కార్తీక పురాణం - ఇరవైనాలుగవ అధ్యాయము
ఓం నమః శ్శివాయ
కార్తీక పురాణం - ఇరవైనాలుగవ అధ్యాయము, ఇరవైనాలుగవ రోజు పారాయణము
సేకరణ: లక్ష్మి రమణ
అత్రిమహర్షి తిరిగి అగస్త్యునితో ఇలా చెబుతున్నారు… ”ఓ కుంభ సంభవా! కార్తీక వత్ర ప్రభావం విన్నావు కదా? ఇది ఎంత విన్నా తనవి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరిస్తాను. సావధానంగా విను…” అని ఇలా చెప్పసాగారు.
”గంగా, గోదావరి మొదలుగాగల నదుల్లో స్నానం చేసినందు వల్ల, సూర్య చంద్ర గ్రహణాల సమయంలో స్నానాదులు చేయడం వల్ల ఎంత ఫలం కలుగుతుందో… శ్రీమన్నారాయణుడి నిజతత్వం తెలిపే కార్తీక వ్రతం ఆచరిస్తూ , శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసేవారికి అదే ఫలితం కలుగుతుంది. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్యాల ఫలం ఇతర దినాల్లో చేసిన ఫలానికంటే వేయి రెట్లు అధికంగా ఉంటుంది. ఆ ద్వాదశి వ్రతమెలా చేయాలో చెబుతాను. విను… కార్తీక శుద్ధ దశిమి రోజున, పగటిపూట మాత్రమే భుజించి, ఆ మర్నాడు ఏకాదశి కావడంతో… శుష్కోపవాసం ఉండాలి. ద్వాదశి ఘడియలు వచ్చాక భోజనం చేయాలి. దీనికి ఒక ఇతిహాసముంది. దాన్ని వివరిస్తాను. సావధానంగా ఆలకించు” అని ఇలా చెప్పసాగాడు.
పూర్వం అంబరీషుడనే రాజు ఉండేవాడు. అతను పరమ భాగవతోత్తముడు. ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశినాడు క్రమం తప్పకుండా వ్రతం చేసేవాడు. ఒక ద్వాదశిరోజున ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నాయి. అందువలన అతను ఆ రోజు తెల్లవారుజామునే లేచి, వ్రతం ముగించి, బ్రాహ్మణ సమారాధన చేయాలని నిర్ణయించుకున్నారు . అదే సమయంలో అక్కడకు కోప స్వభావుడు, ముక్కోపి అయిన దుర్వాసుడు వచ్చాడు.
అంబరీషుడు ఆయన్ను గౌరవించి, ద్వాదశి ఘడియలలో పారాయణం చేస్తున్నాను. స్నానమాచరించి త్వరగా రమ్మని ప్రార్థించాడు. స్నానానికి వెళ్లిన దుర్వాసుడు ఎంత సమయమైనా రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోతున్నాయి. దాంతో అంబరీషుడు ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనానికి రమ్మన్నాను. ఆ ముని నదికి స్నానానికి వెళ్లి ఇంకా రాలేదు. బ్రాహ్మణులకు ఆతిథ్యమిస్తానని మాట ఇచ్చాను. వారికి భోజనం పెట్టకపోవడం మహాపాతకం. అది గృహస్తునకు ధర్మం కాదు. ఆయన వచ్చేవరకు ఆగితే… ద్వాదశి ఘడియలు దాటిపోతాయి. వ్రతభంగం తప్పదు. దూర్వాస ముని మహాకోప స్వభావం కలవాడు. ఆయన కాకుండా నేను భుజించినా… నన్ను శపిస్తాడు. నాకేమిచేయాలో అర్థం కావడం లేదు. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు. ద్వాదశి ఘడియలు మించిపోకూడదు. ద్వాదశి దాటాక భోజనం చేస్తే హరిభక్తిని వదిలినవాడనవుతాను. ఏకాదశినాడున్న ఉపవాసం నిష్పలమవుతుంది” అని మల్లగుల్లాలు పడుతూ సర్వజ్ఞులైన పండితులని సలహాకోసం ఆశ్రయించాడు . దుర్వాసుడు వచ్చేవరకు ద్వాదశి ఘడియలు ఆగవు కనుక ఇప్పుడు- వ్రతభంగమా? దుర్వాసుడు రాకముందే భోజనమా? ఏది విహితమైంది ? అని ప్రశ్నించాడు.
దానికి ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రాలను పరిశోధించి, విమర్శ, ప్రతివిమర్శ చేసుకుని, దీర్ఘంగా ఆలోచించి ఇలా చెప్పారు… ”మహారాజా! సమస్త ప్రాణికోటి గర్భాలయాల్లో జటరాగ్ని రూపంలో ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టిస్తాడు. ప్రాణులు భుజించే చతుర్విధాన్నాలు దేహేంద్రియాలకు శక్తిగా మారుతుంది. ప్రాణవాయువు సహాయంతో జటరాగ్ని ప్రజ్వరిల్లుతుంది. అది చెలరేగి క్షుద్భాద కలుగుతుంది. ఆ తాపం చల్లార్చడానికి అన్నం, నీరు అవసరం. శరీరానికి శక్తి కలిగించేవాడే అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడైన దేవ పూజ్యుడైనవాడు. ఆ అగ్నిదేవుని అందరు సదా పూజించాలి. గృహస్తు, ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెడతానని చెప్పి, అతనికి పెట్టకుండా తిననకూడదు. దానివల్ల మహాపాపం కలుగుతుంది. అందువల్ల ఆయుక్షీణమవుతుంది. దుర్వాసుడంతటివాడిని అవమానమొనరించిన పాపం సంప్రాప్తి స్తుంది ” అని వివరించారు.
_శ్రీ స్కాంద పురాణాంతర్గత, వశిష్ట ప్రోక్త, కార్తీక మహత్యంలోని ఇరవైనాలుగవ అధ్యయము , ఇరవైనాలుగవ రోజు పారాయణము సమాప్తం .
సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !!
స్వస్తి !