Online Puja Services

అశూన్య శయనవ్రత విధానం.

18.117.8.177

ఆయురారోగ్యములతో, భోగభాగ్యాలతో, శుభ లాభాలతో దీవించే అశూన్య శయనవ్రత విధానం. 
- లక్ష్మి రమణ 

 నారద మహర్షి అంబరీష మహారాజుతో ఈ విధంగా చెబుతున్నారు.  శృత దేవుని మాటలు విని, శృతి కీర్తి మహారాజు “ఓ మునివర్యా ! 

 మన్మధుని భార్య రతిదేవి అసూన్యశయన వ్రతాన్ని చేసినట్లు చెప్పారు.  ఆమెకు ఆ వ్రత విధానాన్ని దేవతలు చెప్పినట్టుగా మీరు వివరించారు.  దయవుంచి నాకు ఆ వ్రత విధానాన్ని వివరించండి.  ఆ వ్రత విధానాన్ని, చేయవలసిన దానాన్ని, పూజని, ఫలాన్ని మొదలైన వాటిని కూడా చెప్పవలసిందిగా  కోరుతున్నాను” అని అభ్యర్థించాడు.  అప్పుడు శృతదేవుడు “ఓ మహారాజా! ఆ అశూన్యశయనము అనే వ్రతము సర్వపాపాలను పోగొడుతుంది.  ఈ వ్రతాన్ని శ్రీమన్నారాయనుడే స్వయంగా లక్ష్మీదేవికి చెప్పారు.  దీనిని ఆచరించినట్లయితే, నీల మేఘశ్యాముడైన విష్ణువు లక్ష్మీ సమేతంగా ప్రసన్నుడై, సర్వపాపాలను పోగొట్టి, సర్వసుభాలను ప్రసాదిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించే  గృహస్తులు  ధర్మానువర్తులై  సఫలమైన గృహస్థ జీవనాన్ని గడిపి, సర్వసంపదలను పొందగలరు. 

శ్రావణమాసంలో శుద్ధ విదియ రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి.  ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఆ తర్వాతి నాలుగు మాసాలలోనూ  పాయసాన్ని భుజించాల్సి ఉంటుంది.  పారణ దినము నాడు  లక్ష్మీ సమేతుడైన  శ్రీమహావిష్ణువుని అర్చించి, చతుర్విధ భక్ష్యాలను వండి నివేదన చెయ్యాలి. కుటుంబముగల సద్బ్రాహ్మణున్ని పూజించి, అతనికి చతుర్విధ భక్ష్యాలను వాయినంగా ఇవ్వాలి. బంగారము లేదా వెండి తోటి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి, పట్టు వస్త్రాలు, తులసి మాలికలు మొదలైనటువంటి సుగంధ వస్తువులతో పూజించాలి. శయ్యాదానము, వస్త్రదానము చేసి, బ్రాహ్మణునికి భోజనము పెట్టి, దంపతుల పూజ చెయ్యాలి. ఈ విధంగా శ్రావణమాసం మొదలు నాలుగు మాసాలు విష్ణువును లక్ష్మీ సమేతంగా పూజించాలి. ఆ తరువాత మార్గశిరము, పుష్యము, మాఘము,ఫాల్గుణ మాసములలో లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుని పూజించాలి. 

 ఆ తరువాత  వచ్చే  చైత్రము, వైశాకము, జేష్టము, ఆషాడము ఈ నాలుగు మాసాలలో శ్రీహరిని రుక్మిణి సమేతంగా ఎర్రని పుష్పాలతో పూజించాలి . భూదేవి సహితుడైన సనందాది ముని సంస్మృతుడు, పరిశుద్ధుడు అయినటువంటి శ్రీమహావిష్ణువుని అర్చించాలి. ఈ విధంగా చేసి ఆషాడశుద్ధ విదియ రోజు ముగించి, అష్టాక్షరి మంత్రంతో హోమాన్ని చేయాలి. మార్గశిర మాసము మొదలు నాలుగు మాసాలలోనూ  పారణ మందు విష్ణు గాయత్రీ చేత హోమాన్ని చెయ్యాలి. చైత్రాది చతుర్మాసములలో కూడా పురుష సూక్త మంత్రములతో  హోమాన్ని చేయాలి.  పంచామృతాలను, పాయసాన్ని, నేతితో వండిన బూరెలను నివేదించాలి. 

ముందే చెప్పుకున్నట్టు  శ్రావణమాసముతో మొదలయ్యే నాలుగు  మాసాలలోనూ పూజ, హోమము చేసి, భక్తితో నివేదన చేయాలి.  లక్ష్మీనారాయణ ప్రతిమని ఈ నాలుగు మాసాల వ్రతాన్ని మొదలు పెట్టినప్పుడే అంటే  శ్రావణాది మాస చతుష్య పూజకు ముందుగానే దానం ఇవ్వాలి.  శ్రీకృష్ణ ప్రతిమను మార్గశీర్ష మాస చతుష్య పూజ మధ్యములో దానం ఇవ్వాలి.  చైత్రాదిమాస చతుష్టయ పూజాంతములో వెండి వరాహమూర్తిని దానం ఇవ్వాలి. అప్పుడు కేశవాది ద్వాదశ నామాలతో 12 మంది బ్రాహ్మణులకు యధాశక్తిగా వస్త్రాలంకారాలను దక్షిణతో కూడా దానముగా ఇవ్వాలి. నేతితో వండిన బూరెలు ఒక్కొక్కరునికి 12 చొప్పున దానం ఇవ్వాలి. ఆ తరువాత మంచాన్ని పరుపును ఉంచి, దానిపై కంచు పాత్రను పెట్టి, దానిపై సర్వాలంకార భూషితమైనటువంటి లక్ష్మీనారాయణ ప్రతిమను ఉంచి, విష్ణుభక్తుడు, కుటుంబవంతుడు అయినటువంటి ఆచార్యుడైన బ్రాహ్మణునికి దానమిచ్చి, బ్రాహ్మణ సమారా ధన చేయాలి. 

లక్ష్మ్యా అశూన్య శయనం యధా తవజనార్ధన
శయ్యా మమాప్యశూన్యా  స్యాద్దావేనానేవ కేశవ 

అని దాన మంత్రాన్ని చెప్పి, దానము చేసి అందరి భోజనము అయిన తర్వాత తాను భుజించాలి. పై శ్లోక భావం ఏంటంటే ‘స్వామి, జనార్ధనా ! నీ శయ్య లక్ష్మీ సహితమై ఉన్నట్టుగా, నా శయ్య కూడా సదా అసూన్యమై - ఈ శయ్యా దానము చేత ఉండుగాక’ అని అర్థము.  ఈ వ్రతము భార్య లేని పురుషుడు, విధవ స్త్రీ, దంపతులు ఇలా ఎవరైనా చేసుకోవచ్చు.  

కాబట్టి ఓ శృతదేవ మహారాజా! నేను నీకు వ్రతాన్ని పూర్తిగా వివరించాను.  ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే, శ్రీమహావిష్ణువు ప్రసన్నుడు అవుతాడు . ఆయన అనుగ్రహాన్ని పొంది, ప్రజ లందరూ కూడా ఆయురారోగ్యములతో, భోగభాగ్యాలతో, శుభ లాభాలతో సంతుష్టులై ఉంటారు.  కాబట్టి యథా శక్తిగా భక్తిశ్రద్ధలతో నువ్వు ఈ వ్రతాన్ని ఆచరించి, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందు.  భగవంతుని  అనుగ్రహం వలన ముక్తి సులభం అవుతుంది. 

ఓ మహారాజా! నీవు అడిగిన అశూన్యశయన వ్రతాన్ని వివరించాను.  నీకు మరింకా ఏమైనా ప్రశ్నలు ఉంటే, అడగవలసింది” అని శ్రుతదేవ మహాముని శ్రుతి కీర్తి మహారాజుని ప్రశ్నించారు.  అప్పుడు శృతకీర్తి మహారాజు తిరిగి “మహామునీ ! వైశాఖమాసంలో చత్రధానము చేస్తే వచ్చే పుణ్యాన్ని వివరించండి.  శుభకరములైన వైశాఖమాస వ్రతాంగ విధానములు ఎంత విన్నా కూడా నాకు తృప్తి కలగడం లేదు. దీన్ని మరింత వివరంగా విపులంగా చెప్పవలసిందిగా కోరుతున్నానని అడిగారు. 

వైశాఖమాస పురాణం  13 వ అధ్యాయము సంపూర్ణం!!

#vaisakhapuranam

Vaisakha Puranam

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya