Online Puja Services

మాతృ ఋణం తీర్చుకోగలమా ?

3.16.147.38

పితృఋణం తీర్చుకోవచ్చు . కానీ మాతృ ఋణం తీర్చుకోగలమా ?
 -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం నుండీ సేకరణ  

పితృరుణం, మాతృరుణం అని రెండుంటాయి. వీటిలో పితృరుణం తీర్చుకోవచ్చు. ఏ కారణంగానయినా తండ్రితో కలిసి లేనప్పుడు.. అంటే ఏ బాల్యంలోనో తండ్రిగారిని కోల్పోయినప్పుడు, వారికి సేవలు చేసే అవకాశం దొరకనప్పుడు, అటువంటి దురదృష్టాన్ని పోగొట్టుకుని పితృరుణం తీర్చుకోవాలనుకుంటే... దానికి ఒక నిర్దిష్ట యాగం చేస్తే పితృరుణం తీరిపోతుందంటుంది శాస్త్రం. కానీ మాతృరుణం తీరడానికి ఏ యాగం లేదు, యజ్ఞం లేదు... అమ్మ రుణం తీర్చుకోవడమన్నమాటే లేదంటుంది శాస్త్రం.

 శంకరభగవత్పాదులవారు ఈ ధర్మాన్ని పాటించారు. ‘‘నాకు ఒకవేళ ఇద్దరు కొడుకులుండి ఒకరు సన్యసిస్తే, ఈ శరీరం పడిపోయినప్పుడు రెండోవాడు అంత్యేష్టి సంస్కారం నిర్వహిస్తాడు. మరి ఒక్క కొడుకువి. నీవు వెళ్ళిపోతానంటున్నావు. నాకు అంత్యేష్టి సంస్కారం ఎవరు చేస్తారు’’అని వారితల్లి అడిగింది. ’’అమ్మా ! నీ శరీరం నుండి ప్రాణములు ఉత్కమ్రణమవుతున్నప్పుడు నన్ను తలచుకో. ఎక్కడున్నా వస్తానమ్మా’’ అన్నారు. అంతే... ఆమె అవసానదశలో తలచుకోగానే యోగమార్గాన కాలడికి వచ్చి అమ్మను శివ స్తోత్రంతో సంతోష పెట్టాడు. శివ భటులు వచ్చారు. అమ్మ భయపడింది. అమ్మా భయపడకని...విష్ణు స్తోత్రం చేసారు. విష్ణు భటులు వచ్చారు. వారిని చూసి సంతోషిస్తూ శరీరం విడిచి వారి వెంట వెళ్ళిపోయింది. ఆ శరీరానికి ఆయన అంత్యేష్టి సంస్కారం పూర్తి చేసారు. ’అమ్మ’ అన్నమాటకి శంకరులు అంత వైభవాన్ని కట్టబెట్టారు. అమ్మ అమ్మే.

 గాంధీగారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒకానొకనాడు ఓడలో విదేశాలకు బయల్దేరబోతున్నారు. పరస్త్రీ సంగమం ఎన్నటికీ చేయనని తనకు మాటివ్వమని తల్లి పుత్లీబాయ్‌ అడిగి ప్రమాణం చేయించుకుంది.  కొన్నేళ్ళ తరువాత ఒకసారి ఆయన చెయ్యకూడని పొరబాటు చేయడానికి వెళ్ళి అంగుళం దూరంలో ఉన్నప్పుడు అమ్మకిచ్చిన మాట గుర్తొచ్చి సర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇదంతా స్వయంగా ఆయన తన జీవిత చరిత్రలో నిజాయితీగా రాసుకున్నారు. అంత నిగ్రహం చూపి అలా వెనుకకు తిరిగి వెళ్ళిపోయిన కారణానికి ఆయన తరువాత కాలంలో మహాత్ముడయ్యాడు. జాతిపితయి, దేశ ప్రజల చేత ’తండ్రీ’ అని  పిలిపించుకోలిగాడు.

 తల్లి జీజీబాయ్‌ నూరిపోసిన దేశభక్తి, సనాతన ధర్మ పరిరక్షణ హితోక్తులతో శివాజీ మహరాజ్‌ధర్మసామ్రాజ్య స్థాపన చేసి, గోసంరక్షణ చేసి శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ అమ్మవారి అనుగ్రహంతో భవానీ ఖడ్గాన్ని కూడా పొందగలిగాడు. పిల్లల వయసుతో సంబంధం లేదు, ఐశ్వర్యాలతో, సామాజిక, రాజకీయ, అధికారిక హోదాలతో, విద్యార్హతలతో సంబంధం లేదు. అమ్మ అంటేనే ఆనందం. అమ్మే దైవం. అమ్మ మాట అమృతతుల్యం. అమ్మ వాక్కు బ్రహ్మ వాక్కు. ’అమ్మ’కు ఈ వేదభూమి, ఈ దేశం ఇచ్చిన గౌరవం అది. ఆ తరమయినా, ఈ తరమయినా, ఏ తరమైనా సనాతన ధర్మ పరిరక్షణ అమ్మ చేతుల్లోనే ఉంది, అమ్మల చేతల్లోనే  ఉంది. 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba