తిధులు , మంచి, చెడు, - వాటి దేవతలు
తిధులు , మంచి, చెడు, - వాటి దేవతలు
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ
ఏ పనికైనా శుభ ముహూర్తాలు చూసుకోవడం మన సంప్రదాయం . కాలెండర్లో నక్షత్రాలు ,తిధులు, వర్జము తదితరాలు అన్ని ఉన్నా కూడా వాటిని గురించి తెలియని వారు మనలో చాలా మంది . అటువంటివారికి అవగాహన కోసం తిధుల గురించి , వాటి మంచీ చెడుల గురించి ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం .
పాడ్యమి
శుద్ధ పాడ్యమి ఉదయం నుండి పనులకు మంచిది కాదు, తిది అర్ధ భాగం తరువాత మంచిది, బహుళ పాడ్యమి అన్నిటికీ శుభప్రదమే. ఈ తిథికి అధిదేవత అశ్వినీ దేవతలు.
విదియ
ఉభయ పక్షములలో ఈ తిథిలో ఏ పని తలపెట్టినా శుభకరము.
ఈ తిథికి అధిదేవత బృహస్పతి.
తదియ
ఉభయ పక్షములలో ఈ తిథిలో పనులలో విజయం, ఆనందం కలిగించును. ఈ తిథికి అధిదేవత గౌరీ దేవీ.
చవితి
శుక్ల పక్షంలో మద్యాహ్నం 1 గం ॥ వరకు గణపతి కి మంచిది, తరువాత మనకు మంచిది, బహుళ చవితి అన్నిటికీ శుభకరం. ఈ తిథికి అధిదేవత గణపతి.
పంచమి
అభయ పక్షములలో ఈ తిథికి శుభానికి చిహ్నం, ఈ తిది లో చేసిన పని లాభం చేకూరును. ఈ తిథికి అధిదేవత సర్పము. నాగ దోషం ఉన్నవారు ప్రతి పంచమికి సర్ప ఆరాధన చేయడం మంచిది.
షష్ఠి
పగలు సుబ్రమణ్య స్వామికి కేటాయించి నందున రాత్రి మనకు మంచిది. ఉభయ పక్షములలో వివాహ -ఉపనయనములకు ఎల్లప్పుడూ మంచిది.
ఈ తిథికి అధిదేవత కుమారస్వామి.
సప్తమి
ఉభయ పక్షములలో అన్ని పనులకు మంచిది. ఈ తిథికి అధిదేవత సూర్యుడు.
అష్టమి
దుర్గా దేవి పూజకి మాత్రమే కలిసి వచ్చే రోజు, మనకు కలిసి రాదు, కాకపొతే వివాహ ఉపనయనములకు మంచిది. ఈ తిథికి అధిదేవత అష్ట మాతృకలు.
నవమి ఉభయ పక్షములలో వివాహ ఉపనయనాలకు మాత్రమే శుభప్రదం. రాత్రి గృహ ప్రవేశాలకు మంచిది. ఈ తిథికి అధిదేవత దుర్గాదేవి.
దశమి
ఉభయ పక్షములలో సమస్త కార్యములకు విజయము . ఈ తిథికి అధిదేవత దిక్పాలకులు.
ఏకాదశి
కొన్నిటికి మాత్రమే శుభం. పది పనులలో ఒకటి జరుగును. ఈ తిథికి అధిదేవత కుబేరుడు.
ద్వాదశి
ఉభయ పక్షములలో అన్ని శుభకార్యాలకు మంచిది.
ప్రయాణములకు ఆహారం తిని వెళ్ళిన మంచిది, శుభప్రదం, లాభం కలుగును. ఏమి తినకుండా వెళ్లినట్టయితే పనులు నెరవేరక తిరిగి వచ్చెదరు. ఈ తిథికి అధిదేవత విష్ణువు.
త్రయోదశి
శుక్ల పక్షంలో అన్ని పనులకు విజయము. బహుళ పక్షంలో వర్జితము. ఈ తిథికి అధిదేవత ధర్మదేవత.
చతుర్దశి శుక్లపక్షంలో అన్ని పనులకు విజయము. బహుళ పక్షంలో వర్జితము. ఈ తిథికి అధిదేవత రుద్రుడు.
పౌర్ణమి
అన్ని శుభాలే. కాకపొతే పౌర్ణమి రాత్రి 8-22, 8-24, 8-26, 8-28, 8-42, 8-44, 8-46, 8-48. ఈ సమయములలో వర్జం లేకుండా ఉంటే , మాత్రమే మరింత మంచిది .
అమావాస్య
శుభకార్యాలకు వర్జితము. ప్రయాణాలు చేయకూడదు అనేది అపోహ. ఈరోజున పితృ దేవతలను ఆరాధించడం మంచిది. ఈ తిథికి అధిదేవత పితృదేవతలు.
గమనిక : ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే ఇవ్వడం జరిగింది. తిథితో బాటు ఆరోజున శుభ నక్షత్రము యోగ కరణాలు కూడా బాగుండాలి. పై సమాచారం బట్టి స్వయంగా నిర్ణయం చేసుకోవడం మంచిది కాదు.