Online Puja Services

కార్తీక పురాణం - ఇరవైఎనిమిదవ అధ్యాయము

18.188.96.17

ఓం నమః శ్శివాయ 

కార్తీక పురాణం - ఇరవైఎనిమిదవ అధ్యాయము, ఇరవైఎనిమిదవ రోజు పారాయణము

సేకరణ: లక్ష్మి రమణ 

వశిష్టుల వారు జనక మహారాజుతో తిరిగి ఇలా అంటున్నారు… ”ఓ జనక మహారాజా! విన్నావా? దుర్వాసుడి అవస్థలు! తాను ఎంతటి కోపవంతుడైనా… వెనకా ముందు ఆలోచించకుండా మహాభక్తుని చిత్త శుద్ధిని శంకించాడు. కాబట్టి ప్రయాసల పాలయ్యాడు. ఎంత గొప్పవారైనా… ఆచరించు కార్యక్రమాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి” అని చెబుతూ… అత్రి మహర్షి అగస్త్యునికి చెప్పిన వృత్తాంతాన్ని తిరిగి ఈ విధంగా వివరిస్తున్నాడు. 

అలా దుర్వాసుడు శ్రీమన్నారాయణుడి వద్ద సెలవు తీసుకుని, తనను వెన్నంటి తరుముతున్న సుదర్శన చక్రాన్ని చూసి, భయపడుతూ తిరిగి భూలోకానికి చేరుకుని, అంబరీషుడి వద్దకు పోయి… ”ఓ అంబరీషా! ధర్మపాలకా! నా తప్పును క్షమించి, నన్ను రక్షించు . నీకు నాపై ఉన్న అనురాగంతో ద్వాదశిపారాయణానికి నన్ను ఆహ్వానించావు. అయితే నేను నిన్ను కష్టాలపాలు చేశాను. వ్రతభంగం చేయించి, నీ పుణ్యఫలాన్ని నాశనం చేయాలనుకున్నాను . కానీ, నా దుర్భుద్ధి నన్నే వెంటాడి, నా ప్రాణాలను తీయడానికి సిద్ధపడింది. నేను విష్ణువు వద్దకు వెళ్లి సుదర్శనం నుంచి కాపాడ మని ప్రార్థించాను. ఆ పురాణపురుషుడు నాకు జ్ఞానోదయం చేసి, నీ వద్దకు వెళ్లమని చెప్పాడు. కాబట్టి నీవే నాకు శరణ్యం. నేను ఎంతటి తపశ్శాలినైనా… ఎంతటి నిష్టావంతుడనైనా… నీ నిష్కళంక భక్తి ముందు సరిపోలను. నన్ను ఈ విపత్తు నుంచి కాపాడు” అని అనేక విధాలుగా ప్రార్థించాడు. 

అంబరీషుడు శ్రీమన్నారాయణుడిని ధ్యానించి… ”ఓ సుదర్శన చక్రమా! నీకివే నా నమస్కారాలు. ఈ దుర్వాస మహాముని తెలిసో, తెలియకో తొందరపాటుగా ఈ కష్టాలను కొని తెచ్చుకున్నాడు. అయినా ఇతడు బ్రాహ్మణుడు. కాబట్టి, ఇతన్ని చంపకు. ఒకవేళ నీ కర్తవ్యాన్ని నిర్వహించక తప్పదనుకుంటే… ముందు నన్ను చంపి ఆ తర్వాత ఈ దుర్వాసుడిని చంపు. శ్రీమన్నారాయణుడి ఆయుధానివి నీవు. నేను ఆ శ్రీహరి భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడే  ఇలవేల్పు, దైవం. నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధాల్లో అనేక మంది లోక కంటకులను చంపావు. కానీ, శరణు కోరేవారిని ఇంతవరకు చంపలేదు. అందుకే… దుర్వాసుడు ముల్లోకాలు తిరిగినా… ఇతన్ని వెంటాడుతూనే ఉన్నావు. కానీ, చంపలేదు. 

ఓ దేవా! సుదర్శనచక్రమా !సురాసురాది భూతకోటి ఒక్కటిగా ఏకమైనా… నిన్నేమీ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైనా అడ్డు లేదు. ఈ విషయం లోకమంతటికీ తెలుసు. అయినా… మునిపుంగవుడికి ఏ అపాయం కలుగకుండా రక్షింపుము. నీయందు ఆ శ్రీమన్నారాయణుడి శక్తి  ఇమిడి ఉంది. శరణు వేడిన ఈ దుర్వాసుడిని రక్షింపుమని నిన్ను వేడుతున్నాను” అని అనేక విధాలుగా స్తుతించాడు.

 అప్పటి వరకు అతి రౌద్రంతో నిప్పులు కక్కుతున్న విష్ణుచక్రం అంబరీషుడి ప్రార్థనకు శాంతించింది. ”ఓ భక్తాగ్రేసరా… అంబరీషా! నీ భక్తిని పరీక్షించడానికి ఇలా చేశానేతప్ప మరొకందుకు కాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటభులను, దేవతలంతా ఏకమైనా చంపలేని మూర్ఖులను నేను దునిమాడటం నీకు తెలుసుకదా? ఈ లోకంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు శ్రీహరి నన్ను వినియోగించి, ముల్లోకాల్లో ధర్మాన్ని స్థాపిస్తున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే… ముక్కోపి అయిన దుర్వాసుడు నీపై పగపట్టి, నీ వ్రతాన్ని భంగపరిచి, నశింపజేసి, నానా ఇక్కట్లు పెట్టడం, కన్నులెర్రచేసి నీ మీద చూపిన రౌద్రాన్ని నేను గమనించాను. నిరపరాధివైన నిన్ను రక్షించి, ఈ ముని గర్వం అణచాలని తరుముతున్నాను. ఇతనూ సామాన్యుడు కాదు. రుద్రాంశం సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహా తపశ్శాలి. రుద్రతేజంతో భూలోకవాసులను చంపగల శక్తి ఆయనకుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తేజస్సు కలవాడు. వారుగానీ, నేనుగానీ, క్షత్రియ తేజస్సున్న నీవుగానీ, ఆయన ముందు సరితూగలేం. అయితే… తనకన్నా ఎక్కువ శక్తివంతులతో సంధిచేసుకోవడం ఉత్తమం. ఈ నీతిని ఆచరించు వారు ఎలాంటి విపత్తుల నుంచి అయినా తప్పించుకోగలరు. ఇంతవరకు జరిగినదంతా విస్మరించి, శరణార్థిగా వచ్చిన ఆ దుర్వాసుడిని గౌరవించి, నీ ధర్మం నీవు నిర్వర్తించు” అని సుదర్శనుడు పలికాడు.

ఆ మాటలకు అంబరీషుడు… ”నేను దేవ, గో, బ్రాహ్మణాదుల పట్ల, స్త్రీలపట్ల గౌరవభావంతో మెసలుకుంటాను. నా రాజ్యంలో సర్వజనులూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటాను. కాబట్టి శరణు కోరిన ఈ దుర్వాసుడిని, నన్ను రక్షించు. వేల అగ్నిదేవతలు, కోట్ల సూర్యమండలాలు ఏకమైనా… నీ శక్తికి, తేజస్సుకు సాటిరావు. నీవు అసమాన్య తేజోరాశివి. మహావిష్ణువు నీన్ను విశేష కార్యాలకు వినియోగిస్తాడు. లోక కంఠకులు, గోవధ చేసేవారు. బ్రహ్మ హత్యాపాతకులు, బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడు” అని ప్రార్థిస్తూ అంబరీషుడు చక్రాయుధానికి ప్రణమిల్లాడు.

అంతట సుదర్శనుడు అంబరీషుడిని లేపి, ఆలింగనం చేసుకుని… ”అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చాను. విష్ణు స్తోత్రం త్రికాలాల్లో ఎవరైతే చేస్తారో.. ఎవరు దాన ధర్మాలతో పుణ్యఫలాన్ని వృద్ధి చేసుకుంటారో… ఎవరు పరులను హింసించకుండా, పరధనంపై ఆశపడకుండా, పరస్త్రీని చెరపట్టకుండా, గోవధ, బ్రాహ్మణ హత్య, శిశు హత్యాది మహాపాకాలను చేయకుండా ఉంటారో… వారి కష్టాలు తొలగిపోయి… ఈ లోకంలో, పరలోకంలో సుఖశాంతులతో తలతూగుతారు. కాబట్టి, నిన్నూ, దుర్వాసుడిని రక్షిస్తున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్య ఫలం ముందు ఈ మునిపుంగవుడి తపశ్శక్తి సాటిరాదు” అని చెప్పి అదృశ్యుడయ్యాడు. 

శ్రీ స్కాంద పురాణాంతర్గత, వశిష్ట ప్రోక్త, కార్తీక మహత్యంలోని ఇరవైఎనిమిదవ అధ్యయము , ఇరవైఎనిమిదవ పారాయణము సమాప్తం . 

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !!

స్వస్తి !

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore