దత్తావధూత మాణిక్ ప్రభు .
దత్తావధూత మాణిక్ ప్రభు .
లక్ష్మీ రమణ
సాయినాధుని సద్గురువుగా భావించి, ఆయన్నే అనుసరించే తెలుగు లోగిళ్ళు ఎన్నో ఉన్నాయి. దేశ విదేశాలకి వెళ్లినా తమతో పాటు ఆ సాయినాధుని దివ్య రూపాన్ని మాత్రమే వెంట తీసుకొని వెళ్ళి భద్రంగా ఆరాధించుకునే భక్తులు ఆ సాయినాధుని ఎందరెందరో ఉన్నారు. వారికి ఆ దివ్యప్రభావుని ఆశీస్సులు కరుణా కటాక్షాలూ కూడా అదేవిధంగా ఉన్నాయి. సాయినాధుని దత్తావధూతగా విశ్వసించేవారు వీరిలో చాలా ఎక్కువ ఆ దత్తసంప్రదదాయానికి చెందిన మరో అవధూత మాణిక్య ప్రభువు .
సాయినాధుని సచ్చరిత్ర చదివే వారికి సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒకానొక సందర్భంలో సాయినాధులు ఒక భక్తునికి తానే ఆ భక్తుని గురువైన మాణిక్యప్రభువునని చెబుతారు . ఆ మహానుభావుని గురించి క్లుప్తంగా చెప్పుకోవడం మహా ప్రయత్నమే . కానీ శక్తి మేరకు చేద్దాం .
శ్రీ మాణిక్య ప్రభువు పంచభూతాలను కూడా ఆజ్ఞాపించే శక్తి కలవారని నిరూపించారు. విశ్వశ్రేయస్సు ఆయన ధ్యేయమై ఉండేది. వారి సన్నిధిలో, ఆయన దర్శనంతో, స్మరణతో అచేతనమైనది కూడా చైతన్యవంతమై అంతా ప్రభు రూపమై ఉండేది. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా జనులకు జనన, మరణ బాధలేని ఆనందమును పొందేట్లు చేసే వాతావరణమును సృష్టించాలని ఆ గురుదేవులు ఒక వ్యక్తిగా ఒక సుక్షేత్రంలో, ఒక విశిష్ట సమాజంలో జన్మించారు. మాణిక్ ప్రభువు భౌతికముగా మానవరూపంలో కనిపించినా ఆయన సర్వ వ్యాపకత్వం అనే సమాధి స్థితిని అందుకున్న మహాత్ములు.
ఈయన సద్గురువులైన అక్కల్కోట్ మహారాజ్ స్వామీ సమర్థ వారిని, షిరిడీ సాయినాధుని కలవడమే కాకుండా శంకరాచార్యుల వారిని కూడా కలిశినవారు. ఇంతమంది సద్గురువులు ఆ కాలంలో ఒకే సారి ఈ ధర్మాన్ని కాపాడడానికి నడయాడారనడానికి మాణిక్ ప్రభు చరిత్ర అద్భుతమైన ఆనవాళ్ళని ఇస్తుంది. కర్ణాటకలో జన్మించిన శ్రీ ప్రభు వారికి దేశమంతా కూడా ఎందరెందరో అనునూయులు ఉన్నారు. ఆయన స్యయంగా బసవేశ్వరుని అవతారమని, దత్తుని అంశంగానే జన్మించి, ఆ దత్తుని చేతనే దండ కమండలాలు పొందారని ఆయన చరిత్ర చెబుతోంది .
ప్రభు బిరుదావళిలో ఆయన అఖిలాండకోటి నాయకునిగాను, భక్తుల కోరికలను తీర్చేవారిగాను, జగద్గురువుగాను, సర్వశక్తిమంతులుగాను, గురువులలో సార్వభౌముడిగాను, యోగులలో మహారాజువంటివారిగాను, సర్వులకూ ఆనందాన్నిచ్చే వారిగాను, అద్వితీయులుగాను, గుణాతీతులుగాను, స్థితప్రజ్ఞులుగా కీర్తించబడ్డారు. జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం మరియు ఔదార్యం కలిగి సర్వకాలాల్లోనూ విరాజిల్లే ప్రభువై ప్రపంచంలోని సర్వ ధర్మములను ఒకే తాటిపైకి తెచ్చి జగద్గురువై మాణిక్ ప్రభు పేరుతో స్వయంగా దత్తాత్రేయుడే ఈ భువిపైన అవతరించారని ఆయన అనునూయుల నమ్మకం.
ఓం సాయిరామ్
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర.