కార్తీకపురాణము - పదునైదవ అధ్యాయము
ఓం నమః శ్శివాయ
కార్తీకపురాణము - పదునైదవ అధ్యాయము, పదిహేనవరోజు పారాయణము
సేకరణ: లక్ష్మి రమణ
అంతట జనకమహారాజుతో వశిష్ఠమహాముని - జనకా! కార్తీకమహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికాదు. ఇప్పుడు నీకు నేను మరో యితిహాసము తెలియ జేయాలి అనుకుంటున్నాను . సావధానుడవై ఆలకింపుమని ఇలా చెప్పసాగారు .
ఈ మాసములో హరినామ సంకీర్తనలు వినడం , చేయడం , శివకేశవులవద్ద దీపారాధన చేయడం , పురాణములు చదవడం , వినడం , సాయంత్రము దేవతాదర్శనము చేసుకోవడం వంటివి చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమునబడి కొట్టుమిట్టాడగలరు . కార్తీకశుద్ద ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగుతుంది .
శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు సమర్పించినట్లయితే, విశేషఫలము పొందగలరు. ఈ విధముగా నెలరోజులు విడవకుండా చేసినట్లయితే అటువంటి వారు దేవదుందుభులు మ్రోగుతుండగా విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళగలరు .
నెలరోజులు చేయలేనివారు కార్తీకశుద్ద త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులలోనైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమును పెట్టాలి .
ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచినా మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించగలరు. ఇతరులు వుంచిన దీపము యెగద్రోసి వృద్ధి చేసినా , లేక, ఆరిపోయిన దీపమును వెలిగించినా అటువంటి వారి సమస్త పాపములు హరించుకుపోతాయి . దీనిని తెలిపే ఒక కథని ఇప్పుడు చెబుతాను వినుమని వశిష్ఠులవారు ఇలా చెప్పసాగారు .
సరస్వతీ నదీతీరములో శిధిలమైన ఒక దేవాలయము ఉండేది . కర్మ నిష్ఠుడనే దయార్ద్ర హృదయుడైన ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీకమాసమంతా అక్కడే గడిపి పురాణ పఠనము చేసే ఉద్దేశ్యంతో ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లుపెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులుజేసి, పండ్రెండు దీపములుంచి, స్వామిని పూజిస్తూ , నిష్ఠతో పురాణము చదవసాగాడు. ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభమైన నాటి నుండీ చేస్తూఉన్నాడు
ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి, నలుమూలలు వెదకి, తినడానికి ఏమీ దొరకక అక్కడ ఆరిపోయిఉన్న వత్తిని తినవలసినదే అనుకొని నొట కరచుకొని, ప్రక్కనున్న దీపము దగ్గర ఆగింది . ఎలుక నోటకరచియున్న వత్తి చివర అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చింది .
అది కార్తీకమాసమవడం వలన, శివాలయములో ఆరిపోయిన వత్తి యీ యెలుక వల్ల వెలగడం చేత దాని పాపములు హరించుకుపోయి పుణ్యము సంప్రాప్తినిచ్చింది. వెంటనే దాని రూపము మారి మానవ రూపము పొందింది .
ధ్యాన నిష్ఠలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరచిచూడగా, ప్రక్కనొక మానవుడు నిలబడి ఉన్నాడు . అతన్ని గమనించి "ఓయీ! నీవెవ్వడవు? ఎందు కిక్కడ నిలబడిఉన్నావు ?" అని ప్రశ్నించగా, "ఆర్యా! నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెదుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి యిక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యివాసనలతో ఉండి ఆరిపోయిన వత్తిని తినాలనుకొని, దానిని నొటకరచి ప్రక్కనున్న దీపంచెంత నిలబడి వుండగ, నా అదృష్టము కొలదీ ఆ వత్తి అంటుకుని వెలగడం వలన నా పాపములు తొలగిపోయినట్టున్నాయి. వెంటనే పూర్వజన్మగా నాకీ రూపం కలిగింది.” అని వివరించి , ఇలా ప్రశ్నించాడు. “ ఓ మహానుభావా! నేను యెందుకీ మూషిక జన్మ మెత్తవలసివచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు"మని కోరాడు . అప్పుడా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచేత సర్వము తెలుసుకొని, "ఓయీ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచే వారు.
నీవు జైనమత వంశానికి చెందిన వాడివి . నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ, ధనాశపరుడై దేవపూజలు, నిత్యకర్మలు మరచి, నీచుల సహవాసము చేయడం వలన, నిషిద్ధాన్నము తింటూ , మంచివారిని , యోగ్యులను నిందిస్తూ, పరులచెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్మే వృత్తిని చేపట్టి దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టేవాడివి . ఇది చాలక సమస్త తినుబండారములను చాలా చౌకగా కొని, తిరిగి వాటిని యెక్కువ ధరకు అమ్మి, ఆవిధంగా సంపాదించిన ధనము నీవు అనుభవించక, యితరులకు యివ్వక దానిని భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు.
మరణించిన తరువాత యెలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపము అనుభవించ సాగవు . నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందువలన పుణ్యాత్ముడవయ్యావు. దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాబట్టి , నీవు నీ గ్రామమునకు పోయి, నీ పెరటిలో పాతిపెట్తిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దానధర్మాలు చేసి, భగవంతుని ప్రార్థించుకొని మోక్షముపొందు"మని అతనికి నీతులు చెప్పి పంపించాడు.
స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి, పంచదశాధ్యాయము - పదిహేనోరోజు పారాయణము సమాప్తము.
సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !!
స్వస్తి !