Online Puja Services

‘తిరుమల జోలికి వెళ్లొద్దు!!’

3.135.206.229

‘తిరుమల జోలికి వెళ్లొద్దు!!’ - శ్రీ శ్రీ శ్రీ పరమాచార్యవారి అనుగ్రహం . 
- లక్ష్మి రమణ 

దాదాపు యాభై సంవత్సరాల క్రితం, పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన. పెరుగుతున్న భక్తుల రద్దీని తట్టుకుని మంచి దర్శనం కల్పించడానికి తితిదే ఎప్పుడూ ఏవో ప్రణాలికలు రచిస్తూనే ఉంటుంది. అలా ఒకసారి పౌర సంబంధాల అధికారి మరియు దేవస్థానం సభ్యుల కలిసి ఒక పథకం ఆలోచించారు..

మామూలుగా జయవిజయులను దాటి స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు మరలా అదే దారిలోనే బయటకు రావడం ఆనవాయితీ. అలా కాకుండా అర్ధమందపం యొక్క ప్రక్క గోడలు తొలగించి అక్కడ ద్వారములు తెరిస్తే, వాటినుండి దర్శనం చేసుకున్న భక్తులు కుడిఎడమలకు వెళ్ళవచ్చు. దీనివల్ల భక్తుల రద్దీని భరించవచ్చు. ఇది అమలు చెయ్యాలనుకున్న ప్రతిపాదన.

దీని గురించి లోతుగా చర్చించి నలభై లక్షల వ్యయంతో అమెరికా నుండి కటింగ్ మెషిన్ ను కొనుగోలు చెయ్యాలని నిర్ధారించారు. ఇదంతా విని అక్కడే ఉన్న శ్రీ గణపతి స్థపతి గారి మనస్సు కలతపడింది. మనస్సులోని బాధ మోహంలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అక్కడే ఉన్న ఒక మంత్రి దీన్ని గమనించారు. స్వయంగా స్థపతి గారినే, “ఎందుకు స్థపతి గారు మౌనంగా ఉన్నారు? ఈ నిర్ణయం మీకు సమ్మతమే కదా?” అని అడిగారు.

“నా అభిప్రాయాల్ని నేను చెప్పవచ్చునా?” అని అడగగా, సరే అన్నట్టు తలూపారు మంత్రిగారు. దేవాలయ ఆగమ పద్ధతులను అనుసరించి వేలఏళ్ళ క్రితం ఆగమ శాస్త్రంలో ఉద్ధండులైన మహాత్ముల చేత కట్టబడింది ఈ దేవాలయం. గర్భాలయం ముందర ఉన్న అర్థ మండపం పరమ పవిత్రమైనది. దారికోసమని ఆ మండపం గోడలను కూల్చడం సరైన పని కాదు. అలా జరిగిన పక్షంలో వేంకటేశ్వర స్వామివారి పవిత్రత, శక్తికి ఆటంకం ఏర్పడవచ్చు...

ఈ పడగొట్టే ప్రణాలికను ఆపేయడం మంచిది అని ధైర్యంగా చెప్పారు.

సభ్యులందరూ ఈ కొత్త ఆలోచనని అప్పటికే ఏకగ్రీవంగా ఆమోదించడంతో, స్థపతి గారి మాటలను పట్టించుకోలేదు. దిన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి పనులన్నీ అక్కడే జరిగిపోయాయి. ఇక చేసేదిలేక అందరి బలవంతం పైన స్థపతి కూడా సంతకం పెట్టవలసి వచ్చింది.

అప్పటినుండి స్థపతి గారి మనస్సు ప్రశాంతతను కోల్పోయింది. గుండె బరువేక్కగా అక్కడినుండి వెళ్ళిపోయారు. దీన్ని ఎలాగైనా ఆపాలని పరి పరి విధాల ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడైన పరమాచార్య స్వామివారు తప్ప ఎవరూ సహాయం చెయ్యలేరని నిర్ణయించుకున్నాడు. వెంటనే మహాస్వామివారి వద్దకు పరుగులు తీసాడు..

