Online Puja Services

కార్తీక పురాణం - ఇరవైఏడవ అధ్యాయము

18.222.170.43

ఓం నమః శ్శివాయ 

కార్తీక పురాణం - ఇరవైఏడవ అధ్యాయము, ఇరవైఏడవ రోజు పారాయణము

సేకరణ: లక్ష్మి రమణ 

అత్రిమహాముని తిరిగి అగస్త్యునితో ఇలా చెబుతున్నాడు… ”ఓ కుంభసంభవా! ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇలా చెబుతున్నాడు…” అని ఆ వృత్తాంతాన్ని వివరించసాగారు .

శ్రీమహావిష్ణువు దుర్వాసునితో ఇలా చెబుతున్నాడు… ”ఓ దుర్వాస మహాముని! నీవు అంబరీషుడిని శపించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారమెత్తడం  కష్టం కాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వక తప్పదు. అందుకు నేను అంగీకరించాను. బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండేలా చేయడమే నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట్లో భుజించకుండా వచ్చినందుకు అతను చింతతో ఉన్నాడు. బ్రాహ్మణ పరివృత్తుడైనందుకు ప్రాయోపవేశం చేసి అగ్నిలో దూకి ఆత్మహత్య  చేసుకోవాలని నిర్ణయించాడు. ఆ కారణం వల్ల విష్ణు చక్రం నిన్ను బాధించేందుకు పూనుకుంది. 

ప్రజారక్షణే రాజధర్మం. ప్రజాపీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనట్లయితే… అతనిని  జ్ఞానులైన బ్రాహ్మణులు శిక్షించాలి. ఒక విప్రుడు పాపి అయితే.. మరో విప్రుడు దండించాలి. ధనుర్బాణాలు ధరించి ముష్కరుడై యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుడిని తప్ప, మరెవ్వరూ బ్రాహ్మణుడిని దండించకూడదు. బ్రాహ్మణ యువకుడిని దండించడం కంటే మరో పాపం లేదని న్యాయశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. బ్రాహ్మణుడి సిగబట్టి లాగినవాడు, కాలితో తన్నినవాడు, విప్రుని ద్రవ్యం అపహరించేవాడు, బ్రాహ్మణుడిని గ్రామం నుంచి తరిమినవాడు, విప్ర పరిత్యాగమొనర్చినవాడు బ్రహ్మ హంతకులే అవుతారు. కాబట్టి ఓ దుర్వాస మహర్షి! ధర్మానువర్తనుడు,  తప:శ్శాలి అయిన అంబరీషుడు నీ మూలంగా ప్రాణ సంకటం పొందుతున్నాడు. నేను బ్రహ్మ హత్యచేశానే అని చింతిస్తూ పరితాపం పొందుతున్నాడు. కాబట్టి, నీవు వేగమే అంబరీషుడి వద్దకు వెళ్లు. అందువల్ల మీ ఇద్దరికీ శాంతి లభిస్తుంది” అని విష్ణుదేవుడు దుర్వాసునికి నచ్చజెప్పి అంబరీషుడి వద్దకు పంపాడు.

శ్రీ స్కాంద పురాణాంతర్గత, వశిష్ట ప్రోక్త, కార్తీక మహత్యంలోని ఇరవైఏడవ అధ్యయము , ఇరవైఏడవరోజు పారాయణము సమాప్తం . 

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !!

స్వస్తి !

Quote of the day

There are only two mistakes one can make along the road to truth; not going all the way, and not starting.…

__________Gautam Buddha