యమలోకం ఖాళీ చేయించిన వైశాఖ ధర్మాచరణ !
యమలోకం ఖాళీ చేయించిన వైశాఖ ధర్మాచరణ !
- లక్ష్మి రమణ
వైశాఖ పురాణంలోని 15వ అధ్యాయం నారద మునీంద్రుడు అంబరీషునికి ఇలా చెబుతున్నారు . ఓ రాజా ! ఆ విధంగా శృతదేవుని మాటలు విన్నటువంటి శృత కీర్తి మహారాజు “ఓ శృతదేవ మహాముని, వైశాఖ ధర్మాలు సులువుగా ఆచరించదగినవి. అఖండ పుణ్యప్రదాయాలు, విష్ణు ప్రీతికరాలు, ధర్మార్థ పురుషార్థ సాధకాలు . ఇటువంటి ఉత్తమమైన ధర్మాలు శాశ్వతాలు, వేద నిరూపితాలు కదా! మరి ఇంతటి ఉత్తమమైన ధర్మములు లోకములో ఎందుకని ప్రసిద్ధము కాలేదు ? తామసము, రాజసము అయినటువంటి ధర్మాలు కష్ట సాధ్యాలు. అధిక ధన ప్రయాసలు కలిగిన ధర్మాలు లోకాన ప్రసిద్ధిని ఎలా పొందుతున్నాయి ? కొందరు మాఘమాసాన్ని మెచ్చుకుంటూ ఉంటారు. మరికొందరు చాతుర్మాస్య వ్రతాలు ఉత్తమమంటారు. ఈ సందేహాల్ని తీర్చి, సరియైన వివేకాన్ని కలిగించ వలసిందిగా కోరుతున్నానని” అభ్యర్థించాడు.
అప్పుడు శృతదేవుడు “ఓ మహారాజా! వైశాఖ ధర్మముల కన్నా ఇతరములైన ధర్మములు ఎందుకు ప్రసిద్ధి పొందాయో వివరిస్తాను విను ! లోకములోని ప్రజలు చాలామంది ఐహిక భోగాలను, పుత్ర పౌత్రాది సంపదలను కోరుకుంటుంటారు. వారు రాజస తామస గుణ ప్రధానులు. కొంతమంది తాము ఏదో ఒక విధముగా స్వర్గాన్ని పొందాలని యజ్ఞాది క్రతువులు చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞాది క్రియలు కష్ట సాధ్యములే అయినప్పటికీ, స్వర్గం పైన ఉన్న మోహముతోటే వాటిని చేస్తుంటారు. కానీ అటువంటివారిలో ఒక్కరు కూడా మోక్షానికై ప్రయత్నించటం లేదు. చాలామంది ప్రజలు క్షుద్ర ప్రయోజనాలకు ఆశపడి అధిక కర్మలు చేస్తూ కామ్య సాధన కోసం ప్రయత్నిస్తూ ఉంటారు . కాబట్టి రాజస తామస ధర్మాలు లోకంలో ప్రసిద్ధములయ్యాయి.
విష్ణు ప్రీతికరమైనటువంటి సాత్విక ధర్మాలు మోక్షాన్ని , దుర్లభమైన విష్ణులోకాన్ని ప్రాప్తిపజేసేవి. కర్మ కర్మ పరతంత్రులు అయినటువంటి మూడులు ఈ విషయాన్ని తెలుసుకోలేరు. ఆధిపత్యం, ఉన్నత పదవి, మనోకామ్యముల సిద్ధే ప్రయోజనముగా కలిగినటువంటి కర్మలను ఆచరించి తాము సిద్ధిపొందామని భ్రమిస్తున్నారు. కానీ వీటి వల్ల సంపదలు వృద్ధి పొందినా, పురుషార్థ సాధన మాత్రం ఆగిపోతుంది. వైశాక ధర్మాలు సాత్వికములు. అవి నిగూఢములుగా ఉండడానికి ఎవరికీ పెద్దగా తెలియక పోవడానికి కారణాన్ని వివరిస్తాను విను.
పూర్వము కాశీరాజు కీర్తిమంతుడు అనేవాడు ఉండేవాడు. అతడు నృగమహారాజు పుత్రుడు. ఇక్ష్వాకు వంశ రాజులలో ఉత్తమమైన వాడు. కీర్తిశాలి. అతడు ఇంద్రియాలు జయించినవాడు, కోపమే ఎరుగనివాడు, బ్రహ్మజ్ఞాని. అతడు ఒకరోజు వేటాడుతూ అడవిలోకి వెళ్ళాడు. వశిష్ట మహర్షి ఆశ్రమ ప్రాంతాన్ని చేరుకున్నాడు. అతడు వెళ్లిన కాలము వైశాఖ మాసము వశిష్ట మహర్షి ధర్మాలను ఆచరిస్తూ ఉన్నారు. కొందరు చలివేంద్రాలను, మరికొందరు నీడనిచ్చే చెట్లను, మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేస్తున్నారు. బాటసారులకు చెట్ల నీడలలో కూర్చుండబెట్టి విసనకర్రలతో వీస్తూ ఉన్నారు. చెరుకు గడలను, గంధాన్ని, ఫలాలను అందిస్తూ ఉన్నారు. మధ్యాహ్న కాలములో గొడుగులను దానం చేస్తూ, సాయంకాలంలో పానకాన్ని పంచుతూ, తాంబూలాన్ని అందిస్తూ, కన్నులు చల్లబడడానికి కర్పూరాన్ని సమర్పిస్తూ ఉన్నారు. చెట్ల నీడలలో, ఇంటి ముంగిళ్ళలో, మండపములలో, ఇసుకను పరిచి కూర్చోవడానికి వీలుగా చేస్తూ ఉన్నారు. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలు కడుతున్నారు.
రాజు వాళ్ళందరిని చూసి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని ప్రశ్నించాడు. వారు కూడా “ఓ రాజా ఇవన్నీ కూడా వైశాఖ మాసంలో ఆచరించవలసినటువంటి ధర్మాలు మానవులకి సర్వపురుషార్థాలని ప్రసాదించగలిగినటువంటివి. మా గురువుగారైన వశిష్టుల చేత ఆజ్ఞాపించబడి, వీటన్నిటినీ కూడా చేస్తున్నాము” అని చెప్పారు. మరింతగా వివరించి చెప్పమని రాజు వారిని అభ్యర్థించారు. అప్పుడు వారు “రాజా మేము ఈ పనులను గురువుల ఆజ్ఞను అనుసరించి చేస్తున్నాము. మీరు ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే మా గురువులను సంప్రదించమని సమాధానం ఇచ్చారు. రాజు వారి మాటలు విని, పవిత్రమైనటువంటి వశిష్టుని ఆశ్రమానికి వెళ్లారు. ఆ విధంగా వస్తున్నటువంటి రాజును ఆయన పరివారాన్ని చూసి వశిష్ట మహర్షి సాదరంగా రాజును ఆయన పరివారాన్ని అతిథి సత్కారాలతో ఆదరించారు.
రాజు మహాముని ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి నమస్కరించి సంతోషంతో ఆశ్చర్యముతో ఈ విధంగా ప్రశ్నించారు. “ఓ మహర్షి! మార్గంలో మీ శిష్యులు బాటసారులకు చేసే అతిధి సత్కారాలు ఉపచారాలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? అని నేను వాళ్ళని అడిగాను. వారు ‘ఓ మహారాజా దీన్ని వివరించే అవకాశం మాకు లేదు. మా గురువుల ఆనతి మీద శుభకరములైన ఈ పనులన్నీ చేస్తున్నాము. మరింత వివరంగా మీరు మా గురువుగారిని అడిగి తెలుసుకోండి.’ అన్నారు. నేను కూడా వేటాడి, అలసిపోయాను. అతిధి సత్కారాన్ని కోరే పరిస్థితిలో ఉన్నాను. ఇటువంటి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేసే అతిధి సత్కారాలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఓ మహర్షి మీరు మునులందరిలోనూ శ్రేష్టమైన వారు. సర్వధర్మములు తెలిసినవారు. నేను మీకు శిష్యసమానుడను. దయవుంచి నాకు ఈ విషయాన్ని తెలియజేయమని ప్రార్థించారు.
