Online Puja Services

రక్షణ కలిగించే కూష్మాండ(గుమ్మడికాయ)దీపం.

18.118.144.109


రక్షణ కలిగించే కూష్మాండ(గుమ్మడికాయ)దీపం.
- లక్ష్మి రమణ  

 చండీ హోమం చేస్తే ఎంతటి ఫలితం లభిస్తుందో కూష్మాండ దీపం వెలిగిస్తే అంతటి ఫలితం కలుగుతుందని శాస్త్ర వచనం .  కూష్మాండ దీపం వెలిగించడం వలన రక్షణ లభిస్తుంది . ఆ రక్షణ ఎటువంటిది అంటే, ద్రుష్టి దోషాలు , గ్రహదోషాలు , నరఘోష ,శనిదోషం, ఆర్ధిక సమస్యలు, దుష్టశక్తుల ప్రభావం ఇటువంటి వాటన్నింటి నుండీ రక్షణ లభిస్తుంది . పిల్లలు చెప్పినమాట వినకపోయినా ఈ పరిహారం పనిచేస్తుంది అని చెబుతున్నారు పండితులు . కాలాభైరవ తంత్రం ప్రకారం కూడా  కూష్మాండ దీపారాధన మేలయిన ఫలితాలని అనుగ్రహిస్తుంది. అసలు ఈ కూష్మాండ దీపారాధన ఎందుకు చేయాలి ? ఎలా చేయాలి వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం . 

శక్తి స్వరూపిణి అయినా అమ్మవారు రక్షణ బాధ్యత కలిగినది . నిత్యం శత్రుసంహారాన్ని, లయత్వాన్ని నిర్వహిస్తుంటుంది . లయకారుని శక్తి కదా మాత . కాలస్వరూపమై , దుష్టశక్తుల పాలిటి సింహస్వప్నం అయిన దేవికి తామస గుణం ఉంటుంది . దేవి సత్వ సరూపమే! అందులో సందేహంలేదు .  అయినా, సంహార క్రియ నిర్వహించేప్పుడు తామస ప్రవృత్తిని అమ్మ ప్రదర్శిస్తుంది . ఆ దేవీ స్వరూపాలై గ్రామాలకి రక్షణగా కాపలా కాసే గ్రామ దేవతలు కూడా , రాత్రిపూట నగర సంచారం / గ్రామ సంచారం చేస్తూ , దుష్ట శిక్షణ చేస్తారు . అందుకే అటువంటి వీరత్వాన్ని ప్రతిబింబించే  నిమ్మకాయల దండలు అమ్మవారికి సమర్పిస్తారు.  

 ‘కూష్మాండో బలిరూపేణ మమ భాగ్యాదవస్థితాః 
ప్రణమామి తతస్సర్వ రూపిణం బలి రూపిణం’. 

వీరత్వాన్ని ప్రదర్శించాల్సిన దేవికి మాంసాహారం నిషిద్ధం కాదుగా ! అందుకే శతృ సంహారం చేసి, రాజ్యాన్ని రక్షించాల్సిన రాజులు మాంసాహారాన్ని తీసుకుంటారు . సాత్విక ప్రవర్తనతో మెలిగేందుకు బ్రాహ్మణులు శాఖాహారాన్ని తీసుకుంటారు.  స్వయంగా రక్షా దక్ష అయిన విశ్వ శక్తి కాబట్టి అమ్మని  ‘బలిప్రియ’ అన్నారు . బలిగా సమర్పించాల్సినది ఏమిటి ? కలియుగంలో బలిగా జంతువులని ఇవ్వడం నిషేధం . మరి బలిగా ఏం సమర్పించాలి ? గుమ్మిడికాయని సమర్పించాలి అని శాస్త్రం . 

శిరస్సుకి ప్రతీక కూష్మాండం (గుమ్మడికాయ ). అందుకే మనం దేవికి బలిగా గుమ్మడికాయని సమర్పిస్తూ  ‘ఓ బలిదానమా ! నా భాగ్యమువలన కూష్మాండ రూపంలో ఉన్నావు (గుమ్మిడికాయ రూపంలో ).  అమ్మవారికి సంతోషాన్ని కలుగజేసి , నా ఆపదలని నశిపజేయి’ .  అని ప్రార్థిస్తూ గుమ్మడికాయని అమ్మవారికి బలిగా సమర్పించాలని శాస్త్రం సూచిస్తూ ఉంది .  ఇదే భావనతో కూష్మాండ దీపారాధన కూడా !

ప్రత్యేకించి మనం ఆ దీపాన్ని కాలభైరవునికి సమర్పిస్తాం . కాల స్వరూపానికి అర్పించే దీపం. ఇక్కడ ప్రక్రుతి స్వరూపంగా భగవతిని కాళికా అంటాం . అదే కాల రక్షకుడైన పరమ పురుషుణ్ణి కాలభైరవుడు అంటున్నాం . ఆయన కూడా రక్షకుడే ! సదా వెన్నంటి కాపాడే రక్షకుడు . కాల ప్రవాహంలో కొట్టుకుపోయే జీవులం మనం . ఆ ప్రవాహంలో మనకి తోడై రక్షించే భైరవునికి ఈ దీపం పెట్టడం వలన పైన చెప్పుకున్నట్టు , ఈతిబాధలు తొలగిపోయి భైరవుని రక్షణ కలుగుతుంది . 

శ్రద్ధగా , భక్తిగా ఇలా కూష్మాండ దీపం వెలిగించుకోండి .   

గుర్తుంచుకోండి . ఇది కేవలం ఇంట్లో చేసుకోవాల్సిన విధానం మాత్రమే . 

ఈ పూజ చేయాలి అనే సంకల్పం ఉన్న రోజున ఉపవాసము ఉండాలి.  ఘన పదార్థం తీసుకోకూడదు .  ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు .  ఉదయం 4:30 నుండి 6:00 మద్యలో ఈ పూజ చేసుకోవాలి అని గుర్తుంచుకోండి . దేనికోసము ఈ పూజ చేస్తున్నారో , ఆ  సంకల్పము సిద్ధించాలని సంకల్పంలో స్వామికి నివేదించాలి . 

ఒక మధ్యరకమైన పరిమాణంలో ఉన్న బూడిదగుమ్మడి కాయ (చిన్నది/ పెద్దది కాకుండా ) తీసుకోండి .  దాన్ని అడ్డముగ కోసి, గింజలు, పిక్కలు తీసి దొల్లగా చేయండి.  దానిలో పసుపు రాసి కుంకుమ బొట్టు పేట్టి, అందులో నల్ల నువ్వుల నూనె పోసి, పెద్ద వత్తులు రెండు వేసి, దీపం వెలిగించండి  .

ఆ దీపానికి పంచోపచార పూజ చేసి దీపం దగ్గర కాల భైరవ అష్టకం 11 సార్లు చదువుకోండి . ఈ దీపారాధన బహుళ అష్టమి రోజున కానీ అమావాస్య రోజున కానీ చెయ్యడం శ్రేష్టం.  ధనయోగాన్ని పొందేందుకు అష్టమీ తిథి, కీర్తి - ప్రతిష్టలు కోసం అమావాస్య రోజునా ఈ దీపారాధన చేయడం మంచిదని పండితులు సూచిస్తున్నారు .  కాలభైరవాష్టమి రోజున ఈ దీపారాధన చేయడం మరింత గొప్ప ఫలితాలని అనుగ్రహిస్తుంది . 

ఈ విధంగా  దీపారాధనని  19 అష్టమి తిథులు కానీ,  19 అమావాస్య తిథులు కానీ చెయ్యాలి. 

పూజంతా అయ్యాక  ఎండు ఖర్జూరం ప్రసాదంగా పెట్టాలి. 

ఇది భక్తి శ్రద్ధలతో చేసినవారి జీవితంలో ఉన్న పూర్తి నరదృష్టి గ్రహ వాస్తు పీడలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ దీపారాధన అత్యంత శక్తి వంతం అయినది విపరీత జన/ధన ఆకర్షణ పెరుగుతుంది. సమస్యలు సమసిపోతాయి. 

శుభం . 

 

 

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi