ఊర్మిళ లక్ష్మణుల ప్రేమ కథ.
ఊర్మిళ లక్ష్మణుల ప్రేమ కథ.
-లక్ష్మీ రమణ
రామాయణం భారతదేశంలో పరిచయం అక్కర్లేని కథ. ‘ఇంటింటా రామాయణమే’ అని ప్రతి ఇంటికీ ఉండే జీవన స్థితిగతుల్లో ఉండే సాధకబాధకాలని తెలుగువారు ఒక్కమాటలో నానుడిగా చెప్పుకోవడమూ ఉంది. అనేక భాషలోకి రామాయణం విస్తృతంగా అనువాదమయ్యింది. రామాయణాన్ని రాసింది వాల్మీకి మహర్షే. కానీ దాన్ని మూలంగా చేసుకొని పుట్టుకొచ్చిన కథలు , గాథలు , నవలలు, రచనలూ ఎన్నో ఎన్నెన్నో ! వీటిల్లో కల్పవృక్షాలూ , విషవృక్షాలూ ఉన్నాయి . కానీ రచయితలెవరో తెలియని జానపదుల నోళ్ళలో పాటలుగా మారి రూపుదిద్దుకొని అందులోనే ధర్మ సూక్ష్మాలనీ , సమాజ కట్టుబాట్లనీ, వారెదుర్కొంటున్న పరిస్థితులనే జోడించిన కథలు తెలుసుంటున్నప్పుడు కాస్త తమాషాగా అనిపిస్తుంది . వారి విజ్ఞానానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అటువంటిదే, ఊర్మిళ లక్ష్మణుల ప్రేమ కథ.
లక్ష్మణుడికి రాముడిపైన, సీతపైన ఎంతో అభిమానము, గౌరవము, ప్రేమ. ఆ ప్రేమతోటే , అన్నవెంట వనవాసానికి కదిలాడు . ఊర్మిళ ఉండిపోయింది . లక్ష్మణునికి అన్న వదినల సేవే జీవితపరమావధి అన్నట్టు , సేవ చేస్తూ తన్మయుడవుతూ ఉండేవాడు వనవాసములో. రాత్రిపూట క్రూరమృగములు, రాక్షసుల నుండీ రక్షణ కల్పించేందుకు నిద్రనుండి పూర్తిగా దూరమయ్యాడు. ఇలా నెలలు, సంవత్సరాలు గడిచాయి. ఇతని దీక్ష నిద్రాదేవికి తెలిసింది. ఇన్ని నెలలపాటు తనప్రభావాన్ని నిగ్రహించగలిగిన రామభక్తిని చూసి ప్రసన్నురాలయ్యింది . లక్ష్మణుడి ముందు నిద్రాదేవి ప్రత్యక్షమయింది.
‘ లక్ష్మణా, నీ దీక్ష, రాముడిపైన నీకుండే అపారమైన భక్తి, ప్రేమ నన్ను సంతోషపరచింది. నిద్రలేని నీకు అలసట కలగకుండా ఉండాలని నీకు వరమిస్తా’నని అన్నది. కానీ లక్ష్మణుడు ‘ నాకు రాముడి సేవలో ఎప్పుడూ అలసట కలుగదు, నీ దగ్గర నేను వరము పుచ్చుకొంటే నా దీక్షలో, నా వ్రతముపై నాకే సందేహము కలుగుతుంది, అందువల్ల నీ వరము నాకు అక్కర్లేదు’ అన్నాడు లక్ష్మణుడు.
‘నీపై నాకు అనుగ్రహము కలిగింది. నీముందుకొచ్చాను. కాబట్టి, ఇప్పుడు నీకు వర మేదీ యివ్వకుండా నేను వెళ్లకూడదు, ఏ వరమైనా అడుగు, అది నీకిస్తాను’ అని చెప్పింది. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు – ‘సరే, ఇక్కడ నాకు అన్నగారి నీడలో ఏ అపాయము లేదు, అక్కడ నా భార్య ఊర్మిళ ఏమి కష్ట పడుతున్నదో, ఆమెకు కష్టాలేమీ లేకుండా చేయమని’ అడిగాడు.
నిద్రాదేవి సరేనని అయోధ్యకు వచ్చి ఊర్మిళ ముందు నిలిచింది. తాను ఆమె భర్త లక్ష్మణుని చూచానని అతడు ఆమెకు కష్టాలేమీ లేకుండా, రాకుండా వరమివ్వ మన్నాడని చెప్పాడని తెలిపింది. అప్పుడు ఊర్మిళ, ఇక్కడ పెద్ద వారి సేవలో నేను నిమగ్నమై ఉన్నాను, నాకేమీ కష్టాలు లేవు, నన్ను తలబోస్తూ అక్కడ లక్ష్మణుడు తన స్వామి కార్యమును సరిగా చేయలేక పోతున్నాడో ఏమో, అందు వల్ల లక్ష్మణుడు నన్ను సంపూర్ణముగా మరచిపోయేటట్లు వరమివ్వమని నిద్రాదేవిని అడిగింది.
ఒకరికన్నా మరొకరు త్యాగశీలురు గదా ఈ ఊర్మిళా లక్ష్మణులని మనకి అనిపించక మానదు . ఈ విధంగా ప్రేమ త్యాగాన్ని కోరుతుందన్నట్టు , వారిరువురూ ఒకరి కోసం ఒకరు చేసిన త్యాగం ఈ జానపద కథలో కనిపిస్తుంది .
ఊర్మిళను కేంద్రముగా నుంచుకొని హిందీకవి మైథిలీశరణ్ గుప్తా సాకేత్ అనే ఒక కావ్యాన్ని కూడా వ్రాసియున్నారు . ఆసక్తి గలవారు ఆ గ్రంధాన్ని చదవగలరు .