Online Puja Services

కార్తీక పురాణము - తొమ్మిదవ అధ్యాయము

3.12.34.192

ఓం నమః శ్శివాయ . 
కార్తీక పురాణము - తొమ్మిదవ అధ్యాయము , తొమ్మిదవరోజు  పారాయణము .
సేకరణ: లక్ష్మి రమణ 

“ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. వైకుంఠము నుండీ వచ్చాము.  మీ ప్రభువగు యమధర్మరాజు ఏ పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మల్ని పంపించారు " యని తిరిగి ప్రశ్నించారు .

 అందుకు జవాబుగా యమదూతలు "విష్ణుదూత లారా! మానవుడు చేసే  పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి,ఆకాశము, ధనుంజయాది వాయువులు, రాత్రింబవళ్లు, సంధ్యాకాలం సాక్షులుగా వుండి ప్రతిరోజూ  మా ప్రభువు దగ్గరికి వచ్చి విన్నవించుకుంటుంటారు .
మా ప్రభువులవారు ఈ కార్యకలాపములను తిరిగి చిత్రగుప్తునిచే చూపించి ఆ వ్యక్తి  అవసానకాలములో మమ్మల్ని  పంపి, వారిని తమ సన్నిధికి రప్పిస్తారు . ఆ పాపులు ఎటువంటివారో చెబుతాము వినండి” . అంటూ ఇలా చెప్పసాగారు . 

“ వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రముల నిందించువారు, గోహత్య, బ్రాహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, పరస్త్రీలను కామించినవారు, పరాన్నభక్షులు, తల్లిదండ్రులను - గురువులను - బంధువులను - కులవృత్తిని తిట్టి హింసించు వారు, జీవహింస చేయువారు దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారు,   జారత్వం ,చొరత్వం చేత భ్రష్టులయిన వారు, యితరుల ఆస్తిని స్వాహాచేయువారు, శిశుహత్య చేయువారు, శరణన్నవానిని కూడా వదలకుండా బాధించు వారు, చేసిన మేలు మరచిన కృతఘ్నులు,పెండ్లిండ్లు తదితర శుభకార్యములు జరగనివ్వక అడ్డుతగిలేవారు పాపాత్ములు.

వారు మరణించగనే తన వద్దకి తీసుకువచ్చి నరకములో పడేసి , దండింపమని మా యమధర్మ రాజుగారి యాజ్ఞ. పైగా  ఈ ఆజామీళుడు బ్రాహ్మణుడై పుట్టీ , దురాచారములకులోనై, కులభ్రష్టుడై, జీవహింసలుచేసి, కామాంధుడై, వావివరసలు లేక, సంచరించిన పాపాత్ముడు.
ఇటువంటి వాడికి విష్ణులోకము ఎలా ప్రాప్తిస్తుంది ? మీరెలా ఈతని తీసుకుపోయేందుకు వచ్చారు ? “ అని అడిగారు . అప్పుడు విష్ణుదూతలు "ఓ యమకింకరులారా! మీరెంత అవివేకులు? మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మములు ఎలాంటివో చెబుతాము వినండి . సజ్జనులతో సహవాసము చేయువారు,జప దాన ధర్మములు చేయువారు,    అన్నదానము,కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారు, అనాధప్రేత సంస్కారములు చేయువారు, తులసీవనమును పెంచువారు ,తటాకములు త్రవ్వించువారున, శివకేశవులను పూజించువారు, సదా హరినామ స్మరణ చేయువారు, మరణకాలమందు 'నారాయణ' అని శ్రీహరిని గాని, 'శివ శివా ' అని శివునిగాని స్మరించువారు, తెలిసిగాని తెలియకగాని మరే రూపమునగాని హరినామస్మరణ చెవినిబడిన వారు పుణ్యాత్ములు! 

కాబట్టి అజామీళుడు ఎంత పాపాత్ముడైనా, మరణకాలమున 'నారాయణా!నారాయణా' అని హరిని స్మరిస్తూ ప్రాణాలు విడిచాడు . కాబట్టి , మేము అతన్ని వైకుంఠమునకు తీసుకొని పోతాము " అని చెప్పారు .

 అజామీళుడు విష్ణుదూతలు , యమదూతల సంభాషణలాలకించి ఆశ్చర్యమొంది "ఓ విష్ణుదూతలారా! పుట్టిననాటినుండి నేటివరకూ శ్రీ మన్నారాయణ పూజగాని, వ్రతములుగాని,ధర్మములు గాని చేసి యెరుగను. నవమాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సైతము ప్రణామము చేయనివాడను . 

 వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై,నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని పై గల ప్రేమచేత  'నారాయణా!' అని పిలుచాను . అంతమాత్రానికే ,  నన్ను ఘోర నరక బాధలనుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొనిపోతున్నారా!

  ఆహా! నేనెంత అదృష్టవంతుడని ! నా పూర్వజన్మ సుకృతము, నాతల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది" అని పలుకుతూ  సంతోషముగ విమానమెక్కి వైకుంఠమునకు చేరాడు . 

కాబట్టి ,  ఓ జనక చక్రవర్తీ! తెలిసిగాని, తెలియకగాని నిప్పును ముట్టుకుంటే శరీరం ఏవిధంగా అయితే,  బొబ్బలెక్కి బాధ కలిగిస్తుందో ,అదే విధంగా శ్రీహరిని స్మరించిన మాత్రం చేత  సకల పాపములు నశించి మోక్షము పొందగలరు . ఇది ముమ్మాటికినీ నిజము.” అని వశిష్ఠులు వివరించారు . 

స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి, తొమ్మిదవ అధ్యాయము , తొమ్మిదవరోజు  పారాయణము సమాప్తము.

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !!

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore