Online Puja Services

కార్తీకపురాణం - పందొమ్మిదవ అధ్యాయం

52.15.233.13

ఓం నమఃశ్శివాయ 
కార్తీకపురాణం - పందొమ్మిదవ అధ్యాయం, పందొమ్మిదవ రోజు పారాయణం  
సేకరణ: లక్ష్మి రమణ 

ఈ విధముగా నైమిశారణ్యమందున్న మహా మునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన తర్వాత పిమ్మట జ్ఞానసిద్దుడనే  ఒక మహాయోగి "ఓ దీనబాంధవా! నీవు వేద వేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గల వాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడే వాడవని, నిత్యుడవని, నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా! నీకివే మా హృదయపూర్వక నమస్కారములు.

           సకల ప్రాణికోటికి ఆధార భూతుడవైన  ఓ నందనందనా! మా స్వాగతమును స్వీకరించు . నీ దర్శన భాగ్యమువల్ల  మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములయ్యాయి . ఓ దయామయా! మేమీ సంసార బంధము నుండి బైట పడలేకున్నాము, మమ్ములను ఉద్దరింపుము.

 మానవుడెన్నిపురాణములు చదివినా, యెన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము పొందజాలడు . నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గో చరుడవు. ఓ గజేంద్రరక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషీకేశా! నన్ను కాపాడు" అని మైమరచి స్తోత్రము చేశారు . అప్పుడు , శ్రీ హరి చిరునవ్వు నవ్వి "జ్ఞానసిద్దా! నీ సోత్రవచనమునకు నేనెంతో సంతోషించాను .   నీ కిష్ట మొచ్చిన వరమును కోరుకొమ్మని "చెప్పాడు . అప్పుడు  జ్ఞానసిద్దుడు "ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన యీగవలె కొట్టుకుంటున్నాను . కనుక, నీ పాద పద్మముల పైన  ధ్యానముండేవిధంగా నన్ను  అనుగ్రహించు . నీపాదసన్నిధి తక్క నాకింకేమీ అక్కరలేదు " అని వేడుకున్నాడు .

 అంత శ్రీమన్నారాయణుడు "ఓ జ్ఞానసిద్దుడా! నీ కోరిక ప్రకారం ఆ వరాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను . దాంతోపాటు , మరో వరాన్ని కూడా ప్రసాదిస్తున్నాను .  ఈ లోకంలో అనేకమంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యాలుచేస్తున్నారు. అలాంటివారి పాపాలు పోవడానికి ఒక వ్రతం కల్పిస్తున్నాను. ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించొచ్చు. సావధానుడవై ఆలకించు…. నేను ఆషాఢ శుద్ధ దశిమిరోజున లక్ష్మీసమేతంగా పాలసముద్రంలో శేషశయ్యపై పవళిస్తాను. తిరిగి కార్తీకమాసం శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలంలో చేసే వ్రతాలు నాకు అమిత ఇష్టమైనవి. చాతుర్మాస్యాల్లో ఎలాంటి వ్రతాలు చేయనివారు నరక కూపాలలో పడతారు. ఇతరులతో కూడా ఈ వ్రతాన్ని ఆచరింపజేయాలి. దీని మహత్యాన్ని తెలుసుకో. వ్రతం చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకాలు కలుగుతాయి. 

ఇక చాతుర్మాస్య వ్రతం చేసేవారికి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమంగా ఆషాఢ శుద్ధ దశిమి మొదలు శాకములు (కూరలు), శ్రావణ శుద్ధ దశిమి మొదలు పప్పుదినుసులు విసర్జించాలి. నాయందు భక్తిగలవారిని పరీక్షించడానికి నేను ఇలా ద్రవ్యాల నిషేధాన్ని విధించాను. ఆ కాలంలో నేను ఆయా ద్రవ్యజాల్లో శయనిస్తాను. నీను ఇప్పుడు నన్ను స్తుతించిన తీరున త్రిసంధ్యల్లో భక్తిశ్రద్ధలతో పఠించేవారు నా సన్నిధికి నిశ్చయంగా వస్తారు” అని శ్రీమన్నారాయణుడు తెలిపాడు. అనంతరం ఆయన మహాలక్ష్మితో కలిసి పాలసముద్రానికి వెళ్లి, శేషపాన్పుపై పవళించాడు. 

తిరిగి వశిష్టుడు జనకమహారాజుతో ఇలా అంటున్నాడు… ”ఓ రాజా! ఈ విధంగా విష్ణుమూర్తి, జ్ఞాన సిద్ధుడు, మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యాన్ని ఉపదేశించాడు. ఈ వృత్తాంతాన్ని ఆంగీరసుడు ధనలోభునికి తెలియజేశాడు. నేను నీకు వివరించాను. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి స్త్రీపురుష బేధం లేదు. అన్ని జాతుల వారు ఈ వ్రతాన్ని ఆచరించొచ్చు. శ్రీమన్నారాయణుడి ఉపదేశం ప్రకారం మునిపుంగవులంతా చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి, ధన్యులయ్యారు. అనంతరం వైకుంఠ ప్రాప్తిని పొందారు” అని వశిష్టులు చెప్పారు. 

స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి, పందొమ్మిదవ అధ్యాయం , పందొమ్మిదవరోజు పారాయణం సమాప్తం.

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !!

స్వస్తి !- 

Quote of the day

There are only two mistakes one can make along the road to truth; not going all the way, and not starting.…

__________Gautam Buddha