హోలీకి ఇంటల్లుడిని గాడిద మీద ఊరేగించే వింత సంప్రదాయం
హోలీకి ఇంటల్లుడిని గాడిద మీద ఊరేగించే వింత సంప్రదాయం
- లక్ష్మి రమణ
హోలీ అంటే రంగుల పండుగ లేదా వసంతోత్సవం. రంగుల్లో దేశమంతా మునిగితేలే ఆనందాల హేల హోలీ. రాధాకృష్ణుల ప్రేమ ఆనంద సాగరమే . అందులోని ప్రతి బిందువూ ఆస్వాదించగలిగిన సాధకునికి , ఆధ్యాత్మిక తీరం చేర్చే సాధనమే ! రాధాకృష్ణుల ప్రేమకు గుర్తుగా ఈ పండుగను నిర్వహించుకుంటాం. ఇది సాధారణంగా శీతాకాలం చివర్లో వస్తుంది . తెలుగు నెలల్లో చిట్టచివరి దైన ఫాల్గుణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ రంగుల పండుగని విచిత్రమైన ఒక ఆచారంతో జోడించి జరుపుకుంటారు మహారాష్ట్రీయులు . ఇంటల్లుడిని గాడిదమీద ఊరేగించి ఆనందిస్తారు. ఈ వింతాచారం కథా కమామిషూ ఏమిటో చూద్దాం దండి .
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో విదా అనే ఊరుంది. ఈ ఊరికి అల్లుడయ్యారంటే, గాడిద మీద ఊరేగాల్సిందే !! ఈ ఊరిలో 90 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారట. ఇదేదో కావాలనుకుంటే, జరిపించొచ్చు, లేదంటే వదిలేయ వచ్చు అనుకొనే ఆషామాషీ వ్యవహారం కాదండోయ్ ! ఈ విదా గ్రామంలో కొత్త అల్లుళ్లు వేట మూడునాలుగు రోజులు ముందుగానే మొదలవుతుంది. కొత్తగా ఆ ఊరికి అల్లుడిగా వచ్చినవారి వివరాల సర్వే మూడు, నాలుగురోజులు ముందునుండే ఇంటింటా మొదలవుతుంది . అంతేనా , హోలీరోజు కొత్త అల్లుళ్లు తప్పించుకోకుండా గట్టి నిఘా కూడా పెడతారు. ఈ ఆచారాన్ని అదే గ్రామానికి చెందిన ఆనంద్‌రావు దేశ్‌ముఖ్ ప్రారంభించారు.
మొదట ఆనంద్‌రావు అల్లుడినే గాడిద ఎక్కించి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కొత్తబట్టలు పెట్టారు. అప్పటినుంచీ ఈ ఆచారం కొనసాగుతున్నది. కొత్ల అల్లుడిని గాడిదపై కూర్చోబెట్టి ఊరి మధ్యలోంచి హనుమాన్ గుడివరకు ఊరేగిస్తారు. ఈ ఊరేగింపు ఉదయం 11 గంటల వరకు ముగుస్తుంది. అనంతరం ఆ కొత్త అల్లుడు కోరిన బట్టలు పెడుతారు.
ఈ వింత ఆచారం వెనుక దాగిన మర్మం ఏమిటి అనేది తెలియదు కానీ, ఆ ఊరి ఆడపిల్లల సౌభాగ్యం కోసం అనిమాత్రం తెలియవస్తోంది . ఏదేమైనా , భలే ఉంది కదూ ఈ వింత ఆచారం . కొన్ని అంతే ! పిల్లికి చెలగాటం , ఎలుకకు ప్రాణసంకటంగా ఉంటాయి .
శుభం !!