కార్వేటి నగరం చేరేటప్పటికి ఉదయం అయ్యింది. బాధపడిన మనస్సుతో పరమాచార్య స్వామివారిని దర్శించాగానే కళ్ళ వెంట అదేపనిగా నీరు వస్తోంది. మహాస్వామివారు వేళ్ళను నుదుటిపై మూడు నామాలవలె చూపిస్తూ, “అక్కడి(తిరుమల) నుండే వస్తున్నావా?” అని అడగడంతో కాస్త కుదుటపడ్డాడు.

“అవును” అని మహాస్వామి వారితో తన బాధనంతా చెప్పుకుందామని నోరుతెరవగానే, చేతి సైగ ద్వారా ఆగమన్నారు స్వామివారు. “ఇప్పుడు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు..

ముందు వెళ్లి ఏమైనా తిను”. తల్లి ప్రేమకంటే గొప్పది ఇంకేదైనా ఉంది అంటే అది పరమాచార్య స్వామీ వారి కరుణ మాత్రమె. ఎందుకంటే ఆ తల్లిప్రేమకు మాత్రమే తెలుసు స్థపతి రెండు రోజులుగా ఏమీ తినకుండా మదనపడుతున్నాడని.

మఠసేవకుణ్ణి పిలిచి, “ఏదైనా హోటలుకు తీసుకుని వెళ్లి కడుపునిండా ఆహారం పెట్టించు” అని స్థపతితో పాటు పంపారు. ఆ సమయంలో కేవలం ఒక్క హోటల్ మాత్రమే తెరచి ఉంది. హోటల్ ఓనరుతో స్థపతి గారికి పెట్టిన ఆహారానికి పరమాచార్య స్వామివారు డబ్బు కడతారు అని చెప్పగా, “పరమాచార్య స్వామివారు పంపిన వారికి ఆహారం ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం” అని సిద్ధంగా ఉన్న వివిధ రకాలైన ఆహార పదార్థాలను వడ్డించారు..

తిన్న తరువాత వెళ్లి పరమాచార్య స్వామీ వారి ఎదుట నిలబడ్డారు. “ఇప్పుడు చెప్పు” అని స్థపతి చెప్పిన విషయాలను మొత్తం విని,, “అలా గోడలను తొలగిస్తే ఏమవుతుంది?” అని అడిగారు.

“తిరుమల ఆలయంలో ఏ మార్పు అయినా పరమాచార్య స్వామివారికి చెప్పిన తరువాతనే అమలుపరుస్తారు. కాని ఇప్పుడు ఈ విషయాన్ని మీకు చెప్పలేదు. అర్థ మంటపాన్ని కదిలిస్తే మునుపటిలాగా వేంకటాచలపతి యొక్క దివ్యశక్తి జనులకు ప్రసరించదు. బహుశా వారి నిర్ణయాన్ని మీకు తెలపడానికి వారు ఇక్కడకు రావచ్చు. అప్పుడు మీరు దీనికి అనుమతి ఇవ్వవలదు” అని పరమాచార్య స్వామీ వారిని ప్రార్థించాడు..

మానవజాతినే ఉద్ధరించడానికి ఈ భువిపై అవతరించిన మహాస్వామివారు తమ చల్లని చిరునవ్వుతో, “అంతా నీవు అనుకున్నట్టుగానే జరుగుతుంది. చింత వలదు” అని అభయమిచ్చారు. కొద్దిగా మనోవేదన తగ్గడంతో స్థపతి అక్కడినుండి వచ్చేశారు. బాగా అలసిపోవడం వల్ల ఆ రాత్రి బాగా నిద్రపట్టింది. ఎవరో తనని నిద్రలేపుతునట్టు అనిపించడంతో హఠాత్తుగా అనిపించసాగింది.

భయంతో లేచి చూస్తె అక్కడ ఎవరూ లేరు. కాని తన అలసట బాధ అంతా తిరిపోయి, చాలా ఉల్లాసంగా అనిపించింది. వెంటనే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి ఇంటికి పరిగెత్తాడు. గేటు దగ్గర ఉన్న సెక్యురిటి గార్డు స్థపతి గారిని గుర్తుపట్టి ఆశ్చర్యంతో ఇంత ఉదయం రావాల్సిన పనేమితని అడిగాడు. వెంటనే తానూ ముఖ్యమంత్రి గారిని కలవాలని చెప్పారు..

ముందస్తు సమాచారం లేనందున అతను అందుకు ఒప్పుకోలేదు. కాని, తిరుపతి గణపతి స్థపతి అంతే ఎవరో అందరికి తెలిసినదే కాబట్టి వారి కోరికను మన్నించడానికి ఒక అధికారి సమాయత్తమయ్యాడు. “అయ్యా, ఒక పని చేద్దాం. సరిగ్గా నాలుగున్నరకి కాఫీ తాగడానికి ముఖ్యమంత్రి గారు కిందకు వస్తారు. కిందకు వచ్చి హాలులోకి వెళ్ళేటప్పుడు, వారు మిమ్మల్ని చూస్తే సమస్య లేదు. లేదంటే మీరు ఉదయం దాకా ఆగవలసిందే” అని చెప్పాడు.

పరమాచార్య స్వామివారు ఖచ్చితంగా దారి చూపిస్తారు అనే నమంకంతో, స్థపతి గారు అక్కడ నిలబడ్డారు. ముఖ్యమంత్రి గారు మెట్లు దిగుతూ వాకిట్లో నిలబడ్డ స్థపతిని చూశారు. “ఏంటి గణపతి ఇంత ఉదయాన్నే?” అని అడిగి, లోపలి రమ్మన్నారు..

“తిరుమల దేవాలయానికి ప్రమాదం” అంటూ మొదలుపెట్టి మొత్తం జరిగిన విషయాన్నంతా చెప్పారు. స్థపతి చెప్పిందంతా విన్న తరువాత ముఖ్యమంత్రి గారి ముఖంలో కోపం కనపడింది. వెంటనే దేవాలయ వ్యవహారాలు చూసే మంత్రిని సంప్రదించారు. “మొన్న తిరుమలలో ఏం జరిగింది?” అని అడిగారు. “ఓహ్ అదా! మీతో ఆ విషయం మాట్లాడుదామనే మొత్తం వివరాలతో సిద్ధం అవుతున్నాను” అని బదులిచ్చారు మంత్రిగారు.

ముఖ్యమంత్రి గారు కోపంతో “నేను అడిగింది ఏమి జరిగింది అని మాత్రమె?” ఈసారి ప్రశ్న చాలా సూటిగా వచ్చింది. మొత్తం తమ ప్రణాలికను వివరించారు మంత్రిగారు. ఇంకా ఏదో చెప్పబోయేంతలో,

“ముందు నేను చెప్పేది విను. ..

వెంకన్న జోలికి పోకండి” అని నిక్కచ్చిగా చెప్పారు. తిరుమల వేంకటేశ్వర స్వామీవారి విషయాల్లో అనవసరంగా తలదూర్చకండి అని చెప్పి సంభాషణ అక్కడితో ముగించారు.

స్థపతిని పంపుతూ, “తిరుమలకు ఏమీ జరగదు. నువ్వు నిశ్చింతగా వెళ్ళు” అని భరోసా ఇచ్చారు. పెద్ద బరువు దింపుకుని చాలా ఉత్సాహంగా తిరుగు ప్రయాణమయ్యారు స్థపతి.

తనను నిద్ర నుండి లేపి, ఈ సమయంలో ముఖ్యమంత్రి గారిని కలిసి, ఇంట పెద్ద సమస్యకు పరిష్కారాన్ని చూపించింది ఏదో ఒక అదృశ్య శక్తి అని గ్రహించాడు.

వెంటనే పరమాచార్య స్వామివారి పలుకులు చెవిలో వినబడ్డాయి. “అంతా నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది” అన్న మాటలు గుర్తుకురావడంతో ఒక్కసారిగా ఒణుకు ప్రారంభమై ఒళ్ళు గగుర్పాటుకు గురైంది.

వరుసగా జరిగిన ఈ సంఘటనలన్నీ కేవలం మహాస్వామివారు ఆశీస్సుల వలన మాత్రమె అని తలచి ఆ ఉషోదయ సమయంలో స్వామివారిని తలచుకుని పులకించిపోయాడు.

--- “కంచి మహానిన్ కరుణై నిళగల్” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

Paramacharya, periyava, tirumala, tirupati, sthapati, chief minister, venkateswara swami, 

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi