ఉగాదినాడు కంచి పరమాచార్య వారు చేసిన పూజా సంకల్పం

ఉగాదినాడు కంచి పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చేసిన పూజా సంకల్పం ఏమిటో తెలుసా ?
- లక్ష్మి రమణ
ఏ పూజకైనా సంకల్పం కామితములని అనుగ్రహించేది. ఆ పూజ చేసేముందర యందు నిమిత్తం ఈ పూజని చేస్తున్నామో ఆ కోరికని సంకల్పంలో భగవంతునికి విన్నవించుకుంటాం. మరి జగద్గురువులు, నడిచే దేవునిగా పేరొందిన కంచి పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు తమ ఉగాది పూజలో ఏ సంకల్పంతో పూజని నిర్వహించారు ? ఈ విషయాన్ని తెలుసుకుంటే, సనాతన ధర్మం గొప్పదనం తెలుస్తుంది.
పరమాచార్య స్వామివారు చిత్తూరు దగ్గరలో మకాం చేస్తున్నారు. ఆరోజు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండగ. మహాస్వామివారి దర్శనానికి చాలామంది భక్తులు వచ్చారు. భక్తులు అలా కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉన్నారు . స్వామివారు వారిని అనుగ్రహిస్తూనే ఉన్నారు . ఆవిధంగా దర్శనం అలా కొనసాగుతూనే ఉంది. అప్పటికి దాదాపు మధ్యాహ్నం రెండు గంటలు కావొస్తోంది. కాని పరమాచార్య స్వామివారు ఇంకా మొదటి కాల పూజ కూడా ప్రారంభించలేదు. స్వామివారి ఆంతరంగిక శ్రీమఠం సేవకులొకరు అప్పటికే పూజకు ఆలస్యమైందని, స్వామి వారికి వినయంగా మనవి చేశారు.
వెంటనే మహాస్వామివారు భక్తులతో , “మనం ఈ నూతన సంవత్సరాన్ని చంద్రమౌళీశ్వర పూజతో ప్రారంభిద్దాము. పూజని సంకల్పంతో మొదలుపెడదాము” అని చెప్పి పూజకు ఉపక్రమించారు.
భక్తుల మనసులో తలెత్తే ప్రశ్నలు, వారి సమస్యలు పెరియవకు నోరు తెరిచి వారు చెప్పే అవసరం ఉందా? ఎవరి మనసులో మెదిలిన ప్రశ్నో తెలియదుగానీ, అక్కడ కూర్చున్న అంతమంది భక్తులను ఉద్దేశించి ఒక ప్రశ్న వేశారు మహాస్వామివారు. “ప్రతిరోజూ చేసే చంద్రమౌళీశ్వర పూజలో చదివే సంకల్పం యొక్క అర్థం, పరమార్థం ఇక్కడున్న ఎవరికైనా తెలుసునా ?” అని.
భక్తులు రకరకాలైన సమాధానాలు వారి వారి అవగణనని అనుసరించి చెప్పారు . ఒకరు అది పరమాచార్య స్వామి వారి కోసం అని అన్నారు. మరొకరు పరమాచార్యవారి కోసం, పుదు పెరియవ కోసం అని చెప్పారు. వేదముల యొక్క సంరక్షణ కోసం అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు. మరో వ్యక్తి ప్రముఖ శ్లోకాన్ని అనుసరించి, అది పాలకులు, బ్రాహ్మణులు, గోవుల యొక్క క్షేమం కోసం అని అన్నారు.
వారి అభిప్రాయాలకి ఒక అంతిమ రూపునిస్తూ, సనాతన ధర్మము గొప్పదనాన్ని విశదపరుస్తూ, దివ్యమైన తమ అనుగ్రహముతో మహాస్వామివారు సంకల్పం చెప్పే శాస్త్రి గారిని పిలిచి, సంకల్పం యొక్క అర్థము, ఉద్దేశ్యము అనువదించి అందరికి తెలియజేయాల్సిందిగా ఆజ్ఞాపించారు.
అపుడు అక్కడున్నవారందరికీ ఆ చంద్రశేఖరుని అంతరంగం, ఆయన సంకల్పంలోని ఔన్నత్యం అర్థం అయ్యింది . ఇంతకీ ఆ సంకల్పం ఏమిటంటే, కుల, మత, వర్ణ, లింగ, ధనిక, పేద వివక్ష లేకుండా సర్వ మానవాళి సుభిక్షత కోసం మహాస్వామివారు జరిపే పూజ అది . కేవలం ఉగాదికి మాత్రమే ఈ సంకల్పం పరిమితం కాదు . శ్రీమఠంలో రోజూ జరిగే పూజ యొక్క ప్రయోజనం కూడా ఇదే !! అదీ సనాతన ధర్మంలోని గొప్పదనం.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
--- ప్రొ. యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి కంచిపరమాచార్యవైభవం వారి అనువాదం ఆధారంగా .