భరతమాత ఆలయం !
విశ్వేశ్వరుని మీద భక్తి పరిఢవిల్లే చోట, భరతమాత ఆలయం !
- లక్ష్మీ రమణ
వారణాశి పేరు చెప్పగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఆ కాశీ విశ్వనాథుడు , విశాలాక్షీ అమ్మవార్లే ! ప్రళయసమయం కూడా ఆ పట్టణం మునిగిపోకుండా ఆ కాశీ విశ్వేశ్వరుడు తాన త్రిశూలంతో లేపి పట్టుకొని ఆ ప్రాంతాన్ని కాపాడతాడని ప్రతీతి . ప్రస్తుతం కాశీలో చక్కగా విశ్వనాథ్ కారిడార్ అందుబాటులోకి వచ్చేయడంతో ఎంతో సౌకర్యంగా అయ్యవారిని అమ్మవారిని దర్శించుకునే వీలు కలిగినది. ఇక కాశీ లో అనేక దేవాలయాలు, విశిష్టమైన దేవీ దేవతలా స్వరూపాలూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ! కానీ దేశభక్తిని చాటి చెప్పే అఖండ భారతావని కీర్తిని వెలుగొందించే గొప్ప దేవాలయం మన వారణాశిలో ఉన్న విషయం తెలిసినవారు తక్కువేనని చెప్పుకోవాలి .రండి ఆ దేవాలయానికి మేము మిమ్మల్ని తీసుకెళ్తాం !
మనం భారతదేశాన్ని మన తల్లిగా, దేవతగా భావించి పూజిస్తామనే విషయం భారతీయులకి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు కదా ! భరతమాత ముద్దు బిడ్డలని ఇప్పటికీ గర్వంగా చెప్పుకునే ప్రతి పౌరుడూ ఆ తల్లి బిడ్డకాక మరెవ్వరు ! ఏదేశమేగినా, ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని ! అన్న గురజాడ ఆమాటలు ఈ దేవాలయాన్ని దర్శిస్తే, కచ్చితంగా చెవుల్లో రింగుమని మారుమ్రోగుతాయి . అవును , ఇది దేవాలయమే, అది కూడా వారణాశిలో ఉన్న భారతమాత దేవాలయం . విశ్వేశ్వరుని మీద భక్తి పరిఢవిల్లే చోట, ఎగురుతున్న దేశభక్తి జెండా ఇది !!
ఈ మందిరం పవిత్ర కాశీ విశ్వనాధ్ మందిర్ కు సమీపంలోని ఆర్యన్ లోలార్కా కుండ్ , సంతానోత్పత్తి చెరువు వద్ద ఉన్నప్పటికీ సందర్శకుల తాకిడి కాస్త తక్కువగానే ఉంటుంది. మీరు దర్శించాలనుకుంటే, ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు హాయిగా కూర్చొని ఆలయాన్ని పరికించవచ్చు .
పవిత్ర పుణ్యక్షేత్రం కాశిలోని ఈభారత మాత ఆలయంలో ఏదేవుడు దేవతా ఉండరు. కానీ ఇక్కడ ఆలయానికి వెళ్తే దేశభక్తిని నింపే అద్భుతం సాక్షాత్కరిస్తుంది. భారతమాత మందిరాన్ని స్వాతంత్ర్యానికి పూర్వమే నిర్మించారు. కాశీ విద్యాపీఠ్ క్యాంపస్ లో దీన్ని 1936లో విశ్వవిద్యాలయ వ్యవస్ధాపకుడు, స్వాతంత్ర్యసమర యోధుడు బాబు శివప్రసాద్ గుప్తా నిర్మించగా మహాత్మాగాంధీ ప్రారంభించారు. హాల్ ప్రధాన ద్వారంపై వందే మాతరం అని చెక్కిన శిల్పాకృతి మనల్ని ఆహ్వానిస్తుంది.
హాల్ యొక్క మొదటి అంతస్తులో పాలరాయితో నిర్మించిన అఖండ భారత ఉపఖండం చిత్రపటం (మ్యాప్) సందర్శకులను కట్టి పడేస్తుంది. భారతదేశం చిత్రపటం అంటే మనకు ఉత్తరాన హిమాలయాలు, ఒక వైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, బంగ్లాదేశ్ కనిపిస్తాయి. ఆ మ్యాప్ లో పర్వతాలు, నదులు మరియు సముద్రాలు చక్కగా వివరించారు . కానీ, ప్రస్తుతం భారతదేశానికి ఉండే సరిహద్దు రేఖలు ఈమ్యాప్ లో కనిపించవు .
దానికి బదులుగా మనం ఈ భారతదేశపటంలో అఖండ్ భారత్ ను దర్శించుకుంటాం . ఆప్గనిస్తాన్‌ను గాంధార దేశంగా భావిస్తారు. ఇలా ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌లతో కూడిన భారత్‌ను అఖండ భారత్ అంటారు. ఇది ప్రాచీన భారతం అసలు స్వరూపం ఇది . రాజస్ధాన్ లో దొరికే అరుదైన మక్రానా మార్బుల్ తో ఈఅఖండ భారత్ చిత్ర పటాన్ని రూపోందించారు.
భరతమాత ఆలయం చూడటానికి ఎటువంటి నింబంధనలు లేనందున ఎవ్వరైనా ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. రిపబ్లిక్ డే, స్వాతంత్ర్యదినోత్సవం రోజున మ్యాప్ ను నీటిలో ఉంచుతారు.