గురుగ్రహ అనుగ్రహాన్ని ప్రసాదించే బగళాముఖి

గురుగ్రహ అనుగ్రహాన్ని ప్రసాదించే బగళాముఖి.
- లక్ష్మి రమణ
గురుగ్రహ (guru graha) అనుగ్రహం లేకపోతె, జీవితమంతా కష్టాల సాగరమే. మార్గమే లేని కారడవిలో , చేతిలో దివిటీ కూడా లేని పరిస్థితిలో సాగే ప్రయాణంలా ఉంటుంది. అటువంటి వెలుగే లేని జీవితంలో వెలుగు దివిటీలా నిలిచి, దారిచూపే దేవత బగళాముఖి. ఈ అమ్మవారి ఆరాధన వలన శతృ నాశనం జరుగుతుంది. జీవితంలో వెలుగు వికసిస్తుంది. ఈ దేవదేవి ఆవిర్భావానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
బగళాముఖి (Bagalamukhi) అమ్మవారి మరో పేరు వైష్ణవి. వైష్ణవి (Vaishnavi ) అంటే లక్ష్మీ దేవి (Lakshmi Devi). పసుపు వస్త్రాలు ధరించి, జ్వలించే ముఖారవిందంతో దర్శనమిచ్చే ఆ వైష్ణోదేవే ఈ బగళాముఖి. అమ్మవారిని భక్తులు …
పీతాంబర ధరి శత్రుభయ నివారిణి
జ్వాలాముఖి వైష్ణవి నామ విఖ్యాతే బగళాముఖీ నమోస్తుతే
అని స్మరించుకుంటూ ఉంటారు.
శత్రుభయ నివారిణి అయిన బగళాముఖీ దేవి :
అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగింది అనే విషయాన్ని గురించి అనేకానేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, వీటన్నింటిలోనూ అమ్మవారి రూపగుణ విశేషాలకి సంబంధించిన వర్ణనలు మాత్రమూ ఒకే విధంగా ఉండడం విశేషం.
ముందుగానే చెప్పుకున్నట్టు అమ్మవారికి పసుపు రంగంటే ఇష్టం. పసుపుపచ్చని వస్త్రాలని, పసుపు వర్ణంలోని పూవులతో కూడిన హారాన్ని ధరించి, కానక పుష్యరాగమణిని అలంకరించుకొని , పసిడి ఆభరణాలతో మెరిసిపోతూ, హరిద్రసరస్సు లేదా పసుపు వర్ణంలోని సరస్సు మధ్యలో రాక్షస మర్దినిగా దర్శనం ఇస్తారు. అమ్మవారి రూపం భయంకరమే. అయినా ఆవిడ అభయం అమృతం. భక్తులకు అమ్మ అనుగ్రహం అనంత శుభప్రదం.
ఆవిర్భావం ఇలా :
బ్రహ్మ దేవుని మెప్పించిన ఒక అసురుడు తన నోటిశబ్ధం నుండి ప్రకంపనల సుడిగుండాలు (అల్ట్రాసౌండ్ ఎఫెక్ట్స్ ?) వచ్చే వరం పొందాడు. ఆలా పొందిన అతనికి గర్వం పెరిగి మునిశ్రేష్ఠులను ఆ తరంగాల ధ్వని ద్వారా హింసించడం, పీడించడం మొదలు పెట్టాడు. వాడిని ఎదిరించడానికి వరాన్ని అనుగ్రహించిన బ్రహ్మదేవునితోపాటు, ఇతర దేవతలు కూడా భయపడసాగారు. ఆ రాక్షసుని అంతం కేవలం వైష్ణవి వల్లే సాధ్యమని తలచిన దేవతలు విష్ణుమూర్తిని శరణువేడతారు. ఆ స్వామీ ఒక సరోవరం దగ్గరికి వెళ్లి తన అంశాన్ని ఆ సరోవరంలో ఉంచి , తానూ తపోనిమగ్నమయ్యారు. స్వామివారి అంశము సరోవరంలో ప్రవేశించడం చేత ఆ సరోవరం పసుపు రంగులోకి మారిపోయింది. అందుకే దానిని హరిద్రాసరోవరమని, పితసరోవరమని అంటారు. అలా అమ్మవారిని గురించి తపస్సు చేసిన విష్ణుమూర్తిని అనుగ్రహించి అమ్మవారు కొంగని వాహనంగా చేసుకొని దర్శనమిస్తారు. ఆ రాక్షసుణ్ణి సంహరించేందుకు యుద్ధోన్ముఖమైన అమ్మ వాడికి సందేశం పంపింది.
కానీ అమ్మని యుద్ధానికి ఆహ్వానిస్తున్న యోధురాలిగా చూడలేని ఆమూడుడు కాముకత్వంతో, అమ్మని ఒక అబలగా భావించి, తనని వరించమని కోరాడు. వాదప్రతివాదనల తర్వాత కూడా వాడి మొహం తగ్గలేదు. అమ్మ వీరత్వాన్ని కళ్లారా చూసినా కాముకత్వపు పొరలు తొలగలేదు.
ఆ యుద్ధంలో అమ్మవారి మీద మోహం తో నాలుక బయటకు తీసిన ఒకే ఒక్క విఘడియ కాలంలో అమ్మవారు స్తంభన విద్య ప్రయోగించి వాడి నాలుక బయటవుండేటట్లు చేస్తుంది. తరువాత ఆ నాలుకని బయటకు లాగిపట్టుకొని తనగదా దండం తో నాలిక పై వేటు వేసి వాడిని వాదించింది. దేవదుందుభులు మ్రోగాయి. పూల వర్షం కురిసింది. అలా అమ్మవారు దుష్ట బుద్ధి పై తన అందని ప్రయోగించింది, కాబట్టి శతృబుద్ధి,బ్రష్టచారిణి అని కూడా ఆవిడని పిలుస్తారు .
ఈ అమ్మవారి ఉపాసన వల్ల స్తంభన సిద్ధి కల్గుతుంది. ఇంకా గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. సర్వకార్యసిద్ధి కల్గుతుంది. జ్వాలాముఖి శక్తిపీఠం, వైష్ణోదేవి ఆలయాన్ని అమ్మ అనుగ్రహం కోసం దర్శించవచ్చు. అంతదూరం వెళ్లలేనివారు ఆంధ్రప్రదేశ్ లోని చందోలు గ్రామంలో ఉన్న
బగళాముఖీ దేవిని దర్శించుకోవచ్చు. దసరా నవరాత్రుల్లో ఈ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి.
ఓం శ్రీ బగళాముఖీ దేవ్యే నమః
శ్రీ మాత్రే నమః
Bagalamukhi Devi, Om sri Bagalamukhi Devyai Namaha
#bagalamukhi