జయాపజయాలు, సత్వ రజస్తమో గుణాలు, శాంత మూఢ అతి మూఢ అతి ఘోరవస్థలు, వికారములు, సహజములు, వాయువులు, స్లేష్మ వాత పిత్తములు - ఇలా కనిపించేవి, అనిపించేవి అయినా వాటన్నింటితో కొలువుదీరిన బ్రహ్మను చూశారు. ఇటువంటి దేవతలు ఉన్న కొలువులోకి యముడు సిగ్గుతో కొత్త పెళ్లికూతురు లాగా తలవంచుకుని ప్రవేశించారు.
ఈ విధంగా సిగ్గుతో తన వారందరితో వచ్చినటువంటి యమున్ని చూసి సభలోని వారు “క్షణమైనా తీరిక ఉండని ఇతడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? తలవంచుకొని విషాదంగా ఉండడానికి కారణం ఏంటి? అని ఆశ్చర్యపడ్డారు. ఇతనొచ్చిన కారణమేంటి? పాపపుణ్యాలని తెలిపేటటువంటి చిత్రగుప్తుని చిట్టా కొట్టివేతులతో నిండి పోయిందెందుకు?” అని ఈ విధంగా సభలో ఉన్న భూతాలు, దేవతలు ఆశ్చర్య పడుతూ ఉండగా యమధర్మరాజు బ్రహ్మ పాదాల మీద పడి దుఃఖిస్తూ, “స్వామి! నన్ను రక్షించు. నీవు ఉండగా నేను పరాభవాన్ని పొందాను. మానవుల పాప పుణ్యాలను తెలిపేటటువంటి చిట్టాలో పాపములను నేనే రాయించి నేనే కొట్టి వేయించవలసి వచ్చింది. నేను నిస్సహాయముగా నిర్వ్యాపారముగా చేతులు ముడుచుకుని ఉండవలసి వచ్చింది” అని పలికి నిశ్శేష్టుడై ఉన్నాడు.
దీన్ని చూసి సభలో గగ్గోలు బయలుదేరింది. “స్థావర జంగమ ప్రాణులన్నింటినీ ఏడిపించే ఇతడే ఇలా ఏడుస్తున్నాడు ఎందుకు? అయినా కూడా జనులని సంతాపపరిచేవాడు శుభాన్ని పొందుతాడా? చెడు చేసినవాడు చెడును పొందక తప్పుతుందా?” అని సభలోని వారు పలు విధాలుగా తమలో తాము అనుకుంటూ ఉన్నారు. వాయువు సభలో వారిని నిశ్శబ్దపరచి, బ్రహ్మ పాదముల పైన వాలిన యమధర్మరాజును దీర్ఘములు దృఢములు అయినటువంటి తన బాహువులతో పైకి లేవదీశాడు. దుఃఖిస్తున్న అతనిని ఆసనము మీద కూర్చోబెట్టి ఊరడించాడు.
“ఓ యమధర్మ రాజా! నిన్ను పరాభవించిన వారెవరు? నీ పనిని నిన్ను చేసుకోనివ్వకుండా అడ్డగించిన వారెవరు? ఈ పాపపు పట్టికని ఈ విధంగా తుడిచేసిన వారెవరు? వివరంగా చెప్పు. నువ్వు ఎందుకు వచ్చావు ? అందరినీ పరిపాలించువారే నీకు నాకు కూడా ప్రభువు. భయము లేదు చెప్పు” అని వాయువు అడిగాడు. అప్పుడు యమధర్మరాజు “అయ్యో ….” అని అతి దినముగా పలికాడు.
వైశాఖ పురాణం 16వ అధ్యాయం సమాప్తం.
Vaisakha Puranam
#vaisakhapuranam #vaisakha #puranam