ఈ కథని విన్నవారు భయాలనుండి విడిపోతారు.
ఈ కథని విన్నవారు జన్మ, మృత్యువు, ముసలితనము మొదలైన భయాలనుండి విడిపోతారు.
- లక్ష్మి రమణ
రుద్రుడు ఆ వార్తను విని కాలాంతకునిలాగా భయంకరాకారుడై వేయి బాహువులు కలిగిన మహాబలసశాలి అయిన వీరభద్రుణ్ణి వెలువరించారు. అతడు కూడా పరమేశ్వరుడికి నమస్కరించి, నన్ను సృష్టించిన కారణాన్ని తెలియజేయమని చేతులు జోడించి అడిగారు. పరమేశ్వరుడు నా భార్య వినకూడని రీతిలో నన్ను నిందించి ఆమె శరీర త్యాగానికి కారణమైన దక్షుణ్ణి వెంటనే సంహరించమని ఆనతిచ్చారు. భూత సంఘాలను వీరభద్రుడి వెంట పొమ్మని పంపించారు.
ఈ విధంగా పరమేశ్వరుని ఆజ్ఞని పొందిన వీరభద్రుడు వాని వెంట వెళ్లిన పరివారము యజ్ఞశాలను చేరుకుని, అక్కడ ఉన్న దేవతలు రాక్షసులు మానవులు మొదలైన మహావీరులందరిని ఇష్టమొచ్చినట్లు కొట్టారు. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుడి దంతాలను వీరభద్రుడు రాలగొట్టారు. సతి దేవిని పరిహాసిస్తూ, ఎవరు ఏ అవయవమును సవరించుకున్నారో వారి ఆ అవయవమును వీరభద్రుడు నాశనం చేశాడు. దక్షుడి శిరస్సును ఖండించాలని వీరభద్రుడు ప్రయత్నించాడు. కానీ ముని మంత్ర రక్షితమైన అతని శిరస్సును ఖండించలేకపోయాడు, పరమేశ్వరుడు ఆ విషయాన్ని గ్రహించి, తానే స్వయంగా దక్షుడి శిరస్సును ఖండించాడు. ఈ విధంగా వీరభద్రుడు, శివుడు, అతని పరివారము యజ్ఞశాలలో వారిని భంగపరిచి తమ వారితో కలిసి కైలాసానికి తిరిగి వెళ్ళారు.
ఇక, యజ్ఞశాలలో మిగిలిన వారు బ్రహ్మ వద్దకు వెళ్లి శరణ కోరారు. బ్రహ్మ కూడా వారితో కలిసి కైలాసానికి వెళ్లారు. రుద్రుని వివిధ రీతులలో ఊరడించి స్తుతించారు. శివుని సమాధానపరిచి, ఆయనతో కలిసి యజ్ఞసాలకు వెళ్లారు. యజ్ఞశాలలో మరణించిన అందరిని శివుని ప్రార్థించి అతని చేతనే బ్రతికించేలాగా చేశారు. శివుడు దక్షుని అవినయానికి శిక్షగా, బ్రహ్మ ప్రార్ధనకు గుర్తుగా దక్షునికి మేఘ ముఖాన్ని తీసుకొచ్చి అమర్చి బ్రతికించారు. ఇక మేక గడ్డాన్ని తీసుకొచ్చి భృగు మహర్షికి అమర్చారు. సూర్యుడికి దంతాలను ఇవ్వలేదు. కానీ, అతనికి పిండిని తినేటటువంటి శక్తిని మాత్రము ప్రసాదించారు. అవయవాలను పోగొట్టుకున్న వారికి ఆ అవయవాలను తిరిగి ఇచ్చారు. అదేవిధంగా కొందరికి ఆ అవయవాలను ప్రసాదించలేదు. యజ్ఞశాలలోనివారు శివుడిని ప్రార్థించారు. యజ్ఞాన్ని తిరిగి పూర్తి చేశారు. యజ్ఞాంతంలో అందరూ కూడా తమ తమ స్థానాలకు చేరుకున్నారు.
శివుడు భార్యవియోగము చేత దుఃఖపూరితడై, గంగా తీరంలో ఉన్న పున్నాగ వృక్షము కింద తపస్సు చేసుకుంటూ ఉన్నారు. దక్షుని కుమార్తె అయిన సతీదేవి తన శరీరాన్ని విడిచిపెట్టి, మీనా హిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుతుంది.
ఈ సమయంలో తారకుడు అనే రాక్షసుడు తీవ్రతపస్సును చేసి బ్రాహ్మణ మెప్పించాడు. శివుడి పుత్రుడి వల్ల తప్ప మరెవరి వల్ల కూడా మరణం లేకుండా వరాన్ని పొందాడు. పరమేశ్వరుడికి భార్యయే లేదు! ఇక పుత్రుడే విధంగా కలుగుతాడు? కాబట్టి నేను అవధ్యుడని. నన్ను చంపే వాడెవరు లేడు. అని తారకుడు తల పోశాడు. వారు గర్వితుడై సర్వలోకాలను సర్వదేవతలను బాధించసాగాడు. దేవతలు తమ గృహాలను ఊడ్చడానికి దేవతా స్త్రీలని దాసీలుగా నియమించుకున్నాడు. దేవతలని ఎన్నో విధాలుగా బాధలు పెడుతూ ఉన్నాడు. దేవతలు అతని బాధలను భరించలేక బ్రహ్మ వద్దకు వెళ్లి, తమని రక్షించమని అనేక రకాలుగా ప్రార్థించారు. బ్రహ్మ కూడా వారి మాటలు విని ఈ విధంగా పలికాడు. “ ఓ దేవతలారా! నేను తారకునికి రుద్ర పుత్రున్ని రుద్ర పుత్రుడి చేత తప్ప మరి ఎవ్వరు కూడా నిన్ను గెలవలేరని వరమిచ్చిన మాట నిజము. రుద్రపత్ని అయిన సతీదేవి దక్షుని యజ్ఞశాలలో శరీరాన్ని విడిచింది. ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె అయిన పార్వతి అనే పేరుతో పెరుగుతోంది. రుద్రుడు కూడా హిమాలయ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి మీరు పరమేశ్వరుడు పార్వతితో కలిసేటటువంటి విధానాన్ని ఆలోచించండి” అని వారికి తగిన ఉపాయాన్ని సూచించారు. వారిని ఆ విధంగా ఊరడించి పంపారు.
దేవతలు అందరూ కూడా ఇంద్రుని ఇంటిలో సమావేశమయ్యారు. బృహస్పతితో సంప్రదించిన ఇంద్రుడు, నారదుని మన్మధుడ్ని స్మరించుకున్నారు. ఇంద్రుడు స్మరించిన వెంటనే నారదుడు, మన్మధుడు ఇంద్రుని దగ్గరకు వచ్చారు. ఇంద్రుడు నారదుడిని చూస్తూ ఓ నారద మహర్షి! నువ్వు హిమవంతుని దగ్గరకు పోయి “దక్షయజ్ఞంలో శరీర త్యాగము చేసిన సతిదేవే, నీ కుమార్తె పార్వతీగ జన్మించింది. ఆమె భర్త అయినటువంటి శివుడు ఈ హిమాలయ శృంగములోనే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. పూర్వజన్మలో పరమశివుని భార్య అయిన నీ కూతురు పార్వతిని శివుని సేవించడానికి పంపించు. ఆమె శివుడికి భార్య కాగలదు. శివుడే ఆమెకు భర్త కాగలడు. కాబట్టి నువ్వు నీ కుమార్తెను పూర్వజన్మలో భర్త అయిన శివుడికి భార్యగా చేయమని బోధించమని చెప్పి నారదుణ్ణి హిమవంతుని దగ్గరకు పంపించారు.
నారదుడు ఇంద్రుడు చెప్పిన విధంగా హిమవంతుని దగ్గరకు వెళ్లి పార్వతిని శివుని సేవకు పంపించే విధంగా, శివుడికి పార్వతినిచ్చి వివాహం చేసే విధంగా హిమవంతునికి ప్రబోధించడం, హిమవంతుడు శివుని సేవకై పార్వతి నియమించడం జరిగిపోయాయి. నారుదుని పంపేసిన తర్వాత, ఇంద్రుడు మన్మధుడిని చూసి, తారకాసుర పీడితుడైన దేవతల హితము కోసము భార్య వియుక్తుడైన శివుని హితము కోసమో నేను చెప్పేటటువంటి కార్యాన్ని నువ్వు కచ్చితంగా చేయాలి. నీ మిత్రుడైన వసంతుడితో శివుడు తపమాచరించే ప్రదేశానికి వెళ్ళు. హృదయ మనోహరమైనటువంటి వసంత ఋతు శోభలని ప్రవర్తింపజేయీ. పార్వతి శివునికి సన్నిహితురాలు అయినప్పుడు, నువ్వు మోహన బాణాలను ప్రయోగించు. శివపార్వతులకు పరస్పరమనురాగము కలిగి వాళ్ళిద్దరికీ కూడా సమాజం ఏర్పడినట్లయితే, రుద్ర పుత్రుడు జన్మించి తారకాసుర వధ జరుగుతుంది. దేవతలకు పరపీడ తొలగిపోతుంది. ఈ ప్రకారం చేయమని అతనిని పంపించాడు.
