Online Puja Services

కార్తీక పురాణం - ఇరవైఆరవ అధ్యాయము

18.223.213.76

ఓం నమః శ్శివాయ 

కార్తీక పురాణం , ఇరవైఆరవ అధ్యయము , ఇరవైఆరవరోజు పారాయణము

సేకరణ: లక్ష్మి రమణ 

ఈ విధంగా అత్రిమహముని అగస్త్యునితో – దుర్వాసుడి కోపం వల్ల కలిగిన ప్రమాదాన్ని తెలిపి… మిగిలిన వృత్తాంతాన్ని ఇలా వివరించసాగారు .

సుదర్శనం తరుముతుండగా… ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకం, భువర్లోకం… పాతాళం, సత్యలోకం… ఇలా అన్ని లోకాలు తిరుగుతూ… తనను రక్షించేవారెవరూ లేకపోవడంతో… వైకుంఠానికి వెళ్లాడు. అక్కడ శ్రీహరిని ధ్యానిస్తూ… “ఓ వాసుదేవా! పరంధామా! జగన్నాథా! శరణాగతి రక్షకా! నన్ను రక్షించు. నీ భక్తుడైన అంబరీషుడికి కీడు చేయదలిచాను. నేను బ్రాహ్మణుడనై ఉండీ ముక్కోపినై మహా అపరాధం చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడగు భృగు మహర్షి నీ హృదయంపైన తన్నినా సహించావు. ఆ కాలి గురుతు నేటికీ నీ వక్షస్థలంపై కనిపిస్తుంది. ప్రశాంత మనస్కుడవై అతన్ని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపాన్నిచ్చిన , నన్నుకూడా రక్షించు . నీ చక్రాయుధం నన్ను చంపడానికి తరుముకొని వస్తోంది. దాని బారి నుంచి నన్ను కాపాడు” అని దుర్వాసుడు శ్రీమన్నారాయణుడిని అనేకరకాలుగా వేడుకొన్నాడు. 

దుర్వాసుడు అహంకారాన్ని వదిలి ప్రార్థించడంతో… శ్రీహరి చిరునవ్వుతో… ”దుర్వాసా! నీ మాటలు యథార్థాలు. నీవంటి తపోధనులు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. నీవు బ్రాహ్మణ రూపాన పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసి, భయపడకుండా ఉండేవారు  ములోకాల్లోనూ  లేరు. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రం ఎలాంటి హింసా కలిగించను. ప్రతి యుగంలో గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనులకు సంభవించే ఆపదలను పోగొట్టడానికి ఆయా పరిస్థితులకు తగిన రూపం ధరించి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావిస్తాను. నీవు అకారణంగా అంబరీషుడిని శపించావు. కానీ నేను శత్రువుకైనా, మనోవాక్కాయాలలో సైతం కీడు తలపెట్టను. ఈ ప్రపంచంలోని ప్రాణి సమూహం మొత్తం నా రూపంగానే చూస్తాను. 

అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తున్నాడు. అలాంటి నా భక్తుడిని నీవు అనేక విధాలుగా ధూషించావు. నీ ఎడమపాదంతో తన్నావు. అతని ఇంటికి అతిథివై వచ్చికూడా… నేను వేళకు రానట్లయితే… ద్వాదశి ఘడియలు దాటకుండా నువ్వు భోజనం చేయమని చెప్పలేదు. అతడు వ్రతభంగానికి భయపడి, నీ రాకకోసం ఎదురుచూసి, జలపానం మాత్రం చేశాడు. అంతకంటే అతడు అపరాధమేమిచేశాడు? చాతుర్వర్ణాల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానం దాహశాంతిని, పవిత్రతను చేకూరుస్తుంది కదా? జలపానం చేసినంత మాత్రాన నా భక్తుడిని దూషించావు కదా? అతను వ్రత భంగం కాకూడదనే జలపానం చేశాడే తప్ప, నిన్ను అవమానించాలనే ఉద్దేశంతో కాదు కదా? నీవు మండిపడుతున్నా… దూషిస్తున్నా… అతను బతిమాలి, నిన్ను శాంతిపజేసేందుకె ప్రయత్నించాడే తప్ప… ఆగ్రహించలేదు. ఆ సమయంలో నేను అంబరీషుడి హృదయంలో ప్రవేశించాను. నీ శాపం అతనిలో ఉన్న నాకు తగిలింది. నీ శాప ఫలంతో నేను పది జన్మలు అనుభవిస్తాను. అతను నీ వల్ల భయంతో నన్ను శరణు వేడాడు. కానీ, అతని దేహం తనని  తాను తెలుసుకునే స్థితిలో లేదు. నీ శాపాన్ని అతను వినలేదు. అంబరీషుడు నా భక్తకోటిలో ఒక్కడు. భక్తుల్లో శ్రేష్టుడు. అతను నిరపరాధి, దయాశాలి. ధర్మతత్పరుడు. అలాంటి వాడిని అకారణంగా ధూషించావు. అతన్ని నిష్కారణంగా శపించావు. అందుకే  ఆ శాపాన్ని నేను స్వీకరించాను. లోకోపకారానికి వాటిని నేను అనుభవిస్తాను. 

అదెలాగంటే… నీ శాపంలో మొదటి జన్మ మత్స్య జన్మ. నేను ఈ కల్పాన్ని రక్షించేందుకు సోమకుడనే రాక్షసుని చంపేందుకు మత్స్యరూపం ధరిస్తాను. మరికొంత కాలానికి దేవదానవులు క్షీరసాగరంలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలుకుతారు. ఆ పర్వతాన్ని నీటిలో మునగకుండా నేను కూర్మరూపం ధరించి, నా వీపున మోస్తాను. వరాహ జన్మనెత్తి హిరణ్యాక్షుడిని వధిస్తాను. నరసింహావతారమెత్తి ప్రహ్లాదున్ని రక్షించి, హిరణ్య కశిపుడిని శిక్షిస్తాను. బలిచక్రవర్తి వల్ల ఇంద్రపదవి కోల్పోయిన దేవేంద్రుడికి సింహాసనాన్ని తిరిగి ఇప్పించేందుకు వామన అవతారం ఎత్తుతాను. వామనుడిని పాతాళానికి పంపిస్తాను . భూభారాన్ని తగ్గిస్తాను. అలాగే లోక కంఠకుడైన రావణుడిని చంపి లోకోపకారం చేయడానికి రఘువంశంలో రాముడనై జన్మిస్తాను. ఆ తర్వాత యదువంశంలో శ్రీకృష్ణుడిగా, కలియుగంలో బుద్ధుడిగా, కలియుగాంతంలో విష్ణుచిత్తుడనే బ్రాహ్మణుడి ఇంట్లో కల్కి అనే పేరుతో జన్మిస్తాను. కల్కి అవతారంలో అశ్వారూఢుడనై పరిభ్రమిస్తూ… బ్రహ్మద్వేషులను మట్టుబెడతాను. నీవు అంబరీషుడికి శాపం రూపంలో ఇచ్చిన పదిజన్మలను ఈ విధంగా పూర్తిచేస్తాను. నా దశావతారాలను సదా స్మరించేవారి పాపాలు తొలగిపోయి.. వైకుంఠ ప్రాప్తిని పొందుదురు. ఇది అక్షర సత్యం” అని చెప్పాడు.

శ్రీ స్కాంద పురాణాంతర్గత, వశిష్ట ప్రోక్త, కార్తీక మహత్యంలోని ఇరవైఆరవ అధ్యయము , ఇరవైఆరవరోజు పారాయణము సమాప్తం .

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !!

స్వస్తి !

Quote of the day

Holding on to anger is like grasping a hot coal with the intent of throwing it at someone else; you are the one who gets burned.…

__________Gouthama Budda