Online Puja Services

‘బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు’

3.144.40.216

బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు’ అని ఇందుకే అన్నారు కాబోలు !!
- లక్ష్మి రమణ 

అరుంధతీ దేవి వసిష్ఠుని భార్య. మహాపతివ్రత. ఈ రోజుకీ మన వివాహ క్రతువులో  అరుంధతీ వసిష్ఠులని చూపించి నమస్కారం చేసుకోమని చెబుతారు. అగ్ని భార్య అయిన స్వాహాదేవి కామరూప విద్యతో తన భర్తని సంతోషపెట్టడానికి మునిపత్నులందరి రూపాలనీ  ధరించినా, అరుంధతి రూపాన్ని ధరించలేకపోయిందట. ఇలా ఆడేవి పాతివ్రత్యాన్ని వివరించే కథలు మనకి ఇతిహాసాలు, పురాణాలలో ఎన్నో కనిపిస్తుంటాయి . అరుంధతీ దేవి అంతటి మహత్యాన్ని పొందేందుకు ఆమె పూర్వజన్మలో చేసుకున్న పూజలు కూడా కారణమయ్యాయి.  ఆద్యంతమూ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ , ఆధ్యాత్మికాశక్తిని రేకెత్తించే అరుంధతీ మాత జన్మ వృత్తాంతం ఇది . శివ పురాణాంతర్గతమైన ఈ విశేషాన్ని ఇక్కడ తెలుసుకుందాం .     

బ్రహ్మ దేవుడికి అనేకమంది మానస పుత్రులు ఉన్నారు.  వారి తరువాత సంధ్య అనే పుత్రిక కూడా జన్మించింది. ఈమె అతిలోక సౌందర్యరాశి.  బ్రహ్మ మానస పుత్రులైన నవబ్రహ్మలు కూడా ఆమె సౌందర్యాన్ని చూసి పరవశించి పోతున్నారు. అంతేనా, తన మానస పుత్రిక అయినా ఆ సౌందర్య సంధ్యని చూసి బ్రహ్మదేవుడు కూడా మోహపరవశుడయ్యాడు .  అందుకు  ఫలితంగా ఉద్భవించిన అగ్నిస్పాత్రులు 64వేల మంది బరిహిషధులు 84 వేల మంది ఉద్భవించారు.  వీరందరూ పితృగణాలలో చేరిపోయారు. అలాగే సంధ్యాదేవిని తలుచుకున్న నవబ్రహ్మలకు పుట్టిన వారు కూడా పిత్రు గణాలలో కలిసిపోయారు.  ఆ విధంగా సంధ్యాదేవి పితృమాత అయింది. 

ఈ ఉదంతానంతా చూసి శివుడు కోపగించారు.  సంధ్యాదేవిని కైలాస పర్వతం మీద తపస్సు చేయమని చెప్పారు.  ఆ తరువాత గౌతమాది మహర్షులు ధర్మశాస్త్రాలను వ్రాశారు.  కొంతకాలానికి బ్రహ్మ వశిష్టుని పిలిచి “సంధ్యాదేవి కైలాస పర్వతం పైన తపస్సు చేస్తోంది.  నీవు ఆమెకు శివపంచాక్షరిని ఉపదేశించవలసింది” అని చెప్పాడు.  తండ్రి ఆజ్ఞను పాటించాడు వశిష్ఠుడు.  కఠోర నియమాలతో పంచాక్షరి మంత్రాన్ని జపించింది సంధ్య దేవి.  శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు.  అప్పుడు ఆమె “దేవదేవ ఈనా శరీరము అగ్ని ప్రవేశం చేసి నేను పునర్జన్మ ఎత్తాలి. నన్ను వ్యామోహంతో చూసినవారు నపుంసకులు కావాలి . పతివ్రతలలో నేను శ్రేష్టురాలను కావాలి” అని అడిగింది.  దానికి శంకరుడు “చంద్రభాగ నదీ తీరాన, మేధా తిధి అనే ఋషి యజ్ఞం చేస్తున్నాడు.  ఎవరికంటా పడకుండా, నువ్వు ఆ యజ్ఞంలో ప్రవేశించు.  యజ్ఞంలో ప్రవేశించే సమయంలో, నువ్వెవరిని భర్తగా కోరుకుంటే అతడే నీ భర్త అవుతాడు.  నీ కోరికలన్నీ తీరుతాయి” అన్నాడు. 

 సంధ్యాదేవి శంకరుడు చెప్పినట్టుగానే యజ్ఞ కుండములో ప్రవేశిస్తూ వశిష్ఠుడిని భర్తగా ధ్యానించింది.  ఆ సమయంలో సూర్యుడు ఆమె శరీరాన్ని రెండు భాగాలుగా చేశాడు.  అందులో పై భాగము దేవతలకు ఇష్టమైన ప్రాతః సంధ్య, క్రింది భాగము పితృదేవతలకు ఇష్టమైన సాయం సంధ్యగామారింది. 

 అగ్నిలో ఆమె భస్మమైన తరువాత ఆమె ఆత్మకు అగ్నిదేవుడు ఒక రూపాన్ని కల్పించాడు.  ఆమే  అరుంధతి.  మేధాతిధి మహర్షి అరుంధతిని పెంచి పెద్ద చేసి, వశిష్టుడికి ఇచ్చి వివాహం చేశాడు.” అని  శివపురాణం అరుంధతీ జనన వృత్తాంతాన్ని తెలియజేస్తోంది . 

ఈ పురాణకథని చక్కని ఆధ్యాత్మిక భావనతో అర్థం చేసుకోవాలి. లోతైన తాత్విక దృష్టితో పరిశీలించాలి గానీ ప్రాపంచికపు దృష్టితో చూడకూడదు . సృష్ట్యాదిలో జరిగిన ఈ విశేషము శివపురాణాంతర్గతమైనది . 

శుభం . 

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi