Online Puja Services

పాపములన్ని తొలగించే దివ్యఫలప్రదాయిని వైశాఖవ్రత మహిమ.

18.119.167.189

పాపములన్ని తొలగించే దివ్యఫలప్రదాయిని వైశాఖవ్రత మహిమ. 
- లక్ష్మి రమణ 

 శృతదేవ మహాముని ఈ విధంగా చెబుతూ ఉన్నారు. వైశాఖ మాసంలో ఎండకు బాధపడేటటువంటి సామాన్యులకు, మహాత్ములకు ఎండ వల్ల బాధ కలగకుండా ఉండడానికి గొడుగులని ఇచ్చిన వారి పుణ్యము అనంతము. దాన్ని వివరించే కథను నీకు చెబుతాను విను! పూర్వము కృతయుగములో జరిగిన వైశాఖమాస వ్రతాన్ని వివరించే కథ ఇది. వంగదేశాన్ని సుకేతు మహారాజు కుమారుడైన హేమకాంతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు.  మహావీరుడైన అతడు ఒకసారి వేటకు వెళ్ళాడు.  అడవిలో వరాహాలు మొదలైన జంతువులెన్నింటినో వేటాడి, అలిసిపోయి అక్కడ ఉన్న మునుల ఆశ్రమాలకు చేరుకున్నారు. 

అది శతర్చనులు అనే మునుల ఆశ్రమము.  ఆ విషయము తెలియని రాజకుమారుడు వారిని పలు విధాలుగా పలకరించారు.  వారు సమాధానము ఇవ్వకపోవడం చేత, తనని అవమానించారనే కోపంతో చంపబోయాడు.  అప్పుడా మనుల శిష్యులు అనేకమంది అక్కడికి వచ్చారు.  రాజుని వారించి “ ఓ దుర్బుద్ధి! మా గురువులు తపోదీక్షలో ఉన్నారు. వారికి బాహ్య స్మృతి లేదు. కాబట్టి, వారు నిన్ను చూడలేదు, గౌరవించలేదు.  ఇటువంటి వారిపై కోపం కూడదని పలికారు. అప్పుడు సుకేతుని కుమారుడైన హేమ కాంతుడు వారిని చూసి మీ గురువులు తపోదీక్షలో ఉన్నట్లయితే, మీరు అలసిపోయిన నాకు ఆతిథ్యము ఇవ్వవచ్చు కదా !” అని అలసటతో వచ్చినటువంటి కోపముతో వారిని అధిక్షేపించాడు. అయినప్పటికీ కూడా వారు పరమ శాంతముతో , “ఓ  రాజకుమారా! మేము భిక్షాన్ని తినేటటువంటి వారము నీకు ఆతిథ్యాన్ని ఇవ్వడానికి మా గురువుల ఆజ్ఞ లేదు.  ఇటువంటి పరిస్థితుల్లో మేము నీకు ఆతిథ్యాన్ని ఇవ్వలేము” అని చెప్పారు. 

హేమ కాంతుడు ప్రభువులమైన మేము క్రూర జంతువులు, దొంగలు మొదలైన వారి నుండి మిమ్మల్ని రక్షించేటటువంటి వాళ్ళము.  మేము ఇచ్చిన అగ్రహారాలు మొదలైన వాటిని పొంది కూడా, మీరు మా పట్ల ఈ విధంగా ఉండకూడదు.  కృతఘ్నులైన మిమ్మల్ని చంపేసిన కూడా తప్పులేదు అని పలికి వారిపై బాణాలను ప్రయోగించి, కొంతమందిని చంపి వేశాడు.  మిగిలిన శిష్యులు భయంతో పారిపోయారు. రాజసైనికులు  బట్టలు ఆశ్రమంలోని వస్తువులన్నిటిని కూడా కొల్లగొట్టారు.  ఆశ్రమాన్ని పాడు చేశారు.  ఆ తర్వాత హేమకాంతుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు.  సుకేతువు తన కుమారుడు చేసిన పనిని తెలుసుకుని అతనిపై కోపించాడు. నువ్వు రాజుగా ఉండ తగవని హేమకాంతుని దేశం నుంచి వెళ్లగొట్టాడు. 

 హేమ కాంతుడు ఆ విధంగా తండ్రిచేత పరిత్యజించబడి, దేశ బహిష్కృతుడై అడవులలో నివసిస్తూ, కిరాతుడై  జీవించసాగాడు.  ఈ విధంగా 28 సంవత్సరాలు గడిచిపోయాయి,  హేమ కాంతుడు కిరాతుడి జీవనానికి అలవాటు పడి, కిరాత ధర్మాలని ఆచరిస్తూ కిరాతుడై జీవిస్తూ ఉన్నాడు. బ్రహ్మహత్యా దోషము సంభవించడం చేత నిలకడ కూడా  కోల్పోయి అడవులను బట్టి తిరుగుతూ ఉన్నాడు.  వైశాఖ మాసంలో త్రితుడు అనే ముని అడవిలో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఎండవేడికి బాధపడి, దప్పికచేత పీడించబడుతూ ఒకచోట మూర్చపోయాడు.  దైవికంగా అడవిలోనే ఉన్న హేమ కాంతుడు అతనిని చూసి జాలిపడ్డాడు.  మోదుగ ఆకులను తెచ్చి, ఎండ పడకుండా గొడుగుగా చేసాడు.  తన వద్ద ఉన్న సొరకాయ బుర్రలో ఉన్న నీటిని అతనిపై చల్లి, అతనిని సేద తీర్చాడు.  త్రితుడనే ముని ఆయన చేసిన ఉపచారముల చేత సేదతిరి సొరకాయ బుర్రలో ఉన్న నీళ్లు తాగి, మోదుగాకుల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామమును చేరి సుఖంగా ఉన్నాడు. 

హేమకాంతుడు ఈ విధంగా వైశాఖ వ్రతాన్ని ఆచరించక పోయినా, జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇవ్వడం చేత, వానికి గల పాపాలు అన్నీ కూడా తొలగిపోయాయి. దీనికి హేమ కాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు.  కొంతకాలానికి అతడు రోగగ్రస్తుడై ఉన్నాడు.  పైకి లేచి ఉన్న జుట్టుతో, భయంకరమైన ఆకారంతో ఉన్న యమదూతలు అతని ప్రాణాలను తీసుకుపోవడానికి వచ్చారు. హేమ కాంతుడు వారిని చూసి భయపడ్డాడు. వైశాఖ మాసంలో మోదుగాకుల గొడుగును సొరకాయ బుర్రలో ఉన్న నీటిని ఇచ్చిన పుణ్య బలము వలన అతనికి శ్రీమహావిష్ణువు స్మృతికి వచ్చి, మహావిష్ణువును స్మరించాడు.  

వెంటనే దయాశాలి అయినటువంటి శ్రీమహావిష్ణువు తన మంత్రిని పిలిచి నువ్వు హేమకాంతుని భయపెడుతున్న యమదూతల్ని నివారించు. వైశాఖ మాస ధర్మాన్ని పాటించి హేమకాంతుని వైశాఖ ధర్మాన్ని ఆచరించి నాకిష్టమైన వాడయ్యాడు. పాపహీనుడయ్యాడు. ఇందులో ఎంత మాత్రమూ  కూడా సందేహం లేదు. ఇక నువ్వు సుకేతునిదగ్గరకి కూడా వెళ్లి ఆయన కుమారుడైన హేమకాంతుడు ఇంతకు పూర్వం ఎన్ని అపరాధములు చేసినప్పటికీ కూడా మీ కుమారుడు వైశాఖ  ధర్మాన్ని ఆచరించి ఒక మునిని కాపాడినవాడు.  మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినవాడు.  ఆ దాన ప్రభావముతో, అతడు శాంతుడు దాంతుడు చిరంజీవి శౌర్యాదిగుణ సంపన్నుడు.  నీకు సాటి అయినవాడు.  కాబట్టి ఇతనిని రాజుగా చేయమని’ నా మాటగా చెప్పమంటూ శ్రీమహావిష్ణువు తన దూతగా విశ్వక్సేనుని హేమకాంతుని దగ్గరకి పంపించాడు.  భగవంతుని ఆజ్ఞ ప్రకారం విశ్వక్సేనుడు హేమాంగదుని వద్దకు వెళ్లాడు.  

యమదూతలకు శ్రీహరి ఆజ్ఞని వివరించి చెప్పి పంపించాడు.  హేమాంగదని తండ్రి అయినటువంటి సుకేతువు వద్దకు తీసుకుని వెళ్లి , శ్రీమహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పారు.  అతనికి హేమాంగదున్ని అప్పగించాడు.  సుకేతువు భక్తితో చేసిన పూజలను, స్తుతులను స్వీకరించాడు. సుకేతువు కూడా సంతోషంతో తన పుత్రుడిని స్వీకరించాడు. తన పుత్రుడికి రాజ్యాన్ని ఇచ్చి విశ్వక్సేనుని అనుమతితో భార్యతో పాటు వనములకు వెళ్లి తపమాచరించసాగాడు . విశ్వక్సేనుడు సుకేతువును, హేమకాంతుని ఆశీర్వదించి విష్ణు సాన్నిద్యానికి తిరిగి వెళ్లారు.  

హేమకాంతుడు మహారాజైనప్పటికీ కూడా, ప్రతి సంవత్సరము వైశాఖమాసంలో వైశాక వ్రతాన్ని, దానికి చెందిన దానాలను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యాడు. హేమకాంతుడు బ్రహ్మజ్ఞానిగా మారి,  ధర్మమార్గాన్ని అవలంబించి, శాంతుడు, దంతుడు, జితేంద్రియుడు దయాస్వభావ్యై అన్ని యజ్ఞములను చేశాడు.  సర్వసంపదలను పొంది, పుత్ర పాత్రలతో కూడిన వాడై సర్వభోగములను అనుభవించాడు.  చిరకాలము రాజ్యాన్ని చక్కగా పరిపాలించి, విష్ణు లోకాన్ని పొందాడు. 

 ఓ శృతికీర్తి మహారాజా! వైశాఖ ధర్మములు ఈ విధముగా సాటి లేనటువంటివి. సులభ సాధ్యమైనవి. పుణ్యప్రదమైనవి. అవి పాపాన్ని దహించి వేస్తాయి. ధర్మార్థ కామ మోక్షాలను కలిగించేటటువంటివి. ఎటువంటి ధర్మాలు సాటిలేని పుణ్యఫలాన్ని ఇస్తాయని శృతి దేవుడు వివరించాడని నారదుడు అంబరీష మహామునికి వివరించారు . 

వైశాఖ పురాణం 14వ అధ్యాయం సంపూర్ణం

Vaisakha Puranam

#vaisakhapuranam #vaisakha #puranam

Quote of the day

The will is not free - it is a phenomenon bound by cause and effect - but there is something behind the will which is free.…

__________Swamy Vivekananda