స్వాతిముత్యం
స్వాతిముత్యం
సి.ఎన్.చంద్రశేఖర్
(9490050214)
"మా నాన్నగారు కనిపించడం లేదు..."
శిరీష మాట విని "ఎక్కడికి వెళ్ళారు?" అని ఆశ్చర్యంతో అడిగాడు వెంకట్.
"ఆ విషయం తెలిస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తాను? నేను అక్కడికే వెళ్ళి ఆయన్ను ఇంటికి పిలుచుకుని వచ్చేదాన్నిగా" అంది అతన్ని విసుగ్గా చూస్తూ.
"సారీ....నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళి చూస్తాను"
శిరీష మేడ దిగి కిందకివచ్చి సిటౌట్ లో కూర్చుంది.
పదినిమిషాలైనా వెంకట్ క్రిందికి దిగిరాకపోయేసరికి విసురుగా మేడపైకి వెళ్ళింది. వెంకట్ తన పోలియో కాలికి షూస్ వేసుకుంటున్నాడు.
ఆమె వెంటనే మేడ దిగి వచ్చేసింది. మరో అయిదు నిమిషాల తర్వాత వెంకట్ వచ్చాడు.
"ఎలా వెళ్తారు" అని అడిగింది అతన్ని.
"నా మోపెడ్ ఉందిగా...!" అంటూ గేటు వైపు నడవసాగాడు
ఆమె అతని నడకనే చూస్తూండిపోయింది. షూస్ వేసుకున్నా ఓ వైపుకు వంగి నడుస్తున్నాడు అతను.
ఆమెకు అతన్ని మొదటిసారి చూసిన సంఘటన గుర్తుకొచ్చింది.
'ఊరికి వెళ్ళిన తను ఇంటికి రాగానే - మేడ మీది పోర్షన్లో ఓ లెక్చరర్ అద్దెకు దిగాడనీ, అతను చాలా మంచివాడనీ తల్లి చెప్పింది. అతను తన కలల్లోని రాకుమారుడిలా ఉంటాడని ఊహిస్తూ మేడపైకి వెళ్ళింది తను. అక్కడ తన కాలికి షూస్ వేసుకుంటున్న వెంకట్ కనిపించాడు.
తను చాలా నిరుత్సాహపడింది. అతను గొప్ప అందగాడు కాదు. చాలా సాధారణంగా ఉన్నాడు...పైగా పోలియో కాలు! తర్వాత మాటల్లో అతను 'పార్ట్ టైం లెక్చరర్’ అని తెలిసింది. అప్పట్నుంచీ అతనంటే ఆసక్తి పోయింది. అయితే అవసర సమయాల్లో అతని సహాయం కోరడం తప్పనిసరి అవుతోంది' అనుకుంది.
అంతలో... ఆమె ఆలోచనలు తండ్రివైపు మళ్ళాయి.
'అసలే మతిస్థిమితం లేని మనిషి. దారితప్పితే ఇల్లు తెలుసుకోలేడు. ఇదివరకు రెండుసార్లు ఇలాగే బయటకు వెళ్ళి తిరిగి రాకపోతే వెంకట్ వెళ్ళి వెతికి ఇంటికి పిలుచుకుని వచ్చాడు. ఈసారి కూడా ఆయన త్వరగా దొరికితే బాగుణ్ణు! తల్లి గుడికి పోతూ తండ్రి గురించి ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది. తనూ జాగ్రత్తగానే ఉంది. రెండు నిమిషాలు బాత్రూంకి వెళ్ళివచ్చేసరికి మనిషి మాయమైపోయాడు ' అనుకుంది.
అరగంట తర్వాత ఆమె తల్లి శారద వచ్చింది. గంట తర్వాత వెంకట్ వచ్చాడు ఒంటరిగా.
"ఆయన కనబళ్ళేదా?" తల్లీకూతుళ్ళు ఆత్రుతగా అడిగారు అతన్ని.
"లేదు. ఊరంతా వెతికాను. షాపుల్లో,హోటళ్ళలో, గుళ్ళలో...అన్ని చోట్లా చూశాను. శివానందంగారు కనబళ్ళేదు"
వెంటనే శారద బావురుమంది.
"అరె.. ఏమైందిప్పుడు? ఊరుకోండి. ఆయన్ని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది...సరేనా! ముందు ఇంట్లోకి పదండి..." అన్నాడు వెంకట్.