మన్మధుడు కూడా ఇంద్రుడి ఆజ్ఞను పాటించి, మిత్రుడైన వసంతుడితోనూ భార్య అయిన రతీదేవితోనూ మలయా నిలయాది పరివారము తోటి శివుడు ఉన్న తపోభూమికి వెళ్ళాడు. అకాలములో వసంత కాలము ఆ ప్రాంతంలో విజృంభించింది. ఆ ప్రాంతమంతా కూడా రకరకాలైన పుష్పాలతో సంమృతమై మలయా నిలయములతో మలయానిలములతో నిండిపోయింది. ఆ సమయంలో ఆయనకి పూజా పుష్పములు మొదలైన వాటిని సమర్పించడానికి వచ్చిన పార్వతీతో శివుడు సంభాషిస్తూ ఉన్నారు. మన్మధుడు శివపార్వతుల సమాగమనానికి ఇదే తగిన సమయం అని తలపోశారు. శివుని వెనక భాగమును శివుని వెనకనకి చెట్టు చాటున నిలబడి ఒక బాణాన్ని ప్రయోగించాడు. తిరిగి మరొక బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధమవుతున్నాడు.
శివుడు తన మనస్సు చలించడాన్ని గుర్తించాడు. కారణమేమిటి అనే విచారించారు. నిశ్చలమైన నా మనసివిధంగా చంచలమవ్వడానికి కారణమేమిటి? నాకు ఇటువంటి చాంచల్యాన్ని కలిగించిన వారు ఎవరిని విచారించి నాలుగు వైపులా తన దృష్టిని సారించారు. బాణ ప్రయోగము చేయబోతున్న మన్మధుడిని చూశారు. తన చూపును పార్వతి నుండి మరల్చారు. మన్మధుని పైన నిటలాక్షుడు తన నుదుట ఉన్న మూడవ కన్నుని తెరిచాడు. లోకభీషణమైన శివుని నేత్రాగ్ని మన్మధుడిని వాని ధనుర్బాణాలతో సహా దహించి వేసింది. తమ కార్యము ఏమవుతుందో చూద్దామని దేవతలు భయపడి, కకావికలై పారిపోయారు. వసంతుడు మన్మధుని భార్య రతి, శివుడు తనని కూడా శిక్షిస్తాడేమో ఆ శిక్ష ఏ విధంగా ఉంటుందో అని భయపడి కళ్ళు మూసుకుని దూరంగా పారిపోయారు. స్త్రీ సాన్నిద్యము యుక్తము కాదని పరమేశ్వరుడు అంతర్జానమయ్యాడు.
మన్మధుడు చేసిన పని దేవతలకు ఇష్టమే అయినప్పటికీ కూడా మన్మధుడికి మాత్రము అనర్ధాన్ని కలిగించింది. ఒకవేళ దేవతలకు ఇష్టము కాని పనిని చేసినట్లయితే ఇంకా ఎంతటి ఆపద మన్మధుడికి కలిగి ఉండేదో ఎవరు చెప్పగలరు!! కావున ఓ శృతకీర్తి మహారాజా! ఇక్ష్వాకు వంశము వాడైన హేమాంగదుడు సత్పురుషులకు ఇష్టుడే అయినప్పటికీ సజ్జనులను గౌరవించక పరమాత్మకు అహితమును, వైకల్యము గల వారిని అప్రసిద్ధులను ఆదరించి గౌరవించడం చేత, తాను చేసిన దానికి శునకాది హీన జన్మలను పొంది బాధపడ్డాడు. కాబట్టి సాధుసేవ ముఖ్య కర్తవ్యము. అనాధల పట్ల దయ, జాలి మితిమీర కూడదు. ఈ విషయాన్ని గమనించాలని శృతదేవుడు వివరించాడు.
పరమేశ్వరునికి ఇష్టం లేని పని చేయడం చేత మన్మధుడు తర్వాతి జన్మలలో అనేక బాధలు పడ్డాడు. పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రి గాని, పగలు గాని ఎవరు విన్నప్పటికీ కూడా జన్మ మృత్యువు ముసలితనము మొదలైన భయాలనుండి విడిపోతారు. అంటే వారికి జన్మదుల వలన భయం ఉండదు అని శృతదేవుడు శృతి కీర్తికి వివరించాడు.
వైశాఖ పురాణం పదవ అధ్యాయం సంపూర్ణం .
#vaisakhapuranam
Vaisakha Puranam