శంకరాచార్య ప్రతిష్ఠితమైన శ్రీ చక్రం ఉన్న దివ్యక్షేత్రం .

దర్శనమాత్రం చేత సిరిసంపదలు అనుగ్రహించే శంకరాచార్య ప్రతిష్ఠితమైన శ్రీ చక్రం ఉన్న దివ్యక్షేత్రం .
- లక్ష్మి రమణ
అపరశివావతారం ప్రతిష్టించిన చంద్రమౌళీశ్వరుడు అలరారుతున్న దివ్యదేశం . పంచవేణీ సంగమ పుణ్యతీర్థం . వైద్యనాధుడు , చెన్నకేశవుడూ వెలసిన దివ్య క్షేత్రం. అంతేనా , ఇక్కడ జగద్గురువైన ఆది శంకరాచార్యులు స్వహస్తాలతో స్థాపించిన శ్రీచక్రం ఈ ఆలయంలోనే ఉంది. ఆ శ్రీ చక్రాన్ని దర్శించి పూజిస్తే, సంపదలు సిద్ధిస్తాయి. వైద్యనాధుడు ఆరోగ్యప్రదాత. చెన్నకేశవుడు కోరినకోర్కెలు వరప్రదాయకుడు. ఇన్ని ప్రత్యేకతలున్న దక్షణకాశీగా పేరొందిన ఆ అద్భుతమైన క్షేత్రాన్ని దర్శిద్దాం రండి .
పుష్పగిరి పీఠం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒకేఒక శంకరాచార్య పీఠం .
దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక్క మార్గంలో వెళితే పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని ‘మధ్య అహోబిలం’ అనీ, శైవులు దీనిని ‘మధ్య కైలాసం’ అనీ అంటారు. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం కూడా ఇక్కడ ఉంది.
పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీక్షేత్రమంటారు. మూడు నదులు కలిస్తే త్రివేణీ సంగమస్థలి అంటాము కదా , అలా ఇక్కడ ఐదునదులు కలిసి సంగమిచే పంచనదీ సంగమ స్థలి. అక్కడ వెలసిన
హరిహరాదుల దివ్య క్షేత్రం.
శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి పుష్పగిరిమీద అనుగ్రహ వరదులై ఉన్నారు. అందువల్ల పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించిన స్థల ఐతిహ్యం ఇలా ఉంది .
పరీక్షిత్తు మహారాజుని కాటందుకున్న సర్పజాతి మీది కోపంతో జనమేజయుడు సర్పయాగమే నిర్వహించాడు. అందులో కోట్ల సర్పాలు దగ్ధం అయ్యాయి . ఆ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశానుసారం పుష్పగిరి కొండ పై ఈ ఆలయమును జనమేజయుడు నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని శాశనాల ద్వారా తెలుస్తుంది.
పుష్పగిరి కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణంలోనే ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. పుష్పగిరిలోనే పాపవినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమలసంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్ర పాదము, విష్ణు పాదము ఈ కొండ మీదనే ఉండడం విశేషం .
వరదలు వచ్చినప్పుడు పెన్న దాటి ఆవలి వైపుకు వెళ్ళలేరు. అప్పుడు ఈవలి వైపు ఉన్న అభినవ చెన్నకేశవ స్వామికి పూజలు జరుగుతాయి. పాతాళ గణపతిని దర్శించుకొని పూజలు చేసెందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. పుష్పగిరి మీదున్న ఈ దివ్య క్షేత్రాన్ని ఈ సారి మీ యాత్రా ప్రాముఖ్యతల్లో ఒకటిగా చేర్చుకోండి . శివకేశవుల అనుగ్రహాన్ని పొందండి . జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్టించిన
శ్రీ చక్రాన్ని దర్శించుకొని తరించండి .
శుభం !!