నాన్న ప్రేమ
నాన్న ప్రేమ...
రచన: నండూరి సుందరీ నాగమణి
“ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అలాగేనా ప్రవర్తించేది? నీ వరస ఏమైనా బాగుందా అపూ?” మందలింపుగా అన్నాడు వెంకట్.
“ఇప్పుడేమైంది? వాళ్లకి మర్యాదలలో ఏం లోటు చేసాను?” చాకుని బంగాళాదుంప మీద కసా కసా ప్రయోగిస్తున్న నా గొంతు నాకు తెలియకుండానే కరుకుగా పలికింది.
“వచ్చిన వాళ్ళు మీ నాన్నగారి స్నేహితులు... ఆయన మీద ప్రేమాభిమానాలతోనే కదా మనింటికి వచ్చారు?”
“అవును... వచ్చారు. అందుకే కదా, వేడి వేడిగా ఉల్లి పకోడీలు వేసి, చల్ల చల్లగా నిమ్మకాయ రసం ఇచ్చాను?”
“ఇవ్వలేదని కాదులే...ఆ పకోడీలు వేస్తున్నంతసేపూ ఎంత గింజుకున్నావో నాకు తెలియదా అపూ? వచ్చిన వాళ్ళు పరామర్శ కోసం వచ్చారు. నీకు సాంత్వన వచనాలు చెప్పటానికి, నీనుంచి కాస్త మంచి పలకరింపు వినటానికి వచ్చారు. నువ్వేమో వంద కుంపట్లు, లక్ష చీమలపుట్టలు ముఖంలో ఉన్నట్టు పెట్టుకొని కూర్చున్నావు...”
“నా మొహమే అంతండీ....” కరిచినంత పని చేసాను.
“అపూ, నీ మనసేమిటో నాకు తెలియనిదా? అందరినీ ఎంతో కరుణతో ప్రేమతో చూసే నువ్వు, మీ నాన్నంటే మాత్రం ఎందుకలా నిప్పులు చెరుగుతావు? సరే, నీకు కోపం ఉంది ఆయనంటే... ఒప్పుకుంటాను. ఆయన ఇప్పుడు ఈ లోకంలోనే లేరు కదా... అలాంటప్పుడు ఆ కోపాన్ని ఆయన మిత్రుల మీద కూడా చూపిస్తే ఎలా చెప్పు?” అనునయంగా అన్నాడు వెంకట్.
“ఈ పూట అన్నం తింటారా, రొట్టెలు ఒత్తాలా?” అడుగుతూ ఉంటే, దీక్షగా నా మొహంలోకి చూసి, హాల్లోకి వెళ్లిపోయాడు, వెంకట్.
‘హు! ఎవరికి తెలుసు నా వేదన?’ నా మనసు బాధగా మూల్గింది.
***
“అమ్మో...చెల్లాయ్స్ నాన్న వచ్చేస్తున్నారు...” పెద్దక్క అరుణ పరుగున వచ్చి చెప్పింది. అంతే!
తనూ, చిన్నక్కా, నేనూ కలిసి చాప మీద కూర్చుని పుస్తకాలు తెరిచాము అర్జెంటుగా...
“ఫర్ మెన్ మే కం అండ్ మెన్ మే గో... బట్ ఐ గో ఆన్ ఫరెవర్...” అంటూ పదో తరగతి చదువుతున్న అరుణక్కా,
“మకర ముఖాంతరస్థమగు మానికమున్ బెకలించవచ్చు...” అంటూ ఎనిమిదో తరగతి చదువుతున్న చిన్నక్క అపరంజీ, “పదమూడొకట్ల పదమూడు, పదమూడు రెళ్ళ ఇరవై ఆరు, పదమూడు మూళ్ళ ముప్పై తొమ్మిది...” అంటూ నాల్గవ తరగతి చదువుతున్న నేనూ బృందగానం మొదలుపెట్టాము.
మేము చదువు మొదలు పెట్టగానే విషయం అర్థమైన అమ్మ పొయ్యి మీద టీకి నీళ్ళు పెట్టింది.
నాన్న వీధి గదిలో చెప్పులు విప్పి, సందులోంచి పెరట్లోకి వెళ్లి, అక్కడ తొట్టిలోని నీళ్ళతో కాళ్ళు, మొహం కడుక్కుని, వంటింట్లోంచి లోపలి వచ్చాడు.
“ఏమిటే మాణిక్యం, ఏమైనా ఉత్తరాలు వచ్చాయా?” అమ్మ అందించిన టవల్ తో తుడుచుకుంటూ అడిగాడు. ఆయన మామూలుగానే అడిగినా ఉరుము ఉరిమినట్టే ఉంటుంది.
“ఒక ఇంగ్లాండ్ [ఇన్లాండ్] లెటర్ వచ్చిందండి...ఇదిగో...”
“ఇంకా విప్పలేదా? మా అన్నయ్య దగ్గరనుంచల్లే ఉంది. అమ్మాయ్ అరుణా, ఇలా రా తల్లీ, ఈ ఉత్తరం కాస్త చదువు...”
