అరటిపండుకీ , దూర్వాసుని కోపానికి సంబంధం
అరటిపండుకీ , దూర్వాసుని కోపానికి విడదీయలేని సంబంధమే ఉంది .
- లక్ష్మి రమణ
దూర్వాసుడు తపస్వి. మహా కోపిష్టి కూడా! ఆ కోపానికి ఒక అర్థం ఉంది . ఆయన కోపం లోకకళ్యాణానికే తోడ్పడింది. దూర్వాసుని గురించిన ప్రస్తావనలు పురాణాలలో కృతయుగం నుండీ ద్వాపర యుగం దాకా కనిపిస్తాయి . మహర్షుల శాపాలు మంచికే కానీ చెడుకు కాదు అనే విషయాన్ని దూర్వాసుడి చరిత్ర చూస్తే అర్థమవుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఎంత అవసరమో కూడా అర్థం అవుతుంది . ఇంతకీ దూర్వాసుని ప్రసక్తికి అరటిపండుకీ ఉన్న లింకేంటీ అని ఆలోచిస్తున్నారా ? ఆ కథకే వస్తున్నా ! అరటిపండుకీ , దూర్వాసుని కోపానికి విడదీయలేని సంబంధమే ఉంది .
కృతయుగం త్రేతా యుగం ద్వాపర యుగాలలో దుర్వాసుడి ప్రమేయము మన పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది అత్రి మహర్షి తపస్సుకు, అనసూయామాత పాతివ్రత్యానికి మెచ్చినటువంటి త్రిమూర్తులు ఇచ్చిన వరప్రసాదమే దూర్వాస మహర్షి.
అత్రి అనసూయ కోరిక మేరకు త్రిమూర్తులు వారి కుమారులుగా జన్మిస్తామని వరమిచ్చారు. అలా త్రిమూర్తులలో రుద్రాంశ స్వరూపంగా దుర్వాస మహర్షి అనసూయ కడుపున జన్మిస్తారు. కాగా శ్రీమహావిష్ణువు వరప్రసాదంగా జన్మించినవారు దత్తాత్రేయుడు, బ్రహ్మగారి అంశ తోటి వరప్రసాదంగా జన్మించినవాడు చంద్రుడు.
రుద్రాంశ సంభూతుడైన దుర్వాస మహర్షి పుట్టుకతోనే అధికమైన క్రోధముతో జన్మించారట. దీనికి కారణం ఏమిటంటే, ఆయన రుద్రుని అంశ కావడం ఒక్కటే కాదు , అమ్మవారి ఆవేదన కూడా ! ఒకానొక సందర్భంలో ప్రళయకాల రుద్రుడైపోయిన పరమేశ్వరుణ్ణి శాంత పరచడం ఎవ్వరికీ చేతకాలేదు. దేవతలందరూ పరిపరివిధాలుగా ప్రయత్నించి విఫలమయ్యారు . అప్పుడు అమ్మవారు పార్వతీదేవి మీ కోపాన్ని తట్టుకొని మీతో కాపురం చేయడం నాకు కష్టమై పోతోంది మహాప్రభో! ఈ కోపాన్ని వదిలేయండి . అని అర్ధించారట . అలా తన కోపాన్ని అనసూయమాతలో ప్రవేశపెట్టడం చేత , దూర్వాసుడు ( కోపంతో ఉన్నవాడు) జన్మించారని ఒక కథ .
అలా అత్రి మహర్షి , అనసూయామాతల పుత్రుడైన దూర్వాసుడు, గొప్ప తపస్సు చేసి మహర్షి అయ్యారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు . కోపాన్ని భరించలేక అమ్మవారు రుద్రున్ని వేడుకుంటే, ఆ కోపాన్ని ఒక మహర్షిని చేసిన ఘనుడు పరమేశ్వరుడు . అటువంటి రుద్రస్వరూపాన్ని భరించాలంటే భార్యకి ఎంతటి ఓపిక , ఓర్పు , సహనం ఉండాలో ఆలోచించండి . అటువంటి దుర్వాస మహర్షి వివాహం కూడా విచిత్రంగానే జరగడంలో ఆశ్చర్యమేముంది .
దుర్వాసుడు వివాహాన్ని చేసుకోదలిచి ఔర్య మహర్షి దగ్గరికి వెళ్లి, ఆయన కూతుర్ని వివాహం చేసుకుంటానని, తనకి పిల్లనివ్వమని అర్థిస్తారు. అప్పుడు ఔర్యుడు తన కుమార్తె అయిన కదళీని దుర్వాసునికి ఇచ్చి వివాహం చేస్తారు. సాక్షాత్తూ పరమేశ్వరుని రౌద్రంతో కాపురం . కదళీ ఓపికమంతురాలే ! దూర్వాసునితో జాగ్రత్తగా మెలుగుతూ ఆయన సేవలో పరవశిస్తూ ఉండేది.
ఇదిలా ఉండగా ఒకనాడు దుర్వాస మహర్షి మధ్యాహ్నం పూట నిద్రకి ఉపక్రమించారు. సాయంత్రం వేళ అయ్యింది. సంధ్యా సమయం మించిపోతోంది. సంధ్యావందనం చేసుకోవాల్సిన మహర్షి ఇంకా లేవలేదు . ఆయనకీ కోపమొచ్చినా సరే, తన భర్త ధర్మాన్ని అతిక్రమించకూడదనే ఉద్దేశ్యంతో , భార్యగా తన ధర్మాన్ని నిర్వర్తించి, దూర్వాసుణ్ణి నిద్ర లేపింది . అంతే, ఆ ముక్కంటిలో ఉన్న అగ్ని ఈ దూర్వాసుని కంట్లో నుండీ వెలువడిందా అన్నట్టు , ఆయన నిద్రాభంగం అయ్యిందన్న కోపం ఆమెని నిలువునా కాల్చి బూడిద చేసేసింది . కదళీ బూడిద కుప్పగా మిగిలింది.
ఆ తర్వాత తన తప్పుని నిదానంగా తెలుసుకున్న దుర్వాస మహర్షి తన కోపానికి చింతించాడు. తన భార్య పేరు భూమిపైన శాశ్వతంగా ఉండేలా చేయాలనుకున్నారు . భగవంతునికి నిత్యము ఆమె ప్రసాదంగా మారేలా , ప్రాణికోటికి ఆరోగ్యాన్ని కలిగించేలా ఆమె శాశ్వతంగా ఈ భూమిపై నిలిచి ఉండాలని భావించి, ఆ భస్మంతో ఒక చెట్టుని సృష్టించారు. అదే కదళీ వృక్షం అంటే అరటి చెట్టు. ఆ విధంగా అరటి చెట్టు పుట్టింది. అందుకే రుద్రునికి , శివునికి , రుద్రసంభవుడైన హనుమంతునికి అరటిపళ్ళ నివేదనం మహాప్రీతినిస్తుంది.
ఈ విధంగా తన భార్యకి గొప్ప వరాన్ని అనుగ్రహించినా, కదళీ అని పిలిస్తే పలికే భార్యగా మాత్రం దూర్వాసుడు ఆమెని దూరం చేసుకున్నట్టే కదా ! ఆయనకి పిల్లనిచ్చిన ఔర్య మహర్షి కూడా సామాన్యుడేమీ కాదు! ఆయన అల్లుడు తన కూతుర్ని భస్మం చేశాడని తెలుసుకున్న ఆగ్రహంతో ఊగిపోయారు. ఒక సామాన్య భక్తుని చేతిలో నువ్వు నీ కోపానికి ఘోరమైన అవమానాన్ని పొందుతావని దుర్వాసుడ్ని శపిస్తాడు. ఆ శాప ప్రభావం తోటే అంబరీషుని చేతిలో దుర్వాస మహాముని గర్వభంగాన్ని పొందడం. ఆ కథ మరో పోస్టు లో చదువుకుందాం .
అసాంఘర్ అనే ప్రదేశంలో దూర్వాసునికి గుడి ఉంది. అక్కడ ఆయన శివలింగంలో ఐక్యమయ్యారని స్థానికుల నమ్మకం. ఆ విధంగా దూర్వాసమహర్షికి కదళీఫలానికి విడదీయరాని అనుబంధమే ఉంది మరి .
శుభం !