కార్తీకపురాణము - సప్తదశాధ్యాయము
ఓం నమఃశ్శివాయ
కార్తీకపురాణము - సప్తదశాధ్యాయము, పదిహేడవ రోజు పారాయణం.
సేకరణ: లక్ష్మి రమణ
ఓ మునులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయాలకు సమాధానం చెప్తున్నాను జాగ్రత్తగా విను. కర్మ వలన ఆత్మకు దేహం ఏర్పడింది. శరీరం ధరించినందువల్లే ఆత్మ కర్మలు చేస్తుంది. కాబట్టి కర్మ చేయడానికి శరీరమే కారణం. స్తూల, సూక్ష్మ శరీరసంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించారు .
దానినే నేను మీకిప్పుడు వివరిస్తున్నాను . 'ఆత్మ' అంటే ఈ శరీరమున అహంకారంగా ఆవరించి, వ్యవహరిస్తూ ఉన్నది అని అంగీరసుడు చెప్పాడు. అప్పుడు ధనలోభుడు , 'ఓ మునీంద్రా! నేనింతవరకూ ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాను. మీరింతవరకూ చెప్పిన వాక్యార్ధజ్ఞానమునకు, పాదార్దజ్ఞానము కారణమవుతూ ఉంది . కాబట్టి , 'అహంబ్రహ్మ' యను వ్యక్యార్ధమును గురించి నాకు వివరంగా తెలియజెయండి"యని ధనలోభుడు కోరెను.
అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇలా అన్నాడు - ఈ దేహము అంత:కరణవృత్తికి సాక్షి, 'నేను - నాది' అని చెప్పబడే జీవత్మ ఇందులోని 'అహం' అనే శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మా 'న:' అనే శబ్దము. ఈ యాత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ది, సాక్షి, జ్ఞాన, రూప,శరీర, ఇంద్రియములు మొదలైన వాటిని వ్యాపారమునుందు ప్రవర్తింపజేసి, వాటి కంటే వేరుగా వున్నదై యెల్లప్పుడు ఒకే రీతిగా ప్రకాశిస్తూ ఉండేది "ఆత్మ" అని చెప్పబడుతున్నది . "నేను" అనునది శరీరేంద్రియాదులలో ఆయా నామరూపాలలో ఉన్నప్పటికీ , నశించనటువంటిది. కాబట్టి దేహమునకు జాగృతి , స్వప్న, సుషుప్త్యవస్థలలో - స్థూల, సూక్ష్మకార, శరీరాలు మూడింటిలోనూ నేను, నాదని వ్యవహరించేది ఆత్మేనని గ్రహించాలి . ఇనుము సూదంటురాయిని అంటి పెట్టుకొని తిరిగినట్టు శరీరం, ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుతుంటాయో అదే ఆత్మ. అదే విధంగా అవి ఆత్మ వలన తమ పని నిర్వర్తిస్తాయి . నిద్రలో శరీరేంద్రియాలు సంబంధంలేక, గాఢనిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోయాను , ఇప్పుడు సుఖముగా ఉన్నది అనుకొనేదే ఆత్మ.
దీపము గాజు బుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేసే విధంగానే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపమవడం వలన, దానికి దారా పుత్రాదులు ఇష్టముగా మారుతున్నారు . అటువంటి విశేష ప్రేమాస్పదమైన వస్తువేదో అదే 'పరమాత్మ'యని గ్రహించు .
'తత్వమసి' అనేది జీవాత్మపరమాత్మల యేకత్వమును బోధిస్తుంది . ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానందరూపమొక్కటే నిలుస్తుంది .అదే 'ఆత్మ'. దేహలక్షణము లుండుట-జన్మించుట-పెరుగుట-క్షీణించుట-చనిపోవుట మొదలగు ఆరుభాగములు శరీరానికే గానీ ఆత్మకు కాదు. ఒక కుండను చూసి మనిషి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహించునో అలానే దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మని తెలుసుకోవాలి. జీవుల కర్మఫలాన్ని అనుభవింపజేసేవాడు పరమాత్ముడని, జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని తెలుసుకోవాలి.
అందువల్ల మానవుడు మంచిగుణాలతో గురుసేవ చేస్తూ సంసారబంధమైన ఆశలనుండి విముక్తి పొందాలి. మంచి జరగాలనే తలంపుతోనే మంచి పనులు చేస్తూ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందాలి. సత్కర్మానుష్ఠానం చేయాలి. మంచి పనులు చేస్తే గానీ ముక్తి లభించదని, అంగీరసుడు ధనలోభునికి మంచి పనులు చేయాల్సిన ఆవశ్యకతను గురించి చెబుతాడు. అందుకు ధనలోభుడు అంగీరసునికి నమస్కరించి ఇలా అన్నాడు .
స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి, సప్తదశాధ్యాయము , పదిహేడవ రోజు పారాయణం సమాప్తం.
సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !!
స్వస్తి !