శీలవతి యైన ఊర్మిళ ఇలా బరితెగించి మాట్లాడుతుందా!
శీలవతి యైన ఊర్మిళ ఇలా బరితెగించి మాట్లాడుతుందా!
-లక్ష్మీ రమణ
సీతారాముల కళ్యాణం చూతము రారండి అని అందరమూ పాడుకుంటాం . కానీ ఆ అన్నగారి వివాహంతో పాటు మిగిలిన ముగ్గురు తమ్ములకూ వివాహం జరిగింది . అన్నగారి వెంట అడవులకేగిన లక్ష్మన్న , జనకమహారాజు పినతండ్రి కూతురైన ఊర్మిళని చేపట్టారు. ప్రధాన పాత్ర, అయినా నాయికా, నాయికలకున్న ప్రాధాన్యత ఈ పాత్రకి ఉండదు . అందువల్లే గొప్ప ఔచిత్యమున్న ఈ పాత్ర గురుంచి వాల్మీకి మహాకవి కూడా పెద్దగా వర్ణించలేదు . కానీ మన తెలుగింటి ఆడపడుచులు ఆమె గొప్పదనాన్ని వదల్లేదు . తమ జానపదాల్లో ఆమె కధకు రూపుకట్టారు . అసమాన సౌందర్యరాశి, మహా పతివ్రత అయినా ఊర్మిళకి తమ అంతరంగాన్ని అలిమారు . వాళ్ళ ఊహల్లో , పాటల్లో ఆ కథ జరిగిఉంటే , అసలు రామాయణమే మరోలా ఉండేది మరి !
రాములవారివెంట సీతమ్మ అడవులకి వెళుతుంటే, ఊర్మిళ కూడా లక్ష్మన్న వెంట తానూ అరణ్యానికి వెళతానంటుంది . కానీ లక్ష్మణుడు అందుకు అంగీకరించడు. తానూ అన్న వదినలు సేవలో తరించాలి కనుక , వారి రక్షణ బాధ్యతని అనుక్షణం వహించాలి కానుకా, భార్యని తన వియోగాన్ని వహించమంటాడు . తన తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోమని మరో బాధ్యతని ఇస్తాడు . అంతేనా , నిద్రాదేవి తనని ఆవహించకుండా ఉండేందుకు , తనకి మారుగా తన భార్యని ఆవహించమని, ఆ విధంగా ఆమె ప్రకృతి ధర్మాన్ని పాటించినట్టవుతుందని ఊర్మిళ కి పదునాలుగేళ్ల నిద్రని కానుక చేస్తాడు . తిండి కూడా లేకుండా ఆ సుకుమార సౌదర్యం రాచకన్య నిద్రలో మునిగిపోతుంది .
సీతాపహరణం, రావణ సంహారం తర్వాత రాములవారు సీతా లక్ష్మణులతో కలిసి అయోధ్యా పట్టణానికి వచ్చిన తర్వాత కూడా ఆమె అదే నిద్రలో మునిగిపోయి ఉంటుంది . ఒకవైపు పట్టాభిషేకం జరుగుతోంది . అయినా ఆమెను పట్టించుకునేవారే లేదా అనే భావం ఈ పాటలో తొణికిసలాడుతుంది .
‘శ్రీరామభూపాలుడూ పట్టాభిషిక్తుడై కొలువుండగా
భరత శతృఘ్నులపుడూ సౌమిత్రి వరుస సేవలు సేయగా
మారుతాత్మజులప్పుడూ రాఘవుల జేరి పాదములొత్తగా
సుగ్రీవుడాకొలువులో కూర్మితో నమ్రుడై కొలువుండగా
… …
సకలదేవతలు గొలువా ఉదయాన పుష్పవర్షము గురిసెను’ అంటూ కొనసాగుతుంది ఈ జానపదం . జనపథంలో ఈ పాట పల్లె సీమల్లోని పొలం పనుల్లో తెలుగు ఆడపడుచుల నోట అద్భుతమైన స్త్రీ వాదాన్ని ఒలికిస్తుంటుంది .
రామరాజ్యం అంతా సక్రమంగా ఉంది. అందరూ ఆనందిస్తున్నారు. ఆ సమయంలొ సీతాదేవి వచ్చి రాముడివైపు తిరిగి “రామచంద్రా, మనం అడివికి వెళ్తున్నపుడు, లక్ష్మణుడితోపాటు ఊర్మిళ కూడా వొస్తానంది, అందుకు లక్ష్మణుడు ఒప్పుకోలేదు, అప్పటినించి ఆవిడ నిద్ర పోతోంది. లక్ష్మణుడిని వెళ్ళి ఆమెను లేపమనండి.” అని సవినయంగా మనవి చేస్తుంది. తాము అడివికి వెళ్ళిన రోజు మొదలుకొని ఊర్మిళ నిరంతరాయంగా నిద్రపోతోందని రాముడికి అప్పుడే తెలుస్తుంది. వెంటనే తమ్ముణ్ణి వాళ్ళావిడ దగ్గరికి పంపిస్తాడు, ముందు ఊర్మిళని నిద్రలేపి ఆవిడని సంతోషపరచమని. రామాజ్ఞ శిరసావహించి లక్ష్మణుడు అప్పుడు భార్య దగ్గరికి వెళతాడు. నిద్రపోతున్న ఊర్మిళ చీర సవరించి, ఆవిడ పక్కనే కూర్చుంటాడు. ప్రేమగా ఆవిడతో మాట్లాడడం మొదలు పెడతాడు.
‘కొమ్మ నీ ముద్దుమొగమూ సేవింప కోరినాడే చంద్రుడూ ….
అమృతధారలు కురియగా పలుకవే ఆత్మ చల్లన చేయవే
అ నిద్రలో తన గదిలోకి ఎవరో పరపురుషుడు ప్రవేశించాడనుకుంటుంది ఊర్మిళ.
తన్ను తా మరచియున్న ఆకొమ్మ తమకమున వణకదొడగే’
ఎవరో తన గదిలోకొచ్చారన్న కలతతో ఆవిడ శరీరం భయంతో వణకడం మొదలవుతుంది.ఇక్కడతో కథ ఒక్కసారిగా మారుతుంది. అంతవరకూ ప్రశాంతంగా వున్న వాతావరణం చెల్లాచెదురైపోతుంది. రామరాజ్య ధర్మం పటాపంచలై పోతుంది. ఊర్మిళ ఆ సందర్భంలో అనే మాటలు వింటే పరపురుషుడి చేత బలాత్కరించబడిన స్త్రీ ఎంత అసహాయ పరిస్థితిలో ఉంటుందో. తాను హింసకు గురై ఎలా చివరికి అపరాధిలా అందరిముందూ నిలబడాల్సి వస్తుందో గుండె చెదిరే లాగా బోధపడుతుంది. ముందుగా నువ్వెవరని ప్రశ్నిస్తుంది. వెళ్లిపొమ్మని వేడుకుంటుంది .భర్తపేరు చేపకూడదన్న నియమాన్ని అనుసరిస్తూనే అతన్ని నానారకాలుగా బెదిరిస్తుంది . అయినా కదలని ఆ మనిషితో మెళుకువలేని స్థితిలో
‘ఒకడాలి కోరిగాదా ఇంద్రునికి ఒడలెల్ల హీనమాయే
పరసతిని కోరి గాదా రావణుడు మూలముతొ హతమాయెనూ’
అని ఇంద్రుడికి అహల్యాజారత్వంలో వచ్చిన శాపం గురించి ఉటంకిస్తుంది . తన గదిలోకి వచ్చిన ఆ ఆగంతకుడికి తెలివి తెచ్చుకోమని చెప్పడానికి అవసరమైన మాటలన్నీ చెబుతుంది .
ఆతర్వాత ఉమ్మడి కుటుంబాలలో ఒదిగిపోయిన స్త్రీలకి లోపించిన స్వాతంత్య్రం , ఆనాటి కుటుంబ పరిస్థితుల వర్ణన ఆమె మాటల్లో వినిపిస్తాయి . చివరకి ఆమె వచ్చింది లక్ష్మణుడనే మాట సుతరామూ ఒప్పుకోదు . కానీ అడగాల్సిన నాలుగుమాటలూ వెనకాడకుండా అడిగేస్తుంది . అన్నగారి చింతనే తప్ప నాగురించి ఎప్పుడాలోచించావయ్యా అని నిలదీస్తుంది .
ఊర్మిళ ఇంకా నిద్రలోనే ఉంది కదా, ఈ మాటలు ఎలా అనగలుగుతోందని అనుమానపడకండి . తాను స్త్రీగా పుట్టడం మూలంగా వచ్చిన ఆధిభౌతికబలహీనతని నిద్రలో కూడా మరిచిపోవడానికి వీలులేని కుటుంబం ఆమెది . భర్తపైన గాఢమైన అనురాగం కూడా ! వెరసి, తాను మేలుకొని ఉండగా మళ్ళా మళ్ళా మననం చేసుకున్న మాటలు ఆవిడ అంతరాంతరాలలో ప్రబలంగా గూడు కట్టుకుని ఉన్నాయి. నిద్రలో కూడా ఆమాటలే పైకి వస్తాయి. అందుకనే నిద్రపోతున్న ఊర్మిళ చేత కూడా కవయిత్రి ఈ మాటలు కంఠతా పట్టిన మాటల్లా చెప్పిస్తుంది.
లక్ష్మణుడు తాను ఆమె భర్తనని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆమాట తిన్నగా చెప్పలేడు. తాను పెరిగిన కుటుంబ మర్యాదలు ఆమాట భార్యకి తిన్నగా చెప్పనియ్యవు. అందుచేత డొంకతిరుగుడుగా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. తను రాముడికి తమ్ముణ్ణనీ, సీతకి మరిదిననీ, జనకుడికి అల్లుణ్ణనీ, వగైరా, వగైరా. ఇప్పుడు ఇక పాటలో ఊర్మిళ అంతశ్చేతనలోని మరొక పొర వ్యక్తమౌతుంది. లక్ష్మణుడు అనే మాటలకి ప్రతిగా ఆమె అనే మాటలు వింటే మనకి ఒక్కసారిగా బుర్ర తిరిగిపోతుంది.
‘శ్రీరాము తమ్ముండనే అతడనగ సృష్టిలో నొకరు గలరా?
జనకునల్లుని గానటే? భూమిలో జనకులనగా నెవ్వరు?
శతపత్రమున బుట్టినా చేడెరో సీతకూ మరిదిగానా?
సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ] సృష్టిలో నేను యెరుగ’
ఎంతో మర్యాద గల రాచ కుటుంబంలో చాలా కట్టుబాట్ల మధ్య పుట్టిన శీలవతి యైన స్త్రీ ఇలా బరితెగించి మాట్లాడుతుందా! అందులోనూ జనకుడంటే ఎవడు, రాముడంటే ఎవడు, సీతంటే ఎవతె అని తృణీకారంగా మాట్లాడుతుందా!
ఒక్క క్షణం ఇక్కడ ఆగి ఆలోచిద్దాం. ఊర్మిళ కష్టాలకి కారణమైనవాళ్ళు వీళ్ళే కదా . తన కూతుర్ని జాగ్రత్తగా రక్షించగలడో లేదో అనే ఆలోచనైనా లేకుండా ఈ చేతగాని లక్ష్మణుడి చేతిలో పెట్టాడు తనని తన తండ్రి. అధికార స్థానంలో ఉన్న తన బావగారు రాముడు, తన భార్యని తనతో తీసికెళ్తున్న పెద్ద మనిషి, తమ్ముడు బానిసలా తనతో పాటు అడివికి వచ్చేస్తుంటే, అయ్యో నీ భార్య ఏమయి పోతుంది, ఆమెను కూడా నీతో బాటు తీసుకొనిరా – అని అనలేకపోయాడు. సొంత అక్కగారు సీత కూడా తన చెల్లెలేమై పోతుందో అనే ఊహ లేకుండా సగర్వంగా భర్తవెంట అడివికి పరిగెత్తింది. ఊర్మిళని ఒక్కత్తెనూ వదిలిపెట్టవద్దని లక్ష్మణుడికీ, రాముడికీ చెప్పగల స్థానంలో ఉన్నది ఆవిడే. ఈ విధంగా కుటుంబంలో తనని కాపాడగల వాళ్ళందరూ తన మానానికి తనని వదిలేశారు.
ఆ కోపమూ, ఆ కక్షా గాఢమైన నిద్రలో కలవరింతగానే పైకొస్తాయి. వొళ్లు తెలియని నిద్రలో కలవరింత రూపంలోనో, మరేదో దెయ్యంపట్టిన కారణం పేరుతోనో, ఏదో ఒక ముసుగులో తప్ప వాళ్ళ నిజ వ్యక్తిత్వం బయటకి రావడానికి వీల్లేని సమాజంలో వాళ్ళున్నారు.
హిస్టీరియా పేరుతో – దాని మాటునే – సమిష్టికుటుంబపు స్త్రీలు తమమీద అధికారం చెలాయించే వారందరినీ నోటికొచ్చినట్టు తిట్టడం మనకి తెలుసు. స్త్రీలలో వుండే అలాంటి కక్షని, అలాంటి కోపాన్ని, ఊర్మిళాదేవి పాత్ర ద్వారా, ఆవిడ నిద్ర ముసుగులో, ఈ పాట రాసిన కవయిత్రి పరమ ప్రతిభావంతంగా చిత్రించింది. తెలుగులో ఇంత సమర్థంగా పరమ క్లిష్టమైన స్త్రీ మానసిక స్థితిని కూర్చి చెప్పిన చోటు మరొకటి లేదు.
లక్ష్మణుడు చేసేదేమీ లేక ఆమెని వేడుకోవడం మొదలు పెడతాడు. నువ్వు నన్ను వదిలేస్తే, నాకు అపకీర్తి వస్తుంది అని ప్రాధేయపడతాడు . దీనంగా, వేడుకుంటాడు . నిద్రలో ఊర్మిళ కోపంగా మాట్లాడిన మాటలు తన కర్థమయ్యాయని, కోపాన్ని తగ్గించుకోమని తాను ప్రార్థిస్తున్నానని చెప్పడానికి ఈ పాటలో ఈ పునరుక్తులు సూక్ష్మ సూచికలు. ఊర్మిళ లేకపోతే అప్పటికీ ఊర్మిళ కరుణించకపోతే లక్ష్మణుడు చివరికి ఏడుస్తూ తనని తాను చంపుకోడానికి కత్తి తీస్తాడు. ఆ చప్పుడుకి ఊర్మిళ హఠాత్తుగా నిద్ర లేస్తుంది. లేచి భర్త కాళ్ళ మీద పడుతుంది. ఆత్మహత్య వీరపురుష లక్షణం కాదు. కాని, ఈ కథలో లక్ష్మణుడు వీరపురుషుడు కాడు. అయినా , ఆమె అలా భర్తని సంభోధిస్తుంది . పాటలో నిద్ర మత్తులో ఉన్న ఊర్మిళ వేరు, నిద్ర మేల్కొన్న ఊర్మిళ వేరు. ఆతర్వాత మెల్లిగా ఊర్మిళా లక్షణుల ఏకాంతం వివరణ చేస్తారు .
ఈ పాటలో ఈ భాగం ఎంతో ముచ్చటగా పాడుకుంటారు ఆడవాళ్ళు. తలుపులు మూసేస్తారు. ఎట్టకేలకు ఆలుమగలకి ఏకాంతం దొరుకుతుంది. అయినా అది నిజమైన ఏకాంతం కాదు. కిటికీలకు అవతల ఎత్తయిన కుర్చీలు వేసుకుని అత్తలూ ఆడబడుచూ చెవులు రిక్కించి వింటూ వుంటారు, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో అని. ఆ తరువాత వస్తుంది, ఆడవాళ్లు కోరుకునే అతి సుందరమైన దృశ్యం. లక్ష్మణుడు ఊర్మిళకి ముడి విప్పి, తల దువ్వి, సుతారంగా జడ వేస్తాడు. వేసి అందంగా జడలో మల్లెలూ, జాజులూ తురుముతాడు. లక్ష్మణుడికి అది బాగా చాతనయిన కళ. ఎంతోమంది భార్యలు తమ భర్తలనించి కోరుకొనే కానుక ఇది. ఆ తరువాత విశ్రాంతిగా తాంబూలాలు నములుతూ కూర్చుని ఉండగా ఊర్మిళ అడుగుతుంది. ఆ అడగడంలో కూడా ఒక చురుకుదనం ఉంది.
‘సింహవిక్రములు మీరూ ఉండగా సీతెట్లు చెరబోయెనూ?’
ఇది విశేషమైన ప్రశ్న. లక్ష్మణుడి పరాక్రమం మీద ఊర్మిళకి అపారమైన విశ్వాసం ఉందని ఇప్పుడు చెప్పించడంలో కవయిత్రి ఉద్దేశించిన సూక్ష్మం ఒకటి వుంది. ఇంతవరకూ ఊర్మిళ అన్న మాటలవల్ల దెబ్బ తిని, కుంగిపోయిన అతని ఆత్మ విశ్వాసాన్ని, మళ్లా ఆవిడే పునరుద్ధరించగలదు. మొగవాళ్ల బలమూ బలహీనతా కూడా ఆడవాళ్ల చేతుల్లోనే వున్నాయని కవయిత్రికి తెలుసు మరి !
ఈ పాటని పూర్తిగా చదివితే, వింటే, ఒక అద్భుతమైన స్త్రీ అంతరంగం, అంతకుమించిన రాజసంతో, ఠీవితో అలరారే ఒక సంప్రదాయమైన భర్తని ప్రేమించే అతివ హృదయం మన ముందు ఆవిష్కృతమవుతుంది . ఇటువంటి ఉదాత్తమైన స్త్రీని ఊర్మిళ రూపంలో మనముందు ఆవిష్కరించిన ఆ జానపదులకు మనసా శిరసా నమస్సులు తెలుపుకోవాల్సిందే.
మూలం :Velcheru Narayana Rao, “ A Ramayana of Their Own: Women’s Oral Tradition in Telugu, in Many Ramayanas, ed. Paula Richman. Berkeley: University of California Press, 1991, pp. 114-136.