ఇంట్లోకి వచ్చాక "మీ స్నేహితులకీ, బంధువులకీ ఫోన్ చేశారా? వీళ్ళలో ఎవరో ఒకరింటికి ఆయన వెళ్ళి ఉండవచ్చు" అన్నాడు వెంకట్ శిరీషతో.
"ఒకరిద్దరికి చేశాను...ఆయన రాలేదన్నారు"
"అందరికీ చెయ్యండి. మన ప్రయత్నలోపం ఉండకూడదు. నేను ఈలోపల ఇంకో రౌండ్ వెతికివస్తాను"
* * * *
రెండురోజులైనా శివానందం తిరిగి రాలేదు.
శారద ఏడుస్తూనే ఉంది. శిరీష, వెంకట్ ఆమెకు ధైర్యం చెబుతున్నారు.
ఓ రోజు వెంకట్ శారదతో " శివానందంగారి గురించి పేపర్లో ప్రకటన ఇద్దామని అనుకుంటున్నాను. మీకు సమ్మతమైతే ఆయన ఫోటోలు కొన్ని ఇవ్వండి" అన్నాడు.
"మంచి ఆలోచన నీది. ఫోటోలు తెస్తాను...కూర్చో" అంటూ శారద ఇంట్లోకి వెళ్ళింది.
"మనం తమిళనాడుకు దగ్గరలో ఉన్నాం కాబట్టి, తమిళ పేపర్లకు కూడా ఇద్దాం. ఆయన్ను చూసినవాళ్ళు కాంటాక్ట్ చేయడానికి నా సెల్ నంబర్ ఇస్తాను" అన్నాడు వెంకట్ శిరీషతో.
"ఎంతవుతుంది వీటికి?" అడిగింది శిరీష.
"నాకూ తెలియదు. మీ నాన్నగారు ఇంటికొచాక లెక్క చెబుతాను. అప్పుడు ఇద్దురు గానీ!" అన్నాడు నవ్వుతూ వెంకట్.
"అక్కర్లేదు. వెయ్యి రూపాయలు ఇస్తాను. లెక్కలు తర్వాత చూద్దాం" అంటూ లోపలికెళ్ళి డబ్బులు తెచ్చి అతని చేతికిచ్చింది. అతను ముభావంగా అందుకున్నాడు. శారద అందించిన ఫోటోలు కూడా తీసుకుని వెళ్ళిపోయాడు.
మరో నాలుగు రోజులు గడచిపోయాయి...శివానందం ఆచూకీ తెలియకుండానే.
* * * *
ఆరోజు రాత్రి పన్నెండు గంటలకు తలుపు తట్టిన శబ్దమైతే-టీవీ చూస్తున్న శిరీష ఉలిక్కిపడింది.
భయంభయంగా కిటికీ తలుపు తీసి చూస్తే...వెంకట్ కనిపించాడు.
ఏం కావాలన్నట్లు అతనివైపు చూసింది.
"తలుపు తెరవండి...మీకో విషయం చెప్పాలి" అన్నాడు నవ్వుతూ.
"పిచ్చి వేషాలు మాని విషయం చెప్పండి!" అంది కటువుగా.
"మీ నాన్నగారు వచ్చారు...ఇంట్లోకి తీసుకెళ్ళండి!" అనేసి మేడ మెట్లు ఎక్కి తన పోర్షన్లోకి వెళ్ళిపోయాడు వెంకట్.
తల్లిని లేపి, తర్వాత తలుపు తెరిచిన శిరీషకు ఎదురుగా తండ్రి కనిపించాడు.
* * * *
"ఎక్కడ దొరికారు ఆయన?" మరుసటి రోజు వెంకట్ ని అడిగింది శారద.
"చెన్నైలో. నిన్న సాయంత్రం కాలేజీలో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది. వెంటనే బయలుదేరి వెళ్ళాను"
"వాళ్ళకేమైనా నగదు బహుమతి ఇచ్చావా?"
"ఇవ్వబోయాను...వాళ్ళు తీసుకోలేదు"
"ప్రపంచంలో నీలాంటి మంచివాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట!అవునూ...నిన్న రాత్రి శిరీష నిన్నేమైనా అన్నదా?"
"మీకెందుకా అనుమానం వచ్చింది?"
"ఇంటి బయట నువ్వు కనబడలేదు కాబట్టి"
"మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ చేశాను. అది బెడిసికొట్టింది...అంతే!"
"ఇంతకీ...ఏమంది?"
"ఏమనలేదు.."
"నువ్వు చెప్పకపోయినా నేను ఊహించగలను. దాని మాటల్ని మనసుకు తీసుకోవద్దు.
దానికి నోటిదురుసు ఎక్కువ"
"నేను ఆ విషయాన్ని నిన్ననే మర్చిపోయాను. పైగా, ఆవిడ ఆ సమయంలో తలుపు తీయకపోవడాన్ని నేను నూటికి నూరుపాళ్ళూ సమర్థిస్తాను."
అతన్ని చూస్తూంటే శారదకు ఎంతో ముచ్చటేసింది.
'ఇతనికి కోపాలూ, ఇగోలూ లేవా? శిరీష దురుసుగా మాట్లాడినా ఎంత హాయిగా నవ్వుతున్నాడు?అదే ఇంకొకరైతే 'ఇంత సహాయం చేసిన నన్నే అవమానిస్తారా?' అని ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోయేవారు’ అనుకుంది.
వెంకట్ వెళ్ళిపోయాక శిరీష గురించి ఆలోచిస్తూండిపోయింది...
'తండ్రి గెజిటెడ్ ఆఫీసరు కావడం, కాలేజీలో బ్యూటీ క్వీన్ గా పేరుపొందడం, ఒక్కతే కూతురని తండ్రి గారాబం చేయడం...శిరీషలో అహాన్ని పెంచాయి. ఎవ్వరినీ లెక్కచేయని తత్వం ఆమెది.
బి.ఎస్.సి. బొటాబొటీ మార్కులతో పాసైంది. తను కోరితే బి.ఈడీ. చేసింది. ఇంతలో...భర్త లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్ళకు చిక్కాడు. అతని ఉద్యోగం పోయింది. ఆ షాక్ తో అతనికి మతిస్థిమితం తప్పింది. వైద్యం చేయించినా మామూలు మనిషి కాలేకపోయాడు. రోజూ ఓ యోగిలా అరుగుమీద కూర్చుంటాడు. భోజనానికి, టిఫిన్ కీ పిలిస్తే వచ్చి తింటాడు. కూతురు ఉద్యోగం చేస్తే ఆర్థికంగా కాస్త వెసులుబాటు ఉంటుందని తన ఆశ! కానీ, శిరీష ఆ ప్రయత్నమే చేయడం లేదు. ఆలస్యంగా నిద్రలేవడం, టీవీలో సినిమాలు చూడటం, సాయంత్రాలు స్నేహితురాళ్ళ ఇళ్ళకూ, సినిమాలకూ వెళ్ళడం చేస్తూ రోజులు గడిపేస్తూంది. దాచుకున్న డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. ఇకపై వెంకట్ ఇచ్చే అద్దెతోనే బ్రతకవలసివస్తుంది’ అనుకుంది శారద.
వెంటనే ఆమె ఆలోచనలు వెంకట్ మీదికి మళ్ళాయి.
'ఎంత మంచి అబ్బాయి వెంకట్. ఉదయాన్నే లేచి పూజ చేస్తాడు. వంట స్వయంగా చేసుకుంటాడు. కాలేజీకి వెళ్ళి పాఠాలు చెబుతాడు. సాయంత్రాలు ఉద్యోగాల కోసం పోటీపరీక్షలు రాసేవాళ్ళకు ట్యూషన్లు చెబుతాడు. రాత్రి చాలాసేపటివరకూ చదువుకుంటూ ఉంటాడు.
'ఇతనికి అలసట, విసుగు అనేవి ఉండవా...?' అనిపిస్తుంది. అందరితోనూ నవ్వుతూ మాట్లాడతాడు, ఎవ్వరినీ నొప్పించడు. భగవంతుడు ఆ 'చిన్న వంకా పెట్టకుండా ఉండిఉంటే అతన్నిఅల్లుడిగా చేసుకునేదాన్ని!' అనుకుంది.
మళ్ళీ 'అది వంక అని భావిస్తేనే కదా ఇబ్బంది...ఓ సారి శిరీషతో అతని విషయం మాట్లాడాలి!' అనుకుంది.
