ప్రజల క్షేమమే పరమాచార్య ధ్యేయం.
ప్రజల క్షేమమే పరమాచార్య ధ్యేయం.
పరమాచార్య స్వామివారి గురించి నేను మొదటిసారి విన్నది 1943లో, నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు. తిరువానైకోయిల్ లో మకాం చేస్తున్న స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తూ నా మిత్రుడు సాయింత్రం ఆటను మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తరువాత తిరుచిరాపల్లిలో ప్రముఖ వైద్యులు, శ్రీమఠంలో కూడా సాధారణ వైద్యునిగా, పంటి వైద్యునిగా పేరుగాంచిన మా నాన్నగారు డా. వి. సుబ్రమణియమ్ గారు నన్ను, మా అమ్మను, నా సోదరిని తీసుకుని దర్శనానికి వెళ్ళారు. అప్పుడు సాయం సంధ్యా సమయం. తిరువానైకోయిల్ మఠం తోట ఆవరణంలో చిన్న గుడిసెలో పరమాచార్యుల స్వామివారి సమక్షంలో పాదపూజ చేశారు మా నాన్నగారు. మహాస్వామి వారు నవ్వుతూ, మందహాసంతో, కరుణాపూరిత మోముతో దాదాపు అరగంట పటు సాగిన ఆ క్రతువులో అలా కూర్చుని ఉండడం నాకు ఇప్పటికి గుర్తు. అరవై ఏళ్ళ తరువాత కూడా కళ్ళు మూసుకుంటే ఇప్పటికి ఆ మనోహర దృశ్యం గోచరమవుతుంది.
నా జీవితాన్ని, జీవన గమనాన్ని మలుపు త్రిప్పిన అద్భుత జ్ఞాపకం, నన్ను మహాస్వామి వారు విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం. అది 1960 ఏప్రియల్ లేదా మే అనుకుంటా. కామన్వెల్త్ స్కాలర్షిప్ లకు మొదటి విడత విద్యార్థులను జాబితా వెలువడే సమయం. కొద్ది వారాల క్రిందట శ్రీలంకలోని కొలంబోలో జరిగిన కామన్వెల్త్ దేశాల ప్రధానుల సమాఖ్యలో తీసుకున్న ముఖ్య నిర్ణయం ఈ స్కాలర్షిప్ ల విధానం.
అందుకోసం నేను ఢిల్లీలో ఇంటర్వ్యూ ఇచ్చిన కొద్దిరోజుల తరువాత ఈడిన్ బర్గ్ లో రెండేళ్ళ పాటు న్యూరోసర్జికల్ శిక్షణకు ఎంపికయ్యానని తెలిసింది. తిరుచ్చిలో ఉన్న మా నాన్నగారికి విషయం తెలిపాను. అప్పట్లో పరమాచార్య స్వామివారు సాంప్రదాయ కుంటుంబ పిల్లలు చాలాకాలం పాటు విదేశాలకు వెళ్ళే ఆలోచనను సమ్మతించేవారు కాదు. స్వామివారు అనుమతి ఇస్తేనే నేను వెళ్ళడానికి కుదురుతుందని నాన్న గారు తెలిపారు. పరమాచార్య స్వామి అనుగ్రహం కోసం అందరమూ శ్రీ మఠానికి వెళ్ళాము.
నాన్న గారు : రామన్ కు స్కాట్ ల్యాండ్ వెళ్లి మెదడు శస్త్రచికిత్సలో శిక్షణ పొందడానికి స్కాలర్షిప్ లభించింది. వెళ్ళాలని ఆశపడుతున్నాడు.
మహాస్వామి : అందువల్ల ఏమి ప్రయోజనం?
నాన్న గారు : ఇప్పుడు జనరల్ సర్జరీలో యమ్ యస్ డిగ్రీ ఉంది. విదేశాలకు వెళ్లి, న్యూరోసర్జరీలో నిష్ణాతుడు అయితే, ఎక్కువ ధనం సంపాదించవచ్చు.
మహాస్వామి : అతను వెళ్ళడం వల్ల ఉపయోగం ఏమి?
నాన్న గారు : తను ఇంగ్లాడు వెళ్లి, ఎఫ్.ఆర్.సి.యస్ డిగ్రీ తెచ్చుకుని, పరిశోధన చేస్తే పి.హెచ్.డి డిగ్రీ లభిస్తుంది.
మహాస్వామి : అది కాదు. అతను వెళ్ళడం వల్ల ప్రజలకు ఏమిటి ఉపయోగం?
అప్పుడు అర్థం అయ్యింది మా నాన్నగారికి మహాస్వామి వారి ప్రశ్నలలో ఉన్న అంతరార్థం. అప్పుడు మా నాన్న ఇలా జవాబు ఇచ్చారు.
ఇప్పుడు మెదడుకు సంబంధించిన ఆపరేషన్లు డా. రామమూర్తి గారు ఒక్కరే చేస్తున్నారు. వారు ఒక్కరే అవ్వడం వల్ల ఎందఱో రోగులకు శస్త్రచికిత్స అందడం లేదు. విదేశాలకు వెళ్లి శస్త్రచికిత్సలు చేసుకునే అంత స్తోమత అందరికి ఉండదు. రామన్ విదేశాలకు వెళ్లి, న్యూరోసర్జరీలో శిక్షణ పొంది వస్తే, ఎక్కువమంది రోగులకు చికిత్స చెయ్యవచ్చు. అంతేకాక భారతదేశంలోనే ఇంకా ఎక్కువమంది డాక్టర్లకు శిక్షణ ఇచ్చి, వారు శస్త్రచికిత్సలు నిర్వాహించేటట్టు చెయ్యవచ్చు. ఇది ప్రజలకు చాలా ఉపయోగకరం పెరియవ.
మహాస్వామి : అలా అయితే, వెళ్ళమని చెప్పు.
ఒక విషయాన్నీ మహాస్వామి వారు నిర్ణయించే విధానం ఇది. ఒక సాంప్రదాయ బ్రాహ్మణ యువకుడు నిత్యానుష్టానం వదిలి విదేశాలకు వెళ్ళడమా, ఎక్కువ విద్యార్హతలు సంపాదించడమా, ఎక్కువ ధనం ఆర్జించడమా అన్నది ముఖ్యం కాదు.
ఇక్కడ ఈ దేశంలో ఉన్న ప్రజలకు అందువల్ల కలగబోయే సహాయం, దాని వల్ల ప్రజలకు కలిగే ఉపయోగం మాత్రమే ముఖ్యం. స్వామివారి నిర్ణయానికి కొలమానం అదే!
--- ప్రొ. యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం