పరమేశ్వరుణ్ణి పూజించే వారికి సహకరించినా,
పరమేశ్వరుణ్ణి పూజించే వారికి సహకరించినా, ఈశ్వరుణ్ణి అర్చించిన ఫలం దక్కుతుంది .
లక్ష్మీ రమణ
పరమేశ్వరుడు జగత్పిత. సర్వాంతర్యామి. ఎన్నో ఆగమాలలో ఆచార్య , మత, భేదాలతో స్పష్టంగా తెలియబడే ఒకే ఒక్క జగత్ బంధువు, నిత్యుడు అయినా పరబ్రహ్మము . ఎవరిచేత ఈ జగత్తు మొత్తం సృష్టించబడి, ధరించబడుతుందో, ఎవరి చేత ఆశ్రయించబడిందో, ఎవరి అంశతో ఈ ప్రపంచమంతా రూపొందిందో అలాంటి పరమాత్మని పూజించగలగడం ఒక సుకృతం. అయితే, అటువంటి భక్తుల పూజకి సహకరించిన వారికి కూడా పరమేశ్వరుని పూజించదానితో సమానమైన ఫలితం లభిస్తుంది . అంటుంది స్కాంద పురాణం. ఈ విషయాన్ని తన జీవిత కాలంలో నిరూపించారు నడిచే పరమేశ్వరుడని పేరొందిన కంచి పెరియవ శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి. గురుదేవుల పాదపద్మాలకి ప్రణమిల్లుతూ ఆ దివ్యమైన సందర్భాన్ని ఇక్కడ తెలుసుకుందాం .
వేదములు, ఉపనిషత్తుల ద్వారా మాత్రమే తెలుసుకో దగినది పరమేశ్వరుని నిజతత్వము. అని చెబుతూ స్కాంద పురాణం
అడ్యోవా పి దరిద్రోవా ఉత్తమోహ్యధమోపివా
శివ భక్తిరతో నిత్యం శివయేవ న సంశయః
అంటుంది . అంటే, ధనవంతుడైనా, దరిద్రుడైనా , ఉత్తముడైనా, అధముడైనా సరే, శివ భక్తిని కలిగి శివ తత్వాన్ని తెలుసుకున్నట్లయితే శివ పూజ చేసి ఆనందించే వాడే అయితే అతడు సాక్షాత్తు శివుడే అవుతాడు. అందులో సంశయమే అవసరం లేదు . అంతేకాదు, ఎవరైతే ఇతరులు చేసే శివ పూజని చూసి ఆనందిస్తారో, ఆ పూజకి సహకరిస్తారో వారికి పూజ చేసిన వారితో సమానంగా పుణ్యఫలంలో భాగం వస్తుంది. ఇందులో కూడా సంశయమేమీ లేదని స్వయంగా పరమేశ్వర స్వరూపమైన పరమాచార్యవారే స్వయంగా నిరూపించారు .
ఒకసారి పరమాచార్య వారు కలకత్తాలో ఒక శిబిరంలో నూరు రోజులు బస చేసారు. నూరు రోజులు చంద్రమౌళిశ్వర పూజ కు అవసరమైన బిల్వ దళాలను ఒక గుర్తు తెలియని వ్యక్తి తెచ్చి స్వామివారి సేవకి ఇచ్చి, వెంటనే ఆఫీస్ కు వెళ్లి పోయేవారు. అతని దృష్టిలో అది సామాన్య విషయం. అలా నూరు రోజులు గడిచిన తరువాత స్వామి వారు ఆ అపరిచితుణ్ణి తన వద్దకు తీసుకొని రమ్మని సిబ్బందిని ఆదేశించారు.
అతను వచ్చాక , స్వామి "చాలా సంతోషం. ఈ నూరు రోజులు మీరు బిల్వదళాలు ఇచ్చి మా పూజకు గొప్ప సహాయం చేసారు. మీరు ఒక రోజు బిక్షా వందనానికి కుటుంబ సమేతంగా రండి." అని ఆహ్వానించారు .
ఆ అపరిచితుడు పరమాచార్యవారు తమ ఇంటికి భోజనానికి వస్తానాని చెబుతున్నారని అనుకున్నాడు . "స్వామీ , మాది పెద్ద కుటుంబం. నాదా చిన్న ఉద్యోగం. తమకు భిక్ష సమర్పించే స్తోమత నాకు లేదు. మన్నించాలి." అన్నాడు .
అప్పుడు స్వామి పరమ ప్రసన్నతతతో తిరిగి ఇలా అన్నారు "నేను మిమ్మల్ని భిక్ష కోరలేదు. రేపు జరిగే భిక్షా వందనానికి బిల్వం తో వచ్చి పూజ చూసి ప్రసాదం స్వీకరించి భోజనం చేసి వెళ్ళండి."
అందుకు సరేనని , ఆ అపరిచితుడు భార్య పిల్లలతో సహా మొత్తం కుటుంబం తో మరుసటిరోజు భిక్షావందనానికి వచ్చాడు. పూజానంతరం స్వామి ప్రసాదం ఇస్తూ "నీకేం కావాలి "అని అడిగారు. ఎన్ని తపస్సులు చేస్తే పరమేశ్వరుడు స్వయంగా ఆ మాట అడుగుతారు ? అతని పుణ్యం అలా వచ్చింది .
ఆ అపరిచితుడైన భక్తుని కోరిక చూడండి . " స్వామి నాకు మరు జన్మ ఉండకుండా వరమివ్వండి" అన్నాడు. లౌకికమైన విషయాలన్నీ విడిచి ఆ భక్తుని కోరిక జన్మరాహిత్యం !!
ఆ తరువాత స్వామి వారు కదిరా మంగళం అనే ప్రాంతం లో పూజలు చేసి ఒకరోజు స్నానానికి నదికి వెళ్లారు. శిష్యుణ్ణి పిలిచి "ఏడు దర్భలు తీసుకొని రా" అని చెప్పారు . ఆశ్చర్యం తో శిష్యుడు ఏడు దర్భలు తెచ్చి ఇచ్చాడు.
స్వామి వారు ప్రతి దర్భ నదిలో వేసి ఏడు సార్లు మునకలు వేశారు.
ఆశ్చర్యం గా ఈ ఉదంతాన్నంతా గమనిస్తున్న ఒక స్త్రీ "స్వామి ఈ అకాలంలో స్నానం చేయడం ఏమిటి? అలా దర్భలు నదిలో వేయడం ఏమిటి "అని ప్రశ్నించింది.
చిరునవ్వు తో స్వామి అప్పుడు ఇలా వివరించారు . "కలకత్తా లో ఒకరు నూరు రోజులు పూజకు బిల్వాలు సమకూర్చాడు. అతడు మరుజన్మ లేకుండా ఉండాలని కోరుకున్నాడు. కానీ అతనికి ఏడుజన్మల ఋణం మిగిలివుంది. అతని ఏడుజన్మల ఋణం తీరడం కోసం అలా చేశాను."అన్నారు.
జన్మ జన్మల ఋణానుబంధాలను గురువు మాత్రమే తొలగించగలరు. ఆయనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర లకు మూలమైన పరబ్రహ్మ రూపం. ఈ విధంగా స్కాంద పురాణంలో చెప్పినట్టు, పూజకి సాయం చేసిన భక్తునికి జన్మ రాహిత్యాన్ని అనుగ్రహించారు ఆ పరమాచార్యులు, అపార కరుణా సాగరులు , సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులైన శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వామీ .
కంచి పరమాచార్య వైభవం రచన ఆధారంగా , కృతజ్ఞతలతో !