అమావాస్య తిథి దేవతానుగ్రహాన్ని అందిస్తుంది.
అమావాస్య తిథి దేవతానుగ్రహాన్ని అందిస్తుంది.
- లక్ష్మి రమణ
అమావాస్య తిథిని చెడు చేసే రోజుగా భావించి భయపడేవారు సమాజంలో చాలామందే కనిపిస్తారు. అమావాస్య నాడు చంద్రుడు పూర్తిగా నల్లగా అయిపోతాడు. వెన్నల నింపే చంద్రుడు ఆకాశంలో లేడని బాధవల్ల పుట్టిన భయం కాదది. ఏదో చెడు జరిగిపోతుందని భయం. దయ రక్షణలో ఉన్నంతవరకూ చెడు శక్తులు యెంత బలమైనవైనా మనని తాకనే తాకలేవు అనేది నిర్వివాదాంశం. మనం అటువంటి భగవంతుని రక్షణని పొందేందుకు అమావాస్య ఒక రకంగా మంచి తిధే. ఆరోజు ప్రాధాన్యత ఏమిటి? ఏ కార్యక్రమాలని నిర్వర్తించాలని విషయాలు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
పితృదేవతలకు ప్రీతికరమైన రోజు అమావాస్య. ఈ రోజు పితృదేవతల అనుగ్రహం పొందేందుకు శ్రేష్టమైనది. దేవతలు స్మరించినా దక్కని ఫలితం ఆ రోజు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం వలన పొందవచ్చు. అమావాస్య నాడు దేవతలకు సమానంగా పితృదేవతలను కొలిచే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.
స్థూలంగా చెప్పాలంటే, తిథులు అంటే చంద్రుడి కళలు (Phases). వీటినే అమావాస్య, పౌర్ణమి అని చెప్పుకుంటాం . భూమినుంచి చూస్తే ఆకాశంలో చంద్రుడు, సూర్యుడు ఒకరికొకరు ఎదురెదురుగా (నూట ఎనభై డిగ్రీల దూరంలో) ఉంటే అది పూర్ణిమ. ఇద్దరూ కలిసి ఉంటే (ఒకే డిగ్రీలో ఉంటే) అది అమావాస్య.
అమావాస్య నుంచీ పున్నమి వరకూ వచ్చే తిథుల్ని శుక్ల పక్షం అంటారు. మళ్ళా పున్నమి నుంచీ అమావాస్య వరకూ వచ్చే తిథులు కృష్ణ పక్షం లేక బహుళ పక్షం. శుక్ల పక్షపు తిథుల్నే శుధ్ధ తిథులని కూడా అంటారు. శుక్ల అంటే తెల్లని అని అర్ధం. కృష్ణ అంటే నల్లని అని అర్ధం. ఇలా ప్రతినెలా కృష్ణపక్షంలో అమావాస్య వస్తుంది. ఆరోజు ఖచ్చితంగా పితృదేవతారాధన చేసుకోవాలి. ఈ అమావాస్యలలో కొన్ని విశేషమైన ప్రాధాన్యతని కలిగినవి కూడా ఉన్నాయి. వాటిని గురించి వివరంగా తెలుసుకుందాం.
మహాలయ అమావాస్య:
ఏడాదిలో భాద్రపదమాసంలో వచ్చే బహుళ పాడ్యమి మొదలు 15 రోజులని పితృపక్షంగా చెబుతారు. ఈ పదిహేను రోజులూ కూడా నిత్యమూ తర్పణాలు విడవాలి. మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంటూ ఉంటారు. ఇందులో మరీ ముఖ్యమైన తిధి త్రయోదశి. 15 రోజులూ నిత్యమూ కుదరనివారు కనీసం త్రయోదశినాడు తర్పణాలు విడవడం మంచిది.
సోమవార అమావాస్య:
సోమవారం నాడు వచ్చే అమావాస్య తిథి కలిసి వస్తే దాన్ని సర్వ అమావాస్య, సోమవార అమావాస్యగా పిలుస్తారు. ఈ సర్వ అమావాస్య రోజున గంగానది, తుంగభద్ర వంటి పుణ్య తీర్థాల్లో స్నానమాచరించేవారికి కోటి జన్మల పుణ్యఫలంసిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ అమావాస్య రోజున పుణ్యతీర్థాల్లో స్నానమాచరించి, శివునికి నేతి దీపం వెలిగించే వారికి పుణ్యఫలం సిద్ధిస్తుంది. అలాగే పితృదేవతలను తృప్తిపరచేందుకు అర్ఘ్యమివ్వడం ద్వారా వారి ఆశీస్సులను పొందవచ్చునని పండితులు అంటున్నారు.
ఇవి పితృదేవతల అనుగ్రహాన్ని అందించే గొప్ప అమావాస్యతిథి ప్రాముఖ్యతలు. అలాగే మనం , దీపావళి అమావాస్యని , పొలాల అమావాస్యని, చుక్కల అమావాస్యని, పుష్యమాసంలో వచ్చే అమావాస్య (నాగోబా జాతర) లని పండుగలుగా జరుపుకుంటాం కదా ! కనుక అమావాస్య భగవంతుని అనుగ్రహాన్ని అందించేది.
సర్వేజనా సుఖినోభవంతు !
శుభం .
Amavasya is the day for Pitru Devathalu, Mahalaya Amavasya, Somavara Amavasya
#amavasya #pitrudevata #pitrudevatalu #pithrudevatha #pitrudevatha