అప్పుడు వశిష్ట మహర్షి రాజుకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేయతలకు ఎంతో సంతోషించి “ఓ రాజా నీ బుద్ధికి గల క్రమశిక్షణ గొప్పది. విష్ణు కథా ప్రాసంగము పట్ల, విష్ణు ప్రీతికరమైన ధర్మములను తెలుసుకోవడం పైన ఆసక్తి కలగడం సామాన్యమైన విషయం కాదు. మీరు అడిగినటువంటి వివరాలను చెబుతాను శ్రద్ధగా విను”. అంటూ ఈ విధంగా చెప్పసాగారు. “వైశాఖ మాస వ్రత ధర్మ విషయాలను విన్నంతనే సర్వపాపాలు కూడా నశిస్తాయి. ఇతర ధర్మములన్నింటికంటే కూడా వైశాఖ ధర్మాలు ఉత్తమమైనవి. వైశాఖ మాసంలో బహిస్నానము చేసిన వారు శ్రీమహావిష్ణువుకు ప్రియమైన వారు. ఇతరములైన అన్ని ధర్మములను ఆచరించి, స్నానము దానము అర్చనము ఎన్ని చేసినా కూడా, వైశాఖ మాస ధర్మాన్ని ఆచరించినట్లయితే అటువంటి వారికి శ్రీహరి దూరంగా ఉంటారు. ఈ మాసంలో స్నానము దానము పూజాదికాలు మానివేసిన వారు ఎంత గొప్ప కులములో జన్మించిన వారైనప్పటికీ, కర్మను అనుసరించి మిక్కిలి నీచ జన్మ కల వారిని గుర్తుంచుకో.
వైశాఖ మాస వ్రత ధర్మాన్ని ఆచరించి, శ్రీహరిని పూజించినట్లయితే శ్రీహరి సంతోషించి అటువంటి వారి కోరికలను తీర్చి రక్షిస్తారు. శ్రీపతి అయినటువంటి జగన్నాథుడు సర్వపాపాలని నశింపజేయగలిగినవాడు. వ్యయప్రయాసలు గల వ్రతాల చేత, ధర్మసూక్ష్మాల చేత, ధనము చేతను శ్రీహరి సంతోషించడు. భక్తి పూర్వకముగా చేసేటటువంటి ఎటువంటి స్వల్ప పూజ అయిన స్వల్ప కర్మకైనా శ్రీహరి ఎంతో సంతోషిస్తారు. భక్తిలేని కర్మ ఎంత పెద్దదైనా ఆయన అనుగ్రహించరు. అధిక కర్మకు అధిక ఫలము, స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కించరని భక్తి అధికమైనట్లయితే స్వల్ప కర్మకైనను అధిక ఫలాన్ని ఇస్తారని గుర్తుంచుకోవాలి.
వైశాఖ ధర్మాలు స్వల్పములైన వ్యయప్రయాసల చేత చేయబడినప్పటికీ భక్తి పూర్ణములైనట్లయితే శ్రీహరికి మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఓ రాజా నువ్వు కూడా వైశాఖ మాస ధర్మాలను ఎక్కువ తక్కువ అని ఆలోచించకుండా భక్తి పూర్ణముగా ఆచరించు. నీ దేశ ప్రజల చేత కూడా చేయించు వారికి శుభాలు కలుగుతాయి. వైశాఖ ధర్మాలను ఆచరింపని నీచుడు అతడు ఎవరైన ప్పటికీ కూడా తీవ్రంగా శిక్షించు” అని వశిష్ట మహర్షి శాస్త్రోక్తములైనటువంటి శుభకరములైనటువంటి వైశాఖమాస వ్రత ధర్మాలను వాటి యొక్క అంతరార్ధాన్ని మహారాజుకు వివరించారు. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యానికి వెళ్లారు.
ఆ రాజు వశిష్ట మహర్షి చెప్పినటువంటి మాటలను యధాతధంగా పాటించారు. వైశాఖమాస ధర్మాలను పాటిస్తూ, శ్రీమహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవిస్తూ ఉన్నారు. ఏనుగుపై భేరి వాయిద్యాన్ని ఉంచి దానిని మోగించి బటుల చేత గ్రామ గ్రామములో “ప్రజలారా వినండి 80 సంవత్సరముల వయస్సు దాటిన వారు ఎనిమిది సంవత్సరముల వయసు వారు ప్రాతః కాలములోనే స్నానం చేసి వైశాఖమాసంలో వైశాఖమాస వ్రత ధర్మాన్ని ఆచరించాలి. ఆ విధంగా ఆచరించని వారిని దండిస్తాము లేదా దేశము నుండి బహిష్కరిస్తాము” అని చాటించాడు.
