పుండరీకాక్షుని నామాన్ని తలచుకుంటే చాలు, స్నానం చేసినట్టే !
పుండరీకాక్షుని నామాన్ని తలచుకుంటే చాలు, స్నానం చేసినట్టే !
- లక్ష్మీరమణ
పుండరీకాక్షుని నామాన్ని తలచుకుంటే చాలు, స్నానం చేసినట్టే ! స్నానం చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఈ నామాన్ని చెప్పుకుని నీటిని తలమీద జల్లుకుంటే, అసౌచం తొలగి పరిశుద్ధులవుతారని ప్రతీతి. బాహ్యమైనదే కాక ఆంతరంగ శుచి కూడా జరుగుతుందని వేదవచనం. పూజా కార్యక్రమాల్లో కూడా ఈ నామాన్ని చెప్పాకే పూజావిధిని ప్రారంభిస్తారు. ఈ మాట చేప్పారు అంతే చాలు . రోజూ నీళ్లు ఖర్చు చేసే పని తప్పించారు, ఎంచక్కా రోజూ స్నానం చేయకుండా స్వామి నామాన్ని తలుచుకుంటాను అనుకుంటే పొరపాటు. ఇక్కడ అత్యావశ్యక పరిస్థితుల్లో మాత్రమే అనే మాటని గుర్తుంచుకోవాలి. అంతకంటే ముఖ్యంగా ఆ నామాన్ని వేదం ఎందుకు అలా చెప్పిందనే విషయాన్ని అర్థం చేసుకొనాలి .
శ్లో||అపవిత్రః పవిత్రోవా
సర్వావస్థాం గతోపివా|
యస్మరేత్ పుండరీకాక్షం
సబాహ్యాభ్యంతరస్శుచిః||
ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః
(అనుకుని అనంతరం కుడిచేతి బొటన వ్రేలితో - ఉద్ధరిణె లోని నీళ్ళను తమ తలపై మూడు సార్లు చల్లుకొనవలెను) అని పూజకి ముందర పంతులుగారు చేయిస్తూ ఉంటారు . అలా ఆ పుండరీకుని నామం తలచుకుంటే చాలు అపవిత్రత తొలగిపోయి, బాహ్యము అంతరంగము కూడా శుద్దయిపోతాయి అని భావన.
పుండరీకాక్షుడు అనేది విష్ణుభగవానుడికి పేరు . పుండరీక + అక్షుడు అంటే పద్మము వంటి విశాలమైన కన్నులు కలవాడని అర్థము . అంటే పరమాత్మ విష్ణుభగవానుడు పద్మముల వంటి విశాలమైన కన్నులతో అత్యంత సుందరముగా ఈ నామము చెప్పినప్పుడు మనకి దర్శనమిస్తున్నారు. ఇది బాహ్య రూప దర్శనము.
ఇదేకాకుండా వికశించిన కన్ను కలిగినవాడు అని మరో అర్థం . విరాట్పురుషవర్ణనలో ‘చక్షో సూర్య అజాగతా’ అని చెబుతారు. పరమాత్ముని వికశించిన నేత్రము సూర్యుడు . అంటే ఆదిత్యుడు నేత్రముగా గలిగిన పరమాత్మ అని మరో అర్థం . ఆదిత్యుడు అంటే పరమ చైతన్యము కదా ! ఇక్కడ సూర్య నారాయణుడు అనే నామాన్ని బట్టి ఆయనే నారాయణుడు అని కూడా తెలుసుకుంటున్నాం . ఇక్కడ పరమ ప్రకాశంతో ఉన్న చైత్యముగా పరమాత్మ దర్శనము పుండరీకాక్షుడు అనే నామంలో కలుగుతుంది .
‘హృత్పుండరీకం విరజం విశుద్ధం .
విచిన్త్య మధ్యే యశదం విశోకం’
నిర్మలం , శుద్ధం , శోకరహితం అయిన వికశించిన హృదయ పద్మం లో పరమాత్మని ధ్యానించాలి అని కైవల్యోపనిషత్తు చెబుతోంది. ఇక్కడ పుండరీకము అంటే హృదయము అనే అర్థం వస్తోంది కదా ! ఇదే విధంగా మంత్ర శాస్త్రము కూడా పుండరీకము అంటే హృదయము అనే అర్థాన్ని ఇచ్చే విధంగా శబ్దాన్ని ఉపయోగించింది. అక్షము అంటే కన్ను అనే కాకుండా వికశించడము, వ్యాపించడము అనే అర్థం కూడా ఉన్నది . వీటిని బట్టి హృదయములో వ్యాపించి ఉన్నవాడే పుండరీకాక్షుడు అని అర్థం అవుతూ ఉన్నది . ఇక్కడ మనం దర్శింస్తున్నది రూపము కాదు , కనిపించని చైతన్యముగా , కనిపించని హృదయములో వ్యాపించిన భగవంతుని. అన్ని చేతనలకీ శక్తి కావాలి కానీ, ఆ శక్తి తెలుస్తుంది. కానీ కనిపిస్తుందా ? అటువంటి నిరాకార భగవానుని దర్శనం ఇది .
ఈ విధంగా చూసినప్పుడు మన హృదయము అనే పద్మములో వ్యాపించి ఉన్న చైతన్య స్వరూపుడైన పరమాత్మే పుండరీకుడు. తనలోనే, తన హృదయంలోనే కొలువై ఉన్న ఇటువంటి చైతన్యమును తెలుసుకొని ఉన్నవారు పరమశుద్ధత్వంతో ప్రకాశిస్తారు . ఈ భావనతో పుండరీకుని నామాన్ని స్మరించినప్పుడు ఎంతటి అపవిత్రమైనా, పవిత్రంగా మారుతుంది . బాహ్యము అంతరంగము కూడా శుద్దమవుతాయన్నమాట.
శుభం !
#pundarikaksha
Tags: Pundarikaksha, vishnu, snanam, bath