బల్లికి కూడా విష్ణులోకాన్ని అనుగ్రహించిన వైశాఖమాస వ్రత ప్రశస్తి.
బల్లికి కూడా విష్ణులోకాన్ని అనుగ్రహించిన వైశాఖమాస వ్రత ప్రశస్తి.
- లక్ష్మి రమణ
నారదమహర్షి అద్భుతంగా వైశాఖమాస విశిష్టతని వివరిస్తున్నారు . అంబరీష మహారాజు వింటున్నారు . ఇప్పటివరకు ఈ మాసములో ఆచరించాల్సిన ధర్మాలని గురించి వివరించిన మహర్షి, ఈ మాస ధర్మాన్ని ఆచరించిన వారి విశేషాలని వివరంగా చెప్పసాగారు . కథా రూపంగా వారు చెప్పిన వైశాఖ పురాణం ఆరవ అధ్యాయంలోని ఈ దివ్యగాథని మనమూ చెప్పుకొని తరిద్దాం .
మహారాజా! విను. మాసవ్రతములన్నిటిలో ఉత్తమమైన వైశాఖమాసములో మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటిని ఇవ్వనివారు పశు పక్ష్యాది జన్మములని పొందుతారు. ఈ విషయముకి సంబంధించిన ఒక బ్రాహ్మణుని కథ చెబుతాను. ఈ కథ వైశాఖమాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ.
పూర్వము ఇక్ష్వాకురాజ వంశములో హేమాంగుడనే రాజు ఉండేవాడు. ఆయన అనేకానేక గోదానాలని విరివిగా చేశారు. భూమిలోని రేణువులను లెక్కపెట్టడం, నీటిబొట్టులను గణించడం, ఆకాశాములోని నక్షత్రములని లెక్కపెట్టడం యెంత కష్టమో, ఆ రాజు చేసిన గోదానములను లెక్కపెట్టడం అంత కష్టము. అనేక యజ్ఞములు, గోదానము, భూదానము, తిలదానము తదితరాలన్నీ కూడా అదే సంఖ్యలో చేశాడు .
అయితే, జలము దైవదత్తమయినది. సులభముగా లభ్యం అయ్యేది. అటువంటి జలమును తానూ దానమియ్యాల్సిన అవసరం లేదని తలచిన ఆ రాజు ఆ ఒక్క దానముని తప్ప మిగిలిన దానములన్నీ చేశాడు. బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునగు గురువు పురోహితుడు. ఆయన జలదానము చేయుమని అనేకసార్లు ఆ రాజుకు చెప్పారు.కానీ రాజు గురువుమాటని పెడచెవిన పెట్టారు . అదేవిధంగా ఎవరూ గౌరవింపని వారిని ఆదరించటమే మంచిదని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించారు. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింప లేదు గౌరవింపలేదు. ఈ విధముగ అపాత్రులకు మాత్రమే దానముల నిచ్చెను.
ఈ దోషముచేత, జలదానము చేయకపోవుట వలన చాతక పక్షిగా మూడు జన్మలు పొందారు . ఆ తర్వాత ఒక జన్మలో గ్రద్దగను, కుక్కగ ఏడుసార్లు జన్మించాడు. ఆ తర్వాత మిధిలాదేశమును పాలించే శ్రుతకీర్తి మహారాజు మందిరంలో గోడపై ఉండే బల్లిగా జన్మించాడు. అక్కడ వాలే కీటకములను భక్షిస్తూ, హేమాంగద మహారాజు జీవనము గడపసాగారు. ఈ విధముగ 87 సంవత్సరముల కాలము గడిచిపోయింది .
ఇదిలా ఉండగా ఒకసారి మిధిలాదేశ రాజ గృహమునకు శ్రుతదేవమహాముని ప్రయాణముచేసి అలసి మధ్యాహ్న కాలములో విచ్చేశారు . అప్పుడు శ్రుతకీర్తి మహారాజు ఆయనని సాదరంగా ఆహ్వానించి, ఆయన కాళ్ళు కడిగి ఆ జలాన్ని తన తలపై జల్లుకున్నారు . అలా జల్లుకోవడంతో గోడమీద బల్లిగా ఉన్న హేమాంగదుని మీద కూడా కొన్ని నీటి తుంపరలు పడ్డాయి . ఆ పవిత్ర జలస్పర్శ కలుగగనే ఆ బల్లికి పూర్వజన్మస్మృతి కలిగి, తన దోషమును తెలిసికొని పశ్చాత్తాపము కలిగింది .
వెంటనే , “నన్ను రక్షించండి, నన్ను రక్షించండి” అని మానవ స్వరంతో ఆ మునిని ప్రార్ధించాడు . అప్పుడా ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లీ! నీవెందుకు ఈ విధంగా దుఃఖిస్తున్నావు? నువ్వు ఏ పనిచేసి ఈ విధమైన దశను పొందావు? ఈ విధంగా ఎందుకు అరుస్తున్నావు? నువ్వు దేవజాతీయుడివా, రాజువా, బ్రాహ్మణుడివా? ఎవరు నువ్వు? ఈ దశ నీకు ఎందుకు ప్రాప్తించిందో చెప్పు. నేను నీకు సహాయపడతానని” మాట ఇచ్చారు.
బల్లి రూపంలో ఉన్న హేమాంగద మహారాజు తిరిగి తన కథనంతా ఆ మహర్షితో చెప్పుకున్నారు . ఆ తర్వాత ఇంకా ఇలా చెబుతున్నారు. “ ఓ మహాత్మా! ఈ మహారాజు నీ పాదములు కడిగిన పవిత్ర జలాన్ని తనపై జల్లుకుంటూ ఉండగా కేవలం కొన్ని నీటి తుంపర్లు నామీద పడినంత మాత్రాన నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది. నా పాప భారము తగ్గినట్టు అనిపిస్తోంది. కానీ నేనింకా కూడా 27 మార్లు ఈ విధంగా బల్లిగా జన్మని ఎత్తవలసి ఉన్నట్టుగా నా కనిపిస్తోంది. ఈ విధమైన బల్లి జన్మల పరంపర నాకు ఏ విధంగా తొలగుతుందో దయచేసి తెలియజేయండి. అలాగే నేను చేసిన పాపమేంటి? ఎన్నో దానాలు చేసినా నాకెందుకు ఈ జన్మలు కలుగుతున్నాయో కూడా దయతో తెలియజేయండి.” అని ప్రార్థించాడు .
అప్పుడు శృతదేవ మహాముని హేమాంగదని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఈ విధంగా చెప్పసాగారు. “రాజా నువ్వు శ్రీమహావిష్ణువుకు ప్రియమైన వైశాఖమాసంలో జలదానాన్ని ఎవరికీ ఇవ్వలేదు. జలము సర్వజన సులభము. దానిని దానిని ఇవ్వడమేంటని తలచావు. ప్రయాణంలో అలసి వచ్చిన వారికి కూడా కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. వైశాఖమాస వ్రతాన్ని పాటించలేదు. హోమము చేయదలచిన వారు మంత్ర పూరితమైన అగ్నిలోనే హోమాన్ని చేయాలి. ఆ విధంగా కాక బూడిద మొదలైన వాటిలో హోమం చేస్తే, ఆ హోమం చేసినటువంటి ఫలము ఏ విధంగా కలుగుతుంది? నువ్వు ఎన్నో దానాలు చేసిన మాట వాస్తవమే. కానీ యోగ్యులైన వారికి దానం ఇవ్వకుండా, అయోగ్యులైన వారికి దానాలు చేశావు. అపాత్రులకు ఎన్ని దానాలు ఇచ్చినా కూడా ప్రయోజనం లేదు కదా!
అలాగే వైశాఖమాస వ్రతాన్ని చేయలేదు. జలదానము కూడా చేయలేదు. ఎంత వేపుగా పెరిగినా సుగంధాది గుణములు ఉన్నప్పటికీ కూడా, ముళ్ళు కల వృక్షాన్ని ఎవరు ఆదరిస్తారు? అటువంటి వృక్షము వల్ల ప్రయోజనం ఏముంటుంది? వృక్షములలో రావి చెట్టు ప్రశస్తమైంది. అందువల్ల అది పూజార్హమైంది. మొక్కలలో తులసి మొక్క చాలా పవిత్రమైనది. అటువంటి రావి చెట్టును తులసిని వదిలి వాకుడు చెట్టును ఎవరైనా పూజిస్తారా ? అటువంటి పూజల వలన ఫలితం ఉంటుందా?
వేద శాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలిగిన వారు శ్రీమహా విష్ణు స్వరూపులు. అటువంటి వారినే పూజించాలి. వారిలో జ్ఞానవంతులు శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనవారు. అటువంటి వారిని పూజించినట్లయితే తననే స్వయంగా పూజించినట్టుగా భావించి శ్రీహరి వరాలను అనుగ్రహిస్తారు. కాబట్టి జ్ఞానులైన వారు సర్వాధికులు సర్వోన్నతులు. అటువంటి వారిని గౌరవించకపోవడం అంటే వారిని, శ్రీమహావిష్ణువును అవమానించడమే అవుతుంది. ఈ విధంగా చేయడము ఇహలోకములో పరలోకములో దుఃఖాన్ని కలిగిస్తుంది.