వైశాఖ వ్రతమును ఆచరించని వారు తండ్రి అయిన, పుత్రుడైన, భార్య అయిన, ఆత్మ బంధువైన తీవ్ర దండనకు అర్హులే అని ప్రకటించారు .
వైశాఖమాసంలో ప్రాతః కాలంలోనే స్నానం చేసి సద్బ్రాహ్మణులకు జలము మొదలైన వాటిని యధాశక్తిగా దానం చేయాలి. చలివేంద్రములు మొదలైన వాటిని ఏర్పాటు చేయాలి. అని వైశాఖ ధర్మాలను పాటించని వారిని తెలుసుకోవడానికి ధర్మ కర్తను నియమించారు. వైశాఖ వ్రతాన్ని పాటించని వారిని శిక్షించడానికి, ఐదు గ్రామాలకి ఒక ధర్మాధికారిని కూడా నియమించారు అతని అధీనములో పదిమంది అశ్వికులను ఉంచారు. ఈ విధంగా ఆ మహారాజు ఆజ్ఞ చేత ఆయన దేశంలో వైశాఖ మాస వ్రతము సుస్థిరముగా జరుగుతూ ఉంది.
ఈ విధంగా ఆ రాజు ప్రారంభించి, నాటినటువంటి వైశాక ధర్మ వృక్షము ఆయన రాజ్యంలో సుస్థిరమైంది . ఆ రాజ్యంలో మరణించినటువంటి స్త్రీలు, బాలురు, పురుషులు అందరూ ఇహలోక సుఖములను పొందినవారై, విష్ణు లోకమును చేరుతూ ఉన్నారు. వైశాక మాసంలో ఏ కారణము చేత ప్రాతఃకాల స్నానము చేసినప్పటికీ పాప విముక్తులై శ్రీహరి లోకాన్ని పొందుతూ ఉన్నారు.
ఈ విధంగా ఆ రాజ్యము దేశంలోని ప్రజలందరూ కూడా వైశాఖ మహత్యము వైశాఖమాస వ్రత మహత్యం వలన శ్రీహరి లోకానికి పోవడం చేత యమధర్మ రాజ్యమునకు (నరకానికి ) పోయే వారెవరూ కూడా లేకపోయారు. ప్రతి ప్రాణి కూడా లోగడ చేసిన పాపములు అన్నింటిని చిత్రగుప్తుడు రాసినప్పటికీ, కొట్టి వేయాల్సి వచ్చింది. ఈ విధంగా చిత్రగుప్తునికి జనుల పాపాలను రాయడము, కొట్టివేయడం జరిగి అతడు ఊరికే ఉండవలసి వచ్చింది. ఏ పనులు చేసిన వారైనా వారు నరకానికి పోవాల్సిన వారైనప్పటికీ వైశాక స్నాన మహిమ చేత విష్ణు లోకమునకు పోవడం చేత నరక లోకములన్నీ కూడా నరక లోకానికి వచ్చేవారు లేక ఆ లోకములన్నీ శూన్యములై ఉన్నాయి. అంతేకాదు, స్వర్గలోకమునకై యజ్ఞ యాగాదులను ఎవరు చేయక వైశాఖ మాస వ్రతాన్ని ధర్మాలను ఆచరిస్తూ ఉండడం చేత వారు కూడా విష్ణు లోకాన్ని పొందారు. స్వర్గలోకము కూడా ఈ విధంగా శూన్యమైపోయింది. యమధర్మరాజు లోకము నరకము, ఇంద్రుని లోకము స్వర్గము వచ్చేవారు ఎవరూ లేక ఈ విధంగా శూన్యములై పోయాయి.
వైశాఖ పురాణం 15వ అధ్యాయం సంపూర్ణం .
Vaisakha Puranam
#vaisakhapuranam #vaisakha #puranam