మరుసటిరోజు భోజనాలప్పుడు శిరీషతో తన మనసులోని మాటను చెప్పింది.
"అతను పార్ట్ టైం లెక్చరర్ అమ్మా...పర్మనెంటు ఉద్యోగి కాదు" అంది శిరీష.
"అయితేనేం? ఏదో ఒకరోజు పర్మనెంట్ అవుతుంది. పైగా, అతను చదువుకున్నవాడు, తెలివితేటలు గలవాడు. తన కాళ్ళమీద తాను నిలబడగలడు"
"నిలబడలేడమ్మా! అతన్ని తన రెండు కాళ్ళమీద నిటారుగా నిలబడమను.....నేను పెళ్ళి చేసుకుంటాను."
నోరు తెరచి ఆశ్చర్యంగా చూస్తూండిపోయింది శారద. తన కూతురు ఓ వ్యక్తి శారీరక లోపం గురించి అంత సంస్కారరహితంగా మాట్లాడుతుందని ఆమె ఊహించలేదు. ఆమె మనసు ఎంతో బాధపడింది.
ఇక శిరీషతో మాట్లాడి లాభంలేదని ఊరుకుంది.
* * * *
ప్రభుత్వం టీచర్ పోస్టులకు పరీక్షలు ప్రకటించింది.
"వెంకట్ ఆ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నాడు. నువ్వూ వెళ్ళవచ్చుగా" అంది శిరీషతో శారద ఓరోజు.
"నేను నా ఫ్రెండ్స్ తో కలసి వేరే చోట కోచింగ్ తీసుకుంటాను"
"ఆ వెళ్ళేదేదో వెంకట్ దగ్గరికే వెళ్ళొచ్చుగా! ఆటోల ఖర్చుండదు. పైగా, అతను మనకు ఫీజులో కన్సెషన్ ఇవ్వొచ్చు"
"అతనిచ్చే కన్సెషన్ మనకు అవసరం లేదు"
"అవసరం ఉంది శిరీషా! ఇంకో రెండు నెలలు గడిస్తే మనకు రోజులు గడవడం కూడా కష్టమౌతుంది. నువ్వే అర్థం చేసుకుంటావని ఇన్నాళ్ళూ చెప్పలేదు. నువ్వు అర్జెంటుగా ఓ ఉద్యోగం తెచ్చుకోవాలి. అప్పుడే మనం రెండుపూటలా తినగలం."
శిరీష కాసేపు మౌనంగా ఉండిపోయింది. తర్వాత "నువ్వు అతనితో మాట్లాడు...అతను ఒప్పుకుంటే వెళ్తాను" అంది.
* * * *
శారద వెంకట్ తో శిరీష కోచింగ్ విషయం చెప్పగానే-"తప్పకుండా రమ్మనండి. ఆ బ్యాచ్ మొదలుపెట్టి వారం గడచిపోయింది. అయినా ఫర్వాలేదు. తనకు జరిగిన పోర్షన్ కూడా చెబుతాను" అన్నాడు వెంకట్.
"మరి, నీ ఫీజు?"
"ఉద్యోగం వచ్చాక ఫీజు సంగతి మాట్లాడదాం"
"అలా కాదు, మిగిలిన వాళ్ళు ఎంత ఇస్తున్నారు?"
"నేను వాళ్ళతో ఏమీ చెప్పలేదు. వాళ్ళలో చాలామంది నిరుద్యోగులూ, చిరుద్యోగులూ ఉన్నారు. వాళ్ళను పీడించి తీసుకుంటే నాకేం ఒరుగుతుంది? ఎటూ నేను దీనిపైనే ఆధారపడి బ్రతకడం లేదు. ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను"
ఆమె ఆశ్చర్యంగా వెంకట్ వైపు చూస్తూండిపోయింది.
కొంతమంది లెక్చరర్లు గవర్నమెంట్ కాలేజీల్లో లీవు పెట్టి జీతాలు తీసుకుంటూ, ప్రైవేటు కాలేజీల్లో పాఠాలు చెబుతూ లక్షలు ఆర్జించడం ఆమెకు తెలుసు. వెంకట్ ఎటువంటి ఆదాయం ఆశించకుండా అంత శ్రమ తీసుకోవడం ఆమెను విస్మయపరచింది.
'జీవించడానికే డబ్బులు గానీ...డబ్బే జీవితం కాదనే సత్యం తెలిసిన వ్యక్తి ఇతను’ అనుకుంది.
* * * *
శిరీష డి.ఏస్సీ. పరీక్ష పాసైంది.
ఇంటర్యూలో కూడా సెలెక్ట్ అయింది. ఆమెతో పాటు వెంకట్ దగ్గర శిక్షణ తీసుకున్న మరో పదిహేడుమంది ఉద్యోగానికి ఎంపికయ్యారు.
ఓరోజు మేడ దిగి వస్తున్న శిరీషను చూసి ఆశ్చర్యపోయింది శారద.
"ఏమిటీ...లేక లేక ఈరోజు తమరు మేడ పైకి వెళ్ళారు?" నవ్వుతూ అడిగింది కూతుర్ని.
"డి.ఈ.ఓ. గారి అబ్బాయి వెంకట్ స్టూడెంట్ అట! ఆయనతో మాట్లాడి నాకు దగ్గర్లో పోష్టింగ్ ఇప్పించమని వెంకట్ తో చెప్పాను"
"ఏమన్నాడు?"
"ఏమంటాడు? తప్పకుండా చెబుతానన్నాడు. స్నేహితుడంటే అవసరంలో సహాయపడేవాడే కదా!" అంది శిరీష.
"అవును. అవసరంలో గుర్తొచ్చేవాళ్ళు కూడా స్నేహితులే. కానీ, అవసరం వచ్చినప్పుడే స్నేహితుల్ని గుర్తుతెచ్చుకునే వాళ్ళు మంచి స్నేహితులు కారు."
"నీ సెటైర్ నాకర్థం కాలేదు"
"నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాక మళ్ళీ మేడ ఎక్కలేదు. నువ్వు ఇంటర్వ్యూలో నెగ్గిన విషయం కూడా సుధీర్ చెబితేనే అతనికి తెలిసింది. నీ విజయం కోసం అంతగా శ్రమపడిన అతనికి ఆ శుభవార్త స్వయంగా చెప్పాలని నీకు అనిపించలేదా?"
"నువ్వు చెప్పావు కదాని ఊరుకున్నాను. ఇవన్నీ నీతో చెప్పుకుని ఏడ్చాడా?" విసుగ్గా అంది శిరీష.
"చెప్పుకోలేదు...చెప్పాడు. ఆరోజు నేను ఊర్లో లేను. సాయంత్రం ఊరినుంచి వచ్చాక అతనికి చెప్పాను. నువ్వు అతనికి విషయం చెప్పకపోయేసరికి నువ్వు సెలెక్ట్ కాలేదనుకుని బాధపడ్డాడట. తర్వాత సుధీర్ ఫోన్ చేసి నువ్వూ సెలెక్ట్ అయ్యావని చెబితే సంతోషించాడట. నువ్వు చెప్పు...నీ పద్దతి కాస్తయినా బాగుందా?"
శారద మాటలకు బదులు చెప్పకుండా విసురుగా వెళ్ళిపోయింది శిరీష.
'మనుషులు- ఆరోగ్యం విలువ, స్నేహితుల విలువ వాటిని కోల్పోయేంతవరకు తెలుసుకోలేరంటారు. ఇది మాత్రం కోల్పోయినా తెలుసుకోలేదు’ అనుకుంది శారద.
* * * *
ఓ ఆదివారం వెంకట్ కోసం అతని స్నేహితుడు హరి వచ్చాడు.
మేడమీది పోర్షన్ కి తాళం వేసిఉండటం చూసి శారదను అడిగాడు.
"వెంకట్ ఎక్కడికి వెళుతున్నాడో నాకు చెప్పలేదు. ప్రతి ఆదివారం ఉదయం పూట అతను మాకు కనిపించడు" అంది శారద.
"ఈ రోజు ఆదివారం కదా...వికలాంగుల ఆశ్రమానికి వెళ్ళిఉంటాడు. నేను ఆ విషయం మరచిపోయాను. నా పేరు హరిప్రసాద్....వెంకట్ ఫ్రెండ్ ని. తిరుపతి నుంచి వచ్చాను. సాయంత్రం తనని కలుస్తానని వాడొస్తే చెప్పండి."