మానవుడు పురుషర్దాలను సాధించాలి అనుకుంటే జ్ఞానుల సేవ, వారిని గౌరవించడం కచ్చితంగా పాటించాలి. తీర్థములు కేవలము జలములు కావు, దేవతలు శిలా రూపులు కారు. చిరకాలము దీర్ఘ స్నాన సేవ చేసినట్లయితే ,శిలా రూపంలో ఉన్న దైవమును చిరకాలము పూజించినట్లయితే కచ్చితంగా అటువంటి వారికి వారి అనుగ్రహం కలుగుతుంది. కానీ జ్ఞానులు సజ్జనులైన వారిని కేవలం దర్శించినంత మాత్రాం చేత వాళ్ళు ప్రసన్నులవుతారు. ఇష్టపల ప్రాప్తిని కలిగిస్తారు. కాబట్టి జ్ఞానులైన వారిని సేవించి వారి ఉపదేశములను పాటించినట్లయితే విషాదం అనేదే ఉండదు. ఇష్ట ప్రాప్తి సంతోషము కలుగుతాయి. అమృతత్వ సిద్ధి కలుగుతుంది.
మహారాజా నువ్వు వైశాఖమాస వ్రతాన్ని ఆచరించలేదు. జలదానములు చేయలేదు. జ్ఞానులైన వారిని సేవించలేదు. కాబట్టి నీకిటువంటి దుర్గతి కలిగింది. ఈ వైశాఖమాస వ్రతాన్ని ఆచరించి నేను సంపాదించినటువంటి పుణ్యాన్ని కొంత నీకు ధారపోస్తాను. దానివలన ఈ దుర్దశ శాంతించి, భవిష్యత్తు, వర్తమాన కాలాలలో మీ పాపములు వాటి ఫలాలను పోగొట్టుకుని విజయములను పొందగలవు.” అని పలికి శృతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపంలో ఉన్న హేమాంగద మహారాజుకు తాను చేసిన వైశాఖమాస వ్రతములోని కొన్ని రోజుల పుణ్యాన్ని ధారపోశారు.
ఆ పుణ్యఫలాన్ని పొందిన వెంటనే హేమాంగద మహారాజు బల్లి రూపం విడిచి దివ్య రూపాన్ని పొందారు. శృత కీర్తి మహారాజుకు, శృతదేవ మహర్షికి నమస్కరించారు. వారి అనుజ్ఞతో శ్రీహరి పంపించినటువంటి దివ్య విమానాన్నీ అధిరోహించి పుణ్యలోకాలకు చేరుకున్నారు. ఆ విధంగా హేమాంగదుడు పుణ్యలోకాలలో పదివేల సంవత్సరాలున్నారు. దివ్యలోక భోగాలను అనుభవించారు. ఆ తర్వాత ఇక్ష్వాకు కులములో కాకుస్త్వ మహారాజుగా జన్మించారు. ఏడు ద్వీపాలలో భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించారు. శ్రీమహావిష్ణువు అంశము పొంది ఇంద్రునికి స్నేహితుడై మెలిగారు. కుల గురువైన వశిష్ట మహాముని ఉపదేశాన్ని పాటించారు . వైశాఖమాస వ్రతాన్ని సంపూర్ణంగా ఆచరించారు. అందులో చేయవలసినటువంటి దానధర్మములన్నింటినీ కూడా శ్రద్ధాసక్తులతో భక్తి పూర్వకంగా చేశారు. సర్వపాపాలను పోగొట్టుకున్నారు. దివ్యజ్ఞానాన్ని పొందారు. శ్రీమహావిష్ణువు సాయిధ్యాన్ని పొందారు.
కాబట్టి వైశాఖ మాస వ్రతము సర్వపాపహరము. అనంతపుణ్యప్రదం. కనుక ప్రతి మానవుడు కూడా వైశాఖమాస వ్రతాన్ని ప్రతాంగములను దానధర్మాలను పాటించి, శ్రీహరి అనుగ్రహాన్ని పొందాలి” అని నారదుడు అంబరీషునికి వైశాఖమాస వ్రత విశిష్టతను వివరించారు .
వైశాఖ పురాణం ఆరవ అధ్యాయం సంపూర్ణం .
Tags: Vaisakha, puranam
#vaisakhapuranam
Vaisakha Puranam