మతమార్పిడి గురించి
మతమార్పిడి గురించి స్వయంగా భువిమీద నడయాడిన పరమేశ్వరుని అవతారం ఏమన్నారో తెలుసా ?
- లక్ష్మి రమణ
మతం మారతాము అని అంటే, యెగిరి గంతేసి పలు కూడికలు తీసివేతలతో మభ్యపెట్టి , సనాతన ధర్మానికి తూట్లు పొడిచే వలస పక్షులు ఈ దేశం మీద దాడి చేసి ఎన్నో ఏళ్లయ్యింది. కానీ సనాతనానికి తెలుసు “ స్వధర్మో నిథనం శ్రేయ:” అని. దానికి తూట్లు పొడవగలిగిన శక్తులు ప్రయత్నాలు చేసినా , సనాతన ధర్మం గెలిచి నిలిచిన సత్యం . ఇతర ధర్మాన్ని ఆచరించేవారిని ఎప్పుడూ మతం మారమని సనాతనం ఇబ్బంది పెట్టలేదు . పెట్టదు. ఈ విషయాన్ని స్వయంగా నేలమీద నడయాడిన పరమేశ్వర స్వరూపమే తెలియజేశారు.
నడయాడే దేవునిగా, కంచి పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామీ పేరొందారు. పరమాచార్య వారి జీవితంలోని ఎన్నో సంఘటనలు పరమేశ్వర అనుగ్రహాన్ని పొందడం అంటే ఏమిటో చాటి చెబుతాయి . పరమేశ్వరుని తండ్రి స్వరూపంగా ఎందుకు భావిస్తామో అర్ధమయ్యేలా చేస్తాయి . అపార కరుణా సింధుడు , జ్ఞానప్రదాత ఆ పరమాచార్యులవారు. ఆయన కులమతాలకు అతీతులు. శరణన్నవారిని అనుగ్రహించే సాక్షాత్తూ శంకర స్వరూపులు .
ఒకసారి పరమాచార్య వారు తమినాడు లోని కరంబకుడి నుండి పట్టుకొట్టయ్ అనే గ్రామానికి వెళుతూ ఉన్నారు . ఆయన కోసం కరంబకుడి నివాసి అయిన ఒక ముస్లిం వృద్దుడు వెనక పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అది మంచి ఎండా కాలం. రొప్పుతూ వస్తున్న వృద్దున్ని చూసి స్వామి ఆగారు. ఆ వృద్దుడు పండ్లు, పూలు స్వామి కి సమర్పించి నమస్కరించి నిలుచున్నాడు.
అప్పుడు పరమాచార్యవారు “స్వామి! మీరు నన్ను కరంబకుడి లో చూచారుగా! మరల ఇంతగా ఆయాసపడుతూ ఎందుకు ఇంత దూరం వచ్చారు." అని అడిగారు . అప్పుడా ముస్లిం వృద్దుడు " నేను మిమ్మల్ని కరంబకుడి లో చూసాను. అయినా మిమ్మల్ని చూడకుండా ఉండలేననిపించి మరల వచ్చాను. మా మతం లో అల్లా కు రూపం లేదు. ఉంటే మీలా ఉంటాడు అని నా అభిప్రాయం. అందుకే మిమ్మల్ని చూడాలనిపించింది. స్వామీ మీ సేవా భాగ్యం నాకు ఎలా కలుగుతుంది ? నేను మీ మతం లోకి మారి, మీరు కోరిన సేవ చేస్తాను. నన్ను మీ మతం లోకి చేర్చుకొని ఆ సేవా భాగ్యం నాకు కలిగించండి. " కన్నీళ్లతో గద్గద స్వరంతో గురువుని చేరిన శిష్యునిలా, అమ్మని అడిగే పసి పాపాయిలా, భగవంతుని ముందర దోసిలి ఒగ్గిన భక్తునిలా ఆ వృద్ధుడు చేసిన ప్రార్ధనకి పరమాచార్యవారు కరిగిపోయారు .
స్వామి కరుణ వర్షించే కళ్ళతో, అమ్మలా ఆప్యాయత కురిపిస్తూ ఇలా అన్నారు . "మీకు నన్ను చూడాలనిపించినప్పుడు నన్ను తలుచుకోండి. మీ ఆలోచనలలోకి నేను వస్తాను. అప్పుడు నేను మీ దగ్గర ఉన్నట్లే. దానికోసం మతం మారకూడదు. మనం అనుసరించే ధర్మాన్ని వదులుకోకూడదు " అని అనునయంగా చెప్పి, ముందుకు సాగారు.
స్వామి కనుమరుగయ్యే వరకు కన్నీళ్లతో స్వామి నే కాదు ఆ స్వామిలో తన అల్లానే చూసుకుంటూ ఆ వృద్దుడు ఆగిపోయాడు. "స్వ ధర్మో నిధనం శ్రేయః "అనే గీతాచార్యుని అభిప్రాయమే స్వామి వారి అభిప్రాయం అని ఇక్కడ మనం గ్రహించాలి . అదే విధానాన్ని మన జీవితంలో అనుసరించాలి .
సర్వేజనా సుఖినోభవంతు !!
కంచి పరమాచార్య వైభవం ఆధారంగా .