Online Puja Services

తిరుమల శ్రీవారిని చేరుకొనేందుకున్న మార్గం

13.58.201.240

అలిపిరి మెట్ల మార్గం ఒక్కటే తిరుమల శ్రీవారిని చేరుకొనేందుకున్న మార్గం అనుకుంటున్నారా !
-సేకరణ 

శ్రీవారిని దర్శించుకోవడానికి వెళుతున్నారా! ఏడుకొండలూ నడిచి ఎక్కాలని అనుకుంటున్నారా ? అయితే, శ్రీవారి ఆలయానికి చేరుకోవడానికి ఎన్ని నడకదారులున్నాయో తెలుసుకోవడం అవసరం . అదేమిటి అలిపిరి మెట్ల మార్గం ఒక్కటే కదా ! నడిచి ఎక్కేందుకు ఉన్నదారి అనుకుంటున్నారా ! కానీ కాదు. శ్రీవారి సన్నిధికి చేరుకోవడానికి ఎన్నో నడకమార్గాలున్నాయి . ఆ స్వామిని చేరుకోవాలనే మనసుండాలేగాని , అక్కడున్న ప్రతి చెట్టు చేమా , రాయిరప్పా కూడా శ్రీవారి తీరం చేరుస్తాయి . ఆ మార్గాలని తెలుసుకుందాం రండి . 

ఏటా లక్షల సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శిస్తుంటారు భక్తులు. కొండ మీద ఉన్న శ్రీవారికి దర్శించుకొనేందుకు భక్తులు సాధారణంగా నడక మార్గాన, టాక్సీలలో, జీపులలో బస్సులలో కూడా  వెళుతుంటారు. కానీ ఇలా వెళ్ళేవారిలో చాలా మందికి తెలిసిన దారి అలిపిరి. కానీ ఎంతమందికి తెలుసు అలిపిరి కాకుండా చాలా మార్గాలు ఉన్నాయని !! వాటిని గురించి తెలుసుకుందామా !

తిరుమలలో ఏడు కొండలు ఉన్నాయని తెలుసుకదా ? ఈ ఏడు కొండలు నడకదారి గుండా ప్రయాణిస్తే తిరుమల ఆలయానికి చేరుకోవచ్చు. ఇప్పుడు ఆ మార్గాల గురించే చెప్పుకోబోతున్నాం .  

అలిపిరి మార్గం :
మనకు తాళ్ళపాక అన్నమాచార్యులు గురించి తెలుసు కదా! ఆయన గొప్ప వైష్ణవ భక్తుడు మరియు వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి, మర్యాద, గౌరవం, ప్రేమ, వాత్సల్యం. ఆయన వ్రాసిన 32 వేల కీర్తనలలో వెంకటేశ్వరస్వామి కీర్తనలే ఎక్కువ. అలిపిరి నుండి తిరుమల కొండ ఎక్కిన మొట్టమొదటి భక్తుడు అన్నమాచార్యుల వారే.

అలిపిరి నుండి అన్నమాచార్యులు వెళ్లిన దారే మొదటి నుండి గుర్తింపు పొందినది. శ్రీవారి కొండకు చేరుకోవటానికి తక్కువ సమయ పట్టే మార్గాలలో ఇది ఒకటి. ఈ దారే కాకుండా తిరుమల చేరుకోవటానికి అనేక దారులు ఉన్నాయి. అయితే సౌకర్యాలు అంతంత మాత్రమే.

శ్రీవారికి ఆలయానికి చేరుకోవటానికి మొత్తం 8 దారులు ఉన్నాయి. వాటిలో మొదటిది మరియు ప్రధానమైనది అలిపిరి. అలిపిరి అంటే 'ఆదిపడి' అనగా మొదటిమెట్టు అని అర్థం.

అలిపిరి మార్గంలో తిరుమల చేరుకోవటానికి 3  గంటల సమయం పడుతుంది. దూరం 11- 12 KM లు ఉంటుంది.

రెండవ దారి- శ్రీవారి మెట్టు :

తిరుపతి కి 10 KM ల దూరంలో శ్రీనివాసమంగాపురం ఉంది. అక్కడికి 5 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. ఈ దారి గుండా మూడు కిలోమీటర్లు నడిస్తే శ్రీవారి ఆలయం చేరుకోవచ్చు. పట్టే సమయం గంట. చంద్రగిరి కోట నిర్మించిన తర్వాత ఈ దారి వెలుగులోకి వచ్చింది.