"ఎండనబడి వచ్చారు......లోపలికి రండి...నిమ్మరసం తాగి వెళుదురుగాని!" అంది శారద.
అతను సోఫాలో కూర్చున్నాక మంచినీళ్ళు అందించింది.
"వెంకట్ ని తల్లిలా చూసుకునే శారదగారు మీరేనన్నమాట" అన్నాడు హరి నవ్వుతూ.
"శారదను నేనే....ఇది నా కూతురు" అంటూ శిరీషను చూపి ఏదో చెప్పబోతూంటే...
"శిరీష గారు...గవర్నమెంట్ స్కూల్లో టీచరు...మా వెంకట్ శిష్యురాలు. బయట అరుగు మీద కూర్చున్నాయన యోగి శివానందంగారు....అవునా?" అన్నాడు హరి.
శారద నవ్వుతూ "వెంకట్ మా వివరాలన్నీ మీకు చెప్పినట్లున్నాడు. అయినా అతనికి ఇల్లు, ఉద్యోగం ఉంది కదా...ఆశ్రమానికి వెళ్ళాల్సిన అవసరమేముంది? వారానికి ఒకరోజైనా మాతో గడపవచ్చు కదా!" అంది.
"మీరన్నట్లు వాడికి అవసరం లేదు. అక్కడి ఆశ్రమవాసులకి వీడి అవసరం ఉంది. ప్రతి ఆదివారం వాళ్ళతో గడిపి, వారికి మానసిక ధైర్యాన్నీ, ఉల్లాసాన్నీ ఇస్తాడు. మామూలు మనుషులకన్నా తాము ఎందులోనూ తీసిపోమంటూ ఋజువు చేయాలని ఉత్సాహపరుస్తాడు. తాను సాధించిన విజయాల గురించి చెప్పి వారికి స్ఫూర్తినిస్తాడు" అన్నాడు హరి.
"స్ఫూర్తినిచ్చేంత విజయాలు అతడేం సాధించాడని?" వెటకారంగా అంది శిరీష.
"బి.ఎస్సీ. మూడేళ్ళూ, ఎం.ఎస్సీ. రెండేళ్ళూ కలిపి అయిడేళ్ళు వరుసగా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్స్ సాధించాడు. అది అచీవ్ మెంట్ కాదా?"
"వెంకట్ గోల్డ్ మెడల్స్ సాధించాడా? నాతో ఎప్పుడూ చెప్పనే లేదు" అంది శారద.
ఆమె ముఖంలో ఆశ్చర్యం, ఆనందం కనిపించాయి అతనికి.
"వాడు తన విజయాల గురించి చెప్పడు. కానీ, తన తోటివాళ్ళు సాధించిన విజయాల గురించి పొంగిపోతాడు. తనకు పరిచయమైన ప్రతి వ్యక్తీ బాగుండాలని కోరుకునే మనసు వాడిది. నిజానికీ నేనూ, వాడూ వ్యవసాయ కూలీల కుటుంబం నుంచి వచ్చినవాళ్ళమే. అయితే వాడు శ్రద్దగా చదువుకునేవాడు. నేను జులాయిగా తిరిగేవాణ్ణి. నన్ను సరిదిద్ది మంచి దారిలో పెట్టిన గురువు వాడు. నేనూ, వాడూ బ్యాంకు పరీక్షలు రాశాం. ఇద్దరం పరీక్ష పాసయ్యాం. ఇంటర్వ్యూ లో నేను సెలెక్ట్ అయ్యాను...వాడు కాలేదు. అయినా వాడి ముఖంలో గానీ, మాటల్లో గానీ రవ్వంత అసూయ కూడా నాకు కనబళ్ళేదు. పైగా నాకంటే వాడే ఎక్కువగా ఆనందించాడు. అటువంటి మనుషుల్ని చాలా అరుదుగా చూస్తాం మనం"
"అతను ఇంటర్వ్యూ లో సెలెక్ట్ కాకపోవడం ఏమిటి? ఫిజికల్లీ హ్యాండీకాప్డ్ కోటా కింద అతనికి రిజర్వేషన్ ఉందిగా!" అని అడిగింది శిరీష.
