కార్తీకపురాణము - పదునాల్గవ అధ్యాయము
ఓం నమఃశ్శివాయ
కార్తీకపురాణము - పదునాల్గవ అధ్యాయము , పదునాల్గవ రోజు పారాయణము
సేకరణ: లక్ష్మి రమణ
వశిష్ఠుల వారు, జనకుని దగ్గరగా కూర్చుండ బెట్టుకొని కార్తీకమాస మాహాత్మ్యమును గురించి, తనకు తెలిసిన సర్వవిషయములు చెప్పాలనే కుతూహలముతో ఇలా చెప్పసాగారు.
ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయడం , శివలింగ సాలగ్రామములను దానముచేయడం , ఉసిరికాయలు దక్షిణతో దానముచేయడం మొదలైన పుణ్యకార్యములు చేయడం వలన వెనుకటి జన్మములో చేసిన సమస్త పాపములను నశింప చేసుకోగలరు . వారికి కోటియాగముల చేసిన ఫలము దక్కుతుంది . ప్రతి మనుజుని పితృదేవతలు తమ వంశములో ఎవరు ఈ విధంగా ఆబోతునకు అచ్చువేసి వదలుతారా అని ఎదురుచూస్తుంటారు .
ఎవరు ధనవంతుడై ఉండి, పుణ్యకార్యములు చేయక, దానధర్మములు చేయక, చివరకు ఆంబోతునకు అచ్చువేసి పెండ్లిఅయినా చేయడో, అటువంటివాడు రౌరవాది సకల నరకములు అనుభవించడమే కాక, వాని బంధువులను కూడా నరకముపాలు చేసినవాడవుతాడు .
కాబట్టి ప్రతిసంవత్సరం కార్తీక మాసములో తన శక్తికొద్ది దానము చేసి, నిష్టతో వ్రతమాచరించి ,సాయం సమయములో శివకేశవులకు ఆలయములో దీపారాధనచేసి ఆరాత్రిమొత్తం జాగరముండి, మరునాడు తమశక్తి కొద్దీ బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనం పెట్టినవారు ఇహపరములందు సర్వసుఖములనూ అనుభవిస్తారు .” అని వసిష్ఠ మహాముని తెలిపారు.
ఆతర్వాత కార్తీకమాసములో విహితమైన విషయాల గురించి వివరంగా చెప్పిన ఆయన , ఈ మాసంలో విసర్జింపవలసిన విషయాల గురించి ఇలా చెప్పనారంభించారు .
ఈ మాసములో పరాన్న భక్షణ చేయకూడదు . ఇతరుల యెంగిలి ముట్టకూడదు. తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినకూడదు . తిలాదానము పట్టకూడదు . శివార్చన, సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినకూడదు . పౌర్ణమి, అమావాస్య, సోమవారమునాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులలో భోజనం చేయకూడదు .
కార్తీకమాసములో నెలరోజులూ కూడా రాత్రిపూట భోజనం చేయకూడదు . భర్తని కోల్పోయిన స్త్రీ వండినది తినకూడదు . ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేసేవారు ఆ రెండు రాత్రులు, తప్పనిసరిగా జాగారము చేయాలి . ఒక్కపూట మాత్రమే భోజనము చేయాలి . కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విస్మరించకూడదు .
కార్తీకమాసములో చేసే వేడినీటి స్నానము - కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పి ఉన్నారు . కాబట్టి , వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యముగా వుండి, యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయాలన్న కుతూహలం గలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చు. ఆ విధంగా చేసే వారు గంగ, గోదావరీ సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయాలి .
ఏ నది తనకు దగ్గరలో వుంటే, ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయాలి . అలా చేయనట్టయితే మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున బడి కృశిస్తారు . ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని, చెరువులో గాని స్నానము చేయవచ్చు. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించాలి .
శ్లో!! గంగే యమునే చైవ గోదావరి సరస్వతీ
నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు!!
కార్తీకమాస వ్రతము చేసే వారు పగలు పురాణపఠన శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలము గడపాలి . సాయం కాలము సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరములోని శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించాలి .
కార్తీక మాస శివపూజాకల్పము
1. ఓం శివాయ నమః - ధ్యానం సమర్పయామి
2. ఓం పరమేశ్వరాయ నమః - ఆవాహనం సమర్పయామి
3. ఓం కైలాసవాసాయ నమః - నవరత్నసింహాసనం సమర్పయామి
4. ఓం గౌరీనాథాయ నమః - పాద్యం సమర్పయామి
5. ఓం లోకేశ్వరానమః - ఆర్ఘ్యం సమర్పయామి
6. ఓం వృషభవాహనాయనమః - స్నానం సమర్పయామి
7. ఓం దిగంబరాయ నమః - వస్త్రం సమర్పయామి
8. ఓం జగన్నాథాయనమః - యజ్ఞోపవీతం సమర్పయామి
9. ఓం కపాలధారిణే నమః - గంధం సమర్పయామి
10. ఓం సంపూర్ణ గుణాయనమః - పుష్పం సమర్పయామి
11. ఓం మహేశ్వరాయ నమః - అక్షతాన్ సమర్పయామి
12. ఓం పార్వతీనాథాయ నమః - ధూపం సమర్పయామి
13. ఓం తేజోరూపాయ నమః - దీపం సమర్పయామి
14. ఓం లోకరక్షాయ నమః - నైవేద్యం సమర్పయామి
15. ఓం త్రిలోచనాయ నమః - కర్పూర నీరాజనం సమర్పయామి
16. ఓం శంకరాయనమః - సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
17. ఓం భవాయనమః - ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
ఈప్రకారముగా కార్తీకమాసమంతా కూడా పూజించాలి . శివసన్నిధిలో దీపారాధన చేయాలి . ఈ విధముగా శివపూజ చేసినట్టయితే ఆ వ్యక్తి ధన్యుడవుతాడు. పూజానంతరము తన శక్తినిబట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి, దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచాలి .
ఈ విధంగా హెసినవారికి నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము, వెయ్యి వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగుతుంది . ఈ కార్తీకమాసము నెల రోజులూ బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన, తులసికోటవద్ద కర్పూర హారతులతో దీపారధన చేసినట్టయితే , వారికీ, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగుతుంది .
శక్తి కలిగిఉండికూడా యీ వ్రతము ఆచరించనివారు వంద జన్మలు నానాయోనులందునా జన్మించి ఆ తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, యెలుక మొదలైన జన్మలెత్తుతారు . ఈ వ్రతము శాస్త్రోకతముగా ఆచరించినట్లయితే పదిహేను జన్మలయొక్క పూర్వ జ్ఞానము కలుగుతుంది . వ్రతము చేసినా , పురాణము చదివినా , విన్నా అట్టివారికి సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుంది .
పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము...
స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి, పదునాల్గవ అధ్యాయము , పదునాల్గవ రోజు పారాయణము సమాప్తము.
సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !!
స్వస్తి !