చంద్రగిరి కి 8 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. చంద్రగిరి రాజులు ఈ దారి గుండా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొనేవారు.  కృష్ణదేవరాయలు చంద్రగిరి దుర్గం లో విడిది చేసి, ఈ మార్గం గుండా శ్రీనివాసుడిని ఏడు సార్లు దర్శించుకున్నాడని స్థానికులు చెబుతారు. ఇప్పటికీ కొండ పైకి కూరగాయలు, పాలు, పెరుగు, పూలు వంటివి ఇదే దారిలో చేరుస్తారు. స్థానికులకు తప్ప ఈ దారి గురించి బాహ్య ప్రపంచానికి తెలీదు.

మూడవ దారి-మామండూరు:

మూడవ దారి మామండూరు. ఇది తిరుమల కొండకు ఈశాన్యాన ఉంటుంది . దీనికి మించిన దారి మరొకటిలేదు అంటారు పూర్వీకులు. కడప, రాజంపేట, కోడూరు, కర్నూలు,  నుండి వచ్చే భక్తులు ఈ దారి గుండా శ్రీవారి ఆలయం చేరుకుంటారు. 
విజయనగర రాజులు ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం రాతి మెట్లను ఏర్పాటుచేశారు.

నాల్గవ దారి-శ్యామలకోన:

తిరుమల కొండకు పశ్చిమం వైపున కల్యాణి డ్యాం ఉంటుంది .  దానికి ఆనుకొని శ్యామలకోన అనే దారి ఉంది. రంగంపేట,భీమవరం వచ్చే భక్తులు ఈ దారిగుండా వెళుతారు.

నాల్గవ దారి-నారాయణగిరి:

డ్యాం వద్ద నుండి దారి గుండా 3 కిలోమీటర్లు ముందుకు వెళితే ఒక మలుపు వస్తుంది. అక్కడి నుండి తూర్పువైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది. ఈ దారిగుండా వెళితే, డ్యాం నుండి తిరుమల మధ్య దూరం : 15 KM.

ఐదవ దారి-పాపవినాశనం:

కడప జిల్లా - చిత్తూరు  జిల్లా  కలిసే ప్రదేశంలో కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుండి తుంబురుతీర్థం వెళ్లి,  పాపవినాశనం మీదుగా  తిరుమల చేరుకోవచ్చు. తుంబురుతీర్థం, పాపవినాశనం మధ్య దూరం 12 KM.

ఆరవ దారి-అవ్వాచారికోన:

అవ్వాచారి కొండ/ అవ్వాచారికోన దారి గుండా వెళితే కూడా తిరుమల కొండ చేరుకోవచ్చు. రేణిగుంట సమీపంలో కడప - తిరుపతి రహదారి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉన్నది. ఇక్కడి నుండి లోయలో ఉన్న అవ్వాచారికోన దారి గుండా పడమరవైపుకి వెళితే మోకాళ్ళపర్వతం వస్తుంది. అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు.

ఏడవదారి -ఏనుగుల దారి:

ఏనుగుల దారి అంటే ఏనుగులు ప్రయాణించిన దారి. పూర్వం చంద్రగిరి శ్రీవారి మెట్టు నుండి అవ్వాచారికోన వరకు దారి ఉండేది. తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు కావలసిన రాతి స్తంభాలను ఏనుగుల గుండా ఈ మార్గానే చేరవేసేవారు.

ఎనిమిదవదారి -తలకోన:

తలకోన నుండి కూడా తిరుమలకు దారి ఉంది . జలపాతం వద్ద నుండి నడుచుకుంటూ జెండాపేటు దారిలోకి వస్తే, మనము తిరుమలకు చేరుకున్నట్లే. నడక మార్గం 20 కిలోమీటర్లు.

కానీ ఈ దారుల్లో వెళ్లాలనుకుంటే, తెలిసినవారు, స్థానికులు  మనకి తోడుగా ఉంటె చాలా బాగుంటుంది.  

Quote of the day

Holding on to anger is like grasping a hot coal with the intent of throwing it at someone else; you are the one who gets burned.…

__________Gouthama Budda