మలయాళీల యక్షి ఆరాధన
విచిత్రమైన మలయాళీల యక్షి ఆరాధన గురించి తెలుసా !
సేకరణ
దక్షిణభారత దేశానికే చెందిన కేరళ రాష్ట్రంలోని పూజా విధానాలు కొంత భిన్నంగా ఉంటాయి . కేరళలో పూజా విధానమంతా తాంత్రిక విధిలో జరుపుతారు. మనం ఇక్కడ ఆగమాలను పాటిస్తాం. పురాణాలు, పౌరాణిక పాత్రలలో కూడా మన ఊహలకు, వారు అన్వయించుకున్న దానికి మధ్య కూడా భేదం ఉంది. మనం యక్షులను మరుగుజ్జులుగా అన్వయించుకుంటే కేరళలో యక్షులు/యక్షిణులును అందానికి ప్రతిరూపంగా భావిస్తారు.కేరళలో ఉన్న యక్షి సంప్రదాయం, మలయాళ జానపదాల్లో వారికున్న ప్రాముఖ్యత గురించి కొద్దిగా తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం . .
మలయాళీల సంస్కృతికి, ఆరాధనా విధానాలకు మన తెలుగు వారి పద్ధతులను పోల్చి చూస్తే రెంటికీ మధ్య పొంతనలు చాలా తక్కువనే చెప్పాలి. మలయాళీల జానపదాల ప్రకారం యక్షిణులను అలకాపురి(యక్షుల నివాసం) నుంచి వెలివేయబడితే వారు భూలోకంలో యథేచ్ఛగా సంచరిస్తూ మానవులతో సంగమించి తమ కామవాంఛను తీర్చుకుంటారని ఒక నమ్మకం ఉంది. ఇలాంటి యక్షిణులను తాంత్రిక విధులననుసరించి సరైన పద్ధతిలో ఆవాహన చేసి ప్రతిమ రూపేణా ఒకచోట దిగ్భంధించి వారిని ఆరాధిస్తే సమృద్ధిని, సంతానాన్ని ప్రసాదిస్తారని వారి విశ్వాసం.
శపించబడి, వెలివేయబడిన యక్షిణులు మానవలోకంలో రాత్రి పూట సంచరించే బాటసారులను ఆకర్షించటానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారట. వాటిలో ముఖ్యమైనది వారి అందం/రూపం - పద్మదళ విశాల నేత్రాలు, కార్చీకటి వంటి కురులు, స్వర్ణ మేని ఛాయ, సప్తపర్ణి పుష్ప సుగంధం, శ్వేత వస్త్రాలతో మనోహరంగా ఉంటారు. (అందుకేనేమో సప్తపర్ణి వృక్షాలను Devils Tree అంటారు)
వీటికి మోహించి తన వెంట ఎవరైనా వస్తే ఆ బాటసారితో రతిసలిపి ఆ మానవుడి రక్తాన్ని త్రాగి ప్రాణాలు తీస్తుందట. అందుకని పూర్వం కేరళలో బ్రహ్మచారులు అర్థరాత్రులు ఒంటరిగా ప్రయాణం చేసేవారు కారు.
ఇలాంటి యక్షిణులను కొందరు తాంత్రికులు ప్రతిమా దిగ్బంధం చేసి వారికి ఆలయాలను నిర్మించారు. ఈ ఆలయాలు సాధారణంగా పెద్ద పెద్ద వృక్షాల కింద, లేదా నీటి మడుగుల వద్ద, అడవులలో ఉంటాయి. ఈ పోస్టు కేవలం ఒక అవగాహనకు మాత్రమే !!