"వాడు ఆ సదుపాయాన్ని వాడుకోలేదు. వాడుకోవడం వాడికి ఇష్టం లేదు కూడా! మామూలు మనుషుల కన్నా తను ఏ విధంగానూ తక్కువ కాదని నిరూపించుకోవాలనే తపన కలిగిన వాడు వెంకట్. స్కూల్లో చదువుతున్నప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడూ వీడికే వస్తోందని ఈర్ష్యతో క్లాసుమేట్స్ వీణ్ణి మరే విధంగానూ తప్పు పట్టలేక 'కుంటివాడు’ అని వెక్కిరించేవాళ్ళు. వీణ్ణి అభిమానించే టీచర్లు సైతం వీడి ఐడెంటిటీ కోసం 'పోలియో కాలుతో నడుస్తాడే...ఆ అబ్బాయి!' అని తోటివాళ్ళతో చెప్పేవాళ్ళు. ఆ విషయం తెలిసి 'నాకు వెంకట్ అని పేరుంది కదా...పోలియో ప్రస్తావన ఎందుకు చేయాలి’ అని వాపోయేవాడు. క్రమంగా ఆ బాధను కసిగా మార్చుకున్నాడు. ఆ కసితోనే గోల్డ్ మెడల్స్ సాధించాడు."
"అన్ని గోల్డ్ మెడల్స్ సాధించినవాడు పార్ట్ టైం లెక్చరర్ ఉద్యోగం చేయడం ఏమిటి?" అంది శారద.
"చదువు పూర్తయినా తండ్రి సంపాదన మీద ఆధారపడటం ఇష్టంలేక ఈ ఉద్యోగంలో చేరాడు. అయితే వాడి ఆలోచనలు వేరు, ధ్యేయం వేరు. అంతటి బలవంతులైన పాండవులు కూడా విరాటరాజు కొలువులో ఉద్యోగానికి చేరారు. వెంకట్ కూడా అంతే! సమయమొస్తే ఓ భీముడిగా, ఓ అర్జునుడిగా తనను తాను నిరూపించుకుంటాడు" అన్నాడు హరి.
* * * *
ఆరు నెలల తర్వాత హరి అన్న మాటలు నిజమయ్యాయి.
వెంకట్ ఐ.ఏ.ఎస్. పాసయ్యాడు.
శిరీషకు నమ్మబుద్దేయడం లేదు.
'తక్కువ ఖరీదు దుస్తులు ధరించి, పాత మోపెడ్ పై వెళ్ళే వెంకట్- ఇప్పుడు ఐ.ఏ.ఎస్. ఆఫీసరు. కాబోయే కలెక్టరు ' అనుకుంది.
శారదకూ ఆశ్చర్యంగా ఉంది...'ఐ.ఏ.ఎస్. పాసయినా వెంకట్ లో కాస్త కూడా అహం కనిపించడం లేదు. అదే నమ్రత, అదే చిరునవ్వు! 'నిండు కుండ తొణకదు’ అని ఇలాంటివారిని చూసే అన్నారేమో! అసలు ఈ అబ్బాయి తన ఇంట్లో చేరినప్పటినుంచీ తనను తరచుగా ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉన్నాడు’ అనుకుంది.
వెంకట్ ఆ ఊర్లో ఓ హీరో అయిపోయాడు. ఇంటిదగ్గ ఆత్మీయుల సందడి పెరిగింది. పత్రికా విలేఖర్ల హడావుడి మొదలైంది. అతని ప్రమేయం లేకుండానే అతని ఫోటోతో హోర్డింగులు వెలిశాయి. స్కూలు, కాలేజీ యాజమాన్యాలు తమ విద్యార్థులకు స్ఫూర్తినివ్వమని ఆహ్వానింపసాగాయి. అతని తల్లితండ్రులు వచ్చి నాలుగు రోజులుండి కొడుకు ఆనందాన్ని పంచుకుని వెళ్ళారు.
క్రమంగా శిరీషకు వెంకట్ పట్ల ఆసక్తి పెరగసాగింది. అది అతను ఐ.ఏ.ఎస్. అయినందువల్ల కావచ్చు...లేదా, ఊర్లో అతనికి ఏర్పడ్డ 'ఫాలోయింగ్' వల్ల కూడా కావచ్చు.
ఆమెకు తల్లి ఇదివరలో చేసిన పెళ్ళి ప్రొపోజల్ గుర్తొచ్చింది. 'ఓ సారి వెంకట్ తో మాట్లాడి తన పట్ల అతని అభిప్రాయం కనుక్కోవాలి ' అనుకుంది.
అయితే...వెంకట్ తో ఏకాంతంగా మాట్లాడే అవకాశం ఆమెకి చాలా రోజులదాకా దొరకలేదు.
* * * *
ఆరోజు సాయంత్రం మేడమీద సందడి లేకపోవడం గమనించి వేగంగా మెట్లెక్కి అతని ఇంట్లోకి నడిచింది.
వెంకట్ ఓ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆమె గొప్ప అందగత్తె కాదుగానీ...చూడటానికి ముచ్చటగా ఉంది.
శిరీషను చూసిన వెంకట్ "రండి...కూర్చోండి!" అంటూ ఆహ్వానించాడు. తర్వాత "ఈవిడ శ్రావణి...నా కాబోయే భార్య." అంటూ ఆ అమ్మాయిని శిరీషకు పరిచయం చేశాడు.
ఆ అమ్మాయి నవ్వుతూ రెండుచేతులూ జోడించింది.
శిరీష ముఖం చిన్నబోయింది.
బలవంతంగా ముఖంపై నవ్వు తెచ్చుకుంటూ ప్రతినమస్కారం చేసింది. ఆమెకు శ్రావణి పై రవ్వంత అసూయ కలిగింది.
తర్వాత "మీరూ ఐ.ఏ.ఎస్. పాసయ్యారా?" అని శ్రావణిని అడిగింది.
ఆమె బదులివ్వకముందే వెంకట్ అందుకుని "లేదు. తను బి.ఎస్సీ. పాసైంది. వికలాంగుల ఆశ్రమంలో పనిచేస్తోంది" అన్నాడు.
"మీరు వికలాంగుల ఆశ్రమానికి వికలాంగుల కోసం వెళ్తున్నారనుకున్నాను" అంది శిరీష వెటకారంగా.
వెంకట్ నవ్వుతూ "నేను నిజంగా వికలాంగుల కోసమే ఆశ్రమానికి వెళ్తాను..." అన్నాడు. తర్వాత శ్రావణితో "ఇక మీరు బయలుదేరండి...ఇప్పటికే ఆలస్యమయింది" అన్నాడు.
ఆమె శిరీష వైపు తిరిగి 'వెళ్తున్నా...'నన్నట్టు చూసి వెళ్ళిపోయింది.
"మీ కాబోయే శ్రీమతికి తను కలెక్టర్ భార్య కాబోతున్నానని గర్వంలా ఉంది. పెదవి విప్పి నాతో ఓ మాట కూడా మాట్లాడలేదు" అంది శిరీష నిష్టూరంగా.
"ఆమె పెదవి విప్పగలదు. కానీ, మాట్లాడలేదు"
షాక్ తిన్నట్లు చూస్తూండిపోయింది శిరీష.
"నేను తన గొంతునౌతాను. తను నన్ను ముందుకు నడిపిస్తుంది." అన్నాడు వెంకట్.
అతను ఎంతో ఎత్తుకు ఎదిగిపోయినట్లు , తాను అతని ముందు అన్ని విషయాల్లో చిన్నగా కనిపిస్తున్నట్లు అనిపించింది ఆమెకు. తన ఆశయాలనూ, ఆదర్శాలనూ చేతలలో చూపిన అతన్ని మనస్ఫూర్తిగా అభినందించాలని ఆమెకు అనిపించింది.
లేచి నిలబడి "కంగ్రాచ్యులేషన్స్" అంటూ చేయి అందించింది.
అతను ఆమె చేతిని ఆప్యాయంగా నొక్కి వదిలాడు.
* * * *
వెంకట్ ఇల్లు ఖాళీ చేస్తూంటే శారదకు ఏడుపొచ్చింది.
శివానందం, శారదల పాదాలకు నమస్కారం చేశాడు వెంకట్.
అతని స్నేహితులు స్టేషన్ కి వెళ్ళడానికి కారు తీసుకొచ్చారు. వెంకట్ కారు వైపు నడచి వెళ్తూంటే శిరీష అతన్నే చూస్తూండిపోయింది.
ఇప్పుడు అతను ఓ వైపుకు వంగి నడుస్తున్నట్టు ఆమెకు అనిపించలేదు. ఎంతో హుందాగా నడుస్తున్నట్లు అనిపించింది.