Online Puja Services

వైశాఖమాసంలో చేసే స్నానం

3.17.74.181

ఎన్ని పూజలు చేసినా పొందలేని ఫలం వైశాఖమాసంలో చేసే స్నానం అనుగ్రహిస్తుంది . 
- లక్ష్మి రమణ 

 మాసాలన్నీ పుణ్యప్రదమైనవే ! ఆయా మాసాల్లో కార్తీకం, మాఘం, వైశాఖం మరింత పుణ్యప్రదమైనవని పురాణాలు చెబుతున్నాయి . కార్తీకమాసంలో ఎలాగైతే మనం శివారాధనలు చేసి, కార్తీక పురాణాన్ని పారాయణం చేస్తామో అదే విధంగా వైశాఖమాసంలో విష్ణు ప్రధానమైన ఆరాధనలో, వైశాఖ పురాణాన్ని పారాయణ చేయడం చేస్తే, వారికి తీరని కామ్యములు ఉండవని, అంత్యమున మోక్షాన్ని పొందగలరని ఋషివాక్యం. అందులోని మొదటి అధ్యాయాన్ని ఇక్కడ మీకోసం సరళమైన భాషలో అందిస్తున్నాం . 

 నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

సుత మహర్షి సనకాది మహర్షులను ఉద్దేశించి చెప్పినట్టుగానే ఈ వైశాఖ పురాణం కూడా మొదలవుతుంది . రాజర్షి అయిన అంబరీషునికి బ్రహ్మ మానస పుత్రుడైన నారద మహర్షి ఒకానొకప్పుడు శ్రీమహావిష్ణువే లక్ష్మీమాతకి వివరించిన వైశాఖ పురాణాన్ని బోధించారని చెబుతూ సూతమహర్షి ఇలా చెప్పసాగారు .  

“ఓ మునులారా వినండి !  శ్రీమహావిష్ణువుకు మాసములన్నింటిలోనూ  వైశాఖమాసము చాలా ప్రియమైనది . ఈ మాసము ఆ స్వామికి  అంత ఇష్టంగా మారడానికి కారణం వివరిస్తాను శ్రద్ధగా ఆలకించండి . అంతే కాకుండా నారదమహర్షి ఈ మాసంలో విష్ణువుని పూజించాల్సిన విధానాన్ని, ఆచరించాల్సిన ధర్మాలనూ కూడా తెలియజేశారు .  వాటిని కూడా మీకిప్పుడు వివరించబోతున్నాను.”  అంటూ ఇలా చెప్పసాగారు . 

 పూర్వము నారద మహర్షి బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మాలను వివరించమని కోరారు. అప్పుడు బ్రహ్మ దేవుడు మహావిష్ణువు లక్ష్మీదేవికి వివరించినటువంటి మాస ధర్మాలను నారదమహర్షికి వివరించారు .  ఈ పరంపరంతా కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి . ఎందుకంటె, విష్ణుమూర్తి నుండీ లక్ష్మీమాత - వారి నుండీ బ్రహ్మదేవుడు - ఆయన నుండీ నారదమహర్షి - ఆయన అంబరీషునికి చెప్పిన ఆ వృత్తాంతమే ఇప్పుడు సూతుడు ఇతర మహర్షులకి వివరిస్తున్నారు . అందుకే మన పురాణాలకి శ్రుతులు అని పేరొచ్చింది . 

మాసములన్నింటిలోనూ కార్తీకమాసము, మాఘమాసము, వైశాఖ మాసము ఈ మూడు మాసములు కూడా ఉత్తమమైనవి.  ఈ మూడు మాసాలలో వైశాఖ మాసము మరింత శ్రేష్ఠమైనది. ప్రాణులకు తల్లిలాగా సదా సర్వ అభీష్టాలను సిద్ధింప చేస్తూ ఉంటుంది.  ఈ మాసములో ఆచరించినటువంటి స్నానము, పూజ, దానము ఇటువంటి కార్యక్రమములన్నీ కూడా పాపములను నశింపజేస్తాయి.  ఆవిధంగా ఆచరించిన వారిని చూసి  దేవతలు సైతము తలవంచి గౌరవిస్తారు.  

విద్యలలో -వేద విద్య లాగా, మంత్రములన్నింటిలో- ఓంకారము లాగా, వృక్షములన్నింటిలో - దివ్య వృక్షమైన కల్పవృక్షము లాగా, ధేనువులలో - కామధేనువు లాగా, సర్వ సర్పములలో- శేషుని లాగా పక్షులలో -  గరుత్మంతుని లాగా దేవతలందరిలో - మహావిష్ణువు లాగా, చతుర్వర్ణములలో- బ్రాహ్మణుని లాగా , ఇష్టమైన వానిలో - ప్రాణములాగా, సౌహార్ధము కలవారిలో - భార్య లాగా,  నదులలో - గంగానది లాగా,  కాంతి కలవారిలో - సూర్యుని లాగా, ఆయుధములలో - చక్రములాగా,  ధాతువులలో - సువర్ణము లాగా, విష్ణు భక్తులలో - రుద్రుని లాగా, రత్నములలో - కౌస్తుభములాగా,  ధర్మ హేతువయిన మాసములలో వైశాఖమాసము ఉత్తమమైనది.  విష్ణు ప్రియమైనది.  అందుకనే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తారు.  విష్ణుప్రీతిని  కలిగించే మాసాలలో వైశాఖ మాసానికి సాటి అయినది లేనేలేదు. 

సూర్యుడు మేషరాశిలో ఉండగా, వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందుగా నదీ, తటాకాదులలో స్నానాన్ని చేసినటువంటి వారిని  శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వానిని ఉద్ధరిస్తాడు.  ప్రాణులు అన్నము తిని సంతోషించినట్లు, మహావిష్ణువు వైశాక స్నానము ఆచరించిన వారిని అనుగ్రహించి సంప్రీతుడౌతాడు.  ఆ విధంగా వైశాఖ  స్నానము చేసినవారికి అన్ని వరములు ఈయడానికి సిద్ధమై ఉంటాడు.  

హీనపక్షం వైశాఖ మాసంలో ఒక్కసారి మాత్రం స్నానమును, పూజని చేసినప్పటికీ కూడా వారిని పాప విముక్తులుగా అనుగ్రహించి  విష్ణు లోకాన్ని ప్రసాదిస్తారు స్వామి.

వైశాఖ మాసంలో వారం రోజులు స్నానాధికాలు చేసి శ్రీహరి నీ ప్రార్ధించినట్లయితే చాలు.  ఆమాత్రానికే శ్రీహరి సంతుష్టిని పొంది,  అనంతమైన అనుగ్రహాన్ని ఇస్తారు.  కొన్ని వేల అశ్వమేధ యాగములు చేస్తే వచ్చే పుణ్యము ఈ స్నానము చేసినందు వల్ల కలుగుతుంది. 

ఒకవారము, లేదా ఒక్క రోజు కూడా అలా  స్నానం చేసి, పూజ చేయలేని (అటువంటి శక్తి లేనివారు /ఆరోగ్యము సహకరించనివారు)  వారి గురించి కూడా చెబుతున్నారు . అటువంటివారు , కేవలం స్నాన సంకల్పాన్ని గట్టిగా చేసుకున్నప్పటికీ కూడా అతడు నూరు అశ్వమేధ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ స్నానమును  నది, ఏరులో చేయాలని సంకల్పించిన వాడై అసక్తుడై ఉన్నప్పటికీ కొంత దూరమైనా ఇంటినుండి బయలుదేరి వెళ్ళినాసరే ,  నది స్నాన సంకల్పము దృఢముగా ఉన్నాసరే, వారు విష్ణుసాయిద్యాన్ని పొందుతారు. 

 ఓ మునులారా! సర్వలోకములో ఉన్న తీర్థములలోని దేవతలు బాహ్య ప్రదేశాలలో ఉన్న జలము, అంటే నది, తటాకము,సెలయేరు తదితరాల్లో ఈ పుణ్యప్రదమైన వైశాఖ మాసములో కొలువై ఉంటారు.  అటువంటి పవిత్ర జలములో స్నానం ఆచరించే వరకు కూడా జీవిని అంటిపెట్టుకొని ఉన్న సర్వ పాపాలు తొలగిపోతాయి. ఈ తీర్థ దేవతలు సూర్యోదయం మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశంలో ఉన్న ఆ నదీ జలమును ఆశ్రయించి ఉంటారు.  ఆ జలములో తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితాన్ని కలగజేస్తారు.  ఆ విధంగా చేయని వారిని శాపాదుల చేత నశింపజేస్తారు. 

ఈ విధంగా వారు శ్రీమహావిష్ణువు ఆజ్ఞను అనుసరించి చేస్తూ ఉంటారు.  సూర్యోదయమైన ఆరు ఘడియల తరువాత తీర్థదేవతలు తమ తమ స్థానాలకు చేరుకుంటారు.  కనుక ఆ సమయానికి పూర్వమే లేచి స్నాన సంకల్పాన్ని చెప్పుకొని వైశాఖ మాస పర్యంతమూ కూడా స్నానాదికాలని ఆచరించాల్సింది. అని నారదుడు అంరీశునికి వివరించినట్టు సూతమహర్షి సౌనకాది మునులకీ వివరించారు . 

వైశాఖ  పురాణం ఒకటవ అధ్యాయం సంపూర్ణం. 

శ్రీ విష్ణు చరణారవిందార్పితమస్తు !! 

శుభం . 

 

#vaisakhapuranam

Vaisakha Puranam

Quote of the day

Beauty is truth's smile when she beholds her own face in a perfect mirror.…

__________Rabindranath Tagore