పెద్దక్క ఇంగ్లీష్ పద్యం చదవటం ఆపి వచ్చి ఉత్తరం గట్టిగా చదవగానే, “ఊ... ఇక వెళ్లి చదువుకో...” అన్నారు నాన్న.
“విన్నావుగా, మన పొలం ఆయన పొలాన్ని ఆనుకొని ఉంది కనుక, మనకిక వ్యవసాయం చేయించే ఉద్దేశ్యం లేదు కనుక, తనకే మన ఐదెకరాలు అమ్మేయమని అంటున్నాడు...” తలూపుతూ టీ గ్లాసు చేతికి అందించింది, అమ్మ.
“అందరూ ఇచ్చే రేటే వాడూ ఇస్తే బాగుంటుంది... ఇవాళ బాంకులో డిపాజిట్ వేసుకుంటే రేపు పిల్లల చదువులకు పనికొస్తుంది... ఆలోచించి చేద్దాం లే... ఆ సంచీలో కూరగాయలు ఉన్నాయి చూడు...”
ఉత్తరాన్ని తీగకు గుచ్చి, వీధి వాకిట్లోకి వెళ్లి అక్కడ వాల్చి ఉన్న పడక కుర్చీలో కూర్చుని సేద దీరుతూ, రేడియో పెట్టాడు వార్తల కోసమని.
***
మా నాన్న నరసింహం ఒక చిరుద్యోగి. ఆయనకి దురలవాట్లు ఏమీ లేవు కాని, మనిషికి విపరీతమైన కోపం. నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేస్తాడు. అమ్మనూ, మమ్మల్నీ కూడా అల్లంత దూరాన నిలబెడతాడు. అనవసరమైన ఖర్చులు పెడితే అసలు ఇష్టపడడు. గట్టిగా కసురుతూ తిట్టటమే కాదు, అప్పుడప్పుడూ అమ్మ మీదా, మా మీదా చేయి కూడా చేసుకుంటాడు. ఆయన ఇంట్లోకి వస్తూ ఉంటే అందరికీ భయమే.
ఒకసారి పండగని, పక్కింటి వాళ్ళు అందరూ కొనుక్కుంటుంటే, వాళ్ళ బలవంతం మీద చేతులకు గాజులు వేయించుకుంది అమ్మ. ఆ సాయంత్రం తనకు చెప్పకుండా డబ్బు ఖర్చు పెట్టి గాజులు కొన్నదని చెంపలు తట్లు తేలేలా కొట్టాడు అమ్మను.
అమ్మ చెంపల మీది వాతలకు కొబ్బరి నూనె రాస్తూ, కన్నీళ్లు కారుస్తూనే నాన్న మీద పళ్ళు నూరాను.
అలాంటి సంఘటనలు ఎన్నో మా ఇంట్లో. పెద్ద పిల్లలయిన పెద్దక్కా, చిన్నక్కా నాన్న మీద భయం, గౌరవం తో పాటు కాస్తయినా ప్రేమ కలిగి ఉండేవారు. కాని నాకు మాత్రం ఆయనంటే ఎప్పుడూ ద్వేషమే...
నేను లెక్కల్లో ఫెయిల్ అయితే వీపు పగిలేలా కొట్టాడని, పండక్కి బట్టలు కొనమని అడిగితే, రెడీమేడ్ గౌను కాకుండా అందరికీ ఒకే తాను తెచ్చి లంగా జాకెట్లు కుట్టించాడని... మమ్మల్ని సినిమాకి పంపలేదని... అమ్మను అస్తమానూ తిడతాడని... ఎదురింటబ్బాయి పెద్దక్కను చూసి ఈల వేస్తే అమ్మను తలవాచేలా చీవాట్లు పెట్టాడని... ఇంకా ఇలాంటివే నా కారణాలన్నీ...
“అమ్మా నాన్నకి అసలు మనసనేది లేదమ్మా...” అమ్మ గుండెల్లో తలదాచుకొని ఏడుస్తూ అనే దాన్ని.
“బేబీ, తప్పమ్మా... నాన్నని అలా అనకూడదు...ఆయన మనకోసం ఎంతో కష్టపడుతున్నారు...” అని అమ్మ చెబితే నాకసలు రుచించేది కాదు.
ఇంటర్మీడియట్ పూర్తి కాగానే పెద్దక్కకి దగ్గర బంధువులలోనే సంబంధం వస్తే పెళ్లి చేసేసాడు నాన్న.
‘నాన్నా, నేను ఇంకా చదువుకుంటాను’ అని అది ఎంత ఏడ్చి మొత్తుకున్నా వినలేదు.
అమ్మ నచ్చజెప్పబోతే, “నువ్వా, నేనా ఇంటి యజమాని? నోరుమూసుకో, నా బాధ్యతలు తీరాలి... ఇంకా ఇద్దరున్నారు...” అంటూ ఆమె నోరు మూయించాడు.
అపరంజక్కకి డిగ్రీ పూర్తి కాగానే అహమ్మదాబాద్ లో ఉద్యోగం వచ్చింది. అది అక్కడికి వెళ్లి ఉద్యోగంలో జాయిన్ అయింది. ఏడాది తిరిగేలోగా దానికి కూడా వివాహం జరిపించేసాడు నాన్న.
నేను ఇంటర్ బైపీసీ మంచి మార్కులతో పాసయ్యే సరికి నాన్నకి ఇంకా మూడేళ్ళ సర్వీసే మిగిలింది. నన్ను మెడిసిన్ చదివించమని వేడుకున్నాను కాని, అంత ఖరీదైన చదువు చదివించటానికి తనకు స్తోమతు చాలదంటూ నా కోరికను నిరాకరించాడు నాన్న. ప్రైవేట్ గా డిగ్రీ చేస్తూ జాబ్స్ కి అప్లై చేయమని అన్నాడు. విధి లేక అందుకు అంగీకరించిన నాకు నా తండ్రి నా ఆశాలతలన్నీ కూకటివేళ్ళతో త్రెంపి వేసిన రాక్షసుడిలా కనపడ్డాడు.
అయిష్టంగానే ఉద్యోగ రాత పరీక్షలకు దరఖాస్తు చేసినా, నాకన్నీ మంచి అవకాశాలే వచ్చాయి. హైదరాబాదు రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం వెదుక్కుంటూ నా చెంతకు వచ్చింది.
నన్ను వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఉంచి, అన్ని జాగ్రత్తలూ చెప్పి, దగ్గరుండి ఉద్యోగంలో చేర్పించి, ఇంటికి తిరిగి వచ్చాడు నాన్న.
గాంధీ హాస్పిటల్ కి ఎదురుగా ఉన్న ఇంట్లోనే నేనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉండేది. చక్కగా తెల్లని కోటు, మెళ్ళో స్టెతస్కోపు ధరించి, గేటులోంచి కిలకిలా నవ్వుకుంటూ లోపలికీ బయటికీ తిరిగే మెడికోలను చూస్తూ ఉంటే, మా నాన్న నా బంగారు భవిష్యత్తును కాలరాచేసిన యముడని అనిపించేది నాకు... ఎన్నో రాత్రులు వెక్కి వెక్కి ఏడ్చేదాన్ని, నిద్రపోకుండా...
మెల్లగా రిజర్వ్ బాంకు ఉద్యోగానికి అలవాటు పడి, ఆ ఉద్యోగాన్నీ ప్రేమించటం మొదలుపెట్టినా, మెడికో ఆడపిల్లలని, లేడీ డాక్టర్స్ ని చూసినప్పుడల్లా నా గుండెల్లో సన్నని మంట రేగేది... అది నా తండ్రి మీద వ్యతిరేకతను మరింతగా పెంచేది.
మూడు సంవత్సరాలు గడిచాయి. నన్నెంతగానో అభిమానించే వెంకట్ ఓ శుభముహూర్తాన ‘ఐ లవ్ యూ అపూర్వా!’ అని ప్రపోజ్ చేస్తే అతని ప్రేమని కాదని అనలేకపోయాను.
***
వెంటనే ఇంటికి రమ్మని నాన్న ఇచ్చిన టెలిగ్రాం అందుకున్న నా గుండెల్లో ఒక్కసారిగా భయంతో రైళ్ళు పరుగు తీసాయి. ఆఫీసు అయ్యాక కలిసిన వెంకట్ తో విషయం చెబితే, ధైర్యం చెప్పి, నాన్నతో మా ప్రేమ విషయం చెప్పేయమనీ, ఆయనను పెళ్ళికి ఒప్పించటానికి ప్రయత్నించమనీ చెప్పాడు.
అన్యమనస్కంగానే ట్రైన్ కి టికెట్ కొనుక్కుని ఊరికి బయలుదేరాను. ఉదయమే రైలు దిగి, ఆటో మాట్లాడుకుని ఇల్లు చేరిన నన్ను ఇంటి వాకిట్లోకి అడుగు పెడుతూనే ఎప్పటిలా, ‘ప్రయాణం బాగా జరిగిందా బేబీ?’ అని ప్రేమగా అడగలేదు నాన్న.
‘అపూర్వా... కాళ్ళు కడుక్కుని రా... నీతో మాట్లాడాలి’ అన్నాడు గంభీరంగా.
బిక్కమొహం వేసి అమ్మ వైపు చూసాను. నిస్సహాయంగా నీళ్ళు నిండిన కళ్ళతో చూసింది అమ్మ. బాగ్ ముందు గదిలో పెట్టి, పెరట్లో కాళ్ళు కడుక్కుని వచ్చిన నన్ను వరండాలోనే కూర్చోబెట్టి, క్లాసు మొదలు పెట్టాడు.
“వెంకట్ ఎవరు?” మేఘం ఉరిమింది.
“నా... నా...కొలీగ్ నాన్నా...”
భయంతో మాట పెగలటం లేదు నాకు.
“స్నేహితుడా, అంతకన్నా ఎక్కువా?” రౌద్ర రసం అంతకంతకూ ఎక్కువ అవుతోంది ఆయన కంఠంలో.
“స్నేహితుడు...” నా మాట పూర్తవకుండానే చెంప చెళ్ళుమంది.
“నాన్నా...” చెంప పట్టుకుని అట్టే కూలబడిపోయాను. దవడ ఎముక విరిగిపోయినట్టయింది. కళ్ళముందు నక్షత్రాలు కనబడ్డాయి. నొప్పికి కళ్ళు చీకట్లు కమ్మాయి...
“నాన్న... ఇంకా బ్రతికే ఉన్నాడే... నువ్వు వాడితో అక్కడ సినిమాలకూ షికార్లకూ తిరుగుతూ ఉంటే ఆ వార్త విని ఇంకా ఇంకా... బ్రతికే ఉన్నాడే నీ నాన్న... నువ్వే నేను చచ్చానని అనుకున్నావు...” గట్టిగా రంకెలు వేసాడు ఆయన.
“ఏమండీ... పిల్ల అన్ని గంటలు ప్రయాణం చేసి వచ్చింది. అన్నీ లోపలి వెళ్లి మాట్లాడుకుందాం... దాన్ని లోపలికి రానీండి...” చెప్పబోయింది అమ్మ.
“నువ్వు మాట్లాడకే... అసలు నీ పెంపకం సరిగ్గా ఉంటే ఇలా ఎందుకు ఏడుస్తుందిది? బేబీ...నువ్వు మాట్లాడు!”
“సరే నాన్నా, ఇంత వరకూ వచ్చింది కనుక చెబుతున్నాను... వెంకట్ నాకు కాబోయే భర్త...” ధైర్యంగా చెప్పాను.
గబుక్కున ముందుకు వంగి విసురుగా నా జుట్టు పట్టుకున్నాడు నాన్న.
“ఎంత కావరమే నీకు? నీకు కాబోయే మొగుణ్ణి నువ్వే నిర్ణయించుకుంటావా? ఏం, నేను చచ్చానని అనుకున్నావే? అయినా ఎవరూ దొరకనట్టు వాడే దొరికాడా?” వెంకట్ పుట్టిన కులాన్ని పేరు పెట్టి చెబుతూ ఈసడించాడు.
“నాన్నా, కొంచెం నీ నాలుక కంట్రోల్ చేసుకుంటావా?”
“ఎంత ధైర్యమే నీకు? నన్ను నన్ను నోరుమూసుకోమని అంటున్నావ్ కదా...” ఉగ్రుడైపోయాడు.
“నేను అలా అనలేదు నాన్నా... ఎవరినీ తూలనాడకూడదు... వెంకట్ గురించి నీకు తెలియదు... చాల మంచి వాడు... అతన్ని పెళ్లి చేసుకుంటే నన్ను పూవుల్లో పెట్టి చూసుకుంటాడు తప్ప ఏ రకంగాను నన్ను బాధించడు...” సహనంగా చెప్పబోయాను.
“అంటే నీ మంచీ చెడ్డా నాకనవసరం అని అంటున్నావా బేబీ?”
“అయ్యో, నేను అలా అనలేదు నాన్నా... “
“ఎలా అన్నా దాని ఉద్దేశం ఒక్కటే. నువ్వు వెంటనే నా ఇంట్లోంచి వెళ్ళిపో... ఇక నాకు ముఖం చూపించకు... నాకిద్దరే కూతుళ్ళు...” తర్జనితో వీధివాకిలి చూపించాడు నాన్న.
“నాన్నా...” హతాశురాలను అయ్యాను. ఆయన అంత మాట అంటాడని, ఇంట్లోంచి వెళ్ళగొడతాడని నేను అనుకోలేదు.
“ఒసే ఇల్లాలా, దాన్ని వెంటనే బయటకి నడవమను... లేకుంటే నా శవాన్ని కళ్ళ జూస్తుందది...”
ఖచ్చితంగా చెప్పేసి అమ్మ చెయ్యి పట్టుకుని లోపలి లాగి గడియ పెట్టేసాడు.
“అయ్యో, బేబీ... మన బేబీ అండీ... దాన్ని లోపలి పిలవండీ... పాపం ఆకలికి ఆగలేదండి...కాఫీ అయినా తాగలేదండి... ఒక్క సారి తలుపు తీయండి...” నెత్తి కొట్టుకుంటూ అమ్మ ఏడవటం, గడియ తీయటానికి ప్రయత్నించటం కిటికీలోంచి కనిపిస్తూ ఉంటే, ఆమెను అడ్డుకుంటూ నాన్న ఆమెను తోయటం, చెంపల మీద కొట్టటం వినిపిస్తున్నాయి. నా కళ్ళూ, చెవులూ ఎందుకు పనిచేస్తున్నాయో అర్థం కావటం లేదసలు.
నా హృదయం ముక్కలై పోయింది. కిటికీ దగ్గరగా నడిచి, రెండు చేతులూ జోడించి, “నాన్నా, ఆవిడని ఏమీ అనకండి, దయచేసి కొట్టకండి... నా మీది కోపంతో ఆమెను శిక్షించకండి...మీరన్నట్టే నేను వెళ్ళిపోతున్నాను... ఇక మీకు కనిపించను” అని చెప్పేసి, బాగ్ తీసుకొని, భుజాన తగిలించుకొని కలలో నడుస్తున్నట్టు అలాగే అడుగులు వేస్తూ నడవసాగాను.
“బేబీ, అమ్మా... వెళ్లకే... అరుగు మీద కూర్చోవే... నేను తలుపు తీస్తానే... కోపం తగ్గాక నాన్నే లోపలి పిలుస్తాడే... అమ్మా బేబీ... బేబీ... వెళ్లకే... వెళ్ళి పోకే..." అమ్మ అరుపులు వెనుకనుంచి వినిపిస్తూనే ఉన్నాయి.
***
ఇంటి నుంచి బయటకి వచ్చి రిక్షాలో రైల్వే స్టేషన్ కి వచ్చేసాను. రాత్రి వరకూ రైలు లేదు...
స్టేషన్ ఎక్కడో ఊరవతల పొలాల మధ్యన ఉన్నది. బాగులో ఉన్న నీళ్ళ సీసా లోంచి నీళ్ళు వంపుకొని ముఖం కడుక్కున్నాను.
ఉదయం తెల్లవారగానే రైల్లోనే పళ్ళు తోముకున్నాను కాని ఇంత వరకూ ఏమీ కడుపులో పడకపోవటంతో ఎంతో నీరసంగా అనిపించసాగింది.
స్టేషన్ లోని టీ స్టాల్ లో టీ తాగాను. అక్కడ టిఫిన్స్ ఏమీ లేవు. నాన్న ప్రవర్తనను, ఆయన అన్న మాటలను, భరించలేని ఆ కాఠిన్యాన్ని తలచుకుంటూ కన్నీరు కార్చసాగాను. అలా ఎంతసేపు గడిచిందో నాకు సమయం కూడా తెలియలేదు.
మిట్ట మధ్యాహ్నం అయ్యే సరికి కళ్ళు తిరగటం మొదలైంది. ఏం చేయాలో తెలియక మళ్ళీ టీ స్టాల్ కే వెళ్లి బన్ లు రెండు కొనుక్కుని తిని, మళ్ళీ టీ తాగాను.
ఇంతలోనే ఎవరో ఇద్దరు వ్యక్తులు నన్ను అనుసరించి వస్తూ నేను ప్లాట్ ఫారం మీద కూర్చున్న బెంచీ దగ్గరే తచ్చాడసాగారు. ఏవేవో సైగలు చేస్తూ బూతు పాటలు పాడసాగారు...
హఠాత్తుగా మబ్బులు ముసురుకొని వర్షం జల్లులు మొదలయ్యాయి... నాకు ఎంతో భయంగా ఉంది. ప్లాట్ ఫారం మీద ఒక్క పురుగు లేదు. బాగా తాగి ఉన్న ఆ ఆగంతకులు ఇద్దరూ వచ్చి నా బెంచీ మీదనే కూర్చున్నారు. చటుక్కున లేచి నిలుచున్నాను...
గబుక్కున అక్కడనుంచి కదలబోతే, “ఒసే పిల్లా, మేవూ ఆకలి మీదనే ఉన్నాం, నీ ఆకలీ తీరుస్తాం... ఇగో, ఈడెల్లి టవును నించి పలావట్టుకొచ్చేత్తాడు. ఈలోగా మనమిద్దరం...” వెకిలిగా నవ్వుతూ నా చేయి పట్టుకోబోయాడు ఒకడు...
నాకు షాక్ తగిలినట్టు అయింది. తల వంచి నఖశిఖ పర్యంతం నన్ను నేను
ఒక్కసారి చూసుకున్నాను. రాత్రెప్పుడో నేను కట్టుకున్న బట్టలు బాగా నలిగిపోయి పిచ్చిగా తయారయ్యాయి. జుట్టు దువ్వుకోక, రేగిపోయి, అట్టలు కట్టేసినట్టు ఉంది. స్నానం కూడా చేయలేదేమో... వళ్ళంతా అదోలా ఉంది...
వీళ్ళు నాగురించి ఏమని అనుకుంటున్నారో అర్థమైన నాకు ఈ పరిస్థితికి కారణం అయిన నాన్నపై, ఆయన అర్థంలేని ఆగ్రహావేశాలపై అంతులేని అసహ్యం కలిగింది ఆ క్షణంలో...
ఈలోగానే రెండోవాడు ముందుకు వంగి నా చీర కొంగు పట్టి గట్టిగా లాగాడు. “ఛీ...” అంటూ కొంగు విసురుగా లాక్కుని బ్యాగ్ తో సహా పరుగులు తీస్తూ స్టేషన్ మాస్టర్ గారి రూమ్ లోకి దూసుకు పోయాను.
“అరె, ఎవరమ్మా నీవు? ఇలా లోపలి రాకూడదు...” అని వారించబోయి నా వెనకాలే రాబోయి కాస్త దూరంలో ఆగిపోయిన ఆ దుండగులను చూసి, ‘ఎవర్రా అది?’ అని గదమాయిస్తూ ఆయన బయటకు వెళ్ళేసరికే వాళ్ళు పారిపోయారు.
అక్కడున్న చిన్న బెంచీ మీద కూర్చుని అలుపు తీర్చుకుంటూ ఉంటే నాకు ఉవ్వెత్తున దుఃఖం ముంచుకు వచ్చింది.
“వాళ్ళు వెళ్ళిపోయారు తల్లీ, భయం లేదు. ఇక్కడే కూర్చో... ఇంతకీ ఎవరు నీవు? ఎక్కడికి వెళ్ళాలి?”
“నాపేరు అపూర్వ అండీ, నేను హైదరాబాద్ వెళ్ళాలి...” ఇంగ్లీష్ లో చెప్పాను. భుజం మీద చిరిగిన చీర కొంగును హాండ్ బాగ్ తో కవర్ చేస్తూ...
“అయ్యో, రాత్రి ఎనిమిదిన్నర వరకూ రైలు లేదు కదమ్మా... నువ్వు ఇంటికి వెళ్లి మళ్ళీ వస్తే బాగుంటుందేమో...”
“ఇక్కడ నాకెవరూ లేరండి...”
“సరే తల్లీ, పక్కనే నా క్వార్టర్ ఉంది. మా ఆవిడ ఇంట్లోనే ఉన్నది. అక్కడికి వెళ్లి, ముఖం కడుక్కుని కొద్దిగా ఆ బట్టలు మార్చుకో... ఎందుకో నువ్వు అప్సెట్ అయి ఉన్నట్టుగా అనిపిస్తోంది... కొంచెం ఫ్రెష్ అయితే సరి...”
నా సమాధానానికి ఎదురు చూడకుండానే, ఎవరినో పిలిచి, “ఇంటికి తీసుకు వెళ్ళు అమ్మాయి గారిని...” అని నా బ్యాగ్ ని అతని చేతికి అందించారు.
ఆయన భార్య ఎంతో ఆదరంగా నన్ను ఆహ్వానించింది... ఆవిడ చూపిన బాత్ రూమ్ లోకి వెళ్లి స్నానం చేసి, బట్టలు మార్చుకున్నాను. తల దువ్వుకుని జడవేసుకున్నాను. దుఃఖ భారంతో ఉన్న నాకు కాసేపు విశ్రమిస్తే బాగుండుననిపించింది.
ఈలోగానే ఆవిడ వేడి వేడి ఉప్మా తయారుచేసి ప్లేట్ లో పెట్టుకు వచ్చి వద్దన్నా బలవంతం చేసి తినిపించింది. పడుకోవటానికి చోటు చూపించింది.
ఆరు గంటలు అవుతూ ఉండగా లేచి ముఖం కడుక్కుని కూర్చున్నాను.
ఈలోగా స్టేషన్ మాష్టారు తనతో పాటుగా అమ్మని, బాబూరావు మామయ్యని తీసుకు వచ్చారు.
అమ్మ నన్ను గాఢంగా గుండెకు హత్తుకుంది. నన్ను ఇంటికి వచ్చేయమని అడిగింది. అసలు అమ్మనే మా నాన్నని వదిలేసి నాతో వచ్చెయ్యమని చెప్పాను నేను.
వెంకట్ తో నా పెళ్ళికి ఆయన్ని ఒప్పిస్తానని, నాన్న మాటలు లెక్క పెట్టవద్దని చెప్పింది అమ్మ. నిరసనగా ముఖం తిప్పుకున్నాను.
నా ఆకలి తీర్చిన స్టేషన్ మాస్టారి భార్యకి తడి కళ్ళతో రెండు చేతులూ జోడించి నమస్కరించింది అమ్మ.
కాలమే అన్ని సమస్యలనూ తీర్చుతుందని చెప్పి, రైలు ఎక్కించింది నన్ను. కనుచూపు మేరా అమ్మను తనివితీరా చూస్తూ చేయి ఊపుతూనే ఉన్నాను.
***
నేనూ, వెంకట్ స్నేహితుల సహాయంతో పెళ్లి చేసుకున్నాము. అమ్మా నాన్నల ఆశీర్వాదం కోసం చాలా ప్రయత్నించాడు వెంకట్. కాని మాకు అది దొరకలేదు.
మూడు నెలలు గడిచాయో లేదో అశనిపాతంలా మామయ్య నుంచి కబురు, అమ్మకి సీరియస్ గా ఉందని, ఆస్పత్రిలో చివరి క్షణాల్లో ఉందనీ... నా నవనాడులూ క్రుంగి పోయాయి.
నాకు తెలుసు, అమ్మ నా గురించే ఆలోచించీ ఆలోచించి బెంగ పడి, ప్రాణాల మీదకు తెచ్చుకుని ఉంటుంది.
ఇద్దరం బయలుదేరేంత లోనే మళ్ళీ టెలిగ్రాం. అమ్మ మరిక లేదనీ, తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిందనీ...
మొదలు నరికిన మానులా కూలబడి పోయాను. అమ్మను సజీవంగా తప్ప నిర్జీవంగా చూడలేనని వెంకట్ కి చెప్పి ప్రయాణం ఆపేసుకున్నాను.
నాలో నేనే కుమిలిపోయాను... దీనికంతటికీ కారణమైన ఆ వ్యక్తిపై నాకు కోపం రోజు రోజుకీ ఎక్కువైపోతోంది.
కాలం అన్ని గాయాలను మాన్పుతుంది అంటారు.
కానీ రోజు రోజుకీ నాలో, నా మనసులో ఆయనంటే తీవ్రమైన కోపం, ఆగ్రహం ఎక్కువ కాసాగాయి.
నా జీవిత భాగస్వామితో స్వర్గం ఓ వైపు, నా జన్మకు కారణమైన ఆ వ్యక్తితో నేను ఎదుర్కొన్న నరకయాతన మరో వైపు...
మూడేళ్ళ వ్యవధిలో పాప, బాబు పుట్టారు.
కాలమిలా సాగిపోతూ ఉండగా ఆఫీస్ కాంపుకని బయలుదేరి వెళ్ళిన వెంకట్ తనతో పాటుగా ఓ వ్యక్తిని ఇంటికి తీసుకు వచ్చాడు.
ఎండిపోయి, అస్థిపంజరంలా ఉన్న ఆ వ్యక్తి ఎవరో కాదు, మా నాన్నే... ఊహించని ఈ పరిణామానికి నేను షాక్ అయ్యాను.
నాన్న బాగా జబ్బు పడ్డాడని, చూసేవారు ఎవ్వరూ లేరని, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న పెద్దక్క దగ్గర ఆస్త్మా సమస్య ఉన్న ఈయన ఉండలేరనీ, చిన్నక్క ఆస్ట్రేలియాలో ఉంది కనుక అది తనతో ఈయన్ని తీసుకువెళ్ళే పరిస్థితి లేదనీ...ఇక ఇప్పుడు మనం తప్ప ఇంకెవ్వరూ ఆయనకి లేరని, ఆయన బాధ్యత మనదేనంటూ నాకు నచ్చజెప్పాడు వెంకట్.
***
‘నా పిల్లలకే చేసుకోలేక ఛస్తోంటే, ఈయనొకడు! ఈ ముసలాయన్ని తెచ్చి పడేసాడు నా ప్రాణానికి ...’ విసుక్కుంటూ బత్తాయి పళ్ళ రసం తీయసాగాను.
రసం ఆయనకి అందేలా బల్ల మీద పెట్టి వెళ్ళబోతున్న నన్ను “బేబీ...” అని వణికే గొంతుతో పిలిచాడు నాన్న.
ప్రశ్నార్థకంగా చూసాను తప్ప ఏమీ మాట్లాడలేదు. “ఇంకా నా మీద కోపం పోలేదామ్మా?” దీనంగా అడిగాడు.
“ఒక్క నిమిషం’ అంటూ బయటకి వచ్చేసి, వెంకట్ ని పంపాను లోపలికి.
ఆయన బాధగా నిట్టూర్చటం నా చెవుల పడినా పట్టించుకోలేదు నేను.
వెంకట్ నా పాపతో, బాబుతో ఆడుతూ, నవ్వుతూ, పాడుతూ, చదివిస్తూ, వాళ్ళతో దెబ్బలు తింటూ ఎంతో సరదాగా ఉండటం చూసిన నాన్న కళ్ళలో ఏదో అపరాధభావన కనపడేది నాకు.
ఆయనకి సమయానికి అన్నీ అమర్చేదాన్ని. ఆయాకి అన్నీ అప్పజెప్పి ఆఫీసుకు వెళ్ళిపోయేదాన్ని.
కాని, అసలు ఆయనతో ఒక్కమాటైనా మాట్లాడేదాన్ని కాదు. ఒక ఉద్యోగి తన కర్తవ్యం ఎలా నిర్వహిస్తాడో అలా నేను నాన్నకి కావలసినవి అమర్చేదాన్ని... కాని అందులో ఏమాత్రం ఆప్యాయత ఉండేది కాదు.
ఎందుకంటే, ఆయన నాకు చేసిన అవమానాన్ని, రైల్వే స్టేషన్ లో ఆనాటి నా నిస్సహాయ స్థితిని నేను ఏనాడూ మరచిపోలేను. అందుకే ఆయన్ను క్షమించలేను కూడా...
నాలుగు నెలల తర్వాత ఓ రాత్రి ఆయన నిద్రలోనే పోయారు. చిత్రం, నా కంట ఒక్క కన్నీటి బొట్టు కూడా జారలేదు.
ఈ అపూర్వ ఇంత కఠిన మనస్కురాలా? నా మన:స్థితి నాకే విచిత్రంగా తోచింది.
నిన్ననే పదవ రోజు కార్యక్రమం ముగిసింది. ఈరోజు నాన్న కొలీగ్స్, మిత్రులు కొంతమంది మా ఇంటికి వచ్చారు. ఏదో మొక్కుబడిగా, యాంత్రికంగా మాట్లాడి, అతిథి మర్యాద చేసి పంపేసానే కాని, మనసారా వాళ్ళను రిసీవ్ చేసుకోలేదని వెంకట్ ఫిర్యాదు.
***
రెండురోజుల తర్వాత ఆదివారం నాడు -
నాన్న ఉన్న రూమ్ తీసి సర్దటం మొదలు పెట్టాను. ఆయన పడుకున్న మంచాన్ని మా వాచ్ మాన్ కి ఇచ్చేయమని వెంకట్ చెప్పటంతో, ఆయన బట్టలు, పక్కబట్టలు అన్నీ తీసి ఉతికించాలని పక్కన పెట్టసాగాను. బల్లమీద మందుల బాక్స్ లో, మిగిలి ఉన్న మందులనూ, గోడకి ఆనించి ఉన్న ఆయన చేతి కర్రనూ చూడగానే, కడుపులో ఏదో కదిలినట్టు అయి, కళ్ళు చెమర్చాయి...
అక్కడే భగవద్గీత పుస్తకంలో ఒక మడత పెట్టిన కాగితం కనిపించింది.
ఉత్తరం... ఆయన నాకు రాసిన లెటర్... అప్రయత్నంగా నా చేతులు దాన్ని విప్పాయి.
‘బేబీ, నాకు నాగరికత తెలీదు. ఎక్కువ చదువుకోలేదు. మీరు చదువుకొని పైకి రావాలని కోప్పడటమే తెలుసు...
మీకోసం కష్టపడటం, మీ భవిష్యత్తు కోసం కూడబెట్టటమే తెలుసు. అసలు మీమీద ప్రేమని చూపించాలన్న విషయం కూడా నాకు తెలియదమ్మా...
తలకి మించిన భారాన్ని మోసే నాకు నా బాధ్యతలు త్వరగా తీర్చుకోవాలన్న తపనే తప్ప, ప్రేమను పంచాలని, మీతో సరదాగా గడపాలని తెలీదు...అది నా తప్పేరా బేబీ...
వయసు వచ్చిన ఆడపిల్లలని కొట్టకూడదని తెలియదు. నా భయమే నా చేత అలా చేయించింది తప్ప, మీ నాన్నకి మీ మీద ప్రేమలేక కాదురా...
అమ్మ గాజులకి ఖర్చు పెట్టిన అయిదు రూపాయలతో మీకందరికీ మామిడిపళ్ళు వస్తాయని, ఒక్కొక్కళ్ళకీ రెడీమేడ్ బట్టల బదులుగా ఒకే రకం బట్టలు నీకూ, అక్కలకూ కుట్టిస్తే మీ అచ్చుపుస్తకాల ఖర్చు వెళ్ళిపోతుందనే తప్ప, నా కాపీనంతో మిమ్మల్ని బాధపెట్టాలని కాదురా...
నిన్ను డాక్టరీ చదివించాలని నేనూ అనుకున్నాను. అందుకనే పొలం అమ్మిన డబ్బు దాచి ఉంచాను. కాని, అపరంజి పెళ్ళిలో కట్నం గురించి గొడవై వాళ్లకి మరో లక్ష రూపాయలు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది.
అందుకే నిన్ను ఉద్యోగం చూసుకోమని చెప్పక తప్పలేదు.
నువ్వు వేరే కులం అబ్బాయిని చేసుకుంటే, వాళ్ళలో ఇమడలేవని, మరో కులపు కోడల్ని వాళ్ళు ఆదరించకపోగా, ఏ కిరసనాయిలో పోసేసి చంపేస్తారన్న నా భయమే నీ పెళ్ళికి నన్ను తీవ్రంగా అడ్డు చెప్పేలా చేసింది.
కాని, నీ భర్త దేవుడమ్మా... నీకు మంచి నాన్న దొరక్కపోయినా, మంచి భర్త దొరికాడు. కొడుకులు లేని నాకు ఆ లోటు వెంకట్ ద్వారా నాకు తీరింది.
నీకు నా మీద కోపం ఉన్నా, నాతో మాట్లాడకపోయినా నీ భర్త మాటమీద గౌరవం కొద్దీ నన్ను వెళ్ళగొట్టకుండా ఇంట్లోనే ఉంచుకుని కన్న తల్లివై నన్ను కాపాడావు...
బేబీ, ఈ నాన్నను క్షమిస్తావుగా? బ్రతికుండగా ఈ మాటలు నీతో చెప్పగలనో లేదో తెలియక ఇలా కాగితం మీద రాస్తున్నాను...
నీవు నా ఆయుష్షు కూడా పోసుకొని నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి తల్లీ...
ఆశీర్వచనాలతో మీ నాన్న...”
అప్పుడు వచ్చింది నాకు దుఃఖం. అక్కడే కూలబడిపోయి, రెండు చేతుల్లో ముఖం దాచుకొని, ‘నాన్నా... నాన్నా...’ అంటూ కరువుతీరా ఏడవసాగాను...
ఏళ్ళ తరబడి ఆయన మీద నాలో పేరుకు పోయిన కోపం, పగ అన్నీ ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి.
ప్రేమను వ్యక్తపరచడం చేతకాని, ప్రేమను అర్ధం చేసుకోలేని... కొన్ని జీవితాలు అంతే
సర్వేజనాః సుఖినోభవంతు
ఇలాంటి సామాజిక, ఆధ్యాత్మిక సమాచారం కోసం ఈ క్రింది నంబర్ కు వాట్సప్/ టెలిగ్రామ్ లలో జాయిన్ గ్రూప్ అని మెసేజ్ పెట్టండి
శ్రీ ధర్మశాస్త సేవాసమితి