కార్తీక పురాణం - ఇరవైమూడవ అధ్యయము
ఓం నమః శ్శివాయ
కార్తీక పురాణం - ఇరవైమూడవ అధ్యాయము, ఇరవైమూడవ రోజు పారాయణము
సేకరణ: లక్ష్మి రమణ
అగస్త్యుడు తిరిగి అత్రి మహామునిని ఇలా అడిగారు … ”ఓ ముని పుంగవా! విజయలక్ష్మి వరించాక పురంజయుడు ఏం చేశాడో వివరిస్తారా?” అని కోరాడు. దీనికి అత్రి మహర్షి ఆ తర్వాత కథని వివరించడం మొదలుపెట్టారు . ”కుంభ సంభవా! పురంజయుడు కార్తీక వ్రతమాచరించడం వల్ల అసమాన బలోపేతుడై అగ్నిశేషం, శత్రు శేషం ఉండకూడదని తెలిసి… తన శత్రురాజులందరినీ ఓడించాడు. నిరాటంకంగా తన రాజ్యాన్ని ఏలాడు.
తన విష్ణు భక్తి ప్రభావం వల్ల గొప్ప పరాక్రమవంతునిగా , పవిత్రునిగా , సత్యదీక్ష తత్పరునిగా , నిత్యాన్నదాననిరతునిగా , భక్తిప్రియవాదిగా , తేజోమంతునిగా , వేదవేదాంగవేత్తగా విరాజిల్లాడు. శత్రురాజ్యాలను జయించి, తన కీర్తిని దశదిశలా చాటాడు. శత్రువులకు సింహస్వప్నమై… విష్ణు సేవాధురంధురుడై, కార్తీకవ్రత ప్రభావంతో కోటికి పడగలెత్తి, అరిషడ్వర్గాలను జయించాడు.
అయినా… అతనిలో తృప్తి లోపించింది. ఏ దేశాన్ని, ఏ కాలంలో, ఏ క్షేత్రాన్ని ఏవిధంగా దర్శించాలి? శ్రీహరిని ఎలా పూజించి కృతార్థుడనవ్వాలి? అని విచారిస్తూ గడిపేవాడు. అలా శ్రీహరిని నిత్యం స్మరిస్తున్న అతనితో ఓ రోజు అశరీర వాణి …ఇలా పలికింది.
”ఓ పురంజయా! కావేరీనదీ తీరంలో శ్రీరంగ క్షేత్రముంది. దాన్ని రెండో వైకుంఠమని పిలుస్తారు. నీవు అక్కడకు వెళ్లి, శ్రీరంగనాథ స్వామిని అర్చించు. నీవు ఈ సంసార సాగరం దాటి మోక్షప్రాప్తిని పొందగలవు” అని పలికింది.
అంతట పురంజయుడు తన రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి, సపరివార సమేతంగా బయలుదేరి, మార్గంలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ… ఆయా దేవతలను సేవిస్తూ, పుణ్యనదుల్లో స్నానం ఆచరిస్తూ… శ్రీరంగానికి చేరుకున్నాడు. అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహిస్తుండగా… శ్రీరంగనాథ స్వామి మధ్యలో కొలువయ్యారు. శేషశయ్యపై పవళిస్తున్న ఆయనను గాంచిన పురంజయుడు పరవశంతో చేతులు జోడించి… ”దామోదరా… గోవిందా… గోపాలా… హరే కృష్ణా… హే వాసుదేవా! దాసోహం… దాసోహం…” అని స్తోత్రం చేశాడు. కార్తీకమాసమంతా శ్రీరంగంలోనే గడిపాడు. ఆ తర్వాత వారు అయోధ్యకు బయలుదేరారు. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షంలో కార్తీకమాసవ్రతం చేయడం వలన , ఆ వ్రత మహిమలతో అతని రాజ్యంలోని ప్రజలంతా సుఖశాంతులతో విరాజిల్లారు. పాడిపంటలు, ధనధాన్యాలు, ఆయురారోగ్యాలకు లోటు లేకుండా పోయింది. అయోధ్యానగరం దృఢతర ప్రాకారాలు కలిగి, తోరణ యంత్ర ద్వారాలతో మనోహర గృహగోపురాలు, పురాదులతో, చతురంగ సైన్య సంయుతంగా ప్రకాశించసాగింది . అయోధ్యానగరంలోని వీరులు యుద్ధనేర్పరులై… రాజనీతి కలవారై, వైరులపాలిటి సింహస్వప్నాలై , నిరంతరం విజయశీలురై, అప్రమత్తులై ఉన్నారు . ఆ నగరంలోని మహిళలు , యువతులు, హంసగజగామినులు, పద్మపత్రాయతలోచనలు, రూపవుతులు, శీలవతులని, గుణవతులని ఖ్యాతి గడించారు.
శ్రీరంగంలో కార్తీకవ్రతమాచరించి, ఇంటికి క్షేమంగా చేరిన పురంజయుడిని ఆ పుర ప్రజలు మంగళ వాద్యాలతో ఆహ్వానించారు. అలా కొంతకాలం ఐహికవాంఛలను అనుభవించిన పురంజయుడు ఆ తర్వాత వాటిని వదులుకుని, తన కుమారుడికి రాజ్యభారం అప్పగించి, వానప్రస్థాశ్రమం గడిపాడు. జీవితాంతం కార్తీక వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తూ… అంత్యకాలంలో వైకుంఠానికి చేరుకున్నాడు.
కాబట్టి ఓ అగస్త్యా! కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైంది. దాన్ని ప్రతిఒక్కరూ ఆచరించాలి. ఈ కథ చదివినవారికి, విన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది” అని అత్రి మహర్షి వివరించారు.
_శ్రీ స్కాంద పురాణాంతర్గత, వశిష్ట ప్రోక్త, కార్తీక మహత్యంలోని ఇరవై మూడవ అధ్యయము , ఇరవై మూడవరోజు పారాయణము సమాప్తం .
సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !!
స